మోడీ ఎఫెక్ట్ మార్కెట్ దారెటు?
* ఎన్‌డీఏ 260 సీట్లు దాటితేనే మార్కెట్లో ర్యాలీ
* 220 వద్ద ఆగిపోతే మార్కెట్ వర్గాలకు నిరాశే
* 200 మార్క్ దాటకపోతే పతనమే
* 12-18 నెలల్లో నిఫ్టీ లక్ష్యం 7,300-8,700
* కార్వీ స్టాక్ బ్రోకింగ్ నివేదిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం మొత్తం ఎన్నికల ఫలితాల కోసం మే 16 వరకు ఎదురు చూడాల్సిందే. ఇప్పుడు అందరి దృష్టీ ఏ కూటమి అధికారంలోకి వస్తుందనే. ఎన్నికల తర్వాత సోమవారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ మంగళవారం మార్కెట్ కదలికలను ప్రభావితం చేయనున్నాయి. మోడీ నేతృత్వంలో ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్న అంచనాతో మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా మంగళవారం మార్కెట్ ఏ విధంగా స్పందించవచ్చు, వాస్తవ ఫలితాలు వెలువడిన తర్వాత మార్కెట్ కదలికలు ఎలా వుండవచ్చు. దీర్ఘకాలంలో మార్కెట్లు ఏ విధంగా ఉంటాయన్న దానిపై రాష్ట్రానికి చెందిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ఒక నివేదిక విడుదల చేసింది.
ఆ వివరాలు ....
మే 16 వరకు ఆగకుండానే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా మంగళవారం మార్కెట్లు భారీగా స్పందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోమవారం మార్కెట్లు ముగిశాక వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణంగా వుండటంతో మంగళవారం సూచీలు 2-3% గ్యాప్ అప్‌తో ప్రారంభమవుతాయని కార్వీ పేర్కొంది. మే 16న తుది ఫలితాలు విడుదల అయ్యేంతవరకూ నిఫ్టీ 7,000-7,300 శ్రేణిలో కదిలే అవకాశం ఉందని, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్‌డీఏ కూటమి తక్కువ సీట్లను పొందితే మాత్రం మార్కెట్లు కుప్పకూలతాయనడంలో సందేహం అక్కర్లేదని స్టాక్ బ్రోకింగ్ కంపెనీ వివరించింది. తుది ఫలితాల తర్వాత ఎన్‌డీఏ కూటమికి వచ్చే సీట్లు ఆధారంగా మార్కెట్ కదలికలను కార్వీ మూడు విభాగాలుగా విభజించింది.
ఎన్‌డీఏకు 260 దాటితే....
ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమికి 260 కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్న భావనతోనే గత ఫిబ్రవరి నెల నుంచి మార్కెట్లు పరుగులు తీశాయి. వాస్తవ ఫలితాల్లో ఎన్‌డీఏకు 260 దాటి, పదేసి సీట్లు పెరుగుతున్న కొద్ది మార్కెట్లు మరింత ముందుకు పోతాయి. స్థిరమైన కూటమి అధికారంలోకి రావడమే కాకుండా ఆర్థిక వృద్ధి గాడిలో పెట్టే విధంగా సంస్కరణలు చేపట్టే అవకాశాలు ఉండటం మార్కెట్లకు శక్తినిచ్చే అంశం. ఇదే జరిగితే వచ్చే 6-9 నెలల్లో నిఫ్టీ 15 శాతం లాభాలను అందిస్తుంది.
220 సీట్ల వద్ద ఆగిపోతే...
ఎన్‌డీఏ కూటమి 220 సీట్ల దగ్గర ఆగిపోతే మొదటి సినారియోలోని వారు నిరాశకు గురవుతారు. ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మరికొన్ని పార్టీలతో జతకట్టాల్సి ఉంటుంది. దీంతో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుపై సందేహాలు పెరగడంతో పాటు సంస్కరణల అమలుపై నీలి నీడలు ఏర్పడొచ్చు. ఇలా జరిగితే వచ్చే 3 నెలలు మార్కెట్లు 5% శ్రేణిలో కదలొచ్చు.
200లోపు వస్తే....
ఒకవేళ ఎన్‌డీఏ కూటమికి 200 సీట్ల కంటే తక్కువ వస్తే అప్పుడు యూపీఏ మద్దతుతో మూడో ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానమంత్రి అభ్యర్థిని వెతకడం దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ గందరగోళంగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో సూచీలు 15 - 20 శాతం క్షీణించే అవకాశం ఉంది.
మెజారిటీపై అంచనాలు-షేర్ల తీరు
స్టాక్ పేరు ప్రస్తుత ధర 260దాటితే 200లోపైతే
ఐసీఐసీఐ బ్యాంక్ 1,399 1,600 1,150
ఎల్‌అండ్‌టీ 1,387 1,600 1,100
ఎన్‌టీపీసీ 121 144 105
ఆర్‌ఐఎల్ 1,029 1,300 850
టాటా మోటార్స్ 455 500 375
యెస్ బ్యాంక్ 493 550 375
రిలయన్స్ ఇన్‌ఫ్రా 557 700 450