Cash shortage
-
తీవ్ర నిధుల సంక్షోభంలో ఐరాస
ఐక్యరాజ్య సమితి: ఐక్యరాజ్య సమితి తీవ్రమైన నిధుల కొరతలో ఉందని సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు వచ్చే నెల వేతనాలిచ్చేందుకూ సరిపోను నిధులు లేవన్నారు. ఐరాసలో ఈ దశాబ్దంలో ఈ స్థాయి సంక్షోభం ఎన్నడూ లేదన్నారు. సంస్థకు ఇస్తామని ప్రకటించిన నిధులను తక్షణమే అందించాలని 193 సభ్య దేశాలకు విజ్ఞప్తి చేశారు. నిధుల్లేకుండా ఐరాస పథకాల అమలు సాధ్యం కాబోదన్నారు. ఈ దశాబ్దంలోనే ఈ నెలలో అత్యంత తక్కువ స్థాయిలో నిధులున్నాయన్నారు. సంస్థకు దేశం తరఫున అందించాల్సిన నిధులను పూర్తిగా అందించిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయితే, శాంతి పరిరక్షణ దళ ఖర్చుల నిమిత్తం భారత్‌కే ఐరాస రూ. 270 కోట్లు ఇవ్వాల్సి ఉంది. 73 దేశాలు మాత్రమే.. 2017, 2018 సంవత్సరాలకు గానూ 73 దేశాలు మాత్రమే, మార్చి నాటికి తమ వాటాను పూర్తిగా చెల్లించాయని గ్యుటెరస్ తెలిపారు. 2016లో 62 దేశాలు, 2015లో 67 దేశాలు తమ వాటాను పూర్తిగా చెల్లించాయన్నారు. 2018 చివరి నాటికి సభ్య దేశాల నుంచి సంస్థకు అందాల్సిన నిధులు 529 మిలియన్ డాలర్లు. 2018, 2019 సంవత్సరాలకు గానూ.. సంస్థ సాధారణ బడ్జెట్ అయిన 5.4 బిలియన్ అమెరికన్ డాలర్లలో దాదాపు 22% అమెరికా నుంచి అందాల్సి ఉంది. ఈ జనవరి నుంచి తీవ్రస్థాయిలో పొదుపు చర్యలు చేపట్టకుండా, నెలవారీ ఖర్చుల విధానం ప్రారంభించకుండా ఉండి ఉంటే.. పరిస్థితి మరింత దారుణంగా ఉండి ఉండేదని గ్యుటెరస్ అభిప్రాయపడ్డారు. ‘ఆ చర్యలే చేపట్టకుండా ఉండి ఉంటే.. జనరల్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అవసరమైన నిధులు కూడా మనవద్ద ఉండేవి కావు’ అన్నారు. అత్యంత తీవ్రమైన నిధుల లేమి కారణంగా కఠినమైన పొదుపు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. -
కరెన్సీ సమస్యపై స్పందించరేం?
చెన్నై: నగదు కొరతను సత్వరం పరిష్కరించేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకోవాలని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) డిమాండ్ చేసింది. బ్యాంకు శాఖలు, ఏటీఎంలు నగదు లేక వెలవెలబోతున్న నేపథ్యంలో ఉత్తుత్తి ప్రకటనలు సరిపోవని, పరిస్థితిని చక్కదిద్దడానికి నిర్మాణాత్మక చర్యలు అవసరమని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం చెప్పారు. దేశవ్యాప్తంగా నగదులేని ఏటీఎంలు సహా ఎన్నో అంశాల్లో ఆర్బీఐ వైఫల్యం ఉందని, తక్షణమే ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నగదు సరఫరాను వెంటనే పెంచకపోతే తాము దేశవ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. తొమ్మిది ఉద్యోగ సంఘాలతో కూడిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్‌లో ఏఐబీఈఏ కూడా భాగం. కొన్ని రాష్ట్రాల్లో నగదు కొరత చాలా తీవ్రంగా ఉందని వెంకటాచలం అంగీకరించారు. ‘‘కస్టమర్ల విత్‌డ్రాయెల్స్‌కు తగ్గ నగదు సర్దుబాటు చేసే పరిస్థితి కొన్ని శాఖల్లో లేదు. ఆర్బీఐ, ప్రభుత్వం కారణంగా ఏర్పడిన ఈ పరిస్థితికి బ్యాంకు ఉద్యోగుల పాత్ర లేకపోయినా కస్టమర్ల ఆగ్రహాన్ని ఉద్యోగులు చవిచూడాల్సి వస్తోంది. మా తప్పేమీ లేకపోయినా కస్టమర్లు మమ్మల్ని తిడుతున్నారు. కాబట్టి ప్రకటనలు చేస్తే సరిపోదు. సత్వర చర్యలు చేపట్టడం ద్వారా నగదు సరఫరాను పెంచాలి’’ అని వెంకటాచలం కోరారు. కొన్ని వారాలుగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర నగదు కొరత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, వ్యవస్థలో అవసరానికి మించి నగదు ఉందంటూ ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించడం గమనార్హం. రూ.2,000 నోట్లతోనే సమస్య: రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తర్వాత రూ.2,000నోట్లను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంతోనే సమస్య మొదలైందని వెంకటాచలం పేర్కొన్నారు. నోట్ల రద్దు జరిగి 16 నెలలవుతున్నా కొత్త నోట్లకు అనుగుణంగా కొన్ని ఏటీఎంల్లో ఇప్పటికీ మార్పులు జరగలేదన్నారు. పార్లమెంట్ అనుమతి కోసం పెండిం గ్లో ఉన్న ఎఫ్ఆర్డీఐ బిల్లు కూడా సమస్యకు కారణమేనని పేర్కొన్నారు. ఈ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉర్జిత్ పటేల్ తప్పుకోవాలి ‘‘ఆర్బీఐ స్వతంత్రంగా పనిచేయడం లేదు. ప్రస్తుత కరెన్సీ సమస్యకు ఆర్బీఐ గవర్నర్ బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లేదా ఆయన్ను తప్పించాలి. ఇందులో ఆర్బీఐ పూర్తి నిర్లక్ష్యం ఉంది’’ అని వెంకటాచలం చెప్పారు. -
86 శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయి
న్యూఢిల్లీ: నగదు కొరత సమస్య శుక్రవారం నాటికి పరిష్కారమవుతుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్‌కుమార్ తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా 86 శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయని, నగదు కొరత సమస్య తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘దేశమంతటా ఒకే విధంగా ఉన్న సమస్య కాదు ఇది. తెలంగాణ, బిహార్ వంటి ప్రదేశాల్లో సమస్య ఉంది. శుక్రవారంతో పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఆయా ప్రాంతాలకు నగదు గురువారం సాయంత్రానికి చేరుకుంటుంది’’ అని రజనీష్ కుమార్ మీడియాకు చెప్పారు. కరెన్సీ అనేది చేతులు మారాలని, దాన్ని తీసుకుని అలానే ఉంచేసుకుంటే బ్యాంకులు ఏమి సరఫరా చేయగలవని ఆయన ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి నగదును ఉపసంహరించుకుంటే అది తిరిగి బ్యాంకులకు చేరాలన్నారు. మరోవైపు డిమాండ్ ఏర్పడిన ప్రాంతాలకు నగదు సరఫరా పెంపునకు చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. 2.2 లక్షల ఏటీఎంలకు గాను 86 శాతం ఏటీఎంలు నగదు నిల్వలతో పనిచేస్తున్నాయని ప్రకటించాయి. మంగళవారం 60 శాతం ఏటీఎంలే పనిచేసిన విషయాన్ని గుర్తు చేశాయి. ఎన్నికలకు ముందు నగదును నిల్వ చేయడం, ఏటీఎంలను రూ.200 నోట్లకు అనుగుణంగా మార్పు చేయకపోవడం సమస్యకు కారణంగా పేర్కొన్నాయి. రూ.70,000 వేల కోట్ల మేర నగదు కొరతను అధిగమించేందుకు నాలుగు కేంద్రాలు రోజులో పూర్తి సమయం పాటు రూ.500, రూ.200 నోట్లను ముద్రిస్తున్నట్టు తెలిపాయి. ఒక్క రోజు నిబంధనకు మారిపోవాలి వ్యాపార సంస్థలు ‘ఒక్కరోజు చెల్లింపు ఉల్లంఘన’ నిబంధనకు మారిపోవాలని రజనీష్ అన్నారు. రుణ బకాయిలను సమయానికి చెల్లించేయాలని సూచిం చారు. బకాయిలను ఒక్కరోజులోగా చెల్లించకపోతే పరిశీలన జాబితాలో చేర్చాల్సి వస్తుందని కస్టమర్లను హెచ్చరించాలంటూ బ్యాంకులను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ ఆదేశించిన విషయంలో రజనీష్ కుమార్ దీనిపై ప్రకటన చేయడం గమనార్హం. చాలా వరకు బ్యాంకులు ఒక్క రోజు నిబంధనను అమలు చేయడంలో విఫలమవుతుండటంపై స్వామినాథన్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణకు ఇది సమయం కాదు! ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు ఇది సమయం కాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఇందుకు సహకరించడం లేదని ఆయన పేర్కొన్నారు. -
ఇబ్బందుల్లేకుండా జీఎస్టీ అమలు
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ అమలు వల్ల క్షేత్రస్థాయిలో వ్యాపారులకు, పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. జీఎస్టీ అమలు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంపై ఏర్పాటైన వివిధ రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో కూడిన ఉప సంఘ సమావేశం మంగళవారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ వల్ల ఎదురవుతున్న సమస్యలను తెలుసుకునేందుకు సమావేశానికి దేశంలో ఉన్న ట్యాక్స్ కన్సల్టెంట్లను, ఫిక్కీ, సీఐఐ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించినట్టు తెలిపారు. వారిచ్చిన సలహాలను వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముందుంచి.. ఆమోదించి జీఎస్టీ అమలును సరళతరం చేస్తామని చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు, ట్రేడర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పన్ను ఎగవేతదారులకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు 15వ ఫైనాన్స్ కమిషన్ చేయూత ఇవ్వాలే తప్పా.. రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్డీపీలో 25 శాతం ఎఫ్ఆర్బీఎం రుణం పొందే అవకాశాన్ని 20 శాతానికి తగ్గించే ప్రయత్నాలకు తాము వ్యతిరేకమని చెప్పారు. క్షేత్రస్థాయిలో నగదు కొరత.. రాష్ట్రంలో నగదు కొరతపై ఈటల స్పందిస్తూ.. తెలంగాణకు గతంలో కంటే ఎక్కువ డబ్బు సరఫరా చేసినట్టు కేంద్రం లెక్కలు చెబుతోందని, అయితే క్షేత్రస్థాయిలో కొరత ఉందన్నారు. ‘దేశంలో ఈ రోజుల్లో ఒక్కొక్కటిగా బ్యాంకు మోసాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో బ్యాంకుల్లో డబ్బులు పెట్టడం సరికాదన్న ఆలోచనా ధోరణిలో ప్రజలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న పెట్టుబడి సాయానికి నిధుల కొరత ఉండదని ఆశిస్తున్నాం. ఈ పథకం అమలు చేస్తున్నాం కాబట్టి రూ.6 వేల కోట్ల నగదు సరఫరా చేయాలని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీని కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు’అని అన్నారు. -
కరెన్సీ కొరత తాత్కాలికమే
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో నగదు కొరత నెలకొనడం, ఏటీఎంలు మూతబడటంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. గడిచిన మూడు నెలలుగా నగదుకు అసాధారణ డిమాండ్ నెలకొనడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయా రాష్ట్రాల్లో ఈ కొరత తాత్కాలికమైనదేనన్న జైట్లీ.. పరిస్థితి చక్కదిద్దేందుకు సత్వరం చర్యలు తీసుకుంటున్నామన్నారు. సరిపడేంత కరెన్సీ చలామణిలో ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కరెన్సీ పరిస్థితిని సమీక్షించినట్లు పేర్కొన్నారు. ‘మొత్తం మీద చాలినంత కరెన్సీ చలామణిలో ఉంది. అలాగే బ్యాంకుల దగ్గర కూడా తగినంత నగదు ఉంది. కొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా, ఒక్కసారిగా తలెత్తిన డిమాండ్ పరిస్థితిని సత్వరం చక్కదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి‘ అని మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్వీటర్లో జైట్లీ ట్వీట్ చేశారు. మరోవైపు, కరెన్సీ కష్టాలను ధ్రువీకరిస్తూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, బిహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో నగదుకు అసాధారణ డిమాండ్ కనిపించిందని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల తొలి 13 రోజుల్లో కరెన్సీ సరఫరా రూ. 45,000 కోట్ల మేర పెరిగినట్లు వివరించింది. ‘అసాధారణంగా తలెత్తిన డిమాండ్‌కి తగ్గట్లు సరఫరా చేసేందుకు తగినంత కరెన్సీ ఉంది. రూ. 100, రూ. 200, రూ. 500 సహా అన్ని నోట్ల నిల్వలు సరిపడేంత స్థాయిలో ఉన్నాయి‘ అని ఆర్థిక శాఖ పేర్కొంది. ప్రత్యేక కమిటీ ఏర్పాటు.. కొన్ని రాష్ట్రాల్లో నెలకొన్న కరెన్సీ కష్టాలను సమీక్షించేందుకు ప్రభుత్వం రాష్ట్రాలవారీగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా తెలిపారు. మరో 2–3 రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కాగలదన్నారు. ఇందుకోసం అటు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నగదు బదలాయించే అంశాన్ని పర్యవేక్షించడానికి ఆర్బీఐ కూడా కమిటీ వేసినట్లు మంత్రి చెప్పారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం నగదు చలామణి మళ్లీ ...పెద్ద నోట్ల రద్దు పూర్వ స్థాయికి చేరింది. రూ. 17 లక్షల కోట్ల నగదు చలామణిలోకి వచ్చింది. మరోవైపు, కరెన్సీ కొరత నెలకొందనడం సరికాదని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. పంటల కొనుగోళ్ల సీజన్లో కరెన్సీకి డిమాండ్ నెలకొనడం సాధారణమేనని, దీనివల్లే కొంత అసమతుల్యత నెలకొని ఉండొచ్చన్నారు. ప్రొక్యూర్మెంట్ సీజన్ కారణంగా పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ డిమాండ్ ఏర్పడిందని ఆయన చెప్పారు. ఏటీఎంలలో తగ్గిన నగదు భర్తీ.. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంలలో భర్తీ చేసేందుకు రోజువారీ వచ్చే నగదు పరిమాణం కొద్ది రోజులుగా గణనీయంగా తగ్గిపోయిందని ఏటీఎంల సంస్థల సమాఖ్య (సీఏటీఎంఐ) ప్రతినిధి వి. బాలసుబ్రమణియన్ తెలిపారు. మార్చి నెల ఆఖరు దాకా రోజువారీ డిమాండ్‌లో దాదాపు 90 శాతం మొత్తం ఏటీఎంలకు వచ్చేదని... అయితే, గడిచిన వారం రోజులుగా 30 శాతం మాత్రమే ఉంటోందని ఆయన వివరించారు. రూ. 500 నోట్ల ముద్రణ పెంచుతున్నాం: గర్గ్ కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న నగదు కొరతను అధిగమించడానికి రిజర్వ్ బ్యాంక్ రూ. 500 నోట్ల ముద్రణను అయిదు రెట్లు పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ వెల్లడించారు. రూ. 2,000 నోట్లు చలామణిలోకి రాకుండా కొందరు అక్రమంగా నిల్వ చేసుకుంటుండటం కూడా కరెన్సీ కొరతకి కారణమై ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘భవిష్యత్‌లో కరెన్సీ కొరత నెలకొనవచ్చన్న అభిప్రాయం కూడా కొంత మందిలో నెలకొంది. దీంతో వారు విత్‌డ్రా చేసుకుంటూ ఉండటం సైతం ఈ సమస్యకు కారణమై ఉండొచ్చు. అయితే, అసాధారణంగా డిమాండ్ తలెత్తితే సర్దుబాటు చేసేందుకు వీలుగా చలామణిలో ఉన్న కరెన్సీలో ఆరో వంతు మొత్తం ఎప్పుడూ రిజర్వ్‌లో ఉంటుంది. ప్రస్తుతం రూ. 2 లక్షల కోట్ల కరెన్సీ ఈ విధంగా రిజర్వ్‌లో ఉంది‘ అని ఆయన చెప్పారు. డిమాండ్ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరింత అధికంగా కరెన్సీ ముద్రణపై దృష్టి పెట్టిందని గర్గ్ పేర్కొన్నారు. ‘డిమాండ్ పెరిగితే తగినంత కరెన్సీ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం రోజుకు రూ. 500 కోట్ల స్థాయిలో ఉంటున్న రూ. 500 నోట్ల ముద్రణను.. రోజుకు రూ. 2,500 కోట్లకు పెంచనున్నాం. అంటే నెలలో రూ. 70,000–75,000 కోట్ల ముద్రణ జరుగుతుంది‘ అని వివరించారు. బ్యాంకింగ్ స్కామ్‌లకు, నగదు కొరతకు సంబంధం లేదని గర్గ్ తేల్చిచెప్పారు. కొన్ని రాష్ట్రాలు సంక్షేమ పథకాలకి మరింత నగదు బదిలీ పథకాలు అమలు చేస్తుండటం, మొత్తం డబ్బు బ్యాంకుల్లో దాచడం కన్నా కొంత తమ దగ్గరే పెట్టుకోవడం మంచిదనే భావన మొదలైనవీ కరెన్సీ కొరతకు కారణమై ఉండొచ్చన్నారు. మరోవైపు, వ్యవస్థలో నగదు కొరత లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో రవాణాపరమైన సమస్యల కారణంగా నగదు లభ్యత అంతగా లేకపోయి ఉండొచ్చని వివరణనిచ్చింది. ఆర్బీఐ వద్ద తగినన్ని నగదు నిల్వలు ఉన్నాయని, అయినప్పటికీ.. నాలుగు ప్రెస్‌లలోనూ మరిన్ని నోట్ల ముద్రణ పెంచినట్లు పేర్కొంది. -
నోటు కష్టం
ఈయన పేరు ఉప్పరి ధర్మరాజు. క్రిష్ణగిరి మండలం మాదాపురం గ్రామానికి చెందిన ఈయన పొలంలో పండిన వేరుశనగలను మద్దతు ధరతో ఆయిల్‌ఫెడ్ కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నాడు. ఇందుకు సంబంధించి రూ.95వేలు వెల్దుర్తి ఏపీజీబీలోని ఆయన ఖాతాకు 15 రోజుల క్రితం జమ అయింది. 10 రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా నగదు లేదని సమాధానమిస్తున్నారు. గట్టిగా అడిగితే నగదు రావడం లేదని చెబుతున్నారు. కర్నూలు(అగ్రికల్చర్)/వైఎస్ఆర్ సర్కిల్: అసలే మొదటి వారం.. ఆపై నగదు కొరత.. ఇంకేముంది. ఎక్కడ చూసినా రూకలకు ఇక్కట్లే. ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులు, బ్యాంకుల్లో తర్వాత రండి అనే సమాధానాలు నిత్యకృత్యమయ్యాయి. ఫలితంగా అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా వేతన జీవుల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఇదీ పరిస్థితి.. జీతాలు, పింఛన్ల పంపిణీ కోసం జిల్లాకు కనీసం రూ.100 కోట్లు అవసరముండగా బ్యాంకుల్లో రూ.20 కోట్లు కూడా లేని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో పింఛన్ల పంపిణీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోరాదని, ఇందుకు అవసరమైన నగదు సిద్ధం చేయాలన్న కలెక్టర్ ఆదేశాల మేరకు రూ.30 కోట్లు అత్యవసరంగా సర్దుబాటు చేయాలని ఎల్డీఎం 5 రోజుల క్రితమే ఆర్బీఐని కోరినా ఫలితం లేకుండా పోయింది. ఎఫ్ఆర్డీఏ బిల్లు వల్ల కలిగే పరిమాణాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లడంతో బ్యాంకులకు డిపాజిట్లు రావడం తగ్గిపోయింది. ఇదే సమయంలో బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ మూడు,నాలుగు రెట్లు పెరిగింది. దీంతో నగదు కష్టాలు పెరిగిపోయాయి. పింఛన్లు, జీతాల పంపిణే కష్టంగా మారింది. రైతులు ఇతర వర్గాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జిల్లాలో 465 బ్యాంకు శాఖలుండగా 80 శాతం డబ్బులేక దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. కోటి రూపాయలు పంపాలని ప్రాంతీయ కార్యాలయాలను కోరితే రూ.5లక్షలు కూడా ఇవ్వడం లేదు. ఏటీఎంలదీ ఇదే పరిస్థితి. జిల్లాలో 485 ఏటీఎంలుండగా 85శాతం వరకు నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఫలితంగా 20 రోజులుగా బ్యాంకుల్లో లావాదేవీలు గణనీయంగా పడిపోయాయి. ఈ కారణంగా మళ్లీ పెద్ద నోట్ల రద్దునాటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 6 నెలలుగా నగదు సరఫరా బంద్.. రిజర్వు బ్యాంకు నుంచి దాదాపు ఆరు నెలలుగా నగదు సరఫరా బంద్ అయింది. ‘తగినంత నగదు ముద్రించి పంపాము. ప్రజల్లోకి వెళ్లిన నగదు సర్క్యులేషన్లో లేదు. దాచి పెట్టుకుంటుండటం వల్ల నగదు సమస్య ఏర్పడుతోంది. ప్రభుత్వం, బ్యాంకులే సమన్వయంతో నగదు కొరత తీర్చుకోవాలి’ అని ఆర్బీఐ అధికారులు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో నగదు రహిత లావాదేవీలు పెంచుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. నగదు రహిత లావాదేవీలు పడిపోవడం, ప్రజల్లోకి వెళ్లిన నగదు తిరిగి బయటికి రాకపోతుండటం, డిపాజిట్లు బంద్ కావడం, ఆర్బీఐ నుంచి నగదు రావడం నిలిచిపోవడం తదితర కారణాల వల్ల క్యాష్ కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని బ్యాంకులు నగదు కోసం రేపు, మాపు అంటుండగా మరికొన్ని బ్యాంకుల్లో రూ.50వేలు అడిగితే రూ.10 వేలు, రూ.5వేలు ఇచ్చి పంపుతున్నారు. దీంతో అందరూ అవస్థలు పడుతున్నారు. బ్లాక్ అవుతున్న పెద్ద నోట్లు.. రూ.2వేల నోట్ల సర్క్యులేషన్ గణనీయంగా పడిపోయింది. ఈ నోట్ల ముద్రణను ఆర్బీఐ పూర్తిగా నిలిపివేసింది. బ్యాంకుల నుంచి బయటికి వెళ్లిన నోట్లు ఎక్కడివక్కడ బ్లాక్ అవుతున్నాయి. పెద్ద నోట్లను చాలా వరకు లాకర్లలో పెడుతున్నట్లు సమాచారం. రూ.15వేల కంటే ఎక్కువ ఇవ్వలేము.... ఆర్బీఐ నుంచి ఆరు నెలలుగా నగదు రావడం లేదు. దీంతో క్యాష్కు ఇబ్బందిగా ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఒక్క ట్రెజరీ బ్యాంకుకే రూ.5కోట్లు అవసరం. 15 రోజుల నుంచి రోజు కింత తీసిపెడుతూ రూ.కోటి వరకు నిల్వ ఉంచాం. ఉద్యోగుల ఖాతాలకు జీతాలు జమ అయినా.. రూ.15వేల కంటే ఎక్కువ ఇవ్వలేం. ట్రెజరీ బ్రాంచి ఏటీఎంలో మాత్రం నగదు ఉంచుతున్నాం. బయటి వాళ్లు వచ్చి నగదు తీసుకుంటున్న కారణంగా రాత్రిళ్లు క్లోజ్ చేస్తున్నాం. – కల్యాణ్‌కుమార్, చీఫ్ మేనేజర్, ఎస్బీఐ ట్రెజరీ బ్రాంచ్ -
పైసల్లేవ్..!
మంచిర్యాలఅగ్రికల్చర్: అన్నదాతకు నగదు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. వారం రోజులగా బ్యాంకుల్లో నగదు కొరత తీవ్రమైంది. పత్తి అమ్మిన పైసలు చేతికందడం లేదు. వ్యాపారులు ఇచ్చే నగదు ఖాతాల్లోనే జమ చేస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నగదు కోసం బ్యాంక్‌కు వెళ్తే రూ.5వేలు, రూ.10వేలకు మించి ఇవ్వడం లేదు. దీంతో బ్యాంకుల చుట్టు రోజుల తరబడి తిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు పేర్కొంటున్నారు. పంటలు అమ్మిన సొమ్ము వేలల్లో ఖాతాల్లో జమ అవుతుంటే చేతికి నగదు అందడం లేదని వాపోతున్నారు. పత్తి ఏరేందుకు కూలీలకు డబ్బులు చెల్లించలేక తిట్లు తినాల్సి వస్తోందని అంటున్నారు. అకౌంట్ నుంచి మరో అకౌంటుకు బదిలీ చేస్తామంటే కూలీలు అలా తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. తాము బ్యాంకుల చుట్టు తిరగలేమని, నగదే కావాలని చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. పంట కోసం తెచ్చిన అప్పుకు వడ్డీ పెరిగిపోతోందని అంటున్నారు. దీంతో పలుచోట్ల నగదు కోసం బ్యాంకు అధికారులు రైతులు వాగ్విదానికి దిగుతున్నారు. ఆర్బీఐ నుంచే ఆచితూచి.. నగదు కొరత కారణంగా చెస్టు నుంచి ఆర్బీఐ బ్యాంకులకు తక్కువ మొత్తంలో నగదు ఇస్తోందని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. నగదు విత్‌డ్రాలు ఎక్కువగా ఉండటం, దానికి తగ్గట్టు డిపాజిట్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. జిల్లాలో 119 వరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నగదు కొరత తీవ్రంగా ఉంది. రైతులు రుణాలు తీసుకోవడవం, చెల్లించడంతో పాటు ఇతర నగదు లావాదేవీలకు గ్రామీణ బ్యాంకుల్లోనే అకౌంట్లు ఉన్నాయి. వీటితో పాటు ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు, సహకార బ్యాంకులు ఉన్నాయి. ప్రస్తుతం వీటన్నిటిలో పెద్ద నోట్ల రద్దు సమయంలో నెలకొన్న పరిస్థితే కనిపిస్తోంది. రైతులకు ఎక్కువగా అందుబాటులో ఉండే తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో గతంలో వారానికి రూ. కోటి నుంచి రూ.3 కోట్ల వరకు నగదు వచ్చేది. ప్రస్తుతం రూ.10 లక్షలు, రూ.20 లక్షలకు మించి ఇవ్వడం లేదని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో విత్‌డ్రాలకు రూ.5 వేలు రూ.10వేలకన్నా ఎక్కువ ఇవ్వలేకపోతున్నామని తెలుపుతున్నారు. రూ.53 వేలకు రూ.5 వేలే ఇచ్చిండ్రు నాకు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అకౌంటు ఉన్నది. పంట అమ్మిన పైసలు పది రోజుల కిందట జమ చేసిండ్రు. మొత్తం 53 వేలు బ్యాంకుల ఉన్నా.. రూ.5 వేలకు ఎక్కువ ఇవ్వమంటుండ్రు. లేకుంటే పైసలు ట్రాన్స్ఫర్ చేస్తామంటుండ్రు. పైసల కోసం ఇబ్బంది అయితంది. – కొండు రాజేశం, నెన్నెల రూ.5 వేలకు ఎక్కువ లేవంటుండ్రు.. పత్తి అమ్మిన పైసలు రూ.60 వేలు బ్యాంకు ఖాతాలోనే జమ అయినయి. మా ఇంట్ల వచ్చే నెల 4వ తారీఖున పెండ్లి ఉన్నది. పెండ్లి సామాన్లు కొందామంటే బ్యాంకుల రూ.5వేల కంటే ఎక్కువ ఇవ్వమంటుండ్రు. ఖాతాలో పైసలు ఉండి బాకీ తీసుకునుడు అయితంది.– కొండు లక్ష్మి, నెన్నెల వారం సంది తిరుగుతున్నా.. ఈనెల 12వ తేదీన పత్తి అమ్మిన. రూ.లక్ష నా ఖాతాలో జమ చేసిండ్రు. బ్యాంకుకు పోతే ట్రాన్స్ఫర్ చేస్తం.. లేదంటే రూ.5 వేలు ఇస్తం అంటుండ్రు. కూలీలు పైసల కోసం రోజూ ఇంటికి వస్తుండ్రు. వారం రోజుల సందడి బ్యాంకు చుట్టు తిరుగుతున్న. – బీమరాజుల శ్రీనివాస్, నెన్నెల -
మళ్లీ మొదటికి...
♦ నగదు కొరతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి ♦ ఏటీఎంల చుట్టూ చక్కర్లు ♦ శని, ఆదివారాల్లో జిల్లాలోని బ్యాంకులకు అందనున్న డబ్బు కడప అగ్రికల్చర్: నగదు కొరత మళ్లీ వేధిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఏటీఎంలు, బ్యాంకుల్లో డబ్బు సులభంగా తీసుకోవడానికి వీలుండేది. ఇప్పుడా పరిస్థితి లేదని ఖాతాదారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నగదు సమస్య నెలకొంది. నగరంలోని మెజార్టీ ఏటీఎం కేంద్రాలకు వెళ్లి కార్డు మిషన్‌లో పెట్టి చూస్తే డబ్బుల్లేవ్ అనే సమాచారమే వస్తోంది. పెద్దనోట్లు రద్దు చేసి ఇప్పటికి 226 రోజులు గడచింది. నిన్న మొన్నటి వరకు నగదు కొరత తీరిందనిపించినా...పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడం, కొన్ని ఏటీఎంల వద్ద అవుటాఫ్ సర్వీసు బోర్డులు కనిపిస్తుండడం అన్ని వర్గాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. మొన్నటి వరకు బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ వారానికి రూ.24 వేలు మాత్రమే ఉండేది, ప్రస్తుతం రోజుకు రూ.40 వేలకు పెంచారు. అయితే బ్యాంకుల్లో, ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో విత్‌డ్రా పరిమితిని పెంచినా ఉపయోగం ఏమిటని ఖాతాదారుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాకు సంబంధించి ఆంధ్రా బ్యాంకు, ఎస్బీఐలకు ఆర్బీఐ కరెన్సీ చెస్ట్లున్నాయి. ప్రైవేట్ రంగంలోని బ్యాంకుల్లో డబ్బులు కొంతమేర లభ్యమవుతున్నా ఎస్బీఐ, సిండికెట్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడంతో లావాదేవీలు నిలిచిపోతున్నాయి. నగదు చెల్లించడానికి ఎవరైనా వెళితే వారిని క్యూలో నుంచి ముందుకు పిలిచి డబ్బులు తీసుకుని, దానిని మళ్లీ విత్‌డ్రా చేసుకునే వారికి ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో 357 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ ఏటీఎం కేంద్రాలు మూతపడ్డాయి. నగదు రహిత లావాదేవీలంటూ మొదట హడావిడి చేసినా జిల్లా యంత్రాంగం ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టింది. ఈ పరిస్థితి కూడా నగదు కొరతకు కారణమవుతోంది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రతి వారం సక్రమంగా నగదు సరఫరా చేయడం లేదని బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు సాక్షికి తెలిపారు. దాదాపు 10–15 రోజులుగా డబ్బు రావడం లేదని అన్నారు. ప్రధాన బ్యాంకుల్లో నగదు కొరత: ఎస్బీఐ ప్రధాన బ్రాంచీతోపాటు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హైదరాబాద్, సిండికెట్ బ్యాంకు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, కెనరా బ్యాంకు, ఏపీజీబీల్లో నగదు సమస్య ఏర్పడినట్లు సమాచారం. జిల్లాలోని 33 బ్యాంకులకుగాను 380 బ్రాంచీలు ఉన్నాయి. విత్‌డ్రా కోసం వచ్చే ఖాతాదారులు నగదు లేదని తెలిసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. శని, ఆదివారాల్లో జిల్లాకు నగదు ఆర్బీఐ నుంచి నగదు సరఫరా ఉంది. ప్రధాన కారణమేమంటే పాతనోట్లు ఆర్బీఐ తీసుకుని కొత్తవి ఇచ్చే విషయంలో టెక్నికల్ సమస్య ఉన్నట్లు సమాచారం. దీనిని అధిగమించి శని, ఆదివారాల్లో ఆర్బీఐ జిల్లాకు డబ్బు పంపుతున్నట్లు తెలిసింది. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ బ్యాంకు అధికారి తెలిపారు. -
నగదు కొరత వేధిస్తోంది..!
♦ రైతులకు రుణాలు అందడం లేదు ♦ జైట్లీకి దత్తాత్రేయ ఫిర్యాదు ♦ తక్షణం రూ. 8 వేల కోట్ల విడుదలకు జైట్లీ హామీ న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో నగదు కొరత వేధిస్తోందని, నగదు నిల్వ లేక బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం లేదని కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఫిర్యాదు చేశారు. సోమవారం ఆయన కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు, తెలంగాణ బీజేపీ నేత శ్రీరాం వెదిరెతో పాటు జైట్లీని కలిశారు. రైతులకు ఖరీఫ్ సీజన్లో రావాల్సిన రుణాలు అందడం లేదని, నగదు కొరతే దీనికి కారణమని వివరించారు. బ్యాంకులకు నగదు విడుదల చేయాలని కోరారు. తెలంగాణకు దాదాపు రూ. 23 వేల కోట్ల మేర నగదు అవసరమని వివరించినట్టు దత్తాత్రేయ మీడియాకు తెలిపారు. అరుణ్‌జైట్లీ తన విన్నపానికి స్పందిస్తూ రూ. 8 వేల కోట్ల మేర నగదును తక్షణం విడుదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. జీఎస్టీ కారణంగా జౌళీ రంగం, బీడి పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు వచ్చిన విన్నపాలను జైట్లీ దృష్టికి తీసుకు వెళ్లినట్లు దీనికి జైట్లీ స్పందిస్తూ జీఎస్టీ కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు దత్తాత్రేయ వివరించారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్కోవింద్ మంగళవారం హైదరాబాద్‌లో పర్యటిస్తారని, టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కలుస్తారన్నారు. ఈ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. -
బ్యాంకులు హ్యాండ్సప్
-
బ్యాంకులు హ్యాండ్సప్
నగదు కొరతతో పరేషాన్ ⇒ ఏటీఎంలలో నో క్యాష్.. బ్యాంకుల్లో లో క్యాష్ బోర్డులు ⇒ సోషల్ మీడియాలో బ్యాంకు చార్జీలపై మండిపాటు..‘నో ట్రాన్సాక్షన్ డే’పేరిట ప్రచారం సాక్షి, హైదరాబాద్: నో క్యాష్.. ప్రస్తుతం ఏటీఎంలలోనే కాదు.. బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది! పెద్దనోట్ల రద్దు కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తరుణంలో నగదు సమస్య మళ్లీ మొదటికొచ్చింది. రోజువారీ డిపాజిట్లు తగ్గడంతో బ్యాంకుల్లో నగదు నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. దీనికితోడు నెలరోజులుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నుంచి రాష్ట్రానికి నగదు రాకపోవడంతో నోట్ల కష్టాలు తారాస్థాయికి చేరాయి. పక్షం రోజులుగా ఏటీఎం మెషీన్లు మూతపడగా.. బ్యాంకుల్లో ఖాతాదారులకు పరిమితంగా నగదును ఇస్తున్నారు. ఈ నెల 13 నుంచి నగదు విత్‌డ్రాలపై ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ... నగదు నిల్వలు హరించుకుపోవడంతో క్యాష్ కోసం వచ్చే ఖాతాదారులకు బ్యాంకులు మొండిచేయి చూపుతున్నాయి. రూ.20 వేల కోట్ల పెద్ద నోట్లు జనం వద్దే బ్యాంకు గడప దాటిన రూ.2 వేల నోట్లు తిరిగి బ్యాంకులో డిపాజిట్ కావడం లేదు. దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన రెండు వేల నోట్లు ప్రజల వద్దే ఉండిపోయినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో నోట్ల చలామణి భారీగా తగ్గింది. మార్కెట్లో లావాదేవీలు జరుగుతున్నా బ్యాంకుల్లో డిపాజిట్ కాకపోవడంతో నగదు సమస్య తీవ్రమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల్లో ‘లో క్యాష్’బోర్డులు కనిపిస్తున్నాయి. గత నెలరోజులుగా రాష్ట్రానికి కొత్త నోట్ల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. అడపాదడపా పంపిణీ చేస్తున్నా డిమాండ్‌కు తగినట్లు లేకపోవడంతో బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పడుతోంది. రూ.35 వేల కోట్ల నగదు లోటు తెలంగాణకు సంబంధించి దాదాపు రూ.80 వేల కోట్ల విలువైన రూ.500, రూ.1,000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. వీటిలో ఆర్బీఐ ఇప్పటివరకు కేవలం రూ.45 వేల కోట్లే రాష్ట్రానికి పంపిణీ చేసింది. దీంతో దాదాపు రూ.35 వేల కోట్ల నగదు కొరత ఉత్పన్నమైంది. వివిధ బ్యాంకులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 8,642 ఏటీఎం మెషీన్లు ఉన్నాయి. ఇందులో 977 మెషీన్లు ఇప్పటికీ పూర్తిగా పనిచేయడం లేదని అధికారులే అంగీకరిస్తున్నారు. మిగతా వాటిలోనూ 90 శాతంపైగా ఏటీఎంలలో డబ్బు లేదు. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఏటీఎంలు పని చేయడం లేదు. నగదు ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసింది. కానీ ఈ నెల మొదటి వారం నుంచే ఏటీఎంలన్నీ డబ్బు లేకుండా ఖాళీ అయ్యాయి. రాష్ట్రంలో తీవ్రమైన నగదు సమస్యను బ్యాంకులు ఇప్పటికే ఆర్బీఐకి నివేదించాయి. దీంతో ఈనెలాఖరు నాటికి రూ.4 వేల కోట్లు ఇస్తామని ఆర్బీఐ రాష్ట్రానికి భరోసా ఇచ్చింది. మూడ్రోజుల్లో అత్యవసరంగా రూ.1,100 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ డబ్బు వచ్చేంత వరకు ఏటీఎంలలో నగదు కష్టాలు తప్పవని బ్యాంకర్లు చెబుతున్నారు. ‘నో ట్రాన్సాక్షన్ డే’వైరల్.. నగదు డిపాజిట్లపై బ్యాంకులు సరికొత్త ఆంక్షలకు తెరలేపాయి. నెలలో ఖాతాదారుడి లావాదేవీలు మూడింటికి మించితే ప్రతి ట్రాన్సాక్షన్‌పై అదనపు చార్జీ వసూలు చేయనున్నట్లు స్పష్టం చేశాయి. అలాగే ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్‌ను లేకున్నా చార్జీలు వసూలు చేయనున్నట్లు చెప్పాయి. ఏప్రిల్ నెల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు ప్రకటించాయి. ఈ అదనపు చార్జీల భారాన్ని ఎందుకు భరించాలనే ఉద్దేశంతో ఖాతాదారులు మినిమమ్ బ్యాలెన్స్ మినహా మిగిలిన మొత్తాన్ని విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో నగదు విత్‌డ్రాల సంఖ్య భారీగా పెరుగుతోంది. అటు చార్జీలపై సోషల్ మీడియాలో బ్యాంకుల వైఖరిపై నిరసనలు తీవ్రమవుతున్నాయి. బ్యాంకుల అడ్డగోలు చార్జీల వసూళ్లను నిరసిస్తూ... ఖాతాలోని నగదు మొత్తాన్ని ఉపసంహరించుకోవాలని, ‘నో ట్రాన్సాక్షన్ డే’జరపాలన్న అంశాలు వాట్సప్, ఫేస్‌బుక్‌లాంటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
ఎనీ టైం నో క్యాష్
ఏటీఎంలలో నగదు కొరత 15 రోజులుగా నిలిచిన డబ్బుల సరఫరా అవస్థలు పడుతున్న ప్రజలు నిజామాబాద్‌అర్బన్: నోట్ల కష్టాలు మళ్లీ తీవ్రమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏటీఎంలలో ‘నో క్యాష్’ బోర్డులు దర్శనిమిస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. 15 రోజులుగా డబ్బుల సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నగదు కోసం అవస్థలు పడుతున్నారు. రిజర్వు బ్యాంకు నుంచి డబ్బుల సరఫరా నిలిచిపోవడంతో ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో ఉండడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 366 బ్యాంకులు ఉండగా వీటి పరిధిలో 392 ఏటీఎంలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో లేకపోవడంతో మూసి ఉంచుతున్నారు. కొన్ని రోజులుగా ఏటీఎంలు పనిచేయకపోవడంతో ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకుల్లో నగదు డ్రా చేసుకుంటున్నారు. దీనికి కూడా అధికారులు పరిమితిలోపే నగదును ఇస్తున్నారు. ఖాతాదారులు బ్యాంకుల్లో జమ చేసిన డబ్బులనే ఇతర ఖాతాదారులకు అందజేస్తున్నారు. రెండు జిల్లాలకు ఆర్బీఐ నుంచి సుమారు ప్రతినెలా రూ. 186 కోట్ల రూపాయలు అందిస్తున్నారు. వీటి ద్వారానే ఏటీఏంలు, లావాదేవీలు కొనసాగుతాయి. కానీ డబ్బుల సరఫరా నిలిచిపోవడంతో అవస్థలు మొదలయ్యాయి. బ్యాంకులు చాలా చోట్ల ఏటీఎంలను మూసేస్తున్నాయి. ఫిబ్రవరి చివరి రోజుల్లో ఈ అవస్థలు మొదలు కాగా ప్రస్తుతం మరింత తీవ్రమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా బ్యాంకుల్లోనూ నగదు ఇవ్వడంలేదు. జమ చేయడం తప్ప విత్ డ్రాకు అనుమతి ఇవ్వడం లేదు. నగదు విత్ డ్రాలో పరిమితులు విధిస్తున్నారు. అడిగిన దాని కంటే తక్కువగా డబ్బులు అందిస్తున్నారు. ప్రస్తుతం మార్చి నెల కావడంతో లావాదేవీలు అధికంగా ఉంటాయి. ఈ తరుణంలో నగదు కొరత ఇబ్బందికరంగా మారింది. ఆర్బీఐ నుంచి డబ్బులు సరఫరా అయితే తప్పా సమస్య కొలిక్కివచ్చే అవకాశం లేదు. నిజామాబాద్ బస్టాండ్ వద్ద ఉన్న రెండు ప్రధాన బ్యాంకుల శాఖల ఏటీఎంలు వెలవెలబోతున్నాయి. ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలలో కూడా నగదు అందుబాటులో లేదు. ప్రస్తుతం శుభకార్యాలు ఉండడంతో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరం ఉన్న వారు సైతం బ్యాంకుల చుట్టూ డబ్బుల కోసం తిరుగుతున్నారు. తగ్గిన నగదు రహిత లావాదేవీలు గతేడాది నవంబర్ 8న కేంద్రప్రభుత్వం ప్రకటించిన పెద్ద నోట్లరద్దు తర్వాత జిల్లాలో నగదు రహిత లావాదేవీలు పెంచాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు నగదు రహిత లావాదేవీలపై విస్తృత ప్రచారం చేపట్టారు. అప్పట్లో కొనుగోళ్లు, అమ్మకాల్లో నగదు రహిత లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. అనంతరం కొత్తనోట్లు మార్కెట్లోకి అందుబాటులోకి రావడంతో క్రమేపీ నగదు రహిత లావాదేవీలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలు తగ్గిపోవడం, కొత్తనోట్ల సరఫరా ఆగిపోవడంతో ఇబ్బందులు తల్తెతున్నాయి. -
ఎనీ టైమ్.. నో క్యాష్
రాష్ట్రంలో మరోసారి ‘నోట్ల రద్దు’ నాటి పరిస్థితులు - పనిచేయని ఏటీఎంలు.. బ్యాంకుల్లో జనం బారులు - పడిపోయిన డిపాజిట్లు..పెరిగిన విత్‌డ్రాలు - తీవ్ర నగదు కొరత.. కరెన్సీ లేదంటూ ఏటీఎంల ముందు బోర్డులు - నెల ప్రారంభం కావడంతో డబ్బుల కోసం వేతనజీవుల అష్టకష్టాలు - ఈ నెల 13 నుంచి విత్‌డ్రాపై పరిమితులు ఉండవన్న ఆర్బీఐ - పది రోజుల ముందే తలకిందులైన పరిస్థితి - ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఉపసంహరణ చార్జీలు - దీంతో గతనెలలోనే పెద్దమొత్తంలో విత్‌డ్రా చేసుకున్న ఖాతాదారులు సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్ నగదు కొరత మళ్లీ మొదలైందా..? నోట్ల రద్దుతో 3 నెలల కిందట నెలకొన్న పరిణామాలు మళ్లీ పునరావృతమవుతున్నాయా..? ప్రస్తుతం ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు, బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడాన్ని చూస్తుంటే నిజమేననిపిస్తోంది. గత ఐదు రోజులుగా ఏటీఎంలు కేవలం బ్యాలెన్స్ విచారణకే పరిమితమయ్యాయి. బ్యాంకర్లు వాటిలో నగదును నిల్వ చేయకపోవడంతో వేతనజీవులు, జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. నెల ప్రారంభం కావడంతో సాధారణంగా నగదు ఉపసంహరణకు డిమాండ్ అధికంగా ఉంటుంది. కానీ బ్యాంకర్లు ఏటీఎం మిషన్లలో నగదును అందుబాటులో ఉంచకపోవడం, కనీసం బ్యాంకుకు అనుసంధానంగా ఉన్న ఏటీఎంల్లో కూడా కరెన్సీ లభించకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది నవంబర్‌లో కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత రోజుల కంటే ఇప్పుడే నగదు సమస్య తీవ్రంగా ఉందని బ్యాంకర్లు ప్రైవేట్ సంభాషణల్లో చెబుతున్నారు. రద్దు చేసిన నోట్ల స్థానంలో 80 శాతం కొత్త కరెన్సీ వచ్చినా.. అది తిరిగి బ్యాంకులకు రాకపోవడం, ఆర్బీఐ నుంచి నగదు అందకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని బ్యాంకర్లు చెపుతున్నారు. నాలుగు అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంక్ బ్రాంచీలను సందర్శించిన ‘సాక్షి’ప్రతినిధికి అన్నిచోట్ల నగదు కొరత ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. గడచిన వారం దాకా రూ.50 వేల దాకా ఇచ్చిన బ్యాంకులు.. ఈ వారం ప్రారంభం నుంచి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. భారీగా తగ్గిన డిపాజిట్లు మామూలుగా బ్యాంక్‌ల్లో నగదు విత్‌డ్రా చేసేవారు ఎంతమంది ఉంటారో అంతకు మించిన సంఖ్యలో డిపాజిట్‌దారులు ఉంటారు. కానీ ఇప్పుడు విచిత్రంగా బ్యాంక్‌ల్లో డిపాజిట్ చేయడానికి వచ్చేవారి కోసం సిబ్బంది ఎదురుచూస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆంధ్రాబ్యాంక్ శాఖలో నగదు కోసం వచ్చిన వారికి రూ.10 వేలు ఇచ్చి పంపుతున్నారు. మొన్నటిదాకా రూ.50 వేలు ఇచ్చి ఇప్పుడు.. అత్యవసరంగా డబ్బు కావాలంటే ఎందుకివ్వడం లేదని ఖాతాదారులు సిబ్బందితో గొడవ పడుతున్నారు. ఈ నెల 13 నుంచి నగదు ఉపసంహరణ పరిమితి ఎత్తివేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. అయితే అందుకు పది రోజుల ముందు నుంచే నగదు సమస్య మొదలుకావడం బ్యాంకర్లను ముప్పుతిప్పలు పెడుతోంది. ‘‘నోట్ల రద్దు సమయంలో కూడా మేం ఇన్ని ఇబ్బందులు పడలేదు. అంతెందుకు కిందటివారం కూడా ఖాతాదారులకు రూ.50 వేల చొప్పున ఇచ్చాం. ఇప్పుడు అకస్మాత్తుగా సమస్య వచ్చిపడింది. దానికి తోడు డిపాజిట్లు చేసే వారు లేరు’’అని మలక్‌పేటలో స్టేట్‌బ్యాంక్ అధికారి ఒకరు అన్నారు. కొరతకు కారణమేంటి? వ్యాపారులు, వాణిజ్య సంస్థలు నగదు రహిత లావాదేవీలు సాగిస్తుండడం, అందుబాటులో ఉన్న కొద్దిపాటి నగదును తమ వద్దే నిల్వచేసుకోవడంతో బ్యాంకుల్లో రోజువారీ డిపాజిట్లపై తీవ్ర ప్రభావం పడిందని బ్యాంకర్లు చెబుతున్నారు. మణికొండలోని ఎస్బీఐ బ్రాంచీలో రోజుకు సగటున రూ.90 లక్షల సొమ్ము డిపాజిట్ అయ్యేది. ఇప్పుడు సగటున రూ.20 లక్షలు కూడా రావడం లేదు. అయితే నగదు ఉపసంహరణ మాత్రం రోజూ రూ.కోటికి పెరిగింది. దీంతో నగదు కొరతను భర్తీ చేసేందుకు ప్రధాన బ్యాంకుకు వెళ్లాల్సి వస్తోందని, ఏటీఎంలో నగదును అందుబాటులో పెట్టడం లేదని మేనేజర్ తెలిపారు. దాదాపు అన్ని ప్రధాన బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు తగ్గడంతో సొంత ఖాతాదారులకు మాత్రమే ఎంతో కొంత నగదు పంపిణీ చేసేలా బ్యాంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం జంటనగరాల్లో దాదాపు 95 శాతం ఏటీఎంలు నోక్యాష్ బోర్డులతో దర్శనమిచ్చాయి. విత్‌డ్రా చేస్తే చార్జీల మోత.. నగదు ఉపసంహరణపై బ్యాంకులు భారీగా చార్జీల వసూళ్లకు తెరలేపాయి. మార్చి1 నుంచి నాలుగు లావాదేవీల తర్వాత ప్రతి లావాదేవీపై అదనపు చార్జీల పేరిట రూ.150 వరకు చెల్లించాల్సి వస్తుందని ప్రకటించాయి. ఈ అదనపు వసూళ్ల నిర్ణయం ఖాతాదారులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ఖాతాదారులు తమ అకౌంట్లో ఉన్న నగదు నిల్వను ఫిబ్రవరి చివరి వారంలోనే బ్యాంకుకు వెళ్లి ఒకే దఫాలో ఉపసంహరించుకున్నారు. వారంలో రూ.50 వేల లోపు నగదు ఉపసంహరణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఫిబ్రవరి 13 నుంచి 28 మధ్య భారీగా నగదు ఉపసంహరణ జరిగిందని రిజర్వ్ బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో మార్చి మొదటివారంలో నగదుకు ఇబ్బంది ఏర్పడిందని, సరిగ్గా వేతనాల సమయంలో ఉద్యోగులు సమస్యల్లో పడ్డారని అంటున్నారు. జిల్లాల్లోనూ అదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కరెన్సీ ఇబ్బందులు కనిపిస్తున్నాయి. యాదాద్రి జిల్లాలో కొన్ని ఏటీఎంలే పనిచేశాయి. అదీ నగదు లోడు చేసిన గంట లేదా రెండు గంటల్లోనే నిండుకుంటున్నాయి. వికారాబాద్‌లో శుక్రవారం 12 ఏటీఎంలకుగాను నాలుగు మాత్రమే పనిచేశాయి. సాయంత్రానికి వాటిలో కూడా డబ్బు అయిపోయింది. తాండూరులో ఖాతాదారులు ఏటీఎంల ముందు బారులు తీరారు. నల్లగొండ జిల్లా దేవరకొండ, హాలియా ప్రాంతాల్లో గడచిన వారం రోజులుగా బ్యాంక్‌లు నగదు సరఫరా చేయడం లేదు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఇదే పరిస్థితి. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో బ్యాంక్‌లు ఖాతాదారులకు రూ.5 వేలకు మించి ఇవ్వడం లేదు. ఖాతాదారుల ధర్నా మహబూబ్‌నగర్ జిల్లా దామరగిద్ద మండలం కాన్కుర్తి ఎస్బీఐలో రూ.2 వేలు మాత్రమే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఖాతాదారులు శుక్రవారం బ్యాంకు ముందు ధర్నాకు దిగారు. పంటను అమ్ముకున్న డబ్బుల కోసం రోజులతరబడి బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు రూ.40 వేలకు పైగా తీసుకునే వెసులుబాటు ఉన్నా. రూ.2 వేలే ఇస్తున్నారన్నారు. అన్ని చోట్ల అవే బోర్డులు: జె. శ్రీనివాస్‌రావు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సిరిసిల్ల జీతం డబ్బుల కోసం వస్తే ఏటీఎంలు పనిచేయడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చాలా ఏటీఎంల ముందు ఔట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు పెట్టారు. బ్యాంక్ బ్యాలెన్స్ చూద్దామనుకున్నా స్లిప్‌లు రావడంలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. జీతమెలా తీసుకోవాలి?: ఉస్మాన్, లెక్చరర్, తాండూరు ఏటీఎంల నుంచి వేతనం సొమ్ము తీసుకునేందుకు నానా కష్టాలు పడుతున్నాం. ఏటీఎంలలో క్యాష్ ఉండడం లేదు. బ్యాంకు అధికారులు శ్రద్ధ వహించాలి. -
150 రోజులు కరెన్సీ కష్టాలు.. జీతాలకు ఇక్కట్లే
కోల్‌కతా: కొద్ది వారాల్లోనే పెద్ద నోట్ల కష్టాలు తీరిపోతాయని కేంద్రంలోని అధికార నాయకులు చెబుతున్నా మరో నాలుగు నెలలపాటు కరెన్సీ కష్టాలు తప్పవని బ్యాంకు ఉద్యోగుల సంఘం చెబుతోంది. దేశంలోని నోట్ల ముద్రణ శాలలు పూర్తి స్థాయిలో పనిచేసినప్పటికీ ఈ పరిస్థితి ఉంటుందని పేర్కొంది. ది బ్యాంక్ ఎప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్ఐ) పెద్ద నోట్ల రద్దు తిప్పలపై గురువారం స్పందిస్తూ ప్రస్తుతం దేశంలో నాలుగు కరెన్సీ ముద్రణ శాలలు ఉన్నాయని, అవి పూర్తి సమయం పనిచేసినప్పటికీ నాలుగు నుంచి ఐదు నెలలపాటు ఈ సమస్యలు ఉంటాయని పేర్కొంది. మరో వారం రోజుల్లో ఉద్యోగులు నెలవారి జీతాలు తీసుకోవాల్సి ఉంటుందని, అది కష్టంగా మారనుందని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. 'నాలుగు ముద్రణ శాలలు తమ సామర్థ్యంమేరకు పనిచేసినా సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు కరెన్సీ లోటు తీరేందుకు మరో నాలుగు నుంచి ఐదు నెలలు సమయం పడుతుంది' అని బీఈఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి పీకే బిశ్వాస్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, డబ్బును తీసుకునే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొలేక చాలా చోట్ల వినియోగదారులు బ్యాంకు ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారని అది సరైన చర్య కాదని అన్నారు. ఇక బ్యాంకుల నుంచి ఏటీఎంల నుంచి తమ జీతాలను తీసుకునే సమయంలో ఇబ్బందులు వస్తే మాత్రం పరిస్థితులు చాలా చెత్తగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆగిపోనున్న ‘ఆస్క్ మీ’
రోడ్డున పడనున్న 4వేల మంది ఉద్యోగులు న్యూఢిల్లీ: ఈ కామర్స్ స్టార్టప్ సంస్థ ‘ఆస్క్ మీ’ మూతపడనుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన 40 కేంద్రాల్లో పని చేస్తున్న నాలుగు వేల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు. ఈ సంస్థ తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటూ లాభాలు కళ్లజూడలేని పరిస్థితుల్లో తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఇటీవలే ఓలాకు చెందిన ట్యాక్సీ ఫర్ ష్యూర్, స్నాప్‌డీల్‌కు చెందిన ఎక్స్క్లూజివ్లీ డాట్ కామ్ మూసివేత ప్రకటనలు వెలువడగా... తాజాగా ఆస్క్ మీ సైతం వాటి సరసన చేరిపోయింది. ఆస్క్‌మీ సంస్థ ఆస్క్ మీ డాట్ కామ్, ఆస్క్ మీ బజార్, ఆస్క్ మీ గ్రోసరీ, ఆస్క్ మీ పే, మొబైల్కార్ట్ పోర్టళ్లను నిర్వహిస్తోంది. కార్యకలాపాలను నిలిపివేయండి... ఆస్క్‌మీ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ దాని మాతృ సంస్థ గెటిట్ ఇన్ఫోసర్వీసెస్ సీఎఫ్ఓ ఆనంద్ సోన్‌భద్ర ఉన్నతాధికారులకు ఓ మెయిల్ పంపారు. సంస్థ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మరింతగా అప్పుల్లోకి కూరుకుపోకుండా నివారించేందుకు వెంటనే కార్యకలాపాలను నిలిపివేయాలని కోరారు. వీలయితే అన్ని కార్యాలయాలు, హబ్‌లను తాత్కాలికంగా మూసివేయాలని సూచించారు. డెలివరీ బోయ్‌లు, దిగువ స్థాయి ఉద్యోగులకు వేతనాలు చెల్లించనందున వారు అవాంఛనీయ ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని, వీటిని నివారించడంతోపాటు హబ్‌ల వద్ద ఆస్తులను రక్షించుకోవాలని సూచించారు. కాగా, ఆస్క్ మీలో అధిక శాతం మంది ఉద్యోగులకు జూలై నెల వేతనాలు చెల్లించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే, గత కొన్ని నెలలకు సంబంధించిన రీయింబర్స్మెంట్ బిల్లులు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సంస్థకు పలు కేంద్రాలను మూసివేసినట్టు విశ్వసనీయ సమాచారం. అయినా సంస్థ పోర్టళ్లు ఇప్పటికీ పనిచేస్తున్నా యి. ఆస్క్ మీ మాతృ సంస్థ అయిన గెటిట్ ఇన్ఫోమీడియా (తర్వాత గెటిట్ ఇన్ఫోసర్వీసెస్గా మారిం ది)లో మలేసియాకు చెందిన ఆస్ట్రో ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ లిమిటెడ్ (ఏఈఎన్ఎల్) 2010లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ద్వారా 99 శాతం వరకు వాటా తీసుకుంది. ఇప్పటి వరకు సుమారు 30 కోట్ల డాలర్ల మేర నిధుల సాయం అందించింది. ఫోరెన్సిక్ ఆడిట్లో నిజాలు తెలుస్తాయి.. ‘ఏఈఎన్ఎల్ పెద్ద ఎత్తున నిధుల సాయం అందించినప్పటికీ దురదృష్టవశాత్తూ గెటిట్ ఇప్పటి వరకు వ్యాపారాన్ని లాభాల్లోకి తీసుకురాలేకపోయింది. ఆస్క్ మీ లాభాల్లోకి రావడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయని, సంస్థ దివాళా (అప్పులు తీర్చలేని స్థితి) తీసినట్టేనని సలహాదారులు నిర్వహించిన స్వతంత్ర సమీక్షలో తేలింది’ అని ఏఈఎన్ఎల్ ప్రకటించింది. గెటిట్ ఖాతా పుస్తకాలను తనిఖీ చేసేందుకు ఫోరెన్సిక్ ఆడిటర్‌ను నియమించనున్నట్టు వెల్లడించింది. ఆడి ట్ ఫలితాలను బట్టి చర్యలు తీసుకుంటామని తెలి పింది. ఇతర ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్లిపోయినా గెటిట్ వ్యాపారానికి సాధ్యమైనంత సహకారాన్ని అందించామని... ఇకపైనా బాధ్యతాయుతంగా, భారతీయ చట్టాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేసింది. ఆస్ట్రోదే బాధ్యత: గెటిట్ వ్యాపారం దివాళా తీసిందని ఏఈఎన్ఎల్ ఆరోపించడంపై గెటిట్ ప్రతిస్పందించింది. తాము యాజమాన్యం పరంగా వ్యాపార కొనుగోలుకు అవకాశం ఇచ్చినట్టు తెలిపింది. మూసివేత వల్ల అయ్యే వ్యయంపై ఆస్ట్రోకు సమాచారం ఉందని, 2016 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు గెటిట్తో జరిగిన సంప్రదింపుల సమాచారాన్ని విడుదల చేయాలని, అసలైన విషయం బయటకు వస్తుందని కౌంటర్ ఇచ్చింది. ఫోరెన్సిక్ ఆడిట్ కావాలని ఈ దశలో కోరడంపై స్పందిస్తూ... గత రెండేళ్లుగా ఆస్క్‌మీ ఆడిట్ కమిటీలో ఉన్న ముగ్గురు ఆడిటర్లు కూడా ఆస్ట్రో నామినీలేనని, ప్రస్తుత పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. -
ఏటీఎంలు ఖాళీ
డబ్బుల్లేక విసుగెత్తిపోతున్న జనం తమ వద్దా డబ్బు లేదంటున్న బ్యాంకర్లు డబ్బు రీసైకిల్ కాకపోవడమే కారణం ప్రొద్దుటూరు : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని విజయనగరం వీధికి చెందిన వాసుదేవరెడ్డి శనివారం ఏటీఎంలో డబ్బు తీసుకునేందుకు వెళ్లగా లేకపోవడంతో వెనక్కి తిరిగారు. పండుగ తాకిడికి ఏటీఎంలో డబ్బు అయిపోయిందేమో అని భావించాడు. సోమవారం (వర్కింగ్ డే) మధ్యాహ్న సమయంలో శ్రీ రాములపేటలోని ఏటీఎంలో ప్రయత్నించగా అందులోనూ డబ్బు లేదు. ఆ తర్వాత పట్టణంలో ఆరు చోట్ల ఉన్న ఏటీఎంల వద్దకు వెళ్లి చూశాడు. అన్ని చోట్లా అదే పరిస్థితి. పట్టణ శివారులో ఉన్న ఓ ఏటీఎం వద్దకు వెళ్లగా ఇక్కడా కాసేపటి క్రితమే డబ్బు అయిపోయిందని అక్కడున్న వారు సెలవిచ్చారు. దీంతో చేసేది లేక ఓ మిత్రుడికి ఫోన్ చేసి చేబదులు తీసుకోవడానికి బయలుదేరాడు. ఇలా ఒక్క ప్రొద్దుటూరులోనే కాదు.. దాదాపు జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. జిల్లాకు సంబంధించి కడప నగర పరిధిలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 75 ఏటీఎంలు ఉండగా తర్వాత స్థానంలో ఉన్న ప్రొద్దుటూరులో 30 ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఈ ప్రకారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 32 బ్యాంక్లకుగాను 365 బ్రాంచిల పరిధిలో 238 ఏటీఎంలను ఏర్పాటు చేశారు. సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ఏటీఎంలో రూ.45 లక్షల వరకు డబ్బు పెట్టే అవకాశం ఉంది. బ్యాంక్ అధికారుల అంచనా ప్రకారం ప్రతి ఏటీఎంలో రోజూ 150 వరకు ట్రాన్సాక్షన్లు జరుగుతాయని, యావరేజిగా రూ.7.50 లక్షల వరకు డ్రా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కొంత కాలంగా బ్యాంక్ సమీపంలో ఉన్న ఏటీఎంలలో తప్ప బయట ఉన్న ఏటీఎంలలో కావలసినంత డబ్బు పెట్టడం లేదని తెలుస్తోంది. ఈ కారణంగా ఖాతాదారులు ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం ముగిశాక ఈ ప్రభావం మరీ ఎక్కువగా కనిపిస్తోంది. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో అందరు పండుగ ప్రభావమని భావించారు. అయితే వాస్తవానికి ఆర్థిక లేమి పరిస్థితులే కారణమని స్వయంగా బ్యాంకర్లే చెబుతున్నారు. రీసైకిల్ లేకపోవడమే కారణం తమ బ్యాంక్ వద్ద ఉన్న రెండు ఏటీఎంలలో రోజూ రూ.40 లక్షలు పెడుతున్నా ఖాతాదారులు డ్రా చేస్తున్నారే కానీ.. తిరిగి తమ బ్యాంక్‌కు డబ్బు రావడం లేదని ఓ బ్యాంక్ అధికారి తెలపగా, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వ్యవధిలో తమ ఏటీఎం నుంచి రూ.10 లక్షలు డ్రా చేసిన విషయాన్ని గమనించి తాను ఆశ్చర్య పోయానని మైదుకూరు రోడ్డులోని మరో బ్యాంక్ మేనేజర్ సాక్షికి వివరించారు. ఒక్క ప్రొద్దుటూరులోని ఏటీఎంలకు సంబంధించే రోజు రూ.12 కోట్లు డబ్బు పెడుతున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. బ్యాంకర్ల అంచనా ప్రకారం సాధారణంగా డ్రా చేసిన డబ్బు ఏదో ఒక రూపంలో కొంత మొత్తమైనా తిరిగి బ్యాంక్‌లకు జమ కావలసి ఉంది. అయితే వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఖాతాదారులు తీసుకెళ్లిన డబ్బు తిరిగి బ్యాంక్‌లకు జమ కాకపోవడంతో బ్యాంక్‌లు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కొద్ది రోజులుగా ఈ పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఈ సమస్యను బ్యాంక్ ఉన్నతాధికారులు రిజర్వ్ బ్యాంక్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. డబ్బు రీసైకిల్ కాని కారణంగా బ్యాంకర్లు ఇతర ప్రాంతాల్లోని బ్యాంక్‌ల నుంచి ఓడీ తీసుకుంటున్నారు. ప్రొద్దుటూరులో ఆ ఓడీ కూడా దొరకడం లేదని బ్యాంకర్లు వాపోతున్నారు. వ్యాపారాలు లేకపోవడం, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ విధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతోపాటు మానవుని జీవన వ్యయం పెరగడం, పొదుపు తగ్గడం మరో కారణంగా చెప్పవచ్చు. ఇటీవల ప్రొద్దుటూరులో జరిగిన బంగారు వ్యాపారుల సమ్మె ప్రభావం అటు వారితోపాటు వస్త్ర వ్యాపారులపై కూడా తీవ్రంగా పడిందని ప్రముఖ వ్యాపారి బుశెట్టి రాంమోహన్‌రావు తెలిపారు. రీసైకిల్ కాకుండా డబ్బు ఎలా వెళ్లిందన్న విషయం చెప్పలేమని ఓ బ్యాంక్ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఆర్థిక సంక్షోభం వాస్తవమే ... డబ్బు రీసైకిల్ లేని కారణంగా ఆర్థిక సంక్షోభం ఉందని పలువురు బ్యాంకర్లు చెప్పిన విషయం నా దృష్టికి వచ్చింది. అయితే ఖాతాదారులకు ఇబ్బంది లేకుండా ఎలాగోలా కొంత కొంత డబ్బు సర్దుబాటు చేస్తున్నారు. - రఘునాథరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్