న్యూయార్క్ : కరోనా మహమ్మారితో ఈ శతాబ్ధంలోనే అతిపెద్ద ఆర్థిక మాంద్యం ఎదురైందని, రెండో దశ ఇన్ఫెక్షన్స్ వెల్లువెత్తకపోయినా వైరస్ ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) నివేదిక హెచ్చరించింది. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోగా, సంక్షోభంతో పేదలు, యువత ఎక్కువ నష్టపోయారని, అసమానతలు పెచ్చుమీరాయని అంతర్జాతీయ ఆర్థిక నివేదికలో ఓఈసీడీ పేర్కొంది. ఓఈసీడీ ఆవిర్భావం తర్వాత ఇంతటి అనిశ్చితి, నాటకీయ పరిస్ధితులు నెలకొనడం ఇదే తొలిసారని సంస్థ సెక్రటరీ జనరల్ ఏంజెల్ గురియా అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సహజంగా తాము వెల్లడించే అంచనాలనూ అందించలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ రెండో దశ ఇన్ఫెక్షన్లు తలెత్తని పక్షంలో ఈ ఏడాది అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి 6 శాతం పడిపోతుందని, వచ్చే ఏడాది వృద్ధి రేటు 2.8 శాతం పెరుగుతుందని అంచనా వేశారు.
వైరస్ మరోసారి ఎదురైతే ప్రపంచ ఆర్థిక వృద్ధి 7.6 శాతం పడిపోతుందని ఓఈసీడీ విశ్లేషించింది. రెండోసారి వైరస్ విజృంభించినా, తగ్గుముఖం పట్టినా పరిణామాలు మాత్రం తీవ్రంగా, దీర్ఘకాలం కొనసాగుతాయని నివేదిక స్పష్టం చేసింది. మహమ్మారి రాకతో ఆరోగ్యమా, ఆర్థిక వ్యవస్ధా అనే డైలమా ప్రభుత్వాలకు, జీవితమా..జీవనోపాథా అనే ఆలోచనలో వ్యక్తులు పడిపోయారని పేర్కొంది. మహమ్మారి అదుపులోకి రాని పక్షంలో ఆర్థిక వ్యవస్థ కోలుకోలేదని వెల్లడించారు. వైరస్ రెండో దశ తలెత్తిన పక్షంలో సగటు నిరుద్యోగిత రేటు పది శాతానికి ఎగబాకుతుందని పేర్కొంది. ఆరోగ్య వసతుల్లో పెట్టుబడుల ద్వారా అసమానతలను తగ్గించేందుకు ప్రభుత్వాలు కృషిచేయాలని కోరింది. మందుల సరఫరాలు, వ్యాక్సిన్, చికిత్సతో పాటు మహమ్మారి ప్రభావం అధికంగా ఉన్న రంగాలను ఆదుకునేలా చొరవ చూపాలని ఓఈసీడీ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment