కార్వీలో వాటా విక్రయం? | Huge Client Migration From Karvy Stock Broking Firm | Sakshi
Sakshi News home page

కార్వీలో వాటా విక్రయం?

Published Wed, Nov 27 2019 12:40 AM | Last Updated on Wed, Nov 27 2019 12:40 AM

Huge Client Migration From Karvy Stock Broking Firm - Sakshi

ప్రతీ ప్రతికూల పరిస్థితి నుంచి అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవచ్చనేది తెలుసుకునేందుకు మా గ్రూప్‌ ఒక కేస్‌ స్టడీ లాంటిది అని కార్వీ తన పోర్టల్‌లో గర్వంగా చెబుతుంది. కానీ, ప్రస్తుత ప్రతికూల
పరిస్థితుల నుంచి ఎలా బైటపడుతుంది.. మళ్లీ ఎలా నిలదొక్కుకుంటుంది.. అన్నది వేచిచూడాలి.

సాక్షి, బిజినెస్‌ విభాగం: ఖాతాదారుల షేర్లను తనఖా పెట్టి... ఆ డబ్బుల్ని ఇతర వ్యాపారాల్లోకి మళ్లించిందనే వ్యవహారంలో కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ సర్వీస్‌ నుంచి క్లయింట్ల వలస మొదలైంది. కొత్త క్లయింట్లను చేర్చుకోరాదని సెబీ ఉత్తర్వులివ్వటంతో... రెండు రోజులుగా ప్రస్తుత క్లయింట్లు పెద్ద సంఖ్యలో నానక్‌రామ్‌గూడలోని కార్వీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి షేర్‌ ట్రాన్స్‌ఫర్‌ స్లిప్పులు తెచ్చుకుంటున్నారు. వాటిని తమ కార్వీ బ్రాంచీలో ఇచ్చి... తమకున్న వేరే డీమ్యాట్‌ ఖాతాకు బదిలీ చేయాలని అడుగుతున్నారు. బదిలీ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తవుతుందని కార్వీ సిబ్బంది చెబుతున్నారు. ఇలా తరలిపోతున్న క్లయింట్ల సంఖ్య భారీగానే ఉండటంతో... ఇది కార్వీ బ్రోకింగ్‌ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రిటైల్‌ బ్రోకరేజీ క్లయింట్లలో 20– 22 శాతం వాటా కార్వీదే. ఇపుడు ఈ వాటా తగ్గనుంది.

వాటా విక్రయానికి అడుగులు? 
నిబంధనలకు విరుద్ధంగా క్లయింట్ల షేర్లను తాకట్టు పెట్టి, ఆ నిధులను సొంత అవసరాలకు వాడుకుందని కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌పై ఆరోపణలు వస్తున్నాయి. తనఖా పెట్టి తెచ్చుకున్న మొత్తం ఎంతనేది ఇప్పటిదాకా స్పష్టంగా బయటకు రాలేదు. ఎన్‌ఎస్‌ఈ తన నివేదికలో... ఇలా తెచ్చిన రూ.1,096 కోట్లను కేఎస్‌బీఎల్‌ తన రియల్టీ విభాగానికి మళ్లించిందని పేర్కొంది. అయితే కంపెనీ దాదాపు రూ. 2,000 కోట్లు పైగా డిఫాల్ట్‌ అయ్యిందనే వార్తలొస్తున్నాయి. కార్వీ మాత్రం ఈ అంకెలన్నీ తప్పంటోంది. ‘‘150–180 మంది క్లయింట్లకే చెల్లింపులు జరపాల్సి ఉంది. బకాయి రూ. 25–30 కోట్లు మాత్రమే’’ అని సంస్థ చైర్మన్‌ సి. పార్థసారథి చెప్పారు.

15 రోజుల్లో దీన్ని చెల్లిస్తామన్నారాయన. ఈలోగా నిధుల సమీకరణకు తమ కంపెనీల్లో ఒకదాన్లో వ్యూహాత్మక వాటా విక్రయించే దిశగా కార్వీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. డీల్‌ కూడా ఖరారైనట్లు  సమాచారం. ‘‘ఈ డీల్‌తో వచ్చే నిధులు పూర్తిగా సరిపోకపోయినా ప్రస్తుతానికి లిక్విడిటీ సమస్య నుంచి గట్టెక్కుతాం’’ అని కార్వీ వర్గాలు పేర్కొన్నాయి. స్టాక్‌బ్రోకింగ్‌ నుంచి క్లయింట్ల వలసలపై స్పందిస్తూ... ‘‘వలసల ప్రభావం ఉంటుంది. కానీ అది మేం కోలుకోలేనంత స్థాయిలో ఉండకపోవచ్చు. మా వాటా తగ్గుతుంది. కొన్నాళ్ల పాటు విస్తరణ ఉండకపోవచ్చు. కానీ దీన్నుంచి బయటపడతాం’’ అని ఆ వర్గాలు ధీమా వ్యక్తంచేశాయి.

సంక్షోభానికి ఆద్యం... ఐఎల్‌ఎఫ్‌ఎస్‌!! 
అతివేగంగా విస్తరించే ఏ సంస్థయినా... సంక్షోభాలు వచ్చినపుడు సమస్యలు ఎదుర్కోక తప్పదన్నది నిపుణుల మాట. కార్వీ కూడా అలాగే విస్తరించింది. రూ.1.5 లక్షల పెట్టుబడితో 1983లో అయిదుగురు యువ చార్టర్డ్‌ అకౌంటెంట్లు దీన్ని ఆరంభించారు. రిజిస్ట్రీ సేవల సంస్థగా మొదలై... ఆ తర్వాత రిటైల్‌ బ్రోకింగ్,  డెట్‌ మార్కెట్, కమోడిటీలు, రియల్టీ, ఆన్‌లైన్‌ బ్రోకింగ్‌ ఇలా పలు విభాగాల్లోకి విస్తరించింది. ప్రస్తుతం ఆయా వ్యాపార విభాగాల్లో టాప్‌ 5 కంపెనీల్లో ఒకటి. వివిధ మార్గాల్లో 7 కోట్ల మంది ఇన్వెస్టర్లకు, 600 కార్పొరేట్‌ సంస్థలకు సేవలందిస్తోంది. తాజాగా ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తలెత్తాక కార్వీకి కష్టాలు మొదలయ్యాయి.

బ్రోకింగ్‌ సంస్థలకు తమ క్లయింట్లకు మార్జిన్‌ ఇవ్వటానికి లిక్విడిటీ అవసరం. అప్పటిదాకా దాదాపు రూ.500 కోట్ల మేర కమర్షియల్‌ పేపర్లను బ్యాంకుల వద్ద పెట్టి... ఆ మొత్తాన్ని కార్వీ తన లిక్విడిటీ అవసరాలకు వాడుకునేది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తరవాత బ్యాంకులు ఈ కమర్షియల్‌ పేపర్లకు విముఖత చూపించాయి. దాంతో లిక్విడిటీ సమస్య మొదలైంది. దీనికితోడు కార్వీ కాల్‌సెంటర్‌ సహా పలు ప్రభుత్వ ప్రాజెక్టులు చేస్తోంది. చంద్రబాబునాయుడి హయాంలో ఏపీ ప్రభుత్వం నుంచి కొంత బకాయిలు రావాల్సి ఉండగా... ఆ కాంట్రాక్టు ఇప్పుడు కూడా కొనసాగుతోంది కనుక కొంత మొత్తం చేతికందినట్లు తెలిసింది. యూపీ ప్రభుత్వ ప్రాజెక్టు నిలిపేయటంతో అక్కడ బకాయిలుండిపోయాయి. ఇలా అన్ని వైపుల నుంచీ కష్టాలు చుట్టుముట్టడంతో లిక్విడిటీ కోసం కార్వీ తన క్లయింట్ల షేర్లను తనఖా పెట్టేది.

‘పూల్‌’ అకౌంట్లో ఉంటేనే తనఖా!! 
కార్వీ తన ఇన్వెస్టర్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపేది. ‘మీ షేర్లను పూల్‌ అకౌంట్లోకి మళ్లించటం మీకు సమ్మతమేనా?’ అని అడిగేది. అంగీకరించిన వారికి 2.5 శాతం మొత్తం అదనంగా చెల్లిస్తామని చెప్పేది. వద్దన్న వారివి తప్ప మిగతా వారి షేర్లన్నీ పూల్‌ అకౌంట్లోకి మళ్లించి... వాటిని బ్యాంకుల వద్ద తనఖా పెట్టినట్లు సమాచారం. అయితే బ్యాంకులు కొన్ని కంపెనీల షేర్లనే తనఖా పెట్టుకుంటాయి. వాటిపై కూడా 50–60 శాతాన్నే రుణంగా ఇస్తాయి. కార్వీ ఇప్పటిదాకా ఈ రూపంలో ఎంత రుణం సేకరించిందనే విషయం స్పష్టం కావటం లేదు. ‘‘సెబీ నిబంధనల మేరకు అన్ని బ్రోకింగ్‌ కంపెనీలూ ఇలా షేర్లను తనఖా పెట్టడం మామూలే. మేమూ అలాగే చేశాం. అక్టోబర్లో తనిఖీల సందర్భంగా వద్దని చెప్పాక నిలిపేశాం’’ అని కార్వీ చెబుతోంది.

ఇది నియంత్రణ సంస్థల వైఫల్యం కాదా?
కార్వీ అవకతవకల్ని అక్టోబర్లో సెబీ, ఎక్సే్ఛంజీలు పసిగట్టినపుడు వివిధ ఖాతాల్లో 21 వేల పైచిలుకు అవకతవకలు బయటపడినట్లు సమాచారం. వీటిని సరిదిద్దుకునేందుకు సమయమిచ్చినా కార్వీ కొన్ని షేర్లనే తనఖా నుంచి విడిపించగలిగింది. అందుకే కొత్త క్లయింట్లను తీసుకోరాదని కంపెనీకి సెబీ ఆదేశాలిచ్చింది. మరి, కళ్ల ముందే ఇంత భారీగా అవకతవకలు జరుగుతుంటే నియంత్రణ సంస్థలు, స్టాక్‌ ఎక్సే్చంజీలు (ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ), డిపాజిటరీ పార్టిసిపెంట్లు (ఎన్‌ఎస్‌డీఎల్, సీడీఎస్‌ఎల్‌) ఏం చేసినట్లు? బ్రోకరేజీ సంస్థలు సక్రమంగా లావాదేవీలు జరుపుతున్నాయా లేదా అన్నది తరచూ తనిఖీ చేయడం ఎక్సే్చంజీల బాధ్యత.

ఆ బాధ్యతను అవి సక్రమంగా నెరవేరిస్తే ఇలాంటి వాటిని ముందే గుర్తించాలి కదా? డీమ్యాట్‌ ఖాతాల్లో ఏం జరుగుతోందన్నది డిపాజిటరీ పార్టిసిపెంట్స్‌కి పట్టింపు ఉండటం లేదనే విమర్శలూ ఉన్నాయి. ఇక చిన్న చిన్న రుణాలకు వంద కండీషన్లు పెట్టే బ్యాంకులు.. ఇలాంటి సందర్భాల్లో అసలు ఎవరి షేర్లు.. ఎవరు తనఖా పెడుతున్నారు వంటివేమీ పట్టించుకోకుండా అలా ఎలా ఇచ్చేశాయన్నది మరో ప్రశ్న. నిఘా వ్యవస్థను టెక్నాలజీతో పటిష్టం చేస్తున్నామంటూ చెప్పుకునే సెబీ.. చాన్నాళ్లుగా కార్వీ, ఇతర బ్రోకరేజీ సంస్థల మీద సోషల్‌ మీడియాలో వస్తున్న ఆరోపణలను ఎందుకు గుర్తించలే దన్నది మరో విమర్శ. మరి అంతిమంగా ఇన్వెస్టర్లు నష్టపోతే వీటికి బాధ్యత ఎవరిది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement