పని చేస్తూనే ఉంటుంది. అలసట అసలే ఉండదు.. ఇది ఒక బైక్ యాడ్‌లో మాట. కానీ మనిషికి అలసట సహజం. అయితే కొందరు త్వరగా అలసిపోతారు. మరికొందరు అధిక శ్రమ తర్వాత అలసిపోతారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ అండ్ కో ఆపరేషన్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. మెక్సికన్లు అలసట ఎరగక నిర్విరామంగా ఎక్కువ గంటలపాటు పని చేస్తూనే ఉంటారు. యజమాని శ్రామికులనుంచి ఎక్కువ పనిని ఆశించడం సహజం. అయితే సామజిక, సాంస్కృతిక, ఆర్థిక పరమైన అంశాలు శ్రామిక శక్తిని ప్రభావితం చేస్తాయని ఓఈసీడీ తెలిపింది. ఉద్యోగ భద్రత సరిగా లేకపోవడం, కార్మికుల శ్రేయస్సు గాలికొదిలేసిన శ్రామిక చట్టాలు మెక్సికన్లు ఎక్కువ గంటలపాటు పని చేసేలా మార్చాయంది. ఇతర ఓఈసీడీ సభ్య దేశాల కార్మికులతో పోల్చినప్పుడు సరాసరి ఒక మెక్సికన్ శ్రామికుడు ఏడాదికి (అన్ని సెలవులు మినహాయించి) 2,255 గంటల పాటు పని చేస్తాడని వెల్లడించింది.
కోస్టారికా 2,212 గంటలతో రెండో స్థానంలో, దక్షిణ కొరియా 2,069 గంటలతో మూడో స్థానంలో ఉన్నాయని పేర్కొంది. యూరప్‌లో గ్రీకులు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని వివరించింది. ఏడాదిలో వారు సరాసరి 2,035 గంటలు పని చేస్తున్నారు. పొరుగునే ఉన్న జర్మనీ ఇందుకు భిన్నం. ఏడాదిలో కేవలం 1,363 గంటలు మాత్రమే జర్మన్లు పని చేస్తున్నారు. మెక్సికన్ల కంటే పనిలో 892 గంటలు వెనక ఉన్నారని విరించింది. అగ్ర రాజ్యం అమెరికా ఈ విషయంలో 1,783 గంటల పనితో మధ్యస్థంగా ఉందని తన రిపోర్టులో ఓఈసీడీ పేర్కొంది.
‘విశ్రాంతి హక్కు ’..మెక్సికో
మూడవ స్థానంలో కొనసాగుత్ను దక్షిణ కొరియా శ్రామికులతో అధికంగా పని చేయించుకుని ఆర్థికంగా పటిష్టంగా మారింది. జననాల రేటు తక్కువగా ఉండడం, తక్కువ ఉత్పాదకత మూలంగా మెక్సికన్లు ఎక్కువ గంటల పాటు పని చేయాల్సి వస్తోందని ఓఈసీడీ తన నివేదికలో తెలిపింది. వారి పని గంటల్ని తగ్గించే చర్యల్లో భాగంగా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ ‘విశ్రాంతి హక్కు ’ అనే చట్టాన్ని తీసుకొచ్చారంది.
అధిక పనితో మరణాలు..
ఓఈసీడీ సరాసరి పనిగంటల (1763) కన్నా జపాన్ వెనకబడి ఉంది. జపనీయులు ఏడాదికి 1,713 గంటలు పని చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడ అధిక పని వల్ల కార్మికులు చనిపోవడం (కరోషి) గమనార్హం. పని పట్ల మక్కువ కల్గిన దేశంగా పేరున్న జపాన్‌లో ఈ పరిస్థితి తలెత్తడంతో ప్రభుత్వం పని గంటల్ని తగ్గించిందని ఓఈసీడీ వెల్లడించింది.
తక్కువ పని.. ఎక్కువ ఫలితం
ఓఈసీడీ సభ్య దేశాల కంటే తక్కువ గంటలపాటు పనిచేసినా జర్మనీ ఉత్పాదకతలో మాత్రం మెరుగ్గా ఉంది. జర్మనీ దేశస్తులు ఇతర బ్రిటీష్ కార్మికుల కంటే 27 శాతం అధిక ఉత్పత్తిని సాధిస్తున్నారని నివేదిక తెలిపింది. ఇక డచ్, ఫ్రెంచ్, డానిష్ ప్రజలు ఓఈసీడీ సరాసరి కంటే తక్కువ గంటలు పని చేస్తున్నారు. మొత్తం ఓఈసీడీ సభ్య దేశాల కార్మికుల్లో 2శాతమే ఉన్న డానిష్ శ్రామికులు మిగిలిన అన్ని దేశాలతో పోల్చినప్పుడు నాణ్యమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని ఓఈసీడీ నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment