నగదు కొరత వేధిస్తోంది..!
♦ రైతులకు రుణాలు అందడం లేదు
♦ జైట్లీకి దత్తాత్రేయ ఫిర్యాదు
♦ తక్షణం రూ. 8 వేల కోట్ల విడుదలకు జైట్లీ హామీ
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో నగదు కొరత వేధిస్తోందని, నగదు నిల్వ లేక బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం లేదని కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఫిర్యాదు చేశారు. సోమవారం ఆయన కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు, తెలంగాణ బీజేపీ నేత శ్రీరాం వెదిరెతో పాటు జైట్లీని కలిశారు. రైతులకు ఖరీఫ్ సీజన్‌లో రావాల్సిన రుణాలు అందడం లేదని, నగదు కొరతే దీనికి కారణమని వివరించారు. బ్యాంకులకు నగదు విడుదల చేయాలని కోరారు. తెలంగాణకు దాదాపు రూ. 23 వేల కోట్ల మేర నగదు అవసరమని వివరించినట్టు దత్తాత్రేయ మీడియాకు తెలిపారు.
అరుణ్‌జైట్లీ తన విన్నపానికి స్పందిస్తూ రూ. 8 వేల కోట్ల మేర నగదును తక్షణం విడుదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. జీఎస్టీ కారణంగా జౌళీ రంగం, బీడి పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు వచ్చిన విన్నపాలను జైట్లీ దృష్టికి తీసుకు వెళ్లినట్లు దీనికి జైట్లీ స్పందిస్తూ జీఎస్టీ కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు దత్తాత్రేయ వివరించారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌కోవింద్ మంగళవారం హైదరాబాద్‌లో పర్యటిస్తారని, టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కలుస్తారన్నారు. ఈ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు.