పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: కార్వీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరింత దూకుడు పెంచింది. కార్వీతోపాటు ఇతర 8 కంపెనీలకు చెందిన రూ.700 కోట్ల విలువైన షేర్లను ఫ్రీజ్ చేసింది. మూడు రోజుల క్రితం కార్వీ సీఎండీతోపాటు ఇతర నిందితుల ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి.
ఈ సందర్భంగా కీలకమైన డాక్యుమెంట్లు, డైరీలు, డిలీట్ చేసిన మెయిల్స్, పెన్‌డ్రైవ్‌లు ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నాయి. తదుపరి చర్యల్లో భాగంగా షేర్లను ఫ్రీజ్ చేసినట్టు తెలిసింది. 2019–20 ఆర్థిక సంవత్సరం ప్రకారం వాటి విలువను రూ.700 కోట్లుగా నిర్ధారించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.
రుణాలు తీసుకుని షెల్ కంపెనీలకు..
హైదరాబాద్ సీసీఎస్‌లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. పార్థసారథి అక్రమ పద్ధతిలో బ్యాంకుల నుంచి రుణాలు పొంది తిరిగి కట్టకుండా డిఫాల్టర్ అయ్యారు. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కార్వీ స్కాం వెలుగులోకి వచ్చింది.
హెచ్‌డీఎఫ్‌సీ నుంచి రూ.329 కోట్లు, ఇండస్‌ఇండ్ బ్యాంక్ నుంచి రూ.137 కోట్లు, ఐసీఐసీఐ నుంచి రూ.562.5 కోట్లు రుణాలు పొందినట్లు ఆయా బ్యాంకులు ఫిర్యాదులో పేర్కొన్నాయి. వీటితోపాటు మరికొన్ని బ్యాంకుల్లో రుణాలు పొంది షెల్ కంపెనీలకు బదలాయించాడని, మొత్తం స్కాం విలువ రూ. 2,873 కోట్లు అని ఈడీ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.
ఎక్సే్ఛంజ్ బోర్డులకు చెప్పకుండానే..
షేర్ల వ్యవహారంలో కార్వీ సంస్థ రెండు డీపీ (డిపాజిటరీ పార్టిసిపేటరీ) అకౌంట్ల ద్వారా జనవరి 2019 నుంచి ఆగస్టు 2019 వరకు జరిగిన ట్రేడింగ్ వివరాలను బీఎస్‌ఈ (బాంబే స్టాక్ ఎక్సే్ఛంజ్) ఫైలింగ్‌లో ఎక్సే్ఛంజ్ బోర్డులకు చూపకుండా దాచిపెట్టినట్టు ఈడీ దర్యాప్తులోకి వెలుగులోకి వచ్చింది. ఆ బోర్డులకు సమాచారమివ్వకుండా మదుపరుల షేర్లను తన వ్యక్తిగత డీమాట్ అకౌంట్‌లోకి బదలాయించినట్టు కూడా గుర్తించింది.
సెబీకి సమాచారం లేకుండా ఏప్రిల్ 2016 నుంచి అక్టోబర్ 2019 వరకు రూ.1,096 కోట్లను పార్థసారథి కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) నుంచి కార్వీ రియాలిటీ ఇండియా (కేఆర్‌ఐఎల్)లోకి బదలాయించారు. అదేవిధంగా కేఎస్‌బీఎల్ నుంచి కార్వీ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (కేసీఎల్)తో పాటు 8 షెల్ కంపెనీలకు నిధులు బదలాయించినట్లు ఈడీ గుర్తించింది.
కార్వీ రియల్ ఇండియా పేరుతో బదలాయించిన సొమ్ములో కొంత మొత్తాన్ని అదే కంపెనీ పేరిట భూములు కొనుగోలు చేసినట్టు ఉన్న డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు దొరక్కుండా కంప్యూటర్లలో ఫైల్స్, మెయిల్స్‌ను డిలీట్ చేసినట్టు గుర్తించిన ఈడీ వాటిని తిరిగి చేజిక్కించుకున్నట్లు దర్యాప్తు అధికారుల ద్వారా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment