ఇక భారత్ వృద్ధి పుంజుకుంటుంది..
* ఈ ఏడాది వృద్ధి రేటు 4.9 శాతం, 2015లో 5.9 శాతం వృద్ధి
* ఓఈసీడీ నివేదిక
లండన్: భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 4.9 శాతం వృద్ధి చెందే అవకాశముంది... ఎన్నికల తర్వాత రాజకీయ అనిశ్చితి తగ్గుముఖం పట్టి ఆర్థిక ప్రగతి ఊపందుకోనుందని పారిస్ కేంద్రంగా గల ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) అంచనావేసింది. భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) మరింత పుంజుకుని 2015లో 5.9 శాతం వృద్ధి చెందుతుందని ఓఈసీడీ తాజా నివేదిక తెలిపింది.
‘భారత ఎకానమీ 2012-13 ఆర్థిక సంవత్సరంలో మందగించి, అభివృద్ధి అడుగంటింది. ఆ ఏడాది జీడీపీ వృద్ధి రేటు దశాబ్దపు కనిష్టస్థాయి 4.5 శాతానికి చేరింది. ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. పలు ప్రాజెక్టులకు కేబినెట్ కమిటీ ఆమోదం తెలపడంతో పెట్టుబడులు పుంజుకోనున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయ అనిశ్చితి తొలగిపోనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం పెరగడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం వల్ల వస్తు వినియోగం పెరుగుతుంది.
ద్రవ్య పటిష్టీకరణ, సరఫరాల్లో ఇక్కట్లు, బ్యాంకుల మొండిబకాయిలు నేటికీ అధిక స్థాయిలో ఉండడం ఆర్థిక రికవరీపై ప్రభావం చూపనున్నాయి. 2013 మార్చిలో రూ.1.83 లక్షల కోట్లుగా ఉన్న మొండిబకాయిలు అదే ఏడాది సెప్టెంబర్‌కు 28.5 శాతం వృద్ధితో రూ.2.36 లక్షల కోట్లకు చేరాయి. ద్రవ్యలోటు తగ్గినప్పటికీ ద్రవ్య పటిష్టీకరణకు మరిన్ని చర్యలు చేపట్టాల్సి ఉంది. పెండింగులో ఉన్న పన్ను సంస్కరణలను అమలు చేయాలి. కార్మిక చట్టాలను సంస్కరించాలి. విద్యారంగాన్ని మెరుగుపర్చాలి. ఆర్థిక పురోగతిని పెంచడంతో పాటు నాణ్యమైన ఉద్యోగాల కల్పనకు ఈ చర్యలు దోహదపడతాయి...’ అని ఓఈసీడీ నివేదిక పేర్కొంది.