pardhasardhi
-
కార్వీలో వాటా విక్రయం?
ప్రతీ ప్రతికూల పరిస్థితి నుంచి అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవచ్చనేది తెలుసుకునేందుకు మా గ్రూప్ ఒక కేస్ స్టడీ లాంటిది అని కార్వీ తన పోర్టల్‌లో గర్వంగా చెబుతుంది. కానీ, ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నుంచి ఎలా బైటపడుతుంది.. మళ్లీ ఎలా నిలదొక్కుకుంటుంది.. అన్నది వేచిచూడాలి. సాక్షి, బిజినెస్ విభాగం: ఖాతాదారుల షేర్లను తనఖా పెట్టి... ఆ డబ్బుల్ని ఇతర వ్యాపారాల్లోకి మళ్లించిందనే వ్యవహారంలో కార్వీ స్టాక్‌బ్రోకింగ్ సర్వీస్ నుంచి క్లయింట్ల వలస మొదలైంది. కొత్త క్లయింట్లను చేర్చుకోరాదని సెబీ ఉత్తర్వులివ్వటంతో... రెండు రోజులుగా ప్రస్తుత క్లయింట్లు పెద్ద సంఖ్యలో నానక్‌రామ్‌గూడలోని కార్వీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి షేర్ ట్రాన్స్ఫర్ స్లిప్పులు తెచ్చుకుంటున్నారు. వాటిని తమ కార్వీ బ్రాంచీలో ఇచ్చి... తమకున్న వేరే డీమ్యాట్ ఖాతాకు బదిలీ చేయాలని అడుగుతున్నారు. బదిలీ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తవుతుందని కార్వీ సిబ్బంది చెబుతున్నారు. ఇలా తరలిపోతున్న క్లయింట్ల సంఖ్య భారీగానే ఉండటంతో... ఇది కార్వీ బ్రోకింగ్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రిటైల్ బ్రోకరేజీ క్లయింట్లలో 20– 22 శాతం వాటా కార్వీదే. ఇపుడు ఈ వాటా తగ్గనుంది. వాటా విక్రయానికి అడుగులు? నిబంధనలకు విరుద్ధంగా క్లయింట్ల షేర్లను తాకట్టు పెట్టి, ఆ నిధులను సొంత అవసరాలకు వాడుకుందని కార్వీ స్టాక్ బ్రోకింగ్‌పై ఆరోపణలు వస్తున్నాయి. తనఖా పెట్టి తెచ్చుకున్న మొత్తం ఎంతనేది ఇప్పటిదాకా స్పష్టంగా బయటకు రాలేదు. ఎన్ఎస్ఈ తన నివేదికలో... ఇలా తెచ్చిన రూ.1,096 కోట్లను కేఎస్‌బీఎల్ తన రియల్టీ విభాగానికి మళ్లించిందని పేర్కొంది. అయితే కంపెనీ దాదాపు రూ. 2,000 కోట్లు పైగా డిఫాల్ట్ అయ్యిందనే వార్తలొస్తున్నాయి. కార్వీ మాత్రం ఈ అంకెలన్నీ తప్పంటోంది. ‘‘150–180 మంది క్లయింట్లకే చెల్లింపులు జరపాల్సి ఉంది. బకాయి రూ. 25–30 కోట్లు మాత్రమే’’ అని సంస్థ చైర్మన్ సి. పార్థసారథి చెప్పారు. 15 రోజుల్లో దీన్ని చెల్లిస్తామన్నారాయన. ఈలోగా నిధుల సమీకరణకు తమ కంపెనీల్లో ఒకదాన్లో వ్యూహాత్మక వాటా విక్రయించే దిశగా కార్వీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. డీల్ కూడా ఖరారైనట్లు సమాచారం. ‘‘ఈ డీల్‌తో వచ్చే నిధులు పూర్తిగా సరిపోకపోయినా ప్రస్తుతానికి లిక్విడిటీ సమస్య నుంచి గట్టెక్కుతాం’’ అని కార్వీ వర్గాలు పేర్కొన్నాయి. స్టాక్‌బ్రోకింగ్ నుంచి క్లయింట్ల వలసలపై స్పందిస్తూ... ‘‘వలసల ప్రభావం ఉంటుంది. కానీ అది మేం కోలుకోలేనంత స్థాయిలో ఉండకపోవచ్చు. మా వాటా తగ్గుతుంది. కొన్నాళ్ల పాటు విస్తరణ ఉండకపోవచ్చు. కానీ దీన్నుంచి బయటపడతాం’’ అని ఆ వర్గాలు ధీమా వ్యక్తంచేశాయి. సంక్షోభానికి ఆద్యం... ఐఎల్ఎఫ్ఎస్!! అతివేగంగా విస్తరించే ఏ సంస్థయినా... సంక్షోభాలు వచ్చినపుడు సమస్యలు ఎదుర్కోక తప్పదన్నది నిపుణుల మాట. కార్వీ కూడా అలాగే విస్తరించింది. రూ.1.5 లక్షల పెట్టుబడితో 1983లో అయిదుగురు యువ చార్టర్డ్ అకౌంటెంట్లు దీన్ని ఆరంభించారు. రిజిస్ట్రీ సేవల సంస్థగా మొదలై... ఆ తర్వాత రిటైల్ బ్రోకింగ్, డెట్ మార్కెట్, కమోడిటీలు, రియల్టీ, ఆన్లైన్ బ్రోకింగ్ ఇలా పలు విభాగాల్లోకి విస్తరించింది. ప్రస్తుతం ఆయా వ్యాపార విభాగాల్లో టాప్ 5 కంపెనీల్లో ఒకటి. వివిధ మార్గాల్లో 7 కోట్ల మంది ఇన్వెస్టర్లకు, 600 కార్పొరేట్ సంస్థలకు సేవలందిస్తోంది. తాజాగా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంక్షోభం తలెత్తాక కార్వీకి కష్టాలు మొదలయ్యాయి. బ్రోకింగ్ సంస్థలకు తమ క్లయింట్లకు మార్జిన్ ఇవ్వటానికి లిక్విడిటీ అవసరం. అప్పటిదాకా దాదాపు రూ.500 కోట్ల మేర కమర్షియల్ పేపర్లను బ్యాంకుల వద్ద పెట్టి... ఆ మొత్తాన్ని కార్వీ తన లిక్విడిటీ అవసరాలకు వాడుకునేది. ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం తరవాత బ్యాంకులు ఈ కమర్షియల్ పేపర్లకు విముఖత చూపించాయి. దాంతో లిక్విడిటీ సమస్య మొదలైంది. దీనికితోడు కార్వీ కాల్‌సెంటర్ సహా పలు ప్రభుత్వ ప్రాజెక్టులు చేస్తోంది. చంద్రబాబునాయుడి హయాంలో ఏపీ ప్రభుత్వం నుంచి కొంత బకాయిలు రావాల్సి ఉండగా... ఆ కాంట్రాక్టు ఇప్పుడు కూడా కొనసాగుతోంది కనుక కొంత మొత్తం చేతికందినట్లు తెలిసింది. యూపీ ప్రభుత్వ ప్రాజెక్టు నిలిపేయటంతో అక్కడ బకాయిలుండిపోయాయి. ఇలా అన్ని వైపుల నుంచీ కష్టాలు చుట్టుముట్టడంతో లిక్విడిటీ కోసం కార్వీ తన క్లయింట్ల షేర్లను తనఖా పెట్టేది. ‘పూల్’ అకౌంట్లో ఉంటేనే తనఖా!! కార్వీ తన ఇన్వెస్టర్లకు ఎస్ఎంఎస్లు పంపేది. ‘మీ షేర్లను పూల్ అకౌంట్లోకి మళ్లించటం మీకు సమ్మతమేనా?’ అని అడిగేది. అంగీకరించిన వారికి 2.5 శాతం మొత్తం అదనంగా చెల్లిస్తామని చెప్పేది. వద్దన్న వారివి తప్ప మిగతా వారి షేర్లన్నీ పూల్ అకౌంట్లోకి మళ్లించి... వాటిని బ్యాంకుల వద్ద తనఖా పెట్టినట్లు సమాచారం. అయితే బ్యాంకులు కొన్ని కంపెనీల షేర్లనే తనఖా పెట్టుకుంటాయి. వాటిపై కూడా 50–60 శాతాన్నే రుణంగా ఇస్తాయి. కార్వీ ఇప్పటిదాకా ఈ రూపంలో ఎంత రుణం సేకరించిందనే విషయం స్పష్టం కావటం లేదు. ‘‘సెబీ నిబంధనల మేరకు అన్ని బ్రోకింగ్ కంపెనీలూ ఇలా షేర్లను తనఖా పెట్టడం మామూలే. మేమూ అలాగే చేశాం. అక్టోబర్‌లో తనిఖీల సందర్భంగా వద్దని చెప్పాక నిలిపేశాం’’ అని కార్వీ చెబుతోంది. ఇది నియంత్రణ సంస్థల వైఫల్యం కాదా? కార్వీ అవకతవకల్ని అక్టోబర్‌లో సెబీ, ఎక్సే్ఛంజీలు పసిగట్టినపుడు వివిధ ఖాతాల్లో 21 వేల పైచిలుకు అవకతవకలు బయటపడినట్లు సమాచారం. వీటిని సరిదిద్దుకునేందుకు సమయమిచ్చినా కార్వీ కొన్ని షేర్లనే తనఖా నుంచి విడిపించగలిగింది. అందుకే కొత్త క్లయింట్లను తీసుకోరాదని కంపెనీకి సెబీ ఆదేశాలిచ్చింది. మరి, కళ్ల ముందే ఇంత భారీగా అవకతవకలు జరుగుతుంటే నియంత్రణ సంస్థలు, స్టాక్ ఎక్సే్చంజీలు (ఎన్ఎస్ఈ, బీఎస్ఈ), డిపాజిటరీ పార్టిసిపెంట్లు (ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్) ఏం చేసినట్లు? బ్రోకరేజీ సంస్థలు సక్రమంగా లావాదేవీలు జరుపుతున్నాయా లేదా అన్నది తరచూ తనిఖీ చేయడం ఎక్సే్చంజీల బాధ్యత. ఆ బాధ్యతను అవి సక్రమంగా నెరవేరిస్తే ఇలాంటి వాటిని ముందే గుర్తించాలి కదా? డీమ్యాట్ ఖాతాల్లో ఏం జరుగుతోందన్నది డిపాజిటరీ పార్టిసిపెంట్స్‌కి పట్టింపు ఉండటం లేదనే విమర్శలూ ఉన్నాయి. ఇక చిన్న చిన్న రుణాలకు వంద కండీషన్లు పెట్టే బ్యాంకులు.. ఇలాంటి సందర్భాల్లో అసలు ఎవరి షేర్లు.. ఎవరు తనఖా పెడుతున్నారు వంటివేమీ పట్టించుకోకుండా అలా ఎలా ఇచ్చేశాయన్నది మరో ప్రశ్న. నిఘా వ్యవస్థను టెక్నాలజీతో పటిష్టం చేస్తున్నామంటూ చెప్పుకునే సెబీ.. చాన్నాళ్లుగా కార్వీ, ఇతర బ్రోకరేజీ సంస్థల మీద సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను ఎందుకు గుర్తించలే దన్నది మరో విమర్శ. మరి అంతిమంగా ఇన్వెస్టర్లు నష్టపోతే వీటికి బాధ్యత ఎవరిది? -
వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్
సాక్షి, విజయవాడ : రైతులకు సాగునీరు అందించాలని ఇరిగేషన్ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. జిల్లాలో ఎండిపోతున్న పంటలకు నీళ్లు ఇవ్వాలని ఎస్ఈకి వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరిన పార్థసారధి, జోగి రమేష్‌లను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్ట్‌లపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కనీసం వినతి పత్రం కూడా ఇవ్వకుండా పోలీసులను పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు నీళ్లు ఇవ్వలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైఎస్సార్సీపీ నేత పార్ధసారధి విమర్శించారు. రైతుల పంటలకు నీళ్లు ఇవ్వమని అడిగితే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు రోడ్ల మీద కూడా తిరగని పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు. ఆగస్ట్ నెల వచ్చినా రైతుల పొలాల్లో నీళ్లు లేవని, జల వనరుల శాఖ మంత్రి దేవిదేవి ఉమామహేశ్వరరావు అసమర్ధుడని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు విజయవాడలో కార్యాలయంలో కూర్చుని గొప్పలు చెప్పుకుంటున్నారని, రైతుల సమస్యలు మాత్రం పట్టించుకోవట్లేదని పార్టీ నేత జోగి రమేష్ ఆరోపించారు. వైసీపీ నేతల ఆందోళన.. అక్రమంగా అరెస్ట్ చేసిన పార్థసారధి, జోగి రమేశ్‌లతో పాటు రైతులను విడుదల చేయాలని వైసీపీ నేతలు గన్నవరం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. -
బాబుకు హోదాపై చిత్తశుద్ధి లేదు: వైఎస్సార్సీపీ
విజయవాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిథి, మచిలీపట్నం జిల్లా అధ్యక్షుడు కె. పార్థసారథి వ్యాఖ్యానించారు. విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్‌లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్థసారధి మాట్లాడుతూ..ప్రత్యేక హోదా కోసం పోరాడే ప్రతి సంస్ధకు వైఎస్ఆర్సీపీ మద్ధుతు ఇచ్చిందని తెలిపారు. పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామా చేసేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధపడిందని వ్యాఖ్యానించారు. మరి చంద్రబాబుకు హోదాపై పోరాడే ధైర్యం ఎందుకు లేకుండా పోయిందని ప్రశ్నించారు. కేంద్రం ముందు చంద్రబాబు సాగిలపడుతున్నారని, కేంద్రం మోసం చేసిందంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. హోదా ఇవ్వడానికి వీలులేదన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారు? అని సూటిగా ప్రశ్నించారు. ‘పదకొండు రాష్ట్రాలకు హోదా కొనసాగిస్తామని కేంద్రం చెప్పినప్పుడు చంద్రబాబు ఏం చేశారు? అవిశ్వాసం పెడదామంటే..ఏం ఒరుగుతుందని చంద్రబాబు అనలేదా? రాజీనామాలు చేద్దామంటే...మీరెందుకు ముందుకు రారు.’ అని అన్నారు. బీజేపీతో కలవాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీకి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మేకా ప్రతాప్ అప్పారావు, రక్షణనిధి కూడా పాల్గొన్నారు. మేకా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. ముస్లిం మైనారిటీలు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమిస్తున్నారని వ్యాఖ్యానించారు. అధికారంలో వున్న చంద్రబాబుకు మాత్రం ప్రత్యేక హోదా పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడమీద పిల్లిలా రాజకీయ పొత్తుల కోసం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారే తప్ప చిత్తశుద్ధితో పోరాటం చేయటంలేదని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజకీయ లబ్దిపొందారని, ఇప్పుడు అవసరం తీరగానే బీజేపీని వదిలి కొత్త మిత్రులను వెతుక్కుంటున్నారని విమర్శించారు. అటువంటి చంద్రబాబుకు, వైఎస్ జగన్‌ని విమర్శించే అర్హత లేదన్నారు. ఇంకా బీజేపీతో చంద్రబాబు లాలూచీ నడుస్తోందని, ఎంపీలతో రాజీనామా చేయమని ప్రజలు కోరుతుంటే..చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలను మైనారిటీలే కాదు..ఏ వర్గం కూడా నమ్మేపరిస్థితి లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రక్షణ నిథి మాట్లాడుతూ..ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని గతంలో చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ హోదా కోసం చేస్తున్న పోరాటం చూసి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను పార్టీ మారాలంటూ ప్రలోభాలు పెట్టారని, మంత్రి పదవి కోసం పార్టీ ఫిరాయించిన జలీల్ ఖాన్‌కు చివరికి దక్కింది వక్ఫ్ బోర్డు పదవి అని, చంద్రబాబు మోసాలు ఇలాగే ఉంటాయని చెప్పారు. -
‘ఉపాధి’ చట్టానికి చంద్రబాబు తూట్లు
విజయవాడ: తన కాంట్రాక్టర్లు, టీడీపీ నేతల జేబులు నింపేందుకుగాను సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. శుక్రవారమిక్కడ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ఉపాధి పనుల్లేక ప్రజలు పొట్టచేతపట్టుకుని దూరప్రాంతాలకు వలస పోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఉపాధి హామీ పథకంతో పేదలు గౌరవంగా బతికేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేస్తే.. చంద్రబాబు మాత్రం పేదల పొట్టగొడుతూ ని«ధుల్ని పచ్చచొక్కాలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తూనే 2014 ఆగస్టు 12న ‘ఉపాధి’ పథకం పనులన్నీ నిలిపేయమని చెప్పిన ఘనుడని దుయ్యబట్టారు. ఆరోజు ‘ఉపాధి’ పథకం తీరుతెన్నులపై ఐఏఎస్‌లతో కమిటీ వేసి.. నిధులు దుర్వినియోగమయ్యాయని చెప్పింది వాస్తవం కాదా? అని నిలదీశారు. ‘ఉపాధి’ పథకం నిధులు దుర్వినియోగమవుతున్నాయని వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేస్తే.. నిధులు రాకుండా ప్రతిపక్షం అడ్డుపడుతోందని చంద్రబాబు నానా యాగీ చేయడం విడ్డూరమన్నారు. ఉపాధి పనుల్లో రూ.146 కోట్ల అవినీతి జరిగిందని కాగ్ ఇచ్చిన నివేదికపై ఏం చెబుతారని ప్రశ్నించారు. కాగ్ రిపోర్టు కూడా వైఎస్సార్సీపీనే రాసిందని చెబుతారా? అని ఎద్దేవా చేశారు. 2016 సంవత్సరానికి సంబంధించి ‘ఉపాధి’ పనుల్లో రూ.350 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్టు ఓ పత్రికలో వచ్చిన వార్తను ఆయన చూపిస్తూ... వాళ్లు రాస్తే ఏమి అన్పించదుగానీ, మేం మీ తప్పుల్ని ఎత్తిచూపితే అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ పాట పాడతారా? అని దుయ్యబట్టారు. 10 లక్షలమంది వలస.. గౌరవంగా బతికిన పదెకరాల రైతులు కూడా చంద్రబాబు పాలనలో పనుల్లేక వలసలు పోతున్నారని పార్థసారథి ఆందోళన వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలో 10 లక్షలమంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని పత్రికల్లో వస్తుంటే.. దానిని ఆపేందుకు ఎందుకు ప్రయత్నించట్లేదని నిలదీశారు. ఇదే అంశంపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో తమ నాయకుడు నిలదీశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 13 లక్షల ఇళ్లను ఉపాధి హామీ పథకం కింద కట్టుకునేందుకు అవకాశమొస్తే వాటినీ నిలుపుదల చేశారని మండిపడ్డారు. ‘ఉపాధి హామీ’ పథకంలో జరిగిన అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ వేసి టీడీపీ తన సచ్ఛీలతను నిరూపించుకోవాలని ఆయన సవాలు విసిరారు. సొంత కేడర్‌ను పెంచుకోలేక.. టీడీపీ సొంత కేడర్‌ను పెంచుకోలేక పక్క పార్టీల నుంచి వలసలు వచ్చేవారికోసం గుంటకాడ నక్కల్లా సూట్‌కేసులు పట్టుకుని తిరుగుతున్నారని ఆయన దుయ్యబట్టారు. వారి పార్టీని బలోపేతం చేసుకోవడం చేతగాక.. పక్కపార్టీల నుంచి లాక్కోవాలని చూస్తున్నారన్నారు. తమ పార్టీ నుంచి టీడీపీలోకి వలస వెళ్లేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నగర అధికార ప్రతినిధి మనోజ్ కోటారితోపాటు కర్నాటి రాంబాబు, దొడ్డ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భూసేకరణ ఆర్డినెన్స్ పై కేంద్రమే పునరాలోచిస్తుంటే..
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల గొంతుమీద ఆర్డినెన్స్ అనే కత్తి పెడుతున్నారని వైఎస్సార్ సీపీ మండిపడింది. భూసేకరణ పేరుతో చంద్రబాబు తన రాక్షస మనస్తత్వాన్ని మరోసారి బయటపెట్టుకుంటున్నారని వైఎస్సార్ సీపీ నేత పార్ధసారథి విమర్శించారు. భూసేకరణ ఆర్డినెన్స్ పై కేంద్రమే పునరాలోచనలో పడితే.. చంద్రబాబు మాత్రం తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. భూసేకరణ ఆర్డినెన్స్ పై పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి కేంద్రమే మల్లగుల్లాలు పడుతుంటే.. చంద్రబాబు సర్కారు మాత్రం రైతుల మెడపై కత్తి పెడుతూ భూములు లాక్కొంటుందని ఆయన ఎద్దేవా చేశారు. దీనిపై కేంద్రం, గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
భూసేకరణ ఆర్డినెన్స్ పై కేంద్రమే పునరాలోచిస్తుంటే..