
విజయవాడ: తన కాంట్రాక్టర్లు, టీడీపీ నేతల జేబులు నింపేందుకుగాను సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. శుక్రవారమిక్కడ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ఉపాధి పనుల్లేక ప్రజలు పొట్టచేతపట్టుకుని దూరప్రాంతాలకు వలస పోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఉపాధి హామీ పథకంతో పేదలు గౌరవంగా బతికేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేస్తే.. చంద్రబాబు మాత్రం పేదల పొట్టగొడుతూ ని«ధుల్ని పచ్చచొక్కాలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తూనే 2014 ఆగస్టు 12న ‘ఉపాధి’ పథకం పనులన్నీ నిలిపేయమని చెప్పిన ఘనుడని దుయ్యబట్టారు.
ఆరోజు ‘ఉపాధి’ పథకం తీరుతెన్నులపై ఐఏఎస్‌లతో కమిటీ వేసి.. నిధులు దుర్వినియోగమయ్యాయని చెప్పింది వాస్తవం కాదా? అని నిలదీశారు. ‘ఉపాధి’ పథకం నిధులు దుర్వినియోగమవుతున్నాయని వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేస్తే.. నిధులు రాకుండా ప్రతిపక్షం అడ్డుపడుతోందని చంద్రబాబు నానా యాగీ చేయడం విడ్డూరమన్నారు. ఉపాధి పనుల్లో రూ.146 కోట్ల అవినీతి జరిగిందని కాగ్ ఇచ్చిన నివేదికపై ఏం చెబుతారని ప్రశ్నించారు. కాగ్ రిపోర్టు కూడా వైఎస్సార్‌సీపీనే రాసిందని చెబుతారా? అని ఎద్దేవా చేశారు. 2016 సంవత్సరానికి సంబంధించి ‘ఉపాధి’ పనుల్లో రూ.350 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్టు ఓ పత్రికలో వచ్చిన వార్తను ఆయన చూపిస్తూ... వాళ్లు రాస్తే ఏమి అన్పించదుగానీ, మేం మీ తప్పుల్ని ఎత్తిచూపితే అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ పాట పాడతారా? అని దుయ్యబట్టారు.
10 లక్షలమంది వలస..
గౌరవంగా బతికిన పదెకరాల రైతులు కూడా చంద్రబాబు పాలనలో పనుల్లేక వలసలు పోతున్నారని పార్థసారథి ఆందోళన వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలో 10 లక్షలమంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని పత్రికల్లో వస్తుంటే.. దానిని ఆపేందుకు ఎందుకు ప్రయత్నించట్లేదని నిలదీశారు. ఇదే అంశంపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో తమ నాయకుడు నిలదీశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 13 లక్షల ఇళ్లను ఉపాధి హామీ పథకం కింద కట్టుకునేందుకు అవకాశమొస్తే వాటినీ నిలుపుదల చేశారని మండిపడ్డారు. ‘ఉపాధి హామీ’ పథకంలో జరిగిన అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ వేసి టీడీపీ తన సచ్ఛీలతను నిరూపించుకోవాలని ఆయన సవాలు విసిరారు.
సొంత కేడర్‌ను పెంచుకోలేక..
టీడీపీ సొంత కేడర్‌ను పెంచుకోలేక పక్క పార్టీల నుంచి వలసలు వచ్చేవారికోసం గుంటకాడ నక్కల్లా సూట్‌కేసులు పట్టుకుని తిరుగుతున్నారని ఆయన దుయ్యబట్టారు. వారి పార్టీని బలోపేతం చేసుకోవడం చేతగాక.. పక్కపార్టీల నుంచి లాక్కోవాలని చూస్తున్నారన్నారు. తమ పార్టీ నుంచి టీడీపీలోకి వలస వెళ్లేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నగర అధికార ప్రతినిధి మనోజ్ కోటారితోపాటు కర్నాటి రాంబాబు, దొడ్డ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment