అది మెక్సికో సిటీలోని దక్షిణ కొరియా ఎంబసీ కార్యాలయం. వందల కొద్దీ ఫుట్‌బాల్ అభిమానులు అక్కడికి చేరుకోవటంతో పండగ వాతావరణం కనిపించింది. ‘బ్రదర్.. ఇప్పటి నుంచి మీరు కూడా మెక్సికన్లే’ అంటూ సౌత్ కొరియన్లను కౌగిలించుకుంటూ, భుజాలపై ఎత్తుకుంటూ మెక్సికన్లు వేడుకలు చేసుకున్నారు.
మెక్సికో సిటీ: ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్-2018.. గ్రూప్-ఎఫ్ లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా బుధవారం స్వీడన్ చేతిలో 3-0 తేడాతో మెక్సికో దారుణంగా ఓడింది. అయితే ఆ ఓటమి నుంచి తేరుకునేందుకు మెక్సికన్లను ఎంతో సమయం పట్టలేదు. డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీ.. దక్షిణకొరియా చేతిలో పరాజయం చెందడం వారిలో ఆనందాన్ని నింపింది. ఒకవేళ గనుక జర్మనీ ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే మెక్సికోకు ప్రిక్వార్టర్ అవకాశం దక్కేది కాదు. దీంతో దక్షిణ కొరియా-జర్మనీ మ్యాచ్ మెక్సికన్లలో టెన్షన్ పుట్టించింది. చివరకు దక్షిణ కొరియా 2-0 తేడాతో జర్మనీని చిత్తు చేయటంతో, దక్షిణ కొరియాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మెక్సికన్లు పండగ చేసుకున్నారు. ‘ఓ ఆసియా దేశం ఢిపెండింగ్ ఛాంపియన్‌ను చిత్తు చేయటం మాములు విషయం కాదు. పైగా మాకు అవకాశం దక్కుతుందా? అన్న టెన్షన్‌లో ఉన్నాం. ఇలాంటి తరుణంలో దక్షిణ కొరియా పోరాటం మాకు మధురానుభూతిని మిగిల్చింది. అందుకే ఈ సెలబ్రేషన్స్’ అని కొందరు ఫ్యాన్స్ తెలిపారు.
పాయింట్ల పట్టికలో ఆరేసి పాయింట్లతో ఉన్న స్వీడన్, మెక్సికోలు నాకౌట్‌కు క్వాలిఫై కాగా, దక్షిణ కొరియా.. చివరి లీగ్ మ్యాచ్‌లో జర్మనీని ఓడించి మెక్సికన్ల కళ్లలో ఆనందాన్ని నింపి మరీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అన్నట్లు గ్రూప్ ఎఫ్‌లో తొలి మ్యాచ్‌లోనే జర్మనీని 1-0 తేడాతో మెక్సికో బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment