షాక్‌లో జర్మనీ ఆటగాళ్లు
జర్మనీ... నాలుగుసార్లు చాంపియన్... మరో నాలుగుసార్లు రన్నరప్...! ప్రపంచ కప్‌లో కాలుపెట్టిందంటే కనీసం క్వార్టర్స్ ఖాయమనే బలీయ నేపథ్యం దానిది. ఫుట్‌బాల్ ప్రపంచంలో జగజ్జేతకు నిర్వచనం అనదగ్గ జట్టు! మరీ ముఖ్యంగా గత నాలుగు కప్‌లలో ఓసారి రన్నరప్, రెండు సార్లు మూడో స్థానం, క్రితంసారి విజేత..! ఏ ఒక్కరిపైనో ఆధారపడని స్థితిలో, అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తూ టైటిల్‌ను నిలబెట్టుకుంటుందనే అంచనాలతో అమేయ శక్తిగా ఈ కప్‌లో అడుగిడింది. ...కానీ బరిలో దిగాక అనుకున్నదంతా తలకిందులైంది! తొలి మ్యాచ్‌లో మెక్సి‘కోరల్లో’ చిక్కి విలవిల్లాడి ఓడింది. రెండో మ్యాచ్‌లో స్వీడన్‌పై చచ్చీ చెడి నెగ్గింది. చివరి మ్యాచ్‌లో కొరియా చేతిలో ఏకంగా చావుదెబ్బ తిన్నది. గెలుపు మాత్రమే నాకౌట్ మెట్టెక్కించే స్థితిలో బోర్లాపడింది. 80 ఏళ్ల తర్వాత తొలిసారిగా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. తమ జట్టు చరిత్రలోనే దారుణ పరాభవం మూటగట్టుకుంది. పోరాడితే పోయేదేమీ లేని స్థితిలో... కొరియా పోతూపోతూ డిఫెండింగ్ చాంపియన్‌నూ తనతో పట్టుకుపోయింది.
కజన్: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో సంచలనం. ఆ మాటకొస్తే ఫుట్‌బాల్ ప్రపంచంలోనే పెను సంచలనం. చిన్న జట్లు మాజీ చాంపియన్లను నిలువరిస్తున్న ప్రస్తుత కప్‌లో దక్షిణ కొరియా ఏకంగా జర్మనీకి జీవితాంతం మర్చిపోలేని షాక్ ఇచ్చింది. ఆటలో, చరిత్రలో, ర్యాంకులో తమకంటే ఎంతో మెరుగైన డిఫెండింగ్ చాంపియన్‌ను 2–0 తేడాతో ఓడించి టోర్నీ నుంచి తమతో పాటే ఇంటికి తీసుకెళ్లింది. కప్‌కు ముందు ఆటగాళ్లంతా అద్భుత ఫామ్‌లో ఉండి, మొత్తం జట్టుకు జట్టే ప్రబలంగా కనిపించిన జర్మనీ... జట్టుగానే విఫలమై తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టింది. 1938 తర్వాత గ్రూప్ దశలోనే నిష్క్రమించడం జర్మనీకిదే తొలిసారి. గెలిస్తేనే నాకౌట్ చేరే పరిస్థితుల్లో బరిలో దిగి... చావోరేవో తేల్చుకోవాల్సిన వేళ జర్మనీ చతికిలపడింది.
మ్యాచ్ రెండు భాగాల్లోనూ గోల్ చేయలేకపోయిన ఆ జట్టు... కొరియాకు (90+3వ నిమిషంలో వైజి కిమ్), (90+6వ నిమిషంలో హెచ్‌ఎం సన్) ఇంజ్యూరీ సమయంలో రెండు గోల్స్ సమర్పించుకుంది. ఇందులో రెండో గోల్ నమోదైన తీరు జర్మనీ ఆటగాళ్ల దారుణ సమష్టి వైఫల్యానికి అద్దంపట్టింది. ఆఖరి నిమిషాలు కావడంతో కీపర్ మాన్యుయెల్ న్యూర్ సహా జర్మనీ ఆటగాళ్లంతా ప్రత్యర్థి ఏరియాలోకి రాగా, బంతిని కొరియా ఆటగాడు బలంగా అవతలి ఏరియాలోకి కొట్టాడు. సన్... వాయువేగంతో పరిగెడుతూ దానిని అందుకుని గోల్ పోస్ట్‌లోనికి పంపించాడు. ఆ సమయంలో కీపర్ న్యూర్ ఎక్కడో దూరంగా ఉన్నాడు. 2014 కప్‌లో అత్యుత్తమ కీపర్‌గా ‘గోల్డెన్ గ్లౌవ్’ అందుకున్న న్యూర్... దీన్నంతటినీ చూస్తూ ఉండిపోయాడు. ఇదే సమయంలో గోల్స్‌ను నిరోధించడంలో ప్రతిభ చూపిన కొరియా కీపర్ జేవో హియాన్‌వూకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కడం విశేషం.
ఊదేస్తుందనుకుంటే...
ఆఖరి క్షణాల్లోన్నైనా ఫలితాన్ని తనవైపు తిప్పుకొనే జర్మనీ బలాబలాల ముందు కొరియా ఏమాత్రం సరితూగనిది. దానికి తగ్గట్లే గోర్టెజ్కా, ఓజిల్, రూయిస్, క్రూస్, ఖెదిరాల సమన్వయంతో ఆ జట్టు ఆధిపత్యంతోనే మ్యాచ్ ప్రారంభమైంది. రక్షణాత్మక శైలితో ఆడిన కొరియాకు వీరిని కాచుకోవడంతోనే సరిపోయింది. అయితే, ఫ్రీ కిక్ రూపంలో మొదటి అవకాశం దానికే దక్కింది. జంగ్ వూయంగ్ షాట్‌ను కీపర్ న్యూర్ కొంత క్లిష్టంగానే తప్పించాడు. తర్వాత కూడా జర్మనీ ఒత్తిడి పెంచింది. 40వ నిమిషంలో బాక్స్ లోపల హమ్మెల్స్‌కు గోల్ చాన్స్ దక్కినా... హియెన్‌వూ తలతో పక్కకు నెట్టాడు. ప్రత్యర్థి ఆధిపత్యాన్ని ఛేదించేందుకు కొరియా చేసిన ప్రయత్నాలేవీ ఫలించకుండా, గోల్సేమీ లేకుండానే మొదటి భాగం ముగిసింది.
ఎన్నో అవకాశాలు వచ్చినా...
రెండో భాగంలో ఎక్కువగా డిఫెండింగ్ చాంపియన్‌కే అవకాశాలు వచ్చాయి. మూడో నిమిషంలో గోర్టెజ్కా కొట్టిన హెడర్‌ను కీపర్ హియాన్‌వూ డైవ్ చేస్తూ నిరోధించాడు. గోమెజ్ దాదాపు గోల్ కొట్టినంత పనిచేశాడు. అటువైపు కొరియా కూర్పు మారుస్తూ ప్రయోగంతో పట్టు కోసం ప్రయత్నించింది. ఇరు జట్లలో ఇవేవీ ఫలించలేదు.
ఇంజ్యూరీలో కుదేలు...
ఇంజ్యూరీ రెండు నిమిషాలు కూడా గణాంకాలేమీ నమోదు కాకుండానే సాగింది. 90+3వ నిమిషంలో మాత్రం అద్భుతం జరిగింది. కార్నర్ నుంచి అందిన బంతిని యంగ్‌వాన్ షాట్ కొట్టగా నేరుగా జర్మనీ గోల్‌పోస్ట్‌లోకి చేరిపోయింది. ఇది ఆఫ్‌సైడ్ అంటూ అభ్యంతరాలు వచ్చినా వీఏఆర్‌లో కాదని తేలింది. 90+6 నిమిషంలో ఇంకో అద్భుతం చోటుచేసుకుంది. న్యూర్ సహా జట్టంతా కొరియా మిడ్ ఫీల్డ్ వద్ద ఉండగా... ఇటువైపు పడిన బంతిని ఛేదించిన సన్... గోల్ అందించడంతో వారి శిబిరం భావోద్వేగంలో మునిగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment