సాక్షి, హైదరాబాద్: ఎలాంటి కొనుగోళ్లు లేకపోయినా ఉన్నట్టు సృష్టించి బ్యాంకులను రూ.402 కోట్లు బురిడీ కొట్టించిన సర్వో మ్యాక్స్ ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ ఎండీ, ప్రమోటర్ అవసరాల వెంకటేశ్వర్‌రావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం అరెస్ట్ చేసింది. నకిలీ అకౌంట్ బుక్కులు, నకిలీ కొనుగోళ్లతో ఎక్కువ లాభాలు చూపించి పలు బ్యాంకులను మోసం చేసినందుకు వెంకటేశ్వర్‌రావుపై సీబీఐ 2018లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఈడీ, కోర్టు అనుమతితో మనీలాండరింగ్ కింద విచారణ ప్రారంభించింది.
విచారణలో ఈడీ అధికారులు అనేక లోపాలను గుర్తించారు. సర్వోమ్యాక్స్ ఇండియా లిమిటెడ్ పేరుతో బ్యాంకుల నుంచి రూ.402 కోట్లు రుణం తీసుకొని ఎలాంటి కొనుగోళ్లు చేయకుండానే నష్టం వచ్చినట్టు మోసానికి పాల్పడ్డారని, కొనుగోళ్లు చేసినట్టు నకిలీ పత్రాలు సృష్టించారని, ఫేక్ ఇన్‌వాయిస్‌లు సృష్టించి అకౌంట్ బుక్కులో నమోదు చేశారని గుర్తించారు.
రుణంగా పొందిన డబ్బును ఇతర కంపెనీలకు మళ్లించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ అధికారులు దర్యాప్తులో వెలుగులోకి తీసుకువచ్చారు. ఆర్థిక నేరాలపై సాక్ష్యాలతో వెంకటేశ్వరరావును కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు 14రోజుల రిమాండ్ విధించినట్టు ఈడీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment