ఆగిపోనున్న ‘ఆస్క్ మీ’
రోడ్డున పడనున్న 4వేల మంది ఉద్యోగులు
న్యూఢిల్లీ: ఈ కామర్స్ స్టార్టప్ సంస్థ ‘ఆస్క్ మీ’ మూతపడనుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన 40 కేంద్రాల్లో పని చేస్తున్న నాలుగు వేల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు. ఈ సంస్థ తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటూ లాభాలు కళ్లజూడలేని పరిస్థితుల్లో తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఇటీవలే ఓలాకు చెందిన ట్యాక్సీ ఫర్ ష్యూర్, స్నాప్‌డీల్‌కు చెందిన ఎక్స్‌క్లూజివ్‌లీ డాట్ కామ్ మూసివేత ప్రకటనలు వెలువడగా... తాజాగా ఆస్క్ మీ సైతం వాటి సరసన చేరిపోయింది. ఆస్క్‌మీ సంస్థ ఆస్క్ మీ డాట్ కామ్, ఆస్క్ మీ బజార్, ఆస్క్ మీ గ్రోసరీ, ఆస్క్ మీ పే, మొబైల్‌కార్ట్ పోర్టళ్లను నిర్వహిస్తోంది.
కార్యకలాపాలను నిలిపివేయండి...
ఆస్క్‌మీ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ దాని మాతృ సంస్థ గెటిట్ ఇన్ఫోసర్వీసెస్ సీఎఫ్‌ఓ ఆనంద్ సోన్‌భద్ర ఉన్నతాధికారులకు ఓ మెయిల్ పంపారు. సంస్థ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మరింతగా అప్పుల్లోకి కూరుకుపోకుండా నివారించేందుకు వెంటనే కార్యకలాపాలను నిలిపివేయాలని కోరారు. వీలయితే అన్ని కార్యాలయాలు, హబ్‌లను తాత్కాలికంగా మూసివేయాలని సూచించారు. డెలివరీ బోయ్‌లు, దిగువ స్థాయి ఉద్యోగులకు వేతనాలు చెల్లించనందున వారు అవాంఛనీయ ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని, వీటిని నివారించడంతోపాటు హబ్‌ల వద్ద ఆస్తులను రక్షించుకోవాలని సూచించారు. కాగా, ఆస్క్ మీలో అధిక శాతం మంది ఉద్యోగులకు జూలై నెల వేతనాలు చెల్లించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే, గత కొన్ని నెలలకు సంబంధించిన రీయింబర్స్‌మెంట్ బిల్లులు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సంస్థకు పలు కేంద్రాలను మూసివేసినట్టు విశ్వసనీయ సమాచారం. అయినా సంస్థ పోర్టళ్లు ఇప్పటికీ పనిచేస్తున్నా యి. ఆస్క్ మీ మాతృ సంస్థ అయిన గెటిట్ ఇన్ఫోమీడియా (తర్వాత గెటిట్ ఇన్ఫోసర్వీసెస్‌గా మారిం ది)లో మలేసియాకు చెందిన ఆస్ట్రో ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ లిమిటెడ్ (ఏఈఎన్‌ఎల్) 2010లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ద్వారా 99 శాతం వరకు వాటా తీసుకుంది. ఇప్పటి వరకు సుమారు 30 కోట్ల డాలర్ల మేర నిధుల సాయం అందించింది.
ఫోరెన్సిక్ ఆడిట్‌లో నిజాలు తెలుస్తాయి..
‘ఏఈఎన్‌ఎల్ పెద్ద ఎత్తున నిధుల సాయం అందించినప్పటికీ దురదృష్టవశాత్తూ గెటిట్ ఇప్పటి వరకు వ్యాపారాన్ని లాభాల్లోకి తీసుకురాలేకపోయింది. ఆస్క్ మీ లాభాల్లోకి రావడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయని, సంస్థ దివాళా (అప్పులు తీర్చలేని స్థితి) తీసినట్టేనని సలహాదారులు నిర్వహించిన స్వతంత్ర సమీక్షలో తేలింది’ అని ఏఈఎన్‌ఎల్ ప్రకటించింది. గెటిట్ ఖాతా పుస్తకాలను తనిఖీ చేసేందుకు ఫోరెన్సిక్ ఆడిటర్‌ను నియమించనున్నట్టు వెల్లడించింది. ఆడి ట్ ఫలితాలను బట్టి చర్యలు తీసుకుంటామని తెలి పింది. ఇతర ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్లిపోయినా గెటిట్ వ్యాపారానికి సాధ్యమైనంత సహకారాన్ని అందించామని... ఇకపైనా బాధ్యతాయుతంగా, భారతీయ చట్టాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేసింది.
ఆస్ట్రోదే బాధ్యత: గెటిట్
వ్యాపారం దివాళా తీసిందని ఏఈఎన్‌ఎల్ ఆరోపించడంపై గెటిట్ ప్రతిస్పందించింది. తాము యాజమాన్యం పరంగా వ్యాపార కొనుగోలుకు అవకాశం ఇచ్చినట్టు తెలిపింది. మూసివేత వల్ల అయ్యే వ్యయంపై ఆస్ట్రోకు సమాచారం ఉందని, 2016 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు గెటిట్‌తో జరిగిన సంప్రదింపుల సమాచారాన్ని విడుదల చేయాలని, అసలైన విషయం బయటకు వస్తుందని కౌంటర్ ఇచ్చింది. ఫోరెన్సిక్ ఆడిట్ కావాలని ఈ దశలో కోరడంపై స్పందిస్తూ... గత రెండేళ్లుగా ఆస్క్‌మీ ఆడిట్ కమిటీలో ఉన్న ముగ్గురు ఆడిటర్లు కూడా ఆస్ట్రో నామినీలేనని, ప్రస్తుత పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది.