బ్యాంకులు హ్యాండ్సప్
నగదు కొరతతో పరేషాన్
⇒ ఏటీఎంలలో నో క్యాష్.. బ్యాంకుల్లో లో క్యాష్ బోర్డులు
⇒ సోషల్ మీడియాలో బ్యాంకు చార్జీలపై మండిపాటు..‘నో ట్రాన్సాక్షన్ డే’పేరిట ప్రచారం
సాక్షి, హైదరాబాద్: నో క్యాష్.. ప్రస్తుతం ఏటీఎంలలోనే కాదు.. బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది! పెద్దనోట్ల రద్దు కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తరుణంలో నగదు సమస్య మళ్లీ మొదటికొచ్చింది. రోజువారీ డిపాజిట్లు తగ్గడంతో బ్యాంకుల్లో నగదు నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. దీనికితోడు నెలరోజులుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నుంచి రాష్ట్రానికి నగదు రాకపోవడంతో నోట్ల కష్టాలు తారాస్థాయికి చేరాయి. పక్షం రోజులుగా ఏటీఎం మెషీన్లు మూతపడగా.. బ్యాంకుల్లో ఖాతాదారులకు పరిమితంగా నగదును ఇస్తున్నారు. ఈ నెల 13 నుంచి నగదు విత్‌డ్రాలపై ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ... నగదు నిల్వలు హరించుకుపోవడంతో క్యాష్ కోసం వచ్చే ఖాతాదారులకు బ్యాంకులు మొండిచేయి చూపుతున్నాయి.
రూ.20 వేల కోట్ల పెద్ద నోట్లు జనం వద్దే
బ్యాంకు గడప దాటిన రూ.2 వేల నోట్లు తిరిగి బ్యాంకులో డిపాజిట్ కావడం లేదు. దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన రెండు వేల నోట్లు ప్రజల వద్దే ఉండిపోయినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో నోట్ల చలామణి భారీగా తగ్గింది. మార్కెట్‌లో లావాదేవీలు జరుగుతున్నా బ్యాంకుల్లో డిపాజిట్ కాకపోవడంతో నగదు సమస్య తీవ్రమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల్లో ‘లో క్యాష్’బోర్డులు కనిపిస్తున్నాయి. గత నెలరోజులుగా రాష్ట్రానికి కొత్త నోట్ల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. అడపాదడపా పంపిణీ చేస్తున్నా డిమాండ్‌కు తగినట్లు లేకపోవడంతో బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పడుతోంది.
రూ.35 వేల కోట్ల నగదు లోటు
తెలంగాణకు సంబంధించి దాదాపు రూ.80 వేల కోట్ల విలువైన రూ.500, రూ.1,000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. వీటిలో ఆర్‌బీఐ ఇప్పటివరకు కేవలం రూ.45 వేల కోట్లే రాష్ట్రానికి పంపిణీ చేసింది. దీంతో దాదాపు రూ.35 వేల కోట్ల నగదు కొరత ఉత్పన్నమైంది. వివిధ బ్యాంకులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 8,642 ఏటీఎం మెషీన్లు ఉన్నాయి. ఇందులో 977 మెషీన్లు ఇప్పటికీ పూర్తిగా పనిచేయడం లేదని అధికారులే అంగీకరిస్తున్నారు. మిగతా వాటిలోనూ 90 శాతంపైగా ఏటీఎంలలో డబ్బు లేదు. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఏటీఎంలు పని చేయడం లేదు. నగదు ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసింది. కానీ ఈ నెల మొదటి వారం నుంచే ఏటీఎంలన్నీ డబ్బు లేకుండా ఖాళీ అయ్యాయి. రాష్ట్రంలో తీవ్రమైన నగదు సమస్యను బ్యాంకులు ఇప్పటికే ఆర్‌బీఐకి నివేదించాయి. దీంతో ఈనెలాఖరు నాటికి రూ.4 వేల కోట్లు ఇస్తామని ఆర్‌బీఐ రాష్ట్రానికి భరోసా ఇచ్చింది. మూడ్రోజుల్లో అత్యవసరంగా రూ.1,100 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ డబ్బు వచ్చేంత వరకు ఏటీఎంలలో నగదు కష్టాలు తప్పవని బ్యాంకర్లు చెబుతున్నారు.
‘నో ట్రాన్సాక్షన్ డే’వైరల్..
నగదు డిపాజిట్లపై బ్యాంకులు సరికొత్త ఆంక్షలకు తెరలేపాయి. నెలలో ఖాతాదారుడి లావాదేవీలు మూడింటికి మించితే ప్రతి ట్రాన్సాక్షన్‌పై అదనపు చార్జీ వసూలు చేయనున్నట్లు స్పష్టం చేశాయి. అలాగే ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్‌ను లేకున్నా చార్జీలు వసూలు చేయనున్నట్లు చెప్పాయి. ఏప్రిల్ నెల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు ప్రకటించాయి. ఈ అదనపు చార్జీల భారాన్ని ఎందుకు భరించాలనే ఉద్దేశంతో ఖాతాదారులు మినిమమ్ బ్యాలెన్స్ మినహా మిగిలిన మొత్తాన్ని విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో నగదు విత్‌డ్రాల సంఖ్య భారీగా పెరుగుతోంది. అటు చార్జీలపై సోషల్ మీడియాలో బ్యాంకుల వైఖరిపై నిరసనలు తీవ్రమవుతున్నాయి. బ్యాంకుల అడ్డగోలు చార్జీల వసూళ్లను నిరసిస్తూ... ఖాతాలోని నగదు మొత్తాన్ని ఉపసంహరించుకోవాలని, ‘నో ట్రాన్సాక్షన్ డే’జరపాలన్న అంశాలు వాట్సప్, ఫేస్‌బుక్‌లాంటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.