స్లో.. & స్టడీ | A tourism movement called Slow Traveling | Sakshi
Sakshi News home page

స్లో.. & స్టడీ

Published Wed, Jan 1 2025 2:33 AM | Last Updated on Wed, Jan 1 2025 2:33 AM

A tourism movement called Slow Traveling

‘స్లో ట్రావెలింగ్‌’పేరుతో పర్యాటక ఉద్యమం

ప్రపంచ పర్యాటకంలో కొత్త ఒరవడి 

ఎక్కువ ప్రాంతాలను చుట్టిరావడంకంటే ఒకే గమ్యస్థానాన్ని సంపూర్ణంగా అన్వేషించేందుకు ఆసక్తి 

ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు స్లో ట్రావెలింగ్‌ వైపు మొగ్గు 

ప్రకృతి ఒడిలో మమేకమవడంఓ చికిత్సగా అభివర్ణిస్తున్న నిపుణులు 

2025లో భారత్‌లో ‘స్లో ట్రావెల్‌’లో10 శాతం వృద్ధి రేటు అంచనా 

దేశంలో స్లో ట్రావెలింగ్‌లోఅహ్మదాబాద్‌కు అగ్రస్థానం

సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ట్రెండ్‌ మారుతోంది. ఉరుకుల పరుగుల ప్రయాణాలకు బదులు స్థిర అన్వేషణల వైపు గమ్యం సాగుతోంది. స్థానిక సంస్కృతి, ఆచార వ్యవహారాలను సంపూర్ణంగా అర్థం చేసుకునేలా ‘స్లో ట్రావెల్‌’పేరుతో పర్యాటక ఉద్యమం ఊపందుకుంటోంది. 

స్లో ట్రావెల్‌లో పర్యాటక ప్రదేశాల పరిమాణం కంటే.. అందులోని నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గజిబిజి జీవితాలను పూర్తిగా స్విచ్‌ ఆఫ్‌ చేసుకుని ప్రకృతి ఒడిలో మునిగిపోయేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 2025 సంవత్సరం ‘స్లో ట్రావెల్‌’ఇయర్‌గా మారుతుందని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రైళ్లకు జై కొడుతున్నారు
2024లో 81శాతం మంది విశ్రాంతి కోసం, రోజువారీ ఒత్తిళ్ల నుంచి బయట పడేందుకు స్లో వెకేషన్లకు వెళ్లినట్టు ‘ట్రావెల్‌ అండ్‌ టూర్‌ వరల్డ్‌’పేర్కొంది. ఇందులో మూడొంతుల మంది సాంస్కృతిక, చారిత్రక అన్వేషణ, వారసత్వ ప్రదేశాల సందర్శనలకు విలువ ఇస్తున్నట్టు గుర్తించింది. స్లో ట్రావెల్‌లో భాగంగా అధిక శాతం మంది రైలు ప్రయాణాలకు జైకొడుతున్నట్టు తేలింది. 

సుదూర గమ్యస్థానాలకు విమాన, కారు ప్రయాణాలకు ఖర్చుతో కూడుకోవడం, ఒక్కోసారి రిమోట్‌ గమ్యస్థానాలను చేరుకోలేకపోవడంతో రైలు మార్గాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా యువత సైక్లింగ్, బైక్‌ రైడ్‌లలో సోలోగా స్లో ట్రావెల్‌కు వెళ్తున్నారు. ఇటీవల కాలం నదీ అందాలను ఆస్వాదించేందకు క్రూయిజ్‌ల ప్రయాణాలను ఎంపికలు పెరిగాయి.  

అహ్మదాబాద్‌.. అగ్రస్థానం
భారతదేశంలో అహ్మదా బాద్‌ నగరం సుదీర్ఘ సందర్శనలలో పాల్గొనే వారికి అగ్ర ఎంపికగా ఉద్భవించింది. గోవా, అయోధ్య తరువాత ఈ ప్రాంతంలో ఎక్కువగా గడిపేందుకు ప్రసిద్ధి చెందింది. 

విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులు ముఖ్యంగా ఆసియాలో థాయ్‌లాండ్‌లోని ఖావో లాక్, జపాన్‌లోని టోక్యో, దక్షిణ కొరియాలోని సియో ల్, మలేషియాలోని పెర్హెన్షియన్‌ దీవులు, వియత్నాంలోని హోచిమిన్‌ సిటీకి ఎక్కువగా ఆకర్షితులవుతున్నట్టు డిజిటల్‌ ట్రావెల్‌ ప్లాట్‌ఫామ్‌ అగోడా ప్రకటించింది.

భారత్‌లో 10% వృద్ధి అంచనా
నిత్యం పని జీవితంలో ఒత్తిళ్లు తారస్థాయికి చేరుకోవడంతో సెలవులు తీసుకోవడం గతంతో పోలిస్తే విలువైనది మారింది. ఆఫ్‌బీచ్‌ వెకేషన్లు, కొత్త అన్వేషణల గమ్యస్థానాలకు ప్రయాణించడం మానసిక చికిత్సగా భావిస్తున్నారు. 2025లో అత్యధికులు ‘స్లో ట్రావెల్‌’కు జైకొడుతున్నారు. ఇది 2025లో 10 శాతం వార్షిక వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతుందని ట్రావెల్‌ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 

చాలామంది పర్యాటకులు గమ్యస్థానాలను పూర్తిగా అస్వాదించలేకపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎక్కువ ప్రదేశాలను చుట్టిరావడం కంటే స్థానిక సంస్కృతిలో లీనమవ్వడం, మరింత అర్థవంతంగా ప్రయాణాన్ని మార్చుకోవడమే ప్రధాన ఉద్దేశంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రజలు నిత్యం పిల్లలను పెంచడం, ఆఫీస్‌ సమావేశాలు, కుటుంబ కార్యక్రమాలంటూ బిజీ షెడ్యూల్‌లో మునిగిపోతున్నారు. 

ఇలాంటి తరుణంలో మానసిక విశ్రాంతి, ఆహ్లాదాన్ని పొందేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త ఆహారాన్ని రుచి చూడటం, కొత్త దృశ్యాలను కళ్లతో బంధిస్తూ విశ్రాంతిని పొందే ప్రదేశాలను కోరుకుంటున్నట్టు ట్రావెల్‌ సంస్థలు చెబుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement