న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కు ఆర్థికశాఖ బుధవారం పిలుపునిచ్చింది. ‘‘మూలధనం, సమర్థవంతమైన వనరులు, సాంకేతిక పరిజ్ఞానం వంటి విషయాల్లో కీలక పాత్ర పోషించాలని నేను ఐబీఏ చైర్మన్‌ను కోరుతున్నాను. ఐబీఏ కేవలం బ్యాంకింగ్ సమస్యలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కు నివేదించే సంఘం మాత్రమే కాదు, వృద్ధిని పెంచడానికి ఆర్థిక సంస్కరణలతో బ్యాంకింగ్ వ్యవస్థను అనుసంధానం చేయడానికి ప్రయత్నించాలి’’ అని ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి దేబాషిష్ పాండా పేర్కొన్నారు.
ఐబీఐ ఢిల్లీ కార్యాలయం ప్రారంభం
అంతకుమందు దేబాషిస్ పాండా ఢిల్లీలో ఐబీఏ కార్యాలయాన్ని ప్రారంభించారు. నిర్వహణ విషయంలో మధ్య శ్రేణి బ్యాంకింగ్ నిపుణులకు శిక్షణను ఇవ్వడానికి, వారిలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి కూడా ఐబీఏ తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. దీనివల్ల బ్యాంకులకు ఈ విషయంలో భారం తగ్గిపోతుందని విశ్లేషించారు.
కస్టమర్ సేవలపై దృష్టి: రాజ్‌కిరణ్ రాయ్
ఈ సందర్భంగా ఐబీఐ చైర్మన్ రాజ్‌కిరణ్ రాయ్ మాట్లాడుతూ, ఐబీఏలో పరివర్తన 2018 లో ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేవలం సలహాలు, సమస్యల పరిష్కారంపైనే దృష్టి సారించకుండా, బ్యాంకింగ్ వ్యాపారం, సేవల పరంగా కార్యకలాపాలలో మరింత నిమగ్నమైందని అన్నారు. కాగా, మహమ్మారి కోవిడ్ సమయంలో కస్టమర్లకు సేవలు అందించే విషయంలో వినూత్న విధానాలు రూపొందించడంపై దృష్టి సారించినట్లు ఐబీఏ సీఈఓ సునిల్ మెహతా ఈ సందర్భంగా తెలిపారు. అలాగే మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ సమన్వయ పనితీరు కోసం మార్గదర్శకాలను రూపొందించిందని వివరించారు. రుణాల మంజూరు, పంపిణీల్లో ఎటువంటి అవకతవకలకూ చోటులేని విధంగా కార్పొరేట్ రుణ వ్యవస్థసహా పలు సంస్కరణలను తీసుకువచ్చినట్లు వెల్లడించారు. రూ.6,000 కోట్ల బ్యాంక్ బ్యాంక్ (నేషనల్ అసెట్ రికన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్– ఎన్‌ఏఆర్‌సీఎల్) ఏర్పాటుకు లైసెన్స్ జారీ చేయాలని కోరుతూ ఇటీవలే ఆర్‌బీఐకి ఐబీఏ దరఖాస్తు దాఖలు చేసింది, వ్యవస్థల పట్ల పట్టింపులేకపోవడమే
బ్యాంకు మోసాలపై సీవీసీ పరిశీలన
రుణాల మంజూరులో, ఇతర కార్యకలాపాల విషయంలో వ్యవస్థలను, విధానాలను పట్టించుకోకపోవడమే బ్యాంకింగ్ రంగంలో పెద్ద ఎత్తున మోసాలకు కారణంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) గుర్తించింది. అవినీతికి చెక్ పెట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రతీ దశలోనూ మోసాల నివారణకు ప్రాధాన్యం ఇవ్వాలని చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్లను సీవీసీ కోరింది. అలాగే, విదేశీ శాఖల్లో చోటుచేసుకున్న పెద్ద మోసాల్లో అంతర్గతంగా ఉన్న అంశాలను విశ్లేషించాలని కూడా సూచించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చినట్టు సీవీసీ తెలిపింది. విజిలెన్స్ కేసులు, వాటి పురోగతి, నివారణ చర్యలను బ్యాంకుల చీఫ్‌లు సీవీసీకి ఇదే సమావేశంలో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment