శంకర్రావు తమ్ముడు అరెస్టు
ముషీరాబాద్,న్యూస్‌లైన్: భూకబ్జా, నకిలీ డాక్యుమెంట్ సృష్టించటం,చీటింగ్ కేసుల్లో మాజీమంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు తమ్ముడు దయానంద్‌ను ముషీరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి నాంపల్లికోర్టులో హాజరపర్చారు. కోర్టు ఈనెల 29 వరకు రిమాండ్ విధించింది. సీఐ శ్యాంసుందర్, బాధితుల వివరాల ప్రకారం..రాంనగర్ జెమినీకాలనీలోని పోచమ్మ ఆలయం సమీపంలో రాధ అనే మహిళ 166 గజాల స్థలాన్ని శంకర్రావు తమ్ముడు దయానంద్‌కు గోదాం కోసం నెలకు రూ.800 చొప్పున పదేళ్లక్రితం అద్దెకిచ్చింది.
తన కూతురు పెళ్లి నిమిత్తం ఈ స్థలాన్ని అమ్ముతున్నామని, వెంటనే ఖాళీ చేయాలని దయానంద్‌ను కోరగా ఆరునెలల సమయం అడిగాడు. ఆ తర్వాత ఖాళీ చేశారు. అనంతరం రాధ, అరుణ అనే మరో మహిళకు విక్రయించింది. ఈ సమయంలో రాత్రికిరాత్రి దయానంద్ తాళాలు పగులగొట్టి స్థల యజమానురాలును అట్రాసిటీ కేసు పెడ్తానని బెదిరించి స్థలాన్ని ఆక్రమించాడు.
అంతేకాకుండా తనకు రూ.5 లక్షలివ్వాలని బెదిరించి కోర్టులో సివిల్ కేసును రాధ,ఆమె అన్న జనార్దన్‌రెడ్డిల మీద దాఖలు చేశారు. ఇంతటితో ఆగకుండా నకిలీ డాక్యుమెంట్‌ను సృష్టించారు. మొత్తం ఈ వ్యవహారంపై రాధ,ఆమె అన్న జనార్దన్‌రెడ్డిలు సివిల్ కేసుతో పాటు క్రిమినల్ కేసును నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు దయానంద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.