సాక్షి, హైదరాబాద్ : మన భూపాలపల్లికి కంబోడియాతో ఉన్న సంబంధం ఏంటి? భూపాలపల్లి జిల్లా దేవునిగుట్టపై ఉన్న బౌద్ధమందిరం అచ్చుగుద్దినట్టు ప్రపంచ ప్రఖ్యాత అంకోర్‌వాట్ దేవాలయ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. కంబోడియా నిర్మాణ విధానం భూపాలపల్లిలో ఎలా ప్రత్యక్షమైంది? చారి త్రక ఆధారాలు ఇప్పటికీ వెలికితీయలేదు. శ్రీకాకుళం జిల్లాలోని దంతపురానికి శ్రీలంకకు ఉన్న లింకేమిటి?. కళింగరాజుల హయాంలో దంతపురంలో బౌద్ధస్తూపం నిర్మితమైంది. ఆ స్తూపం కింద బుద్ధుడి అస్థికగా ఆయన దంతం ఉండేది. కానీ, ప్రస్తుతం ఆ దంతం శ్రీలంకలోని క్యాండీ సమీపంలోని ప్రముఖ బౌద్ధక్షేత్రం దవల మళిగవిలలో ఉంది.
ఇక్కడి నుంచి అటెందుకు తరలింది? శ్రీకాకుళానికి శ్రీలంక దేశానికి మధ్య సంబంధం ఎలా కుదిరింది?.వేల కిలోమీటర్ల దూరంలోని దేశాల్లో తెలుగు వారు వందల ఏళ్లుగా ఎందుకుంటున్నారు? చరిత్రలో కచ్చితమైన సమాధానాల్లేని ప్రశ్నలెన్నో. కానీ వీటి వెనుక సహేతుక చారిత్రక కారణాలున్నాయి. వాటి తీగలాగితే మన దేశానికి–ఇతర దేశాలకు మధ్య వాణిజ్య, సాంస్కృతిక, విజ్ఞాన సంబంధ బాంధవ్యాల డొంక ఇప్పుడు కదులుతుంది. నాటి ఆధారాలు వెలికి తీస్తే ఇప్పుడు ఆయా దేశాలతో కొత్త మైత్రికి బాటలు వేయొచ్చు. ఇది వాణిజ్యపరంగా మన దేశానికి ఉపయోగపడొచ్చు.
ఇప్పుడిలాంటి ఆలోచనలే కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. అందుకే సముద్ర మార్గం ఆధారంగా మన దేశం ఏయే దేశాలతో సంబంధాలు నెరిపిందో చారిత్రక ఆధారాలను వెలికితీయాలని నిర్ణయించింది. సముద్ర తీరం ఉన్న ప్రాంతాల్లో ‘ప్రాజెక్ట్ మౌసమ్’పేరుతో బృహత్తర అధ్యయనాన్ని నిర్వహించనుంది. ఈ బాధ్యతల్ని ప్రాంతాల వారీగా విభజించి కొందరు నిష్ణాతులకు అప్పగించింది. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అధ్యయన బాధ్యతను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగాధిపతి ప్రొఫెసర్ కె.పి.రావుకు అప్పగించింది.
దేశాలతో కొత్త బాంధవ్యాలు
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఓడరేవు బందరు నుంచి కాకతీయ రాజులు ఇతర దేశాలతో వాణిజ్యపరమైన సంబంధాలు కొనసాగించారు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఈ రేవు మీదుగా వస్తువుల ఎగుమతి, దిగుమతులు కొనసాగాయి. దాన్ని రూఢీచేసే శాసనాలు వెలుగు చూశాయి. అందుకే కాకతీయ శాసనాలు ఇప్పటికీ ఆంధ్ర సముద్ర తీరప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇలా ఆసియా నుంచి ఆఫ్రికా వరకు ఎన్నో దేశాలతో కాకతీయుల కంటే ముందు, కాకతీయుల తర్వాత కూడా వాణిజ్య సంబంధాలు కొనసాగాయి. మన ప్రాంతాన్ని పాలించిన అన్ని సామ్రాజ్యాలు ఈ సంబంధాల్ని కొనసాగించాయి.
వ్యాపార వాణిజ్యాలనే ప్రధాన లక్ష్యంతో మొదలైన ఈ సంబంధ బాంధవ్యాలు సంస్కృతీ సంప్రదాయాలతోనూ పెనవేసుకున్నాయి. మన దేశంలోని చాలా ప్రాంతాల్లో అలనాటి చారిత్రక నిర్మాణాల్లో విదేశీశైలి దీనికి నిదర్శనం. అప్పట్లోనే తెలంగాణ ప్రాంతం నుంచి నల్లరాయి ఆఫ్రికా, యూరప్‌లకు చేరింది. ఇప్పటికీ చాలా దేశాల్లో అక్కడ మన శైలి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇక్కడి నుంచి ఇంజినీర్లు ఆయా దేశాలకు వెళ్లి నిర్మాణాల్లో పాలుపంచుకున్న దాఖలాలున్నాయి. ఇవి దేశాల మధ్య మైత్రికి దోహదం చేశాయి. క్రమంగా అవి కనుమరుగయ్యాయి. కానీ నాటి దోస్తీకి గుర్తుగా ఇప్పటికీ ఎన్నో చారిత్రక నిర్మాణాలు అలరారుతున్నాయి. ఆయా నిర్మాణాల ఆధారంగా నాటి మైత్రీజాడలను వెలికితీయాలని కేంద్రం నిర్ణయించింది.
కొత్త వాణిజ్యానికి, స్నేహాలకు బాటలు
‘ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్’నోడల్ ఏజెన్సీగా కేంద్ర పర్యాటక శాఖ ఓ బృహత్తర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇది సముద్ర మార్గం ద్వారా మన దేశంలోని ఏయే ప్రాంతాలు ఏయే దేశాలతో సంబంధాన్ని కలిగి ఉండేవో వెలికితీయబోతోంది. వాటిని ప్రతిఫలించే నిర్మాణాలు, చారిత్రక స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ప్రాధాన్యం ఏంటి, దానితో ఏయే దేశాలు సంబంధం కలిగి ఉన్నాయి, ఆ స్నేహానికి కారణంగా అసలు రెండు ప్రాంతాల మధ్య జరిగిన రవాణా ఏంటి, నాటి వాణిజ్యం, ఆర్థిక అంశాలు తదితర అన్ని వివరాలూ ఈ అధ్యయనంలో తేలనున్నాయి. ఆయా వివరాల ఆధారంగా ఆయా దేశాలతో ఇప్పుడు మనదేశం కొత్త మైత్రిని ఎలా పెంపొందించుకోవచ్చో ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇది మళ్లీ కొత్త వాణిజ్యానికి బాటలు వేస్తుందని కేంద్రం నమ్ముతోంది.
యునెస్కో గుర్తింపునకు అవకాశం
మన తీరప్రాంతాల్లో విలసిల్లిన సంస్కృతి, దానికి గుర్తుగా ఉన్న నిర్మాణాలు, అవి ఇతర దేశాల మైత్రిని ప్రతిఫలించే తీరును వెలికితీసి యునెస్కో ముందు నిలపవచ్చన్న మరో ప్రయత్నాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ప్రపంచ వారసత్వ జాబితాలో మనదేశంలోని కట్టడాలకు చోటు తక్కువే. ఆ గుర్తింపు పొందదగిన చరిత్ర ఉండి కూడా కొన్ని మరుగునపడ్డాయి. ఇప్పుడు చేపట్టబోయే కొత్త అన్వేషణ దానికి ప్రాణం పోస్తుందన్న ఆలోచన కేంద్రం మదిలో ఉంది.
ఇది గొప్ప అధ్యయనం
‘ప్రాజెక్టు మౌసమ్’పేరుతో కేంద్ర పర్యాటక శాఖ నిర్వహించనున్న అధ్యయనం బృహత్తరమైంది. ఇది తీరప్రాంతాలతో గల విదేశీ సంబంధాల చరిత్రను వెలుగులోకి తెస్తుంది. మళ్లీ దేశాల మధ్య కొత్త సంబంధాలకు బాటలు వేయటమే కాక మన చరిత్ర యునెస్కో ముంగిట మెరిసేందుకు కారణం కానుంది. ఇందులో పాలుపంచుకునే అవకాశం నాకు దక్కడం గర్వంగా ఉంది. – ప్రొఫెసర్ కె.పి.రావు
Comments
Please login to add a commentAdd a comment