karvy stock broking company
-
కార్వీ కేసులో ప్రముఖ సంస్థలకు ఊరట
కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో సెబీ, ఎన్ఎస్డీఎల్కు పెద్ద ఊరట లభించింది. ఈ కేసులో గత ఏడాది డిసెంబరు 20న సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్) జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ తన ఖాతాదారుల షేర్లను బ్యాంకుల వద్ద తనఖాపెట్టి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంది. ఈ కుంభకోణం బయటపడడంతో సెబీ, ఎన్ఎస్డీఎల్ రంగంలోకి దిగి ఆ షేర్లను మళ్లీ ఖాతాదారులకు బదిలీ చేయించాయి. యాక్సిస్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ విషయాన్ని శాట్‌లో సవాల్ చేశాయి. ఇదీ చదవండి: పెడితే రూపాయి రాదని తెలిసీ కోట్లు పెట్టుబడి..! ఫలితంగా కార్వీ తనఖాపెట్టిన షేర్ల విలువకు సమాన మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాలని శాట్ గత ఏడాది డిసెంబరులో సెబీ, ఎన్ఎస్డీఎల్ను ఆదేశించింది. ఈ సంస్థలు సంబంధిత అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా శాట్ తీర్పుపై స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసినట్లు తెలిసింది. -
కార్వీ కేసులో డైరెక్టర్ యుగంధర్‌కు ఊరట
హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్)లో అవకతవకల కేసుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణలో సంస్థ డైరెక్టరు మేకా యుగంధర్‌కు ఊరట లబించింది. క్లయింట్ల నిధుల దుర్వినియోగం విషయంలో ఆయన ప్రమేయమేమీ లేదని తుది ఉత్తర్వుల్లో సెబీ అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో ఆయన కేఎస్‌బీఎల్ మేనేజ్మెంట్తో కుమ్మక్కయ్యారనేందుకు తగిన ఆధారాలు లేవని పేర్కొంది. ఆధారాలను బట్టి చూస్తే సంస్థలో యుగంధర్ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా మాత్రమే ఉన్నారని, కంపెనీ రోజువారీ కార్యకలాపాల్లో ఆయన జోక్యం లేదని తెలిపింది. వాస్తవానికి 2017లోనే క్లయింట్ల నిధుల దుర్వినియోగ అంశం గురించి ఆయన లేవనెత్తి, ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని కోరినప్పటికీ సంస్థ సీఎఫ్‌వో, మేనేజ్మెంట్ పట్టించుకోలేదని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో యుగంధర్ ప్రజావేగుగానే వ్యవహరించారని, ఆయన్ను నేరస్తుడిగా భావించడానికి లేదని సెబీ పేర్కొంది. ఈ కేసులో కేఎస్‌బీఎల్, దాని ప్రమోటరు ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ లావాదేవీలు జరపకుండా సెబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
కార్వీ స్కామ్: భారీగా ఆస్తులు స్వాధీనం
హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కెఎస్‌బీఎల్) సంస్థకు చెందిన కోట్ల రూపాయల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. కార్వీ సీఎండీ పార్థసారథి ఇతరులపై మనీ లాండరింగ్ విచారణకు సంబంధించి రూ.110 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ శనివారం తెలిపింది. కార్వీ స్కామ్‌లో మనీలాండరింగ్ యాక్డ్ కింద కార్వీపై ఇప్పటికే కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. దీంతో ఈ కేసులో ఈడీ ఆస్తుల అటాచ్మెంట్ మొత్తం విలువ రూ.2,095 కోట్లకు చేరుకుంది. ఇందులో షేర్లు, భూములు, భవనాల షేర్లు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు ఉన్నాయి. కాగా దాదాపు రూ. 2,800 కోట్ల విలువైన తమ ఖాతాదారుల షేర్లను అక్రమంగా తాకట్టు పెట్టి కార్వీ గ్రూప్ పెద్ద మొత్తంలో రుణాలు పొందిందని, ఆ రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారాయని ఆరోపిస్తూ రుణాలిచ్చిన బ్యాంకుల ఫిర్యాదులపై హైదరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదైంది. విచారణలో భాగంగా ఈ ఏడాది జనవరిలో పార్థసారథి గ్రూప్ సీఎఫ్‌వో జి కృష్ణ హరిని అరెస్టు చేసింది. ఇద్దరూ ఇప్పుడు బెయిల్‌పై ఉన్న సంగతి తెలిసిందే. -
‘నంబర్ వన్’ టార్గెట్టే ముంచిందా!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో కార్వీనే పైన ఉండాలి.. స్టాక్ బ్రోకింగ్‌లో తన సంస్థే వాటానే ఎక్కువగా ఉండాలి.. ఇలా నంబర్ వన్ స్థానం కోసం పోటీపడిన కార్వీ సంస్థల సీఎండీ సి.పార్థసారథి నిండా మునిగారు. బ్యాంకుల నుంచి రూ.వందల కోట్ల రుణాలు తీసుకుని మోసం చేసిన ఆరోపణలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారులు అనేక కీలక విషయాలు గుర్తించారు. కొసరు కోసం అసలు డబ్బు... స్టాక్ బ్రోకింగ్, డేటా మేనేజ్మెంట్ రంగాల్లో కార్వీకి ప్రత్యేక స్థానం ఉండేది. భారీ వ్యాపార సామ్రాజ్యం స్థాపించాలని, తనదో పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీగా మారాలని భావించిన పార్థసారథి అనుబంధ సంస్థల్ని స్థాపించారు. దాదాపు 20కి పైగా కంపెనీలను ఏర్పాటు చేశారు. వీటికి మౌలిక వసతులు, ఇతరాల కోసం కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) నుంచి రూ.250 కోట్లు వెచ్చించారు. ఆ సంస్థలు ఆశించిన స్థాయిలో టర్నోవర్ సాధించలేకపోవడం, కార్వీ రియాల్టీ సంస్థ మహేశ్వరంలో నోవా ప్రాజెక్ట్స్ పేరుతో చేసిన 250 ఎకరాల వెంచర్‌లోనూ లాభాలు రాకపోవడంతో తీవ్రనష్టాల్లో మునిగిపోయారు. ఆయా సంస్థలకు అవసరమైన రుణాలు తీసుకోవడానికి కార్వీ ఆస్తులను గ్యారెంటీగా పెట్టారు. అతి పెద్ద బ్రోకింగ్ సంస్థగా మారాలని... గచ్చిబౌలి కేంద్రంగా పని చేసే కేఎస్‌బీఎల్.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), ది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద రిజిస్టరై ఉంది. ఏళ్లుగా అనేక మంది మదుపర్ల డీమ్యాట్ ఖాతాలను ఈ సంస్థ పర్యవేక్షించేది. జాతీయ స్థాయిలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో జరిగే ట్రేడింగ్‌లో కార్వీ వాటా 2శాతంగా ఉండేది. దీన్ని 7శాతానికి పెంచడం ద్వారా దేశంలోనే అతిపెద్ద బ్రోకింగ్ సంస్థగా అవతరించాలని పార్థసారథి భావించారు. దీనికోసం భారీ టర్నోవర్ సృష్టించడానికి ప్రయత్నించారు. తమ వద్ద ఉన్న డీమ్యాట్ ఖాతాల్లో మదుపరుల ప్రమేయం లేకుండా ట్రేడింగ్ చేయించారు. ఇలా కార్వీ ట్రేడింగ్ వాటా 6శాతానికి చేరాక ప్లాన్ బెడిసికొట్టింది. షేర్ మార్కెట్ కుప్పకూలడంతో రూ.400 కోట్లకు వరకు నష్టాలు వచ్చాయి. కోవిడ్ నేపథ్యంలో కంపెనీలు విక్రయించలేక.. ఈ నష్టాల నుంచి బయటపడటానికి మదుపరుల షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందాలని భావించిన పార్థసారథి దానికోసం వారి అనుమతి లేకుండా వారి డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి మార్చుకున్నారు. ఆ షేర్లను తనఖా పెట్టి రూ.1,100 కోట్ల వరకు వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పు తీసుకున్నారు. కాలక్రమంలో తన కంపెనీలకు విక్రయిం చి బ్యాంకులకు చెల్లించడం ద్వారా బయటపడాలని భావించారు. అయితే కోవిడ్‌తో మార్కెట్ కుప్పకూలడం పార్థసారథికి ప్రతికూలంగా మారింది. -
రూ.700 కోట్ల ‘కార్వీ’ షేర్లు ఫ్రీజ్
సాక్షి, హైదరాబాద్: కార్వీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరింత దూకుడు పెంచింది. కార్వీతోపాటు ఇతర 8 కంపెనీలకు చెందిన రూ.700 కోట్ల విలువైన షేర్లను ఫ్రీజ్ చేసింది. మూడు రోజుల క్రితం కార్వీ సీఎండీతోపాటు ఇతర నిందితుల ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా కీలకమైన డాక్యుమెంట్లు, డైరీలు, డిలీట్ చేసిన మెయిల్స్, పెన్‌డ్రైవ్‌లు ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నాయి. తదుపరి చర్యల్లో భాగంగా షేర్లను ఫ్రీజ్ చేసినట్టు తెలిసింది. 2019–20 ఆర్థిక సంవత్సరం ప్రకారం వాటి విలువను రూ.700 కోట్లుగా నిర్ధారించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. రుణాలు తీసుకుని షెల్ కంపెనీలకు.. హైదరాబాద్ సీసీఎస్‌లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. పార్థసారథి అక్రమ పద్ధతిలో బ్యాంకుల నుంచి రుణాలు పొంది తిరిగి కట్టకుండా డిఫాల్టర్ అయ్యారు. దీంతో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కార్వీ స్కాం వెలుగులోకి వచ్చింది. హెచ్డీఎఫ్సీ నుంచి రూ.329 కోట్లు, ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి రూ.137 కోట్లు, ఐసీఐసీఐ నుంచి రూ.562.5 కోట్లు రుణాలు పొందినట్లు ఆయా బ్యాంకులు ఫిర్యాదులో పేర్కొన్నాయి. వీటితోపాటు మరికొన్ని బ్యాంకుల్లో రుణాలు పొంది షెల్ కంపెనీలకు బదలాయించాడని, మొత్తం స్కాం విలువ రూ. 2,873 కోట్లు అని ఈడీ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఎక్సే్ఛంజ్ బోర్డులకు చెప్పకుండానే.. షేర్ల వ్యవహారంలో కార్వీ సంస్థ రెండు డీపీ (డిపాజిటరీ పార్టిసిపేటరీ) అకౌంట్ల ద్వారా జనవరి 2019 నుంచి ఆగస్టు 2019 వరకు జరిగిన ట్రేడింగ్ వివరాలను బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్సే్ఛంజ్) ఫైలింగ్‌లో ఎక్సే్ఛంజ్ బోర్డులకు చూపకుండా దాచిపెట్టినట్టు ఈడీ దర్యాప్తులోకి వెలుగులోకి వచ్చింది. ఆ బోర్డులకు సమాచారమివ్వకుండా మదుపరుల షేర్లను తన వ్యక్తిగత డీమాట్ అకౌంట్లోకి బదలాయించినట్టు కూడా గుర్తించింది. సెబీకి సమాచారం లేకుండా ఏప్రిల్ 2016 నుంచి అక్టోబర్ 2019 వరకు రూ.1,096 కోట్లను పార్థసారథి కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) నుంచి కార్వీ రియాలిటీ ఇండియా (కేఆర్‌ఐఎల్)లోకి బదలాయించారు. అదేవిధంగా కేఎస్‌బీఎల్ నుంచి కార్వీ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (కేసీఎల్)తో పాటు 8 షెల్ కంపెనీలకు నిధులు బదలాయించినట్లు ఈడీ గుర్తించింది. కార్వీ రియల్ ఇండియా పేరుతో బదలాయించిన సొమ్ములో కొంత మొత్తాన్ని అదే కంపెనీ పేరిట భూములు కొనుగోలు చేసినట్టు ఉన్న డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు దొరక్కుండా కంప్యూటర్లలో ఫైల్స్, మెయిల్స్‌ను డిలీట్ చేసినట్టు గుర్తించిన ఈడీ వాటిని తిరిగి చేజిక్కించుకున్నట్లు దర్యాప్తు అధికారుల ద్వారా తెలిసింది. -
వందల మంది షేర్లు మాయం!
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) సంస్థలో డీమ్యాట్ ఖాతాలు కలిగిన మదుపరుల షేర్లు భారీ సంఖ్యలో గల్లంతయ్యాయి. దీంతోపాటు డీమ్యాట్ ఖాతాలకు లింకై ఉన్న బ్యాంకు ఖాతాల్లోని నగదు కూడా మాయమైంది. కేఎస్‌బీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథిని హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్) పోలీసులు గత గురువారం అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న బాధితులు అనేక మంది అధికారులను సంప్రదిస్తున్నారు. సోమవారం నాటికి 25 మంది వచ్చారని సమాచారం. నిబంధనల ప్రకారం ఈ ఠాణా అధికారులు రూ.75 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో ముడిపడిన ఆర్థిక నేరాల కేసుల్నే నమోదు చేయాలి. అందుకే స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించినట్లు ఓ అధికారి తెలిపారు. రెండు బ్యాంకులకు రూ.484 కోట్లు ఎగవేసిన ఆరోపణలపై సీసీఎస్‌లో వేర్వేరుగా మూడు కేసులు నమోదయ్యాయి. రూ.137 కోట్లకు సంబంధించి ఇండస్ ఇండ్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పార్థసారథిని అరెస్టు చేసిన విషయంతెలిసిందే. తదుపరి విచారణ నిమిత్తం ఆయనను తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సీసీఎస్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు ముగిశాయి. దీనిపై న్యాయస్థానం మంగళవారం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. సంస్థలోకి మళ్లించుకుని రుణాలు.. కేఎస్‌బీఎల్ సంస్థ ఏళ్లుగా అనేక మంది మదుపర్ల డీమ్యాట్ ఖాతాలను పర్యవేక్షించింది. ఆయా ఖాతాల్లో వినియోగదారులకు సంబంధించిన షేర్లతో పాటు దానికి లింకైన బ్యాంకు ఖాతాల్లో నగదు కూడా ఉండేది. ప్రతి మదుపరుడు తన షేర్లను బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టడం ద్వారా వాటి విలువలో 80 శాతం వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని అనువుగా మార్చుకున్న పార్థసారథి మదుపరుల అనుమతి లేకుండా వారి డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి మార్చుకున్నారు. ఆపై బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను సంప్రదించి రుణాలు తీసుకున్నారు. మరికొందరి షేర్లను విక్రయించడంతో పాటు వారి బ్యాంకు ఖాతాల్లోని నగదునూ స్వాహా చేశాడు. ఇలా కేఎస్‌బీఎల్, కార్వీ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు దాదాపు 2 లక్షల మంది మదుపరుల ఖాతాల్లోని షేర్లు, నగదు మళ్లించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకు ఫిర్యాదుతో నమోదైన కేసుల్ని దర్యాప్తు చేస్తున్నామని, అంగీకరించిన మదుపరులను ఈ కేసుల్లో సాక్షులుగా చేరుస్తామని సీసీఎస్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. -
జనవరి 15లోగా తేల్చండి
న్యూఢిల్లీ: బ్రోకింగ్ సంస్థ కార్వీ తనఖా ఉంచిన షేర్ల స్వాధీనానికి సంబంధించి .. యాక్సిస్ బ్యాంకు పిటిషన్‌పై జనవరి 15లోగా తగు ఉత్తర్వులు ఇవ్వాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) శుక్రవారం సూచించింది. దీనిపై 15 రోజుల్లోగా తీర్పునివ్వాలం టూ డిసెంబర్ 17న ఇచ్చిన ఆదేశాలను తాజాగా సవరించింది. క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందని ఆరోపణలున్న కార్వీపై (కేఎస్‌బీఎల్) పలు ఆంక్షలు అమలవుతున్న సంగతి తెలిసిందే. కార్వీ తనఖా పెట్టిన షేర్లపై యాక్సిస్ బ్యాంక్ రూ. 81 కోట్లు రుణమిచ్చింది. ఆ షేర్లను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా.. కార్వీ ఖాతాపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలంటూ నియంత్రణ సంస్థలను యాక్సిస్ బ్యాంక్ కోరుతోంది. -
కార్వీపై ‘ఆంక్ష’లను సమీక్షించండి
న్యూఢిల్లీ: క్లయింట్ల పవర్ ఆఫ్ అటార్నీలను (పీవోఏ) ఉపయోగించుకోనివ్వకుండా స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీపై విధించిన ఆంక్షలను పునఃసమీక్షించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) సూచించింది. డిసెంబర్ 2లోగా దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. క్లయింట్ల షేర్లను సొంత అవసరాలకు ఉపయోగించుకుందన్న ఆరోపణలతో కార్వీపై సెబీ ఆంక్షలు విధించడం తెలిసిందే. కొత్త క్లయింట్లను చేర్చుకోరాదని, ప్రస్తుత క్లయింట్ల పీవోఏలను ఉపయోగించరాదని సెబీ హోల్‌టైమ్ సభ్యుడు(డబ్ల్యూటీఎం) అనంత బారువా నవంబర్ 22న ఇచ్చిన ఎక్స్‌పార్టీ మధ్యంతర ఉత్తర్వుల్లో ఆదేశించారు. దీన్ని సవాలు చేస్తూ కార్వీ గురువారం శాట్‌ను ఆశ్రయించింది. పీవోఏలను ఉపయోగించుకోలేకపోవడం వల్ల లావాదేవీల సెటిల్మెంట్ విషయంలో సమస్యలు వస్తున్నాయని, క్లయింట్లు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. పీవోఏలను ఉపయోగానికి సంబంధించి కొన్ని అంశాలపై స్పష్టతనివ్వాలని కోరింది. తరుణ్ అగర్వాలా, ఎం.టి. జోషిలతో కూడిన శాట్ ద్విసభ్య బెంచ్ దీనిపై శుక్రవారం ఉత్తర్వులిస్తూ... కార్వీ కోరుతున్నట్లుగా సెబీ ఈ అంశాన్ని పరిశీలించాలని, సంస్థ తన వాదనలు వినిపించేందుకు అవకాశమిచ్చి.. తరవాత తగు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. సెబీ మాజీ లీగల్ ఆఫీసర్ కేఆర్‌సీవీ శేషాచలం పార్ట్నర్గా ఉన్న విశేష లా సర్వీసెస్ సంస్థ కార్వీ తరఫున వాదిస్తోంది. మరోవైపు, ప్రస్తుత తరుణంలో కార్వీకి వెసులుబాటు కల్పిస్తే.. మరింతగా పీవోఏల దుర్వినియోగానికి దారి తీయొచ్చని సెబీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. -
చేయకూడనివన్నీ చేసింది..
ముంబై/హైదరాబాద్ బిజినెస్ బ్యూరో: క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి ఆ సొమ్మును సొంత అవసరాలకు వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియంత్రణ సంస్థ ఎన్నడూ అనుమతించని కార్యకలాపాలన్నింటినీ కార్వీ సాగించిందని వ్యాఖ్యానించారు. ‘ఇలాంటి లావాదేవీలు జరపరాదంటూ విస్పష్టమైన సర్క్యులర్ జూన్‌లోనే ఇచ్చాం. అయితే గతంలో కూడా వీటికి అనుమతి లేదు. కార్వీ మాత్రం ప్రాథమికంగా అనుమతించని పనులన్నీ చేసింది. నిబంధనల్లో ప్రత్యేకంగా లేదు కాబట్టి క్లయింట్ల షేర్లను సొంతానికి వాడేసుకుంటామంటే కుదరదు’ అని త్యాగి స్పష్టం చేశారు. కార్పొరేట్ గవర్నెన్స్‌పై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) నిర్వహించిన ఆసియా రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్వీ గతంలోనూ ఇలాంటివి చేసిందని చెప్పిన త్యాగి... గతంలో తమ ఆడిట్లలో వీటిని ఎందుకు బయటపెట్టలేకపోయామన్నది మాత్రం చెప్పలేదు. ఎన్ఎస్ఈ, సెబీతో బ్యాంకర్ల చర్చలు.. కార్వీ స్టాక్ బ్రోకింగ్ ఖాతాల్ని ఫోరెన్సిక్ ఆడిట్ చేసేందుకు ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) సంస్థను నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) నియమించినట్లు సమాచారం. మరోవైపు, కార్వీకి రుణాలు ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల్లో ఆందోళన పెరుగుతోంది. సెబీ ఉత్తర్వుల్లో రియల్ ఎస్టేట్ లావాదేవీల ప్రస్తావన కూడా ఉండటంతో దీనిపై అవి మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య తీవ్రత, కార్వీకి చెందిన కంపెనీలేమైనా డిఫాల్ట్ అయ్యే అవకాశాలున్నా యా అన్న విషయాల గురించి తెలుసుకునేందుకు ఎన్ఎస్ఈ, సెబీతో అవి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి కార్వీ సుమారు రూ. 600 కోట్ల మేర నిధులు తీసుకున్నట్లు తెలియవచ్చింది. అంతా సర్దుకుంటుంది కీలక ఉద్యోగులకు కార్వీ చీఫ్ లేఖ ఈ సమస్య నుంచి సత్వరమే బయటపడగలమని కార్వీ గ్రూప్ చైర్మన్ సి.పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు. తనఖాలో ఉన్న షేర్లను త్వరలోనే విడిపిస్తామని, క్లయింట్లకు కూడా చెల్లింపులు జరిపేస్తామని పేర్కొంటూ సంస్థ కీలక ఉద్యోగులకు బుధవారం ఆయనో లేఖ రాసినట్లు తెలిసింది. గరిష్ఠంగా రెండు వారాల్లో చెల్లింపులు పూర్తిచేస్తామని కొద్దిరోజులుగా చెబుతున్న ఆయన... ఈ లేఖలో కూడా అదే విషయాన్ని పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. -
కార్వీలో వాటా విక్రయం?
ప్రతీ ప్రతికూల పరిస్థితి నుంచి అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవచ్చనేది తెలుసుకునేందుకు మా గ్రూప్ ఒక కేస్ స్టడీ లాంటిది అని కార్వీ తన పోర్టల్‌లో గర్వంగా చెబుతుంది. కానీ, ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నుంచి ఎలా బైటపడుతుంది.. మళ్లీ ఎలా నిలదొక్కుకుంటుంది.. అన్నది వేచిచూడాలి. సాక్షి, బిజినెస్ విభాగం: ఖాతాదారుల షేర్లను తనఖా పెట్టి... ఆ డబ్బుల్ని ఇతర వ్యాపారాల్లోకి మళ్లించిందనే వ్యవహారంలో కార్వీ స్టాక్‌బ్రోకింగ్ సర్వీస్ నుంచి క్లయింట్ల వలస మొదలైంది. కొత్త క్లయింట్లను చేర్చుకోరాదని సెబీ ఉత్తర్వులివ్వటంతో... రెండు రోజులుగా ప్రస్తుత క్లయింట్లు పెద్ద సంఖ్యలో నానక్‌రామ్‌గూడలోని కార్వీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి షేర్ ట్రాన్స్ఫర్ స్లిప్పులు తెచ్చుకుంటున్నారు. వాటిని తమ కార్వీ బ్రాంచీలో ఇచ్చి... తమకున్న వేరే డీమ్యాట్ ఖాతాకు బదిలీ చేయాలని అడుగుతున్నారు. బదిలీ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తవుతుందని కార్వీ సిబ్బంది చెబుతున్నారు. ఇలా తరలిపోతున్న క్లయింట్ల సంఖ్య భారీగానే ఉండటంతో... ఇది కార్వీ బ్రోకింగ్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రిటైల్ బ్రోకరేజీ క్లయింట్లలో 20– 22 శాతం వాటా కార్వీదే. ఇపుడు ఈ వాటా తగ్గనుంది. వాటా విక్రయానికి అడుగులు? నిబంధనలకు విరుద్ధంగా క్లయింట్ల షేర్లను తాకట్టు పెట్టి, ఆ నిధులను సొంత అవసరాలకు వాడుకుందని కార్వీ స్టాక్ బ్రోకింగ్‌పై ఆరోపణలు వస్తున్నాయి. తనఖా పెట్టి తెచ్చుకున్న మొత్తం ఎంతనేది ఇప్పటిదాకా స్పష్టంగా బయటకు రాలేదు. ఎన్ఎస్ఈ తన నివేదికలో... ఇలా తెచ్చిన రూ.1,096 కోట్లను కేఎస్‌బీఎల్ తన రియల్టీ విభాగానికి మళ్లించిందని పేర్కొంది. అయితే కంపెనీ దాదాపు రూ. 2,000 కోట్లు పైగా డిఫాల్ట్ అయ్యిందనే వార్తలొస్తున్నాయి. కార్వీ మాత్రం ఈ అంకెలన్నీ తప్పంటోంది. ‘‘150–180 మంది క్లయింట్లకే చెల్లింపులు జరపాల్సి ఉంది. బకాయి రూ. 25–30 కోట్లు మాత్రమే’’ అని సంస్థ చైర్మన్ సి. పార్థసారథి చెప్పారు. 15 రోజుల్లో దీన్ని చెల్లిస్తామన్నారాయన. ఈలోగా నిధుల సమీకరణకు తమ కంపెనీల్లో ఒకదాన్లో వ్యూహాత్మక వాటా విక్రయించే దిశగా కార్వీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. డీల్ కూడా ఖరారైనట్లు సమాచారం. ‘‘ఈ డీల్‌తో వచ్చే నిధులు పూర్తిగా సరిపోకపోయినా ప్రస్తుతానికి లిక్విడిటీ సమస్య నుంచి గట్టెక్కుతాం’’ అని కార్వీ వర్గాలు పేర్కొన్నాయి. స్టాక్‌బ్రోకింగ్ నుంచి క్లయింట్ల వలసలపై స్పందిస్తూ... ‘‘వలసల ప్రభావం ఉంటుంది. కానీ అది మేం కోలుకోలేనంత స్థాయిలో ఉండకపోవచ్చు. మా వాటా తగ్గుతుంది. కొన్నాళ్ల పాటు విస్తరణ ఉండకపోవచ్చు. కానీ దీన్నుంచి బయటపడతాం’’ అని ఆ వర్గాలు ధీమా వ్యక్తంచేశాయి. సంక్షోభానికి ఆద్యం... ఐఎల్ఎఫ్ఎస్!! అతివేగంగా విస్తరించే ఏ సంస్థయినా... సంక్షోభాలు వచ్చినపుడు సమస్యలు ఎదుర్కోక తప్పదన్నది నిపుణుల మాట. కార్వీ కూడా అలాగే విస్తరించింది. రూ.1.5 లక్షల పెట్టుబడితో 1983లో అయిదుగురు యువ చార్టర్డ్ అకౌంటెంట్లు దీన్ని ఆరంభించారు. రిజిస్ట్రీ సేవల సంస్థగా మొదలై... ఆ తర్వాత రిటైల్ బ్రోకింగ్, డెట్ మార్కెట్, కమోడిటీలు, రియల్టీ, ఆన్లైన్ బ్రోకింగ్ ఇలా పలు విభాగాల్లోకి విస్తరించింది. ప్రస్తుతం ఆయా వ్యాపార విభాగాల్లో టాప్ 5 కంపెనీల్లో ఒకటి. వివిధ మార్గాల్లో 7 కోట్ల మంది ఇన్వెస్టర్లకు, 600 కార్పొరేట్ సంస్థలకు సేవలందిస్తోంది. తాజాగా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంక్షోభం తలెత్తాక కార్వీకి కష్టాలు మొదలయ్యాయి. బ్రోకింగ్ సంస్థలకు తమ క్లయింట్లకు మార్జిన్ ఇవ్వటానికి లిక్విడిటీ అవసరం. అప్పటిదాకా దాదాపు రూ.500 కోట్ల మేర కమర్షియల్ పేపర్లను బ్యాంకుల వద్ద పెట్టి... ఆ మొత్తాన్ని కార్వీ తన లిక్విడిటీ అవసరాలకు వాడుకునేది. ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం తరవాత బ్యాంకులు ఈ కమర్షియల్ పేపర్లకు విముఖత చూపించాయి. దాంతో లిక్విడిటీ సమస్య మొదలైంది. దీనికితోడు కార్వీ కాల్‌సెంటర్ సహా పలు ప్రభుత్వ ప్రాజెక్టులు చేస్తోంది. చంద్రబాబునాయుడి హయాంలో ఏపీ ప్రభుత్వం నుంచి కొంత బకాయిలు రావాల్సి ఉండగా... ఆ కాంట్రాక్టు ఇప్పుడు కూడా కొనసాగుతోంది కనుక కొంత మొత్తం చేతికందినట్లు తెలిసింది. యూపీ ప్రభుత్వ ప్రాజెక్టు నిలిపేయటంతో అక్కడ బకాయిలుండిపోయాయి. ఇలా అన్ని వైపుల నుంచీ కష్టాలు చుట్టుముట్టడంతో లిక్విడిటీ కోసం కార్వీ తన క్లయింట్ల షేర్లను తనఖా పెట్టేది. ‘పూల్’ అకౌంట్లో ఉంటేనే తనఖా!! కార్వీ తన ఇన్వెస్టర్లకు ఎస్ఎంఎస్లు పంపేది. ‘మీ షేర్లను పూల్ అకౌంట్లోకి మళ్లించటం మీకు సమ్మతమేనా?’ అని అడిగేది. అంగీకరించిన వారికి 2.5 శాతం మొత్తం అదనంగా చెల్లిస్తామని చెప్పేది. వద్దన్న వారివి తప్ప మిగతా వారి షేర్లన్నీ పూల్ అకౌంట్లోకి మళ్లించి... వాటిని బ్యాంకుల వద్ద తనఖా పెట్టినట్లు సమాచారం. అయితే బ్యాంకులు కొన్ని కంపెనీల షేర్లనే తనఖా పెట్టుకుంటాయి. వాటిపై కూడా 50–60 శాతాన్నే రుణంగా ఇస్తాయి. కార్వీ ఇప్పటిదాకా ఈ రూపంలో ఎంత రుణం సేకరించిందనే విషయం స్పష్టం కావటం లేదు. ‘‘సెబీ నిబంధనల మేరకు అన్ని బ్రోకింగ్ కంపెనీలూ ఇలా షేర్లను తనఖా పెట్టడం మామూలే. మేమూ అలాగే చేశాం. అక్టోబర్‌లో తనిఖీల సందర్భంగా వద్దని చెప్పాక నిలిపేశాం’’ అని కార్వీ చెబుతోంది. ఇది నియంత్రణ సంస్థల వైఫల్యం కాదా? కార్వీ అవకతవకల్ని అక్టోబర్‌లో సెబీ, ఎక్సే్ఛంజీలు పసిగట్టినపుడు వివిధ ఖాతాల్లో 21 వేల పైచిలుకు అవకతవకలు బయటపడినట్లు సమాచారం. వీటిని సరిదిద్దుకునేందుకు సమయమిచ్చినా కార్వీ కొన్ని షేర్లనే తనఖా నుంచి విడిపించగలిగింది. అందుకే కొత్త క్లయింట్లను తీసుకోరాదని కంపెనీకి సెబీ ఆదేశాలిచ్చింది. మరి, కళ్ల ముందే ఇంత భారీగా అవకతవకలు జరుగుతుంటే నియంత్రణ సంస్థలు, స్టాక్ ఎక్సే్చంజీలు (ఎన్ఎస్ఈ, బీఎస్ఈ), డిపాజిటరీ పార్టిసిపెంట్లు (ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్) ఏం చేసినట్లు? బ్రోకరేజీ సంస్థలు సక్రమంగా లావాదేవీలు జరుపుతున్నాయా లేదా అన్నది తరచూ తనిఖీ చేయడం ఎక్సే్చంజీల బాధ్యత. ఆ బాధ్యతను అవి సక్రమంగా నెరవేరిస్తే ఇలాంటి వాటిని ముందే గుర్తించాలి కదా? డీమ్యాట్ ఖాతాల్లో ఏం జరుగుతోందన్నది డిపాజిటరీ పార్టిసిపెంట్స్‌కి పట్టింపు ఉండటం లేదనే విమర్శలూ ఉన్నాయి. ఇక చిన్న చిన్న రుణాలకు వంద కండీషన్లు పెట్టే బ్యాంకులు.. ఇలాంటి సందర్భాల్లో అసలు ఎవరి షేర్లు.. ఎవరు తనఖా పెడుతున్నారు వంటివేమీ పట్టించుకోకుండా అలా ఎలా ఇచ్చేశాయన్నది మరో ప్రశ్న. నిఘా వ్యవస్థను టెక్నాలజీతో పటిష్టం చేస్తున్నామంటూ చెప్పుకునే సెబీ.. చాన్నాళ్లుగా కార్వీ, ఇతర బ్రోకరేజీ సంస్థల మీద సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను ఎందుకు గుర్తించలే దన్నది మరో విమర్శ. మరి అంతిమంగా ఇన్వెస్టర్లు నష్టపోతే వీటికి బాధ్యత ఎవరిది? -
చెల్లించాల్సింది రూ.25–30 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) తన కస్టమర్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ.25–30 కోట్ల వరకూ ఉంటాయని కార్వీ గ్రూప్ చైర్మన్ సి.పార్థసారథి వెల్లడించారు. వీటిని రెండు వారాలు లేదా అంతకన్నా ముందే చెల్లించేస్తామని ఆయన స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు. ఇవి దాదాపు 150–180 మంది క్లయింట్ల బకాయిలని తెలియజేశారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ నుంచి రియల్ ఎస్టేట్ విభాగానికి నిధులు మళ్లాయన్న ఎన్ఎస్ఈ ఆరోపణల నేపథ్యంలో.. గ్రూప్‌నకు హోల్డింగ్ కంపెనీ కేఎస్‌బీఎల్ కాబట్టే దాన్నుంచి నిధులు బదలాయించినట్లు చెప్పారు. పలు అనుబంధ కంపెనీల్లో కేఎస్‌బీఎల్ పెట్టుబడులున్నాయని గుర్తు చేశారు. కంపెనీ వాదన వినకుండానే సెబీ ఎక్స్‌పార్టీ ఉత్తర్వులు జారీ చేసిందని చెబుతూ... దీనిపై సెబీని సంప్రతిస్తామని తెలిపారు. కేఎస్‌బీఎల్, దాని అనుబంధ కంపెనీలన్నీ లాభాల్లోనే ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. -
క్లయింట్ల తరఫున ట్రేడింగ్‌పై నిషేధం లేదు: కార్వీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త క్లయింట్లను తీసుకోవటంపై మాత్రమే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 21 రోజుల పాటు నిషేధం విధించిందని, ప్రస్తుత క్లయింట్ల తరఫున ట్రేడింగ్ చేయటం, మార్కెట్లలో కార్యకలాపాలు నిర్వహించటం వంటి అంశాల్లో ఎలాంటి నిషేధం లేదంటూ ఆర్థికసేవల సంస్థ ‘కార్వీ’ శనివారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘మా వ్యాపారాల్లో సెబీ, బీఎస్ఈ, ఎన్ఎస్ఈల నియంత్రణలో నడిచే స్టాక్ బ్రోకింగ్ కూడా ఒకటి. దీని పనితీరు, బుక్స్‌ను ఈ సంస్థలు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంటాయి. ఆగస్టులో జరిగిన తనిఖీకి సంబంధించి సెబీకి ఎన్ఎస్ఈ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా ఇన్వెస్టర్ల ప్రయోజనాల దృష్ట్యా 22న సెబీ తాత్కాలిక ఎక్స్‌పార్టీ ఉత్తర్వులిచ్చింది. దీనిపై స్పందించాలని మాకు 21 రోజుల సమయం ఇచ్చింది. అప్పటిదాకా కొత్త క్లయింట్లను తీసుకోరాదని నిషేధించింది. ప్రస్తుత క్లయింట్ల తరఫున కార్యకలాపాలు సాగించటంపై మాత్రం ఎలాంటి నిషేధమూ లేదు’ అని సంస్థ వివరించింది. సంస్థ స్పందించిన అనంతరం దీనిపై మరింత సమగ్రంగా దర్యాప్తు జరిపి తాజా ఉత్తర్వుల్ని సమీక్షిస్తామని సెబీ తెలియజేసినట్లు కార్వీ పేర్కొంది. -
మోడీ ఎఫెక్ట్ మార్కెట్ దారెటు?
* ఎన్డీఏ 260 సీట్లు దాటితేనే మార్కెట్లో ర్యాలీ * 220 వద్ద ఆగిపోతే మార్కెట్ వర్గాలకు నిరాశే * 200 మార్క్ దాటకపోతే పతనమే * 12-18 నెలల్లో నిఫ్టీ లక్ష్యం 7,300-8,700 * కార్వీ స్టాక్ బ్రోకింగ్ నివేదిక హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం మొత్తం ఎన్నికల ఫలితాల కోసం మే 16 వరకు ఎదురు చూడాల్సిందే. ఇప్పుడు అందరి దృష్టీ ఏ కూటమి అధికారంలోకి వస్తుందనే. ఎన్నికల తర్వాత సోమవారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ మంగళవారం మార్కెట్ కదలికలను ప్రభావితం చేయనున్నాయి. మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్న అంచనాతో మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా మంగళవారం మార్కెట్ ఏ విధంగా స్పందించవచ్చు, వాస్తవ ఫలితాలు వెలువడిన తర్వాత మార్కెట్ కదలికలు ఎలా వుండవచ్చు. దీర్ఘకాలంలో మార్కెట్లు ఏ విధంగా ఉంటాయన్న దానిపై రాష్ట్రానికి చెందిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ఒక నివేదిక విడుదల చేసింది. ఆ వివరాలు .... మే 16 వరకు ఆగకుండానే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా మంగళవారం మార్కెట్లు భారీగా స్పందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోమవారం మార్కెట్లు ముగిశాక వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణంగా వుండటంతో మంగళవారం సూచీలు 2-3% గ్యాప్ అప్‌తో ప్రారంభమవుతాయని కార్వీ పేర్కొంది. మే 16న తుది ఫలితాలు విడుదల అయ్యేంతవరకూ నిఫ్టీ 7,000-7,300 శ్రేణిలో కదిలే అవకాశం ఉందని, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీఏ కూటమి తక్కువ సీట్లను పొందితే మాత్రం మార్కెట్లు కుప్పకూలతాయనడంలో సందేహం అక్కర్లేదని స్టాక్ బ్రోకింగ్ కంపెనీ వివరించింది. తుది ఫలితాల తర్వాత ఎన్డీఏ కూటమికి వచ్చే సీట్లు ఆధారంగా మార్కెట్ కదలికలను కార్వీ మూడు విభాగాలుగా విభజించింది. ఎన్డీఏకు 260 దాటితే.... ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 260 కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్న భావనతోనే గత ఫిబ్రవరి నెల నుంచి మార్కెట్లు పరుగులు తీశాయి. వాస్తవ ఫలితాల్లో ఎన్డీఏకు 260 దాటి, పదేసి సీట్లు పెరుగుతున్న కొద్ది మార్కెట్లు మరింత ముందుకు పోతాయి. స్థిరమైన కూటమి అధికారంలోకి రావడమే కాకుండా ఆర్థిక వృద్ధి గాడిలో పెట్టే విధంగా సంస్కరణలు చేపట్టే అవకాశాలు ఉండటం మార్కెట్లకు శక్తినిచ్చే అంశం. ఇదే జరిగితే వచ్చే 6-9 నెలల్లో నిఫ్టీ 15 శాతం లాభాలను అందిస్తుంది. 220 సీట్ల వద్ద ఆగిపోతే... ఎన్డీఏ కూటమి 220 సీట్ల దగ్గర ఆగిపోతే మొదటి సినారియోలోని వారు నిరాశకు గురవుతారు. ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మరికొన్ని పార్టీలతో జతకట్టాల్సి ఉంటుంది. దీంతో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుపై సందేహాలు పెరగడంతో పాటు సంస్కరణల అమలుపై నీలి నీడలు ఏర్పడొచ్చు. ఇలా జరిగితే వచ్చే 3 నెలలు మార్కెట్లు 5% శ్రేణిలో కదలొచ్చు. 200లోపు వస్తే.... ఒకవేళ ఎన్డీఏ కూటమికి 200 సీట్ల కంటే తక్కువ వస్తే అప్పుడు యూపీఏ మద్దతుతో మూడో ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానమంత్రి అభ్యర్థిని వెతకడం దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ గందరగోళంగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో సూచీలు 15 - 20 శాతం క్షీణించే అవకాశం ఉంది. మెజారిటీపై అంచనాలు-షేర్ల తీరు స్టాక్ పేరు ప్రస్తుత ధర 260దాటితే 200లోపైతే ఐసీఐసీఐ బ్యాంక్ 1,399 1,600 1,150 ఎల్అండ్టీ 1,387 1,600 1,100 ఎన్టీపీసీ 121 144 105 ఆర్ఐఎల్ 1,029 1,300 850 టాటా మోటార్స్ 455 500 375 యెస్ బ్యాంక్ 493 550 375 రిలయన్స్ ఇన్ఫ్రా 557 700 450