ఎనీ టైమ్‌.. నో క్యాష్‌ | any time no cash : after three months demonetisation effects repeats | Sakshi
Sakshi News home page

ఎనీ టైమ్‌.. నో క్యాష్‌

Published Sat, Mar 4 2017 1:54 AM | Last Updated on Thu, Mar 28 2019 4:53 PM

ఎనీ టైమ్‌.. నో క్యాష్‌ - Sakshi

ఎనీ టైమ్‌.. నో క్యాష్‌

రాష్ట్రంలో మరోసారి ‘నోట్ల రద్దు’ నాటి పరిస్థితులు
- పనిచేయని ఏటీఎంలు.. బ్యాంకుల్లో జనం బారులు
- పడిపోయిన డిపాజిట్లు..పెరిగిన విత్‌డ్రాలు
- తీవ్ర నగదు కొరత.. కరెన్సీ లేదంటూ ఏటీఎంల ముందు బోర్డులు
- నెల ప్రారంభం కావడంతో డబ్బుల కోసం వేతనజీవుల అష్టకష్టాలు
- ఈ నెల 13 నుంచి విత్‌డ్రాపై పరిమితులు ఉండవన్న ఆర్‌బీఐ
- పది రోజుల ముందే తలకిందులైన పరిస్థితి
- ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఉపసంహరణ చార్జీలు
- దీంతో గతనెలలోనే పెద్దమొత్తంలో విత్‌డ్రా చేసుకున్న ఖాతాదారులు


సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌

నగదు కొరత మళ్లీ మొదలైందా..? నోట్ల రద్దుతో 3 నెలల కిందట నెలకొన్న పరిణామాలు మళ్లీ పునరావృతమవుతున్నాయా..? ప్రస్తుతం ఏటీఎంలలో నో క్యాష్‌ బోర్డులు, బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడాన్ని చూస్తుంటే నిజమేననిపిస్తోంది. గత ఐదు రోజులుగా ఏటీఎంలు కేవలం బ్యాలెన్స్‌ విచారణకే పరిమితమయ్యాయి. బ్యాంకర్లు వాటిలో నగదును నిల్వ చేయకపోవడంతో వేతనజీవులు, జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. నెల ప్రారంభం కావడంతో సాధారణంగా నగదు ఉపసంహరణకు డిమాండ్‌ అధికంగా ఉంటుంది. కానీ బ్యాంకర్లు ఏటీఎం మిషన్లలో నగదును అందుబాటులో ఉంచకపోవడం, కనీసం బ్యాంకుకు అనుసంధానంగా ఉన్న ఏటీఎంల్లో కూడా కరెన్సీ లభించకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గతేడాది నవంబర్‌లో కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత రోజుల కంటే ఇప్పుడే నగదు సమస్య తీవ్రంగా ఉందని బ్యాంకర్లు ప్రైవేట్‌ సంభాషణల్లో చెబుతున్నారు. రద్దు చేసిన నోట్ల స్థానంలో 80 శాతం కొత్త కరెన్సీ వచ్చినా.. అది తిరిగి బ్యాంకులకు రాకపోవడం, ఆర్‌బీఐ నుంచి నగదు అందకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని బ్యాంకర్లు చెపుతున్నారు. నాలుగు అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంక్‌ బ్రాంచీలను సందర్శించిన ‘సాక్షి’ప్రతినిధికి అన్నిచోట్ల నగదు కొరత ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. గడచిన వారం దాకా రూ.50 వేల దాకా ఇచ్చిన బ్యాంకులు.. ఈ వారం ప్రారంభం నుంచి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

భారీగా తగ్గిన డిపాజిట్లు
మామూలుగా బ్యాంక్‌ల్లో నగదు విత్‌డ్రా చేసేవారు ఎంతమంది ఉంటారో అంతకు మించిన సంఖ్యలో డిపాజిట్‌దారులు ఉంటారు. కానీ ఇప్పుడు విచిత్రంగా బ్యాంక్‌ల్లో డిపాజిట్‌ చేయడానికి వచ్చేవారి కోసం సిబ్బంది ఎదురుచూస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆంధ్రాబ్యాంక్‌ శాఖలో నగదు కోసం వచ్చిన వారికి రూ.10 వేలు ఇచ్చి పంపుతున్నారు. మొన్నటిదాకా రూ.50 వేలు ఇచ్చి ఇప్పుడు.. అత్యవసరంగా డబ్బు కావాలంటే ఎందుకివ్వడం లేదని ఖాతాదారులు సిబ్బందితో గొడవ పడుతున్నారు. ఈ నెల 13 నుంచి నగదు ఉపసంహరణ పరిమితి ఎత్తివేస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. అయితే అందుకు పది రోజుల ముందు నుంచే నగదు సమస్య మొదలుకావడం బ్యాంకర్లను ముప్పుతిప్పలు పెడుతోంది. ‘‘నోట్ల రద్దు సమయంలో కూడా మేం ఇన్ని ఇబ్బందులు పడలేదు. అంతెందుకు కిందటివారం కూడా ఖాతాదారులకు రూ.50 వేల చొప్పున ఇచ్చాం. ఇప్పుడు అకస్మాత్తుగా సమస్య వచ్చిపడింది. దానికి తోడు డిపాజిట్లు చేసే వారు లేరు’’అని మలక్‌పేటలో స్టేట్‌బ్యాంక్‌ అధికారి ఒకరు అన్నారు.

కొరతకు కారణమేంటి?
వ్యాపారులు, వాణిజ్య సంస్థలు నగదు రహిత లావాదేవీలు సాగిస్తుండడం, అందుబాటులో ఉన్న కొద్దిపాటి నగదును తమ వద్దే నిల్వచేసుకోవడంతో బ్యాంకుల్లో రోజువారీ డిపాజిట్లపై తీవ్ర ప్రభావం పడిందని బ్యాంకర్లు చెబుతున్నారు. మణికొండలోని ఎస్‌బీఐ బ్రాంచీలో రోజుకు సగటున రూ.90 లక్షల సొమ్ము డిపాజిట్‌ అయ్యేది. ఇప్పుడు సగటున రూ.20 లక్షలు కూడా రావడం లేదు. అయితే నగదు ఉపసంహరణ మాత్రం రోజూ రూ.కోటికి పెరిగింది. దీంతో నగదు కొరతను భర్తీ చేసేందుకు ప్రధాన బ్యాంకుకు వెళ్లాల్సి వస్తోందని, ఏటీఎంలో నగదును అందుబాటులో పెట్టడం లేదని మేనేజర్‌ తెలిపారు. దాదాపు అన్ని ప్రధాన బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు తగ్గడంతో సొంత ఖాతాదారులకు మాత్రమే ఎంతో కొంత నగదు పంపిణీ చేసేలా బ్యాంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం జంటనగరాల్లో దాదాపు 95 శాతం ఏటీఎంలు నోక్యాష్‌ బోర్డులతో దర్శనమిచ్చాయి.

విత్‌డ్రా చేస్తే చార్జీల మోత..
నగదు ఉపసంహరణపై బ్యాంకులు భారీగా చార్జీల వసూళ్లకు తెరలేపాయి. మార్చి1 నుంచి నాలుగు లావాదేవీల తర్వాత ప్రతి లావాదేవీపై అదనపు చార్జీల పేరిట రూ.150 వరకు చెల్లించాల్సి వస్తుందని ప్రకటించాయి. ఈ అదనపు వసూళ్ల నిర్ణయం ఖాతాదారులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ఖాతాదారులు తమ అకౌంట్లో ఉన్న నగదు నిల్వను ఫిబ్రవరి చివరి వారంలోనే బ్యాంకుకు వెళ్లి ఒకే దఫాలో ఉపసంహరించుకున్నారు. వారంలో రూ.50 వేల లోపు నగదు ఉపసంహరణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఫిబ్రవరి 13 నుంచి 28 మధ్య భారీగా నగదు ఉపసంహరణ జరిగిందని రిజర్వ్‌ బ్యాంక్‌ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో మార్చి మొదటివారంలో నగదుకు ఇబ్బంది ఏర్పడిందని, సరిగ్గా వేతనాల సమయంలో ఉద్యోగులు సమస్యల్లో పడ్డారని అంటున్నారు.

జిల్లాల్లోనూ అదే పరిస్థితి
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కరెన్సీ ఇబ్బందులు కనిపిస్తున్నాయి. యాదాద్రి జిల్లాలో కొన్ని ఏటీఎంలే పనిచేశాయి. అదీ నగదు లోడు చేసిన గంట లేదా రెండు గంటల్లోనే నిండుకుంటున్నాయి. వికారాబాద్‌లో శుక్రవారం 12 ఏటీఎంలకుగాను నాలుగు మాత్రమే పనిచేశాయి. సాయంత్రానికి వాటిలో కూడా డబ్బు అయిపోయింది. తాండూరులో ఖాతాదారులు ఏటీఎంల ముందు బారులు తీరారు. నల్లగొండ జిల్లా దేవరకొండ, హాలియా ప్రాంతాల్లో గడచిన వారం రోజులుగా బ్యాంక్‌లు నగదు సరఫరా చేయడం లేదు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఇదే పరిస్థితి. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో బ్యాంక్‌లు ఖాతాదారులకు రూ.5 వేలకు మించి ఇవ్వడం లేదు.

ఖాతాదారుల ధర్నా
మహబూబ్‌నగర్‌ జిల్లా దామరగిద్ద మండలం కాన్‌కుర్తి ఎస్‌బీఐలో రూ.2 వేలు మాత్రమే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఖాతాదారులు శుక్రవారం బ్యాంకు ముందు ధర్నాకు దిగారు. పంటను అమ్ముకున్న డబ్బుల కోసం రోజులతరబడి బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు రూ.40 వేలకు పైగా తీసుకునే వెసులుబాటు ఉన్నా. రూ.2 వేలే ఇస్తున్నారన్నారు.

అన్ని చోట్ల అవే బోర్డులు: జె. శ్రీనివాస్‌రావు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సిరిసిల్ల
జీతం డబ్బుల కోసం వస్తే ఏటీఎంలు పనిచేయడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చాలా ఏటీఎంల ముందు ఔట్‌ ఆఫ్‌ సర్వీస్‌ బోర్డులు పెట్టారు. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చూద్దామనుకున్నా స్లిప్‌లు రావడంలేదు. చాలా ఇబ్బందిగా ఉంది.

జీతమెలా తీసుకోవాలి?: ఉస్మాన్, లెక్చరర్, తాండూరు
ఏటీఎంల నుంచి వేతనం సొమ్ము తీసుకునేందుకు నానా కష్టాలు పడుతున్నాం. ఏటీఎంలలో క్యాష్‌ ఉండడం లేదు. బ్యాంకు అధికారులు శ్రద్ధ వహించాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement