OECD report
-
ప్రపంచ దేశాల్లో రుణ సంక్షోభం.. పన్ను ఎగవేతలను అరికట్టాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, రుణ సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపత్యంలో పన్ను ఎగవేతలను, అక్రమ నిధుల ప్రవాహానికి (ఐఎఫ్ఎఫ్) అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఓఈసీడీ ఒక నివేదికలో తెలిపింది. ముఖ్యంగా ఆసియా దేశాలు ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇలాంటి వాటివల్ల 2016లో 25 బిలియన్ యూరోల మేర నష్టం వాటిల్లిందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) తెలిపింది. ఒక అధ్యయనం ప్రకారం ఆసియా ఆర్థిక సంపదలో దాదాపు నాలుగు శాతం (సుమారు 1.2 ట్రిలియన్ యూరోలు) విదేశాల్లో చిక్కుబడి ఉందని ’ఆసియాలో పన్నులపరమైన పారదర్శకత 2023’ పేరిట రూపొందించిన నివేదికలో వివరించింది. దీనివల్ల 2016లో ఆసియా ప్రాంత దేశాలకు వార్షికంగా 25 బిలియన్ యూరోల మేర నష్టం వాటిల్లి ఉంటుందని పేర్కొంది. పన్నుల విషయంలో పారదర్శకత పాటించేందుకు, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఏర్పాటైన గ్లోబల్ ఫోరం సమావేశం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ గ్లోబల్ ఫోరంలో 167 దేశాలకు సభ్యత్వం ఉంది. నివేదికలో మరిన్ని విశేషాలు.. ►కోవిడ్–19 మహమ్మారి, తదనంతర భౌగోళిక రాజకీయ సంక్షోభాల వల్ల ఆర్థిక వృద్ధి మందగించింది. ప్రజారోగ్యం, సామాజిక.. ఆర్థికపరమైన మద్దతు కల్పించేందుకు ప్రభుత్వాలు మరింతగా వెచ్చించాల్సి వస్తోంది. ►ప్రస్తుతం పన్నులపరమైన ఆదాయాలు తగ్గి, దేశాల ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఇక రుణ భారం, వడ్డీ రేట్లు పెరిగిపోతుండటం, వర్ధమాన దేశాల్లో వడ్డీలు చెల్లించే సామర్థ్యాలు తగ్గుతున్నాయి. ►2004–2013 మధ్య కాలంలో ఐఎఫ్ఎఫ్ కారణంగా వర్ధమాన దేశాలు 7.8 లక్షల కోట్ల (ట్రిలియన్) డాలర్లు నష్టపోగా, ఇందులో ఆసియా దేశాల వాటా 38.8 శాతంగా ఉంది. ► పన్ను ఎగవేతలు, ఐఎఫ్ఎఫ్లు దేశీయంగా ఆ దాయ సమీకరణకు అవరోధాలుగా మారాయి. అంతర్జాతీయంగా కూడా ఇది సమస్యగా ఉంది. ►ఐఎఫ్ఎఫ్ల పరిమాణం గణనీయంగా పెరుగుతోంది. పన్నులపరమైన పారదర్శకతను పెంచేందుకు ప్రాంతీయంగా తీసుకునే చర్యలు మాత్రమే వీటిని కట్టడి చేయగలవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మహమ్మారితో పెను సంక్షోభం
న్యూయార్క్ : కరోనా మహమ్మారితో ఈ శతాబ్ధంలోనే అతిపెద్ద ఆర్థిక మాంద్యం ఎదురైందని, రెండో దశ ఇన్ఫెక్షన్స్ వెల్లువెత్తకపోయినా వైరస్ ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) నివేదిక హెచ్చరించింది. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోగా, సంక్షోభంతో పేదలు, యువత ఎక్కువ నష్టపోయారని, అసమానతలు పెచ్చుమీరాయని అంతర్జాతీయ ఆర్థిక నివేదికలో ఓఈసీడీ పేర్కొంది. ఓఈసీడీ ఆవిర్భావం తర్వాత ఇంతటి అనిశ్చితి, నాటకీయ పరిస్ధితులు నెలకొనడం ఇదే తొలిసారని సంస్థ సెక్రటరీ జనరల్ ఏంజెల్ గురియా అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సహజంగా తాము వెల్లడించే అంచనాలనూ అందించలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ రెండో దశ ఇన్ఫెక్షన్లు తలెత్తని పక్షంలో ఈ ఏడాది అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి 6 శాతం పడిపోతుందని, వచ్చే ఏడాది వృద్ధి రేటు 2.8 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. వైరస్ మరోసారి ఎదురైతే ప్రపంచ ఆర్థిక వృద్ధి 7.6 శాతం పడిపోతుందని ఓఈసీడీ విశ్లేషించింది. రెండోసారి వైరస్ విజృంభించినా, తగ్గుముఖం పట్టినా పరిణామాలు మాత్రం తీవ్రంగా, దీర్ఘకాలం కొనసాగుతాయని నివేదిక స్పష్టం చేసింది. మహమ్మారి రాకతో ఆరోగ్యమా, ఆర్థిక వ్యవస్ధా అనే డైలమా ప్రభుత్వాలకు, జీవితమా..జీవనోపాథా అనే ఆలోచనలో వ్యక్తులు పడిపోయారని పేర్కొంది. మహమ్మారి అదుపులోకి రాని పక్షంలో ఆర్థిక వ్యవస్థ కోలుకోలేదని వెల్లడించారు. వైరస్ రెండో దశ తలెత్తిన పక్షంలో సగటు నిరుద్యోగిత రేటు పది శాతానికి ఎగబాకుతుందని పేర్కొంది. ఆరోగ్య వసతుల్లో పెట్టుబడుల ద్వారా అసమానతలను తగ్గించేందుకు ప్రభుత్వాలు కృషిచేయాలని కోరింది. మందుల సరఫరాలు, వ్యాక్సిన్, చికిత్సతో పాటు మహమ్మారి ప్రభావం అధికంగా ఉన్న రంగాలను ఆదుకునేలా చొరవ చూపాలని ఓఈసీడీ సూచించింది. చదవండి : కోవిడ్-19 రోగి బలవన్మరణం -
చేయకూడనివన్నీ చేసింది..
ముంబై/హైదరాబాద్ బిజినెస్ బ్యూరో: క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి ఆ సొమ్మును సొంత అవసరాలకు వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియంత్రణ సంస్థ ఎన్నడూ అనుమతించని కార్యకలాపాలన్నింటినీ కార్వీ సాగించిందని వ్యాఖ్యానించారు. ‘ఇలాంటి లావాదేవీలు జరపరాదంటూ విస్పష్టమైన సర్క్యులర్ జూన్‌లోనే ఇచ్చాం. అయితే గతంలో కూడా వీటికి అనుమతి లేదు. కార్వీ మాత్రం ప్రాథమికంగా అనుమతించని పనులన్నీ చేసింది. నిబంధనల్లో ప్రత్యేకంగా లేదు కాబట్టి క్లయింట్ల షేర్లను సొంతానికి వాడేసుకుంటామంటే కుదరదు’ అని త్యాగి స్పష్టం చేశారు. కార్పొరేట్ గవర్నెన్స్‌పై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) నిర్వహించిన ఆసియా రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్వీ గతంలోనూ ఇలాంటివి చేసిందని చెప్పిన త్యాగి... గతంలో తమ ఆడిట్లలో వీటిని ఎందుకు బయటపెట్టలేకపోయామన్నది మాత్రం చెప్పలేదు. ఎన్ఎస్ఈ, సెబీతో బ్యాంకర్ల చర్చలు.. కార్వీ స్టాక్ బ్రోకింగ్ ఖాతాల్ని ఫోరెన్సిక్ ఆడిట్ చేసేందుకు ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) సంస్థను నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) నియమించినట్లు సమాచారం. మరోవైపు, కార్వీకి రుణాలు ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల్లో ఆందోళన పెరుగుతోంది. సెబీ ఉత్తర్వుల్లో రియల్ ఎస్టేట్ లావాదేవీల ప్రస్తావన కూడా ఉండటంతో దీనిపై అవి మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య తీవ్రత, కార్వీకి చెందిన కంపెనీలేమైనా డిఫాల్ట్ అయ్యే అవకాశాలున్నా యా అన్న విషయాల గురించి తెలుసుకునేందుకు ఎన్ఎస్ఈ, సెబీతో అవి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి కార్వీ సుమారు రూ. 600 కోట్ల మేర నిధులు తీసుకున్నట్లు తెలియవచ్చింది. అంతా సర్దుకుంటుంది కీలక ఉద్యోగులకు కార్వీ చీఫ్ లేఖ ఈ సమస్య నుంచి సత్వరమే బయటపడగలమని కార్వీ గ్రూప్ చైర్మన్ సి.పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు. తనఖాలో ఉన్న షేర్లను త్వరలోనే విడిపిస్తామని, క్లయింట్లకు కూడా చెల్లింపులు జరిపేస్తామని పేర్కొంటూ సంస్థ కీలక ఉద్యోగులకు బుధవారం ఆయనో లేఖ రాసినట్లు తెలిసింది. గరిష్ఠంగా రెండు వారాల్లో చెల్లింపులు పూర్తిచేస్తామని కొద్దిరోజులుగా చెబుతున్న ఆయన... ఈ లేఖలో కూడా అదే విషయాన్ని పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. -
విరామమెరుగని మెక్సికన్లు..
పని చేస్తూనే ఉంటుంది. అలసట అసలే ఉండదు.. ఇది ఒక బైక్ యాడ్‌లో మాట. కానీ మనిషికి అలసట సహజం. అయితే కొందరు త్వరగా అలసిపోతారు. మరికొందరు అధిక శ్రమ తర్వాత అలసిపోతారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ అండ్ కో ఆపరేషన్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. మెక్సికన్లు అలసట ఎరగక నిర్విరామంగా ఎక్కువ గంటలపాటు పని చేస్తూనే ఉంటారు. యజమాని శ్రామికులనుంచి ఎక్కువ పనిని ఆశించడం సహజం. అయితే సామజిక, సాంస్కృతిక, ఆర్థిక పరమైన అంశాలు శ్రామిక శక్తిని ప్రభావితం చేస్తాయని ఓఈసీడీ తెలిపింది. ఉద్యోగ భద్రత సరిగా లేకపోవడం, కార్మికుల శ్రేయస్సు గాలికొదిలేసిన శ్రామిక చట్టాలు మెక్సికన్లు ఎక్కువ గంటలపాటు పని చేసేలా మార్చాయంది. ఇతర ఓఈసీడీ సభ్య దేశాల కార్మికులతో పోల్చినప్పుడు సరాసరి ఒక మెక్సికన్ శ్రామికుడు ఏడాదికి (అన్ని సెలవులు మినహాయించి) 2,255 గంటల పాటు పని చేస్తాడని వెల్లడించింది. కోస్టారికా 2,212 గంటలతో రెండో స్థానంలో, దక్షిణ కొరియా 2,069 గంటలతో మూడో స్థానంలో ఉన్నాయని పేర్కొంది. యూరప్‌లో గ్రీకులు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని వివరించింది. ఏడాదిలో వారు సరాసరి 2,035 గంటలు పని చేస్తున్నారు. పొరుగునే ఉన్న జర్మనీ ఇందుకు భిన్నం. ఏడాదిలో కేవలం 1,363 గంటలు మాత్రమే జర్మన్లు పని చేస్తున్నారు. మెక్సికన్ల కంటే పనిలో 892 గంటలు వెనక ఉన్నారని విరించింది. అగ్ర రాజ్యం అమెరికా ఈ విషయంలో 1,783 గంటల పనితో మధ్యస్థంగా ఉందని తన రిపోర్టులో ఓఈసీడీ పేర్కొంది. ‘విశ్రాంతి హక్కు ’..మెక్సికో మూడవ స్థానంలో కొనసాగుత్ను దక్షిణ కొరియా శ్రామికులతో అధికంగా పని చేయించుకుని ఆర్థికంగా పటిష్టంగా మారింది. జననాల రేటు తక్కువగా ఉండడం, తక్కువ ఉత్పాదకత మూలంగా మెక్సికన్లు ఎక్కువ గంటల పాటు పని చేయాల్సి వస్తోందని ఓఈసీడీ తన నివేదికలో తెలిపింది. వారి పని గంటల్ని తగ్గించే చర్యల్లో భాగంగా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ ‘విశ్రాంతి హక్కు ’ అనే చట్టాన్ని తీసుకొచ్చారంది. అధిక పనితో మరణాలు.. ఓఈసీడీ సరాసరి పనిగంటల (1763) కన్నా జపాన్ వెనకబడి ఉంది. జపనీయులు ఏడాదికి 1,713 గంటలు పని చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడ అధిక పని వల్ల కార్మికులు చనిపోవడం (కరోషి) గమనార్హం. పని పట్ల మక్కువ కల్గిన దేశంగా పేరున్న జపాన్‌లో ఈ పరిస్థితి తలెత్తడంతో ప్రభుత్వం పని గంటల్ని తగ్గించిందని ఓఈసీడీ వెల్లడించింది. తక్కువ పని.. ఎక్కువ ఫలితం ఓఈసీడీ సభ్య దేశాల కంటే తక్కువ గంటలపాటు పనిచేసినా జర్మనీ ఉత్పాదకతలో మాత్రం మెరుగ్గా ఉంది. జర్మనీ దేశస్తులు ఇతర బ్రిటీష్ కార్మికుల కంటే 27 శాతం అధిక ఉత్పత్తిని సాధిస్తున్నారని నివేదిక తెలిపింది. ఇక డచ్, ఫ్రెంచ్, డానిష్ ప్రజలు ఓఈసీడీ సరాసరి కంటే తక్కువ గంటలు పని చేస్తున్నారు. మొత్తం ఓఈసీడీ సభ్య దేశాల కార్మికుల్లో 2శాతమే ఉన్న డానిష్ శ్రామికులు మిగిలిన అన్ని దేశాలతో పోల్చినప్పుడు నాణ్యమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని ఓఈసీడీ నివేదించింది. -
అమెరికాలో తగ్గుతున్న మహిళా ఉద్యోగులు
ఫ్రాన్స్: ఆర్థిక సహకారం, అభివృద్ధి సంఘం (ఓఈసీడీ) సభ్య దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ఆశ్చర్యంగా అమెరికాలో తగ్గిపోతోంది. 20 ఏళ్ల క్రితం, అంటే 1995లో మహిళలు ఉద్యోగాలు చేయడంలో అమెరికా జపాన్కన్నా ముందు ఉండగా ఇప్పుడు జపాన్ కన్నా వెనకబడి పోయింది. అమెరికా, డెన్మార్క్ మినహా ఓఈసీడీలోని 35 సభ్య దేశాల్లో ప్రధానంగా 2,000 సంవత్సరం నుంచే ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. 2000 నుంచి 2015 నాటికి మహిళల ఉద్యోగాల ఇండెక్స్‌లో అమెరికా ఆరు శాతం పాయింట్లు నష్టపోయి నేడు 63 శాతానికి చేరుకుంది. అదే జపాన్ 14 శాతం పాయింట్లు పుంజుకొని 65 శాతం పాయింట్లకు చేరుకొంది. ప్రస్తుతం అమెరికా కన్నా జపాన్‌లోనే మహిళలు ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్నారు. అమెరికాతోపాటు డెన్మార్క్‌లో కూడా ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య తగ్గిపోయినప్పటికీ 70 శాతం పాయింట్లతో ఇప్పటికీ ప్రపంచంలోకెల్లా డెన్మార్క్‌లోనే ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. డెన్మార్క్ తర్వాత స్థానాల్లో జర్మనీ, కెనడా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయి. ఈ విషయంలో ఫ్రాన్స్ వేగంగా పురోగమిస్తున్నప్పటికీ ఇప్పటికీ అది అమెరికాకన్నా వెనుకబడే ఉన్నది. 61శాతం పాయింట్లతో, అంటే రెండు శాతం పాయింట్లతో వెనకబడిన ఫ్రాన్స్, అమెరికాను అధిగమించడానికి ఎంతో కాలం పట్టదని ఓఈసీడీ విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడిస్తోంది. ఓఈసీడీలోని పలు దేశాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య నానాటికి పెరగడానికి కారణం ఆయా దేశాల్లో మహిళలను ప్రోత్సహించేందుకు ఇస్తున్న సౌకర్యాలు, రాయితీలే ప్రధాన కారణం. మాతృత్వంతోపాటు పితృత్వం సెలవులు ఇస్తుండడమే కాకుండా కొన్ని దేశాల్లో కొత్త దంపతులకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారు. చైల్డ్ కేర్ సెంటర్లకు సబ్సిడీలు కూడా ఇస్తున్నారు. అమెరికాలో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య క్రమంగా తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చైల్డ్‌కేర్ సెంటర్లు అక్కడ బాగా ఖరీదవడం ప్రధాన కారణం కాగా, ఉద్యోగులకు వేతనాలతో కూడా పేరెంట్స్ సెలవులు ఇవ్వకపోవడం, ద్రవ్యోల్బణం పెరగడం ఇతర కారణాలు. జపాన్‌లో తల్లిదండ్రులిద్దరూ 58 వారాలపాటు వేతనాలతో కూడిన సెలవులు తీసుకోవచ్చు. జర్మనీలో బాలింతలు 58 వారాలు, జర్మనీలో 58 వారాలు, కెనడాలో 52, డెన్మార్క్‌లో 50, ఫ్రాన్స్‌లో 42, బ్రిటన్‌లో 39 వారాలపాటు వేతనాలతో కూడిన సెలవులు తీసుకోవచ్చు. ఇక తండ్రులు ఫ్రాన్స్‌లో 28 వారాలు, జర్మనీలో తొమ్మిది, బ్రిటన్, డెన్మార్క్‌లో రెండు వారాలపాటు సెలవులు తీసుకోవచ్చు. అమెరికాలో చైల్డ్‌కేర్ సెంటర్లకు ఓ కుటుంబానికి వచ్చే ఆదాయంలో మూడోవంతు భాగాన్ని చెల్లించాల్సి వస్తోంది. తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలు వీటి ఖర్చును భరించలేక పోతున్నాయి. అందుకని ఎక్కువ మంది మహిళల ఇంటిపట్టున ఉండి పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకునేందుకు ఇష్టపడుతున్నారు. -
ఇక భారత్ వృద్ధి పుంజుకుంటుంది..
* ఈ ఏడాది వృద్ధి రేటు 4.9 శాతం, 2015లో 5.9 శాతం వృద్ధి * ఓఈసీడీ నివేదిక లండన్: భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 4.9 శాతం వృద్ధి చెందే అవకాశముంది... ఎన్నికల తర్వాత రాజకీయ అనిశ్చితి తగ్గుముఖం పట్టి ఆర్థిక ప్రగతి ఊపందుకోనుందని పారిస్ కేంద్రంగా గల ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) అంచనావేసింది. భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) మరింత పుంజుకుని 2015లో 5.9 శాతం వృద్ధి చెందుతుందని ఓఈసీడీ తాజా నివేదిక తెలిపింది. ‘భారత ఎకానమీ 2012-13 ఆర్థిక సంవత్సరంలో మందగించి, అభివృద్ధి అడుగంటింది. ఆ ఏడాది జీడీపీ వృద్ధి రేటు దశాబ్దపు కనిష్టస్థాయి 4.5 శాతానికి చేరింది. ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. పలు ప్రాజెక్టులకు కేబినెట్ కమిటీ ఆమోదం తెలపడంతో పెట్టుబడులు పుంజుకోనున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయ అనిశ్చితి తొలగిపోనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం పెరగడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం వల్ల వస్తు వినియోగం పెరుగుతుంది. ద్రవ్య పటిష్టీకరణ, సరఫరాల్లో ఇక్కట్లు, బ్యాంకుల మొండిబకాయిలు నేటికీ అధిక స్థాయిలో ఉండడం ఆర్థిక రికవరీపై ప్రభావం చూపనున్నాయి. 2013 మార్చిలో రూ.1.83 లక్షల కోట్లుగా ఉన్న మొండిబకాయిలు అదే ఏడాది సెప్టెంబర్‌కు 28.5 శాతం వృద్ధితో రూ.2.36 లక్షల కోట్లకు చేరాయి. ద్రవ్యలోటు తగ్గినప్పటికీ ద్రవ్య పటిష్టీకరణకు మరిన్ని చర్యలు చేపట్టాల్సి ఉంది. పెండింగులో ఉన్న పన్ను సంస్కరణలను అమలు చేయాలి. కార్మిక చట్టాలను సంస్కరించాలి. విద్యారంగాన్ని మెరుగుపర్చాలి. ఆర్థిక పురోగతిని పెంచడంతో పాటు నాణ్యమైన ఉద్యోగాల కల్పనకు ఈ చర్యలు దోహదపడతాయి...’ అని ఓఈసీడీ నివేదిక పేర్కొంది.