Duplicate Document
-
బ్యాంకులకు రూ.402 కోట్లు బురిడీ
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి కొనుగోళ్లు లేకపోయినా ఉన్నట్టు సృష్టించి బ్యాంకులను రూ.402 కోట్లు బురిడీ కొట్టించిన సర్వో మ్యాక్స్ ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ ఎండీ, ప్రమోటర్ అవసరాల వెంకటేశ్వర్రావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం అరెస్ట్ చేసింది. నకిలీ అకౌంట్ బుక్కులు, నకిలీ కొనుగోళ్లతో ఎక్కువ లాభాలు చూపించి పలు బ్యాంకులను మోసం చేసినందుకు వెంకటేశ్వర్రావుపై సీబీఐ 2018లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఈడీ, కోర్టు అనుమతితో మనీలాండరింగ్ కింద విచారణ ప్రారంభించింది. విచారణలో ఈడీ అధికారులు అనేక లోపాలను గుర్తించారు. సర్వోమ్యాక్స్ ఇండియా లిమిటెడ్ పేరుతో బ్యాంకుల నుంచి రూ.402 కోట్లు రుణం తీసుకొని ఎలాంటి కొనుగోళ్లు చేయకుండానే నష్టం వచ్చినట్టు మోసానికి పాల్పడ్డారని, కొనుగోళ్లు చేసినట్టు నకిలీ పత్రాలు సృష్టించారని, ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించి అకౌంట్ బుక్కులో నమోదు చేశారని గుర్తించారు. రుణంగా పొందిన డబ్బును ఇతర కంపెనీలకు మళ్లించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ అధికారులు దర్యాప్తులో వెలుగులోకి తీసుకువచ్చారు. ఆర్థిక నేరాలపై సాక్ష్యాలతో వెంకటేశ్వరరావును కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు 14రోజుల రిమాండ్ విధించినట్టు ఈడీ వెల్లడించింది. -
శంకర్రావు తమ్ముడు అరెస్టు
ముషీరాబాద్,న్యూస్‌లైన్: భూకబ్జా, నకిలీ డాక్యుమెంట్ సృష్టించటం,చీటింగ్ కేసుల్లో మాజీమంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు తమ్ముడు దయానంద్‌ను ముషీరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి నాంపల్లికోర్టులో హాజరపర్చారు. కోర్టు ఈనెల 29 వరకు రిమాండ్ విధించింది. సీఐ శ్యాంసుందర్, బాధితుల వివరాల ప్రకారం..రాంనగర్ జెమినీకాలనీలోని పోచమ్మ ఆలయం సమీపంలో రాధ అనే మహిళ 166 గజాల స్థలాన్ని శంకర్రావు తమ్ముడు దయానంద్‌కు గోదాం కోసం నెలకు రూ.800 చొప్పున పదేళ్లక్రితం అద్దెకిచ్చింది. తన కూతురు పెళ్లి నిమిత్తం ఈ స్థలాన్ని అమ్ముతున్నామని, వెంటనే ఖాళీ చేయాలని దయానంద్‌ను కోరగా ఆరునెలల సమయం అడిగాడు. ఆ తర్వాత ఖాళీ చేశారు. అనంతరం రాధ, అరుణ అనే మరో మహిళకు విక్రయించింది. ఈ సమయంలో రాత్రికిరాత్రి దయానంద్ తాళాలు పగులగొట్టి స్థల యజమానురాలును అట్రాసిటీ కేసు పెడ్తానని బెదిరించి స్థలాన్ని ఆక్రమించాడు. అంతేకాకుండా తనకు రూ.5 లక్షలివ్వాలని బెదిరించి కోర్టులో సివిల్ కేసును రాధ,ఆమె అన్న జనార్దన్‌రెడ్డిల మీద దాఖలు చేశారు. ఇంతటితో ఆగకుండా నకిలీ డాక్యుమెంట్‌ను సృష్టించారు. మొత్తం ఈ వ్యవహారంపై రాధ,ఆమె అన్న జనార్దన్‌రెడ్డిలు సివిల్ కేసుతో పాటు క్రిమినల్ కేసును నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు దయానంద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.