విజేతల్ని ఈ ప్రపంచం ఆరాధిస్తుంది. వారిని అనుసరించి, ఆ మార్గానే పయనించి తానూ గెలవాలని ఉవ్విళ్లూరుతుంది. సరిగ్గా అందుకే అందరూ ఇప్పుడు దక్షిణ కొరియా, వియత్నాంల వైపు చూస్తు న్నారు. చైనా దరిదాపుల్లోవుండి కూడా ఈ దేశాలు అక్కడినుంచి వచ్చిన మహమ్మారిని ఎలా కట్టడి చేశాయో... ఏం మంత్రం వేశాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటలీ.. స్పెయిన్... అమెరికా! కరోనా వైరస్ తాకిడికి అట్టుడికి పోతున్న దేశాలివి. ఒక్కో దేశంలో రోజుకు కొన్ని వందల మంది ప్రాణాలు గాల్లో కలసిపోతూంటే.. కొత్తగా గుర్తిస్తున్న కేసుల సంఖ్య వేలల్లో ఉంటోంది. గత ఏడాది చైనాలో పుట్టిన ఈ వైరస్ ఆశ్చర్యకరంగా ఇరుగుపొరుగున ఉన్న వియత్నాం, దక్షిణ కొరియాల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఎందుకిలా ఆ దేశాలు చేసిన పనులేమిటి. ఇతర దేశాలు మరచింది ఏమిటి ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...
దక్షిణ కొరియా.. చైనాకు పక్కనే ఉంటుంది. జనాభా సుమారు ఐదు కోట్లు. చైనాలోని వూహాన్‌లో వ్యాధి ఉధృతంగా ఉన్న ఫిబ్రవరి నెలలో దక్షిణ కొరియాలోనూ కొన్ని వందల కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 29వ తేదీ ఒక్కరోజే దాదాపు 909 కేసులు బయటపడటంతో అక్కడ కూడా వైరస్ విజృంభిస్తుందని అందరూ ఊహించారు. కానీ ఆశ్చర్యకరంగా ఆ తరువాత దక్షిణ కొరియాలో కేసులు తగ్గుముఖం పట్టాయి. మార్చి ఒకటవ తేదీ 586 కేసులు నమోదు కాగా.. మార్చి 19 నాటికి ఈ సంఖ్య 158కి తగ్గిపోయింది.
దేశం మొత్తాన్ని లాక్‌డౌన్ చేయకుండానే దక్షిణ కొరియా వైరస్ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోగలిగింది. ఈ విజయానికి చాలా కారణాలే ఉన్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది చాలా విస్తృత స్థాయిలో చేపట్టిన పరీక్షల గురించి. ఉన్న ఐదు కోట్ల జనాభాలో దక్షిణ కొరియా సుమారు 3.5 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. ఇంకోలా చెప్పాలంటే ప్రతి పది లక్షల మందిలో 6,000 మందికి పరీక్షలు చేశారన్నమాట. ప్రపంచంలోనే ఈ స్థాయిలో ఎవరూ పరీక్షలు నిర్వహించలేదు. అగ్రరాజ్యం అమెరికా పది లక్షల మందిలో 74 మందికి మాత్రమే పరీక్షలు చేయగలిగిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసకోవచ్చు. పకడ్బందీగా పరీక్షలు చేపట్టడం మాత్రమే కాకుండా.. వ్యాధి బారిన పడ్డ వారిని హుటాహుటిన నిర్బంధంలో ఉంచేందుకు తగిన ఏర్పాట్లు చేయడం, వీరితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ వేగంగా గుర్తించడం కూడా కొరియా విజయానికి కారణాలయ్యాయి. ఐదువేలకు పైగా కోవిడ్ కేసులు ఉన్న షిన్‌ఛెనోజీ చర్చ్ ఆఫ్ జీసస్ సమావేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం కూడా ఆ దేశానికి కలిసివచ్చిందని చెప్పవచ్చు. ఈ చర్చి సమావేశాలను లక్ష్యంగా చేసుకుని పరీక్షలు చేయడం వల్ల తాము ఇతర ప్రాంతాల్లో పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం రాలేదని సియోల్ నేషనల్ యూనివర్సిటీలోని సాంక్రమిక వ్యాధుల నిపుణుడు ఓ మ్యుయాంగ్ డాన్ అంటున్నారు.
మెర్స్ అనుభవం అక్కరకు వచ్చింది..
దక్షిణ కొరియాలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు 2013 నాటి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్) అనుభవం బాగా ఉపయోగపడింది. 2015లో మధ్యప్రాచ్య దేశాల నుంచి తిరిగి వచ్చిన ఓ వ్యాపారవేత్త ద్వారా ఈ వైరస్ దక్షిణ కొరియాలోకి ప్రవేశించింది. వ్యాధిని గుర్తించే లోపు మూడు ఆసుపత్రుల్లో వేర్వరు లక్షణాలకు చికిత్స పొందిన ఈ వ్యాపారవేత్త ఆ క్రమంలో 186 మందికి వైరస్‌ను అంటించాడు. ఆసుపత్రి సిబ్బంది.. ఇతర కారణాల వల్ల ఆసుపత్రిలో చేరిన వారు సుమారు 36 మంది ప్రాణాలు కోల్పోయారు కూడా. ఈ సంఘటనల తరువాత మేల్కొన్న ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వ్యాధిగ్రస్తులను గుర్తించి, నిర్బంధంలో ఉంచడం మొదలుపెట్టింది. దీంతో వ్యాధి సుమారు 17 వేల మందికి సోకినా రెండు నెలల్లో అతితక్కువ మరణాలతో దక్షిణ కొరియా పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఈ అనుభవం మొత్తం ఇప్పుడు సార్స్–సీఓవీ2 కట్టడికి ఎంతో ఉపయోగపడుతోందని, మరీ ముఖ్యంగా ఆసుపత్రుల్లో వైరస్‌ను నియంత్రించేందుకు అక్కరకు వచ్చిందని అంటున్నారు ఆ దేశ వైద్య నిపుణులు. మెర్స్ వ్యాధి ప్రబలిన కాలంలో దక్షిణ కొరియా చేసిన ఒక చట్టం అవసరమైనప్పుడు ప్రజల మొబైల్‌ఫోన్, క్రెడిట్ కార్డు తదితర వివరాలను సేకరించేందుకు వెసులుబాటు కల్పించడంతో కోవిడ్ కష్టకాలంలోనూ ఆ చట్టం సాయంతో వ్యాధి బారిన పడ్డవారిని వేగంగా గుర్తించడం వీలైందని అంచనా.
చైనాలో కరోనా భూతం బయటపడిన వెంటనే కొరియా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వేగంగా వ్యాధి నిర్ధారణకు అవసరమైన కిట్లను అభివృద్ధి చేయించింది. ఫిబ్రవరి ఏడవ తేదీ, తొలి కిట్‌ను ఆమోదించగా పదకొండు రోజుల తరువాత షిన్‌ఛెనోజీ చర్చ్ ఆఫ్ జీసస్ సమావేశాలకు హాజరైన ఓ మహిళకు వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆ వెంటనే అధికారులు సమావేశాలకు హాజరైన వారందరినీ గుర్తించి పరీక్షలు చేపట్టడంతో వ్యాధి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అడ్డుకున్నట్లు అయ్యింది. ఆరోగ్య సమస్యలు ఉన్న వారిలో కోవిడ్ లక్షణాలు బయటపడితే వారికి ఆసుపత్రుల్లో ప్రాధాన్యమివ్వడం ఓ మోస్తరు లక్షణాలు ఉన్న వారిని తాత్కాలిక ఆసుపత్రులు మార్చిన భవనాల్లో ఉంచి కనీస వైద్య సదుపాయం అందేలా చేయడం, కోలుకున్న వారిలో వైరస్ లేదని రెండుసార్లు నిర్ధారణ చేసుకున్న తరువాత మాత్రమే డిశ్చార్జ్ చేయడం వంటి ప్రణాళికబద్ధమైన చర్యలు దక్షిణ కొరియాను కరోనా మహమ్మారి బారి నుంచి ఈ రోజు వరకూ రక్షించాయని చెప్పాలి.
వియత్నాంలో 148 కేసులు మాత్రమే...
చైనాలో సుమారు 1100 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న దేశం వియత్నాం. జనసమ్మర్ధం ఎక్కువ. ప్రజా ఆరోగ్య వ్యవస్థ చాలా బలహీనం. అయినప్పటికీ ఈ దేశంలో మార్చి 26వ తేదీ వరకూ వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య కేవలం 148 మాత్రమే. జనవరి నెల ఆఖరులో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రభుత్వం కరోనా వైరస్‌పై యుద్ధానికి దిగుతున్నట్లు చేసిన ప్రకటనతో ఆ దేశం నిజంగా యుద్ధ ప్రాతిపదికన పనిచేసింది. ఈ మహమ్మారిపై పోరంటే.. శత్రువుతో పోరేనని అధ్యక్షుడు నూగూయెన్ షువాన్ ఫుక్ ఇచ్చిన పిలుపుతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం వేల మందిని ముందస్తు క్వారంటైన్‌లో ఉంచేసింది. మిలటరీ ఆధ్వర్యంలోని పలు కేంద్రాల్లో తాత్కాలిక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసింది.
దక్షిణ కొరియా మాదిరిగా లక్షల సంఖ్యలో పరీక్షలు జరిపేంత ఆర్థిక స్థోమత లేకపోయినా, సుమారు 80 లక్షల జనాభా ఉన్న హో చి మిన్ నగరంలో కేవలం 900 ఐసీయూ పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నా వియత్నాం అదరలేదు. బెదరలేదు. కఠినాతికఠినమైన క్వారంటైన్ నిబంధనలు రూపొందించి వాటి కచ్చితమైన అమలుతో సమస్యను ఎదుర్కొంది. చైనా కంటే చాలా ముందుగానే లాక్‌డౌన్ ప్రకటించడం, వైరస్ సోకిన వారికి సన్నిహితంగా ఉన్న వారిని వేగంగా గుర్తించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోగలిగింది. దేశం మొత్తమ్మీద కేవలం పది కరోనా కేసులు మాత్రమే నమోదైనా ఫిబ్రవరి 12వ తేదీ వియత్నాం హనోయి సమీపంలో సుమారు పదివేల మంది జనాభా ఉన్న గ్రామం మొత్తాన్ని మూడు వారాల స్వీయ నిర్బంధంలో ఉంచిందంటే ఆ దేశం పరిస్థితిని ఎలా అదుపు చేసిందనేది అర్థం చేసుకోవచ్చు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించేందుకు కూడా వియత్నాం ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను అమల్లోకి తెచ్చింది.
జర్మనీలాంటి దేశం వైరస్ బారిన పడ్డవారిని.. వారు ప్రత్యక్ష కాంటాక్ట్‌లను మాత్రమే గుర్తిస్తే వియత్నాం మరో నాలుగు అంచెల వరకూ కాంటాక్ట్‌లను గుర్తించింది. వీరందరి కదలికలపై నియంత్రణలు పెట్టడం, ఇతరులతో కాంటాక్ట్ పెట్టుకోవడంపై ఆంక్షలు విధించడంతో సమస్య చాలావరకూ అదుపులోకి వచ్చిందని అంచనా. కరోనా సమస్య ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వారిని చాలా ముందుగానే 14 రోజుల క్వారంటైన్‌లో ఉంచడంతోపాటు విశ్వవిద్యాలయాలకు, పాఠశాలలన్నింటికీ సెలవులు తొందరగా ప్రకటించిన దేశమూ వియత్నామే. ఇంకోలా చెప్పాలంటే వియత్నాం ఇటలీ, స్పెయిన్, అమెరికా, చైనాల మాదిరిగా వైద్యం, టెక్నాలజీలపై ఎక్కువగా ఆధారపడకుండా.. తన బలమైన నిఘా వ్యవస్థలపై ఆధారపడి నియంత్రణలన్నింటినీ ఉక్కు సంకల్పంతో అమలు చేయడం ద్వారా గట్టెక్కిందని చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment