ఇందూరు, న్యూస్‌లైన్ : ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సదస్సుకు వెళ్లిన నలుగురు అధికారుల్లో నేను ఒకడిని అయినందుకు సంతోషంగా ఉంది. ఓ రోజు ముందే గుజరాత్ చేరాం. అహ్మదాబాద్‌లో మాకు ప్రత్యేక వసతి కల్పించారు. 17న అహ్మదాబాద్‌లో సదస్సు నిర్వహించారు. సుమారు 5 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అక్కడ అమలు చేస్తున్న పథకాలు, గ్రామాల అభివృద్ధి ని ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. అనంతరం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. ఆయన ప్రసంగం ఎంతో ఆకట్టుకుంది. గుజరాత్‌లో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఆయన చక్కగా వివరించారు. 18న క్షేత్రస్థాయి సందర్శనకు వెళ్లాం. అహ్మదాబాద్ జిల్లాలోని మణిపూర్ గ్రామాన్ని సందర్శించి, అభివృద్ధిని పరిశీలించాం.
గొడవల్లేని గ్రామాలకు పారితోషికం
గుజరాత్‌లో మండలాలను సమితి (ఇంగ్లిష్‌లో బ్లాక్) అని పిలుస్తారు. ఆ రాష్ట్రంలో 18 వేల గ్రామాలున్నాయి. అక్కడ గొడవల నివారణకు ప్రభుత్వం వినూత్న ప్రయోగం చేపట్టింది. శాంతియుతంగా సాగే గ్రామాలకు పారితోషికం చెల్లిస్తోంది. మూడేళ్ల కాలంలో పోలీసు కేసు నమోదు కాని, గొడవలు లేని గ్రామాలను గుర్తించి ‘తీర్థ గ్రామం’ పేరుతో * 2 లక్షల చొప్పున ప్రోత్సాహక మొత్తాన్ని అందిస్తోంది. ఇలా 1,137 గ్రామాలను గుర్తించి ప్రోత్సాహకాన్ని అందించారు.
పంచవటి యోజన..
ఆహ్లాదకర గ్రామాల నిర్మాణానికి అక్కడి సర్కారు కృషి చేస్తోంది. పంచవటి యోజన పేరుతో పార్కులు, గార్డెన్లు నిర్మిస్తోంది. ఇందులో గ్రామస్తులనూ భాగస్వాములను చేస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికి 5,316 గ్రామాలను గుర్తించింది. గ్రామస్తులు * 50 వేలు చెల్లిస్తే ప్రభుత్వం * 90 వేల గ్రాంట్ విడుదల చేస్తుంది. ఈ నిధులతో గ్రామంలో పార్కుగాని, గార్డెన్ గాని నిర్మిస్తోంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో పార్కులు, గార్డెన్లు ఏర్పాటయ్యాయి.
పట్టణాలకు దీటుగా..
పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివృద్ధి చేయడంపై గుజరాత్ దృష్టి సారించింది. పట్టణాల్లో ఉన్న మౌలిక వసతులను గ్రామాల్లో కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. మొద టి దశలో 255 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, పెద్ద రోడ్లు నిర్మించడం, తాగు నీటి సరఫరా మెరుగుపరచడం వంటి సౌకర్యాలను కల్పించింది. ఇది 2009-10 నుంచి అమలవుతోంది. అయితే 10 వేలకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలనే ఈ పథకానికి ఎంపిక చేస్తున్నారు. రెండో దశలో మరో 170 గ్రామాలను ఎంపిక చేశారు. అభివృద్ధి పనులు సాగుతున్నాయి.
ఈ-పంచాయతీలు..
గుజరాత్‌లోని 18 వేల పంచాయతీల్లో సుమారు 13 వేల పంచాయతీలను కంప్యూటరీకరించారు. ఆ రాష్ట్రంలో పంచాయతీ, రెవెన్యూ శాఖకు కలిపి ఒక్కరే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. మన రాష్ట్రంలో ఇందిరమ్మ పథకం వలె అక్కడ సర్ధార్ పటేల్ ఆవాస్ యోజన అమలు చేస్తున్నారు. పంచాయతీ భవనాలు పాతవి ఉన్నప్పటికీ బీఆర్‌జీఎఫ్ నిధులతో కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. గరీబ్ కల్యాణ్ మేళా పేరుతో ఏటా పేద కుటుంబాల జంటలకు ఉచితంగా వివాహాలు జరిపిస్తారు.
అంతా ఆన్‌లైన్‌లోనే..
ఏ సమస్యపైనైనా ఫిర్యాదు చేయాలంటే అధికారిని నేరుగా కలవాల్సిన అవసరం లేదు. అక్కడ అన్నీ ఆన్‌లైన్‌లోనే.. ఫిర్యాదుదారుడు తన సమస్యను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా అధికారులు సమస్య పరిష్కరిస్తారు. మన రాష్ట్రంలోని మీ-సేవ కేంద్రాల్లాగే గుజరాత్‌లో ఈ-గ్రామ్ అమలవుతోంది. అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలను ఈ కేంద్రాలనుంచి పొందొచ్చు.
సబర్మతి క్షేత్రం.. అభివృద్ధికి నిలయం
Published Sat, Aug 31 2013 3:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM
Advertisement
Advertisement