
చెన్నై: నగదు కొరతను సత్వరం పరిష్కరించేందుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకోవాలని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) డిమాండ్ చేసింది. బ్యాంకు శాఖలు, ఏటీఎంలు నగదు లేక వెలవెలబోతున్న నేపథ్యంలో ఉత్తుత్తి ప్రకటనలు సరిపోవని, పరిస్థితిని చక్కదిద్దడానికి నిర్మాణాత్మక చర్యలు అవసరమని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం చెప్పారు. దేశవ్యాప్తంగా నగదులేని ఏటీఎంలు సహా ఎన్నో అంశాల్లో ఆర్‌బీఐ వైఫల్యం ఉందని, తక్షణమే ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నగదు సరఫరాను వెంటనే పెంచకపోతే తాము దేశవ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. తొమ్మిది ఉద్యోగ సంఘాలతో కూడిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్‌లో ఏఐబీఈఏ కూడా భాగం. కొన్ని రాష్ట్రాల్లో నగదు కొరత చాలా తీవ్రంగా ఉందని వెంకటాచలం అంగీకరించారు. ‘‘కస్టమర్ల విత్‌డ్రాయెల్స్‌కు తగ్గ నగదు సర్దుబాటు చేసే పరిస్థితి కొన్ని శాఖల్లో లేదు. ఆర్‌బీఐ, ప్రభుత్వం కారణంగా ఏర్పడిన ఈ పరిస్థితికి బ్యాంకు ఉద్యోగుల పాత్ర లేకపోయినా కస్టమర్ల ఆగ్రహాన్ని ఉద్యోగులు చవిచూడాల్సి వస్తోంది. మా తప్పేమీ లేకపోయినా కస్టమర్లు మమ్మల్ని తిడుతున్నారు. కాబట్టి ప్రకటనలు చేస్తే సరిపోదు. సత్వర చర్యలు చేపట్టడం ద్వారా నగదు సరఫరాను పెంచాలి’’ అని వెంకటాచలం కోరారు. కొన్ని వారాలుగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర నగదు కొరత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, వ్యవస్థలో అవసరానికి మించి నగదు ఉందంటూ ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించడం గమనార్హం.
రూ.2,000 నోట్లతోనే సమస్య: రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తర్వాత రూ.2,000నోట్లను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంతోనే సమస్య మొదలైందని వెంకటాచలం పేర్కొన్నారు. నోట్ల రద్దు జరిగి 16 నెలలవుతున్నా కొత్త నోట్లకు అనుగుణంగా కొన్ని ఏటీఎంల్లో ఇప్పటికీ మార్పులు జరగలేదన్నారు. పార్లమెంట్ అనుమతి కోసం పెండిం గ్‌లో ఉన్న ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు కూడా సమస్యకు కారణమేనని పేర్కొన్నారు. ఈ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉర్జిత్ పటేల్ తప్పుకోవాలి
‘‘ఆర్‌బీఐ స్వతంత్రంగా పనిచేయడం లేదు. ప్రస్తుత కరెన్సీ సమస్యకు ఆర్‌బీఐ గవర్నర్ బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లేదా ఆయన్ను తప్పించాలి. ఇందులో ఆర్‌బీఐ పూర్తి నిర్లక్ష్యం ఉంది’’ అని వెంకటాచలం చెప్పారు.