మోతీ షాహీ మహల్... చారిత్రక నిర్మాణం. అహ్మదాబాద్ నగరంలో షాహీభాగ్‌లో ఉంది. ఇప్పుడది సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితానికి దర్పణం. వల్లభాయ్ పటేల్ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను వివరించే డిజిటల్ స్టూడియో అద్భుతం. డిజిటల్ స్టూడియో జైలు గదుల రూపంలో విభజించి ఉంటుంది. గదులకు ఉన్న ఊచలను పట్టుకుంటే ఒక్కొక్క ఘట్టం ఆడియోలో వినిపిస్తుంది. జాతీయోద్యమంలో భాగంగా పటేల్ జైలు జీవితం గడిపిన సంఘటనలతో పాటు ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ భాషల్లో వినవచ్చు. వీటన్నింటినీ లేజర్ షోలో చూడవచ్చు.
ఇక మ్యూజియంలో ఒక్కో గది ఒక్కో రకమైన వస్తువులతో అలరిస్తుంది. వర్తమానం, ఆహ్వానపత్రాలను పంపించిన ట్యూబ్‌లాంటి వెండి పెట్టెలున్నాయి. ఐరన్ మ్యాన్ చేతుల మీదుగా శంఖుస్థాపన చేయించుకోవడానికి సిద్ధం చేసిన వెండితాపీలు లెక్కలేనన్ని ఉన్నాయి. మెమోరియల్ మ్యూజియం అంటే ఆ వ్యక్తి ఉపయోగించిన చెప్పులు, పెన్నులు, భోజనం చేసిన ప్లేట్‌లు, దుస్తులను మాత్రమే చూస్తుంటాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్‌లో భారత జాతీయోద్యమం కనిపిస్తుంది. గాంధీ, నెహ్రూలతో పటేల్ కలసి ఉన్న ఫొటోలతోపాటు ఆయా సందర్భాల వివరణ కూడా ఉంటుంది. పటేల్ జీవితంలో ఉపయోగించిన వస్తువులు ఏయే సందర్భంగా ఉపయోగించారనే వివరాలు ఉండడంతో ఫ్రీడమ్ మూవ్‌మెంట్ క్షణక్షణమూ గుర్తుకు వస్తుంది. విశ్వకవి రవీంద్రుడు పదిహేడేళ్ల వయసులో కొంత కాలం ఈ మహల్‌లో బస చేశాడు.
ఇదీ చదవండి: వెళ్లిపోకు నా ప్రాణమా! బోరున విలపించిన సృజన
షాజహాన్ విడిది
వల్లభాయ్ పటేల్ మెమోరియల్ ఉన్న భవనం మోతీ షాహీ మహల్... మొఘలుల నిర్మాణాలను తలపిస్తుంది. ఈ షాహీ మహల్‌ని 17వ శతాబ్దంలో షాజహాన్ కట్టించాడు. షాజహాన్ యువరాజుగా ఈ ప్రదేశానికి ప్రతినిధిగా ఉన్నప్పుడు దీనిని నిర్మించాడు, రాజ్యపర్యటనకు వచ్చినప్పుడు అతడి విడిది కూడా ఇందులోనే. ఆ తర్వాత బ్రిటిష్ ఉన్నతాధికారుల నివాసమైంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ భవనం రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్. గవర్నర్ నివాసానికి కొత్త భవనం కట్టిన తర్వాత 1978లో ఈ భవనాన్ని పటేల్ మొమోరియల్‌గా మార్చారు. నరేంద్రమోదీ గుజరాత్‌కి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2013లో ఈ మెమోరియల్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటలైజ్ అయింది. మ్యూజియం అంతా తిరిగి చూసిన తర్వాత అదే ప్రాంగణంలో ఉన్న పటేల్ విగ్రహం దగ్గరకు వచ్చినప్పుడు ‘ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడరన్ ఇండియా’ అనే ఆత్మీయ ప్రశంసను గుర్తు చేసుకుంటూ ఓ నమస్కారం పెడతాం.
ఆదివారం ఆటవిడుపు
మోతీ షాహీ మహల్ చుట్టూ అందమైన గార్డెన్ మొఘలుల చార్‌భాగ్ నమూనాలో ఉంటుంది. దట్టమైన చెట్ల మధ్య పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు ఉంటాయి. రంగురంగుల వాటర్‌ఫౌంటెయిన్ పిల్లలను అలరిస్తుంది. అహ్మదాబాద్ వాసులకు వీకెండ్ పిక్‌నిక్ ప్లేస్ ఇది. దాదాపుగా నగరంలోని స్కూళ్లన్నీ విద్యార్థులను ఏటా ఈ మ్యూజియం సందర్శనకు తీసుకువస్తుంటాయి. అహ్మదాబాద్ పర్యటనలో మిస్ కాకుండా చూడాల్సిన ప్రదేశం ఇది. ఈ మెమోరియల్ భవనం లోపల మాత్రమే కాదు భవనం బయట పరిసరాలను కూడా ఆస్వాదించాలి. పచ్చటి ఉద్యానవనంలోని చెట్ల కొమ్మల మీద నెమళ్లు సేదదీరుతుంటాయి. చెట్ల మధ్య విహరిస్తూ తినుబండారాలను రుచి చూడాలంటే అనుమతించరు. చాటుగా తినే ప్రయత్నం చేసినా కోతులు ఊరుకోవు. మెరుపువేగంతో వచ్చి లాక్కెళ్తాయి. మ్యూజియం పర్యటనకు అనువైన కాలం అని ప్రత్యేకంగా అక్కరలేదు, కానీ అహ్మదాబాద్‌లో పర్యటించడానికి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అనువుగా ఉంటుంది. కాబట్టి క్రిస్‌మస్, సంక్రాంతి సెలవుల్లో ప్లాన్ చేసుకోవచ్చు. అహ్మదాబాద్ ఎయిర్΄ోర్ట్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్‌కు దూరం ఐదు కిలోమీటర్లు మాత్రమే.
– వాకా మంజులారెడ్డి,
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment