న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో నగదు కొరత నెలకొనడం, ఏటీఎంలు మూతబడటంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. గడిచిన మూడు నెలలుగా నగదుకు అసాధారణ డిమాండ్ నెలకొనడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయా రాష్ట్రాల్లో ఈ కొరత తాత్కాలికమైనదేనన్న జైట్లీ.. పరిస్థితి చక్కదిద్దేందుకు సత్వరం చర్యలు తీసుకుంటున్నామన్నారు. సరిపడేంత కరెన్సీ చలామణిలో ఉందని ఆయన స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా కరెన్సీ పరిస్థితిని సమీక్షించినట్లు పేర్కొన్నారు. ‘మొత్తం మీద చాలినంత కరెన్సీ చలామణిలో ఉంది. అలాగే బ్యాంకుల దగ్గర కూడా తగినంత నగదు ఉంది. కొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా, ఒక్కసారిగా తలెత్తిన డిమాండ్ పరిస్థితిని సత్వరం చక్కదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి‘ అని మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్వీటర్‌లో జైట్లీ ట్వీట్ చేశారు.
మరోవైపు, కరెన్సీ కష్టాలను ధ్రువీకరిస్తూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, బిహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో నగదుకు అసాధారణ డిమాండ్ కనిపించిందని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల తొలి 13 రోజుల్లో కరెన్సీ సరఫరా రూ. 45,000 కోట్ల మేర పెరిగినట్లు వివరించింది. ‘అసాధారణంగా తలెత్తిన డిమాండ్‌కి తగ్గట్లు సరఫరా చేసేందుకు తగినంత కరెన్సీ ఉంది. రూ. 100, రూ. 200, రూ. 500 సహా అన్ని నోట్ల నిల్వలు సరిపడేంత స్థాయిలో ఉన్నాయి‘ అని ఆర్థిక శాఖ పేర్కొంది.
ప్రత్యేక కమిటీ ఏర్పాటు..
కొన్ని రాష్ట్రాల్లో నెలకొన్న కరెన్సీ కష్టాలను సమీక్షించేందుకు ప్రభుత్వం రాష్ట్రాలవారీగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా తెలిపారు. మరో 2–3 రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కాగలదన్నారు. ఇందుకోసం అటు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నగదు బదలాయించే అంశాన్ని పర్యవేక్షించడానికి ఆర్‌బీఐ కూడా కమిటీ వేసినట్లు మంత్రి చెప్పారు.
ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం నగదు చలామణి మళ్లీ ...పెద్ద నోట్ల రద్దు పూర్వ స్థాయికి చేరింది. రూ. 17 లక్షల కోట్ల నగదు చలామణిలోకి వచ్చింది. మరోవైపు, కరెన్సీ కొరత నెలకొందనడం సరికాదని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. పంటల కొనుగోళ్ల సీజన్‌లో కరెన్సీకి డిమాండ్ నెలకొనడం సాధారణమేనని, దీనివల్లే కొంత అసమతుల్యత నెలకొని ఉండొచ్చన్నారు. ప్రొక్యూర్‌మెంట్ సీజన్ కారణంగా పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ డిమాండ్ ఏర్పడిందని ఆయన చెప్పారు.
ఏటీఎంలలో తగ్గిన నగదు భర్తీ..
ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంలలో భర్తీ చేసేందుకు రోజువారీ వచ్చే నగదు పరిమాణం కొద్ది రోజులుగా గణనీయంగా తగ్గిపోయిందని ఏటీఎంల సంస్థల సమాఖ్య (సీఏటీఎంఐ) ప్రతినిధి వి. బాలసుబ్రమణియన్ తెలిపారు. మార్చి నెల ఆఖరు దాకా రోజువారీ డిమాండ్‌లో దాదాపు 90 శాతం మొత్తం ఏటీఎంలకు వచ్చేదని... అయితే, గడిచిన వారం రోజులుగా 30 శాతం మాత్రమే ఉంటోందని ఆయన వివరించారు.
రూ. 500 నోట్ల ముద్రణ పెంచుతున్నాం: గర్గ్
కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న నగదు కొరతను అధిగమించడానికి రిజర్వ్ బ్యాంక్ రూ. 500 నోట్ల ముద్రణను అయిదు రెట్లు పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ వెల్లడించారు. రూ. 2,000 నోట్లు చలామణిలోకి రాకుండా కొందరు అక్రమంగా నిల్వ చేసుకుంటుండటం కూడా కరెన్సీ కొరతకి కారణమై ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
‘భవిష్యత్‌లో కరెన్సీ కొరత నెలకొనవచ్చన్న అభిప్రాయం కూడా కొంత మందిలో నెలకొంది. దీంతో వారు విత్‌డ్రా చేసుకుంటూ ఉండటం సైతం ఈ సమస్యకు కారణమై ఉండొచ్చు. అయితే, అసాధారణంగా డిమాండ్ తలెత్తితే సర్దుబాటు చేసేందుకు వీలుగా చలామణిలో ఉన్న కరెన్సీలో ఆరో వంతు మొత్తం ఎప్పుడూ రిజర్వ్‌లో ఉంటుంది. ప్రస్తుతం రూ. 2 లక్షల కోట్ల కరెన్సీ ఈ విధంగా రిజర్వ్‌లో ఉంది‘ అని ఆయన చెప్పారు. డిమాండ్ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరింత అధికంగా కరెన్సీ ముద్రణపై దృష్టి పెట్టిందని గర్గ్ పేర్కొన్నారు.
‘డిమాండ్ పెరిగితే తగినంత కరెన్సీ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం రోజుకు రూ. 500 కోట్ల స్థాయిలో ఉంటున్న రూ. 500 నోట్ల ముద్రణను.. రోజుకు రూ. 2,500 కోట్లకు పెంచనున్నాం. అంటే నెలలో రూ. 70,000–75,000 కోట్ల ముద్రణ జరుగుతుంది‘ అని వివరించారు. బ్యాంకింగ్ స్కామ్‌లకు, నగదు కొరతకు సంబంధం లేదని గర్గ్ తేల్చిచెప్పారు.
కొన్ని రాష్ట్రాలు సంక్షేమ పథకాలకి మరింత నగదు బదిలీ పథకాలు అమలు చేస్తుండటం, మొత్తం డబ్బు బ్యాంకుల్లో దాచడం కన్నా కొంత తమ దగ్గరే పెట్టుకోవడం మంచిదనే భావన మొదలైనవీ కరెన్సీ కొరతకు కారణమై ఉండొచ్చన్నారు. మరోవైపు, వ్యవస్థలో నగదు కొరత లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో రవాణాపరమైన సమస్యల కారణంగా నగదు లభ్యత అంతగా లేకపోయి ఉండొచ్చని వివరణనిచ్చింది. ఆర్‌బీఐ వద్ద తగినన్ని నగదు నిల్వలు ఉన్నాయని, అయినప్పటికీ.. నాలుగు ప్రెస్‌లలోనూ మరిన్ని నోట్ల ముద్రణ పెంచినట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment