ముంబై/హైదరాబాద్ బిజినెస్ బ్యూరో: క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి ఆ సొమ్మును సొంత అవసరాలకు వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియంత్రణ సంస్థ ఎన్నడూ అనుమతించని కార్యకలాపాలన్నింటినీ కార్వీ సాగించిందని వ్యాఖ్యానించారు. ‘ఇలాంటి లావాదేవీలు జరపరాదంటూ విస్పష్టమైన సర్క్యులర్ జూన్‌లోనే ఇచ్చాం. అయితే గతంలో కూడా వీటికి అనుమతి లేదు.
కార్వీ మాత్రం ప్రాథమికంగా అనుమతించని పనులన్నీ చేసింది. నిబంధనల్లో ప్రత్యేకంగా లేదు కాబట్టి క్లయింట్ల షేర్లను సొంతానికి వాడేసుకుంటామంటే కుదరదు’ అని త్యాగి స్పష్టం చేశారు. కార్పొరేట్ గవర్నెన్స్‌పై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) నిర్వహించిన ఆసియా రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్వీ గతంలోనూ ఇలాంటివి చేసిందని చెప్పిన త్యాగి... గతంలో తమ ఆడిట్లలో వీటిని ఎందుకు బయటపెట్టలేకపోయామన్నది మాత్రం చెప్పలేదు.
ఎన్‌ఎస్‌ఈ, సెబీతో బ్యాంకర్ల చర్చలు..
కార్వీ స్టాక్ బ్రోకింగ్ ఖాతాల్ని ఫోరెన్సిక్ ఆడిట్ చేసేందుకు ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) సంస్థను నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్‌ఎస్‌ఈ) నియమించినట్లు సమాచారం. మరోవైపు, కార్వీకి రుణాలు ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల్లో ఆందోళన పెరుగుతోంది. సెబీ ఉత్తర్వుల్లో రియల్ ఎస్టేట్ లావాదేవీల ప్రస్తావన కూడా ఉండటంతో దీనిపై అవి మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య తీవ్రత, కార్వీకి చెందిన కంపెనీలేమైనా డిఫాల్ట్ అయ్యే అవకాశాలున్నా యా అన్న విషయాల గురించి తెలుసుకునేందుకు ఎన్‌ఎస్‌ఈ, సెబీతో అవి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి కార్వీ సుమారు రూ. 600 కోట్ల మేర నిధులు తీసుకున్నట్లు తెలియవచ్చింది.
అంతా సర్దుకుంటుంది
కీలక ఉద్యోగులకు కార్వీ చీఫ్ లేఖ
ఈ సమస్య నుంచి సత్వరమే బయటపడగలమని కార్వీ గ్రూప్ చైర్మన్ సి.పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు. తనఖాలో ఉన్న షేర్లను త్వరలోనే విడిపిస్తామని, క్లయింట్లకు కూడా చెల్లింపులు జరిపేస్తామని పేర్కొంటూ సంస్థ కీలక ఉద్యోగులకు బుధవారం ఆయనో లేఖ రాసినట్లు తెలిసింది. గరిష్ఠంగా రెండు వారాల్లో చెల్లింపులు పూర్తిచేస్తామని కొద్దిరోజులుగా చెబుతున్న ఆయన... ఈ లేఖలో కూడా అదే విషయాన్ని పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.
చేయకూడనివన్నీ చేసింది..
Published Thu, Nov 28 2019 4:31 AM | Last Updated on Thu, Nov 28 2019 8:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment