Directorate of Enforcement
-
సిద్ధరామయ్యకు మరో బిగ్ షాక్
న్యూఢిల్లీ: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన మీద మనీలాండరింగ్ కేసులో (PMLA) కింద కేసు నమోదు చేసింది.ముడా కుంభకోణం కేసులో విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు.. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజుల నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం భార్యకు కానుకగా ఇచ్చారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా.. సెంట్రల్ ఏజెన్సీ సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) ద్వారా కేసు నమోదు చేసింది. తద్వారా.. నిందితులను విచారణకు పిలిచేందుకు, విచారణ సమయంలో వారి ఆస్తులను కూడా అటాచ్ చేయడానికి EDకి అధికారం దక్కినట్లయ్యింది.ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారని సామాజిక కార్యకర్త టీజే అబ్రహం, కర్ణాటక గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అబ్రహంతో పాటు స్నేహమయి కృష్ణ, ప్రతీప్ కుమార్ కూడా సీఎంపై ఫిర్యాదు చేశారు. దీంతో ముఖ్యమంత్రిని విచారించాలని గవర్నర్ ఆదేశించారు. అయితే మరోవైపు ఈ ఆదేశాలను రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. దానిని గవర్నర్ తోసిపుచ్చగా విషయం న్యాయస్థానానికి చేరుకుంది. అయితే కోర్టులో సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. ఆయన్ని విచారించేందుకు గవర్నర్ ఆదేశించడం చట్టబద్ధమేనని వ్యాఖ్యానించింది. లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. తర్వాత సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఇప్పుడు ఈ కేసులో మనీలాండరింగ్ అంశంపై ఈడీ కూడా కేసు నమోదు చేయడంతో ఆయనకు మరిన్ని కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. -
మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు.. ఏకకాలంలో 16 చోట్ల తనిఖీలు చేపట్టాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పొంగులేటి నివాసం, ఆయన వ్యాపార సంస్థల కార్యాలయాల్లో ఈడీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఆయన అనుచరులకు సంబంధించిన నివాసాలు, ఆఫీసుల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. కస్టమ్స్ డ్యూటీ ఎగవేత కేసులో నేపథ్యంతోనే ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ రైడ్స్‌కు సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. -
Delhi Liquor Scam Case:శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌లకు 14 రోజుల ఈడీ కస్టడీ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుల కస్టడీ సోమవారంతో ముగియడంతో వారిని ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఐతే ఈ కేసులో నిందితులకు కోర్టులో చుక్కెదురైంది. బినోయ్ బాబు, శరత్ చంద్రారెడ్డిలకు 14 రోజుల జ్యుడీషియల్ ఈడీ కస్టడీని పొడిగిస్తున్నట్లు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీలో ఉన్న నిందితులకు అవసరమైన వైద్య సహాయం అందించాలని అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్ ఆదేశించారు. ఈ మేరకు జైలులో బినోయ్ బాబుకు వాటర్‌ఫ్లాస్క్, ఇంటి భోజనం, రెండు జతల బట్టలు, ఘూస్ వంటి వాటిని అనుమతించింది. అలాగే శరత్ చంద్రారెడ్డికి ఇంటి భోజనం తోపాటు, క్రోనిక్ బ్యాక్ పెయిన్ వైద్య చికిత్స, హైపర్ టెన్షన్ మందులు, ఉలెన్ బట్టలు, ఘూస్ వంటి వాటికి కోర్టు అనుమతించింది. లిక్కర్ స్కామ్‌లో ఇద్దరూ నిందితులను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ అధికారులు..నిందితులకు కస్టడీని మరిన్ని రోజులు పొడిగించాల్సిందిగా అభ్యర్థించడంతో అవెన్యూ కోర్టు ఈ జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అవెన్యూ కోర్టు డిసెంబర్ 5కు వాయిదా వేసింది. (చదవండి: ఆమెకు రూ.10కోట్లు కావాలి అందుకే ఇలా...: కాంగ్రెస్ ఎమ్మెల్యే) -
చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీకి కేంద్రం భారీ షాక్!
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షావోమీకి భారీ షాక్ తగిలింది. షావోమీ సంస్థకు చెందిర రూ.5,551కోట్ల నగదును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీజ్ చేశారు. ఈడీ చరిత్రలో తొలిసారి అత్యధిక మొత్తం నగదు సీజ్ చేసిటన్లు తెలుస్తోంది. అయితే ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించి షావోమీ విదేశాలకు డబ్బు మళ్లించిట్లు తేలింది. రాయల్టీ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బును ఎగ్గొట్టి ఈ ఘనకార్యానికి పాల్పడడంతో ఈడీ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. The Competent Authority appointed under FEMA has confirmed the seizure order of Rs 5551.27 Crore passed today by the ED against Xiaomi Technology India Private Limited under the provisions of FEMA: Enforcement Directorate pic.twitter.com/bXdVaF6v9n — ANI (@ANI) September 30, 2022 -
National Herald Case: రెండో రోజు 11 గంటలు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రిక మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని మంగళవారం రెండో రోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 11 గంటలకు పైగా సుదీర్ఘంగా విచారించింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి బయల్దేరి ఉదయం 11.05కు సోదరి ప్రియాంకతో కలిసి ఆయన ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. 11.30కు విచారణ ప్రక్రియ మొదలైనట్టు అధికారులు తెలిపారు. నాలుగు గంటల అనంతరం మధ్యాహ్న.ం 3.30కు భోజన విరామమిచ్చారు. తర్వాత 4.30 నుంచి రాత్రి 11.30 దాకా విచారణ సాగింది. నేషనల్ హెరాల్డ్–ఏజేఎల్–యంగ్ ఇండియా లావాదేవీలకు సంబంధించిన కీలక అంశాలపై రాహుల్‌ను మరింత లోతుగా ప్రశ్నించి ఆయన సమాధానాలను, వివరణను రికార్డు చేసినట్టు చెబుతున్నారు. వాటిని రాహుల్ కూలంకషంగా పరిశీలించినట్టు సమాచారం. అధికారులు తరచూ విరామమిస్తూ విచారణ కొనసాగించారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం కూడా విచారణకు రావాలని ఈడీ అధికారులు రాహుల్‌ను ఆదేశించారు. ఒక క్రిమినల్ కేసులో గాంధీ కుటుంబ వ్యక్తి ఒకరిని దర్యాప్తు సంస్థలు విచారించడం ఇదే తొలిసారి. రాహుల్‌ను సోమవారం తొలి రోజు 10 గంటలకు పైగా ఈడీ విచారించడం తెలిసిందే. ఈ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీని కూడా 23న ఈడీ విచారించనుంది. రాజస్తాన్‌లో ఓ భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ప్రియాంక భర్త రాబర్ట్ వద్రాను ఈడీ కొన్నేళ్ల క్రితం విచారించింది. భారీగా అరెస్టులు విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సోమవారం మాదిరిగానే నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఢిల్లీలో ఆందోళనలు కొనసాగించారు. ఉదయం రాహుల్ నేతృత్వంలో ఏఐసీసీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైరాం రమేశ్, రణ్‌దీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్, అధీర్ రంజన్ చౌధరి, దీపీందర్ హుడా, పలువురు పార్టీ ఎంపీలు, సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగెల్ తదితర నేతలను పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈడీ విచారణను కేంద్రం రాజకీయ కక్షసాధింపు చర్యగా ఈ సందర్భంగా నేతలు అభివర్ణించారు. విచారణను తప్పించుకునేందుకు నిరసనల పేరిట కాంగ్రెస్ ఇలా డ్రామాలాడుతోందని బీజేపీ దుయ్యబట్టింది. -
బొల్లినేని గాంధీపై క్రిమినల్ కేసు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లో పనిచేసినప్పుడు తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని, తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు ఆదేశాలు, సూచనల మేరకు నడుచుకున్న బొల్లినేని శ్రీనివాసగాంధీపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఈయనపై సీబీఐ, ఈడీల్లో మూడు కేసులు ఉన్నాయి. తాజాగా గాంధీతోపాటు జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్, అదనపు కమిషనర్ ఆనంద్ కుమార్, డిప్యూటీ కమిషనర్ చిల్కల సుధారాణి, సూపరింటెండెంట్ ఇస్బెల్లా బ్రిట్టోలపై గత శుక్రవారం క్రిమినల్ కేసు నమోదైంది. వివరాలివీ.. ►బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన జేఎస్ శ్రీధర్‌రెడ్డి హైదరాబాద్ స్టీల్స్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఇందులో కొన్నాళ్లు ఆయన భార్య జె.రాఘవిరెడ్డి భాగస్వామిగా ఉన్నారు. తర్వాత తన భర్తకే ఆమె జీపీఏ ఇచ్చారు. అయితే 2019లో ఆ సంస్థపై జీఎస్టీ ఎగవేత ఆరోపణలు రావడంతో సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అదే ఏడాది ఫిబ్రవరి 27 సాయంత్రం 5.30 గంటలకు ఐదుగురు వ్యక్తులు శ్రీధర్‌రెడ్డి ఇంటికి వెళ్లి తాము జీఎస్టీ అధికారులమని, ఇంట్లో సోదాలు చేయాలని చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు చూపించలేదు. వీరంతా తీవ్ర అభ్యంతరకరంగా, ఇంట్లోని వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రవర్తించారు. ►తన భర్త విదేశాల్లో ఉన్నారని, తిరిగి వచ్చాక వివరణ ఇస్తారని రాఘవిరెడ్డి చెప్పినా వారు వినిపించుకోలేదు. సోదాల సమయంలో బాధితురాలి ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులూ ధ్వంసమయ్యాయి. జీఎస్టీ అధికారుల తీరుతో బాధితురాలి కుటుంబీకులు భయభ్రాంతులకు లోనయ్యారు. ►కొన్ని గంటలపాటు జరిగిన సోదాల్లో శ్రీధర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో అధికారులు బాధితురాలిని బషీర్‌బాగ్‌లోని తమ కార్యాలయానికి తరలించి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల వరకు నిర్బంధించారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో గాంధీతోపాటు సుధారాణి ఆ కార్యాలయానికి వచ్చారు. బాధితురాలిని బెదిరిస్తూ రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేశారు. ►ఆ మొత్తం లంచం తమ కోసమేకాదని, ప్రిన్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్, అదనపు కమిషనర్ ఆనంద్ కుమార్లకూ వాటా ఇవ్వాల్సి ఉంటుందని గాంధీ ఆమెతో చెప్పారు. తాను 2009లోనే భర్త పేరుతో జీపీఏ ఇచ్చానని చెప్పినా వాళ్లు వినిపించుకోలేదు. అయినప్పటికీ తాము పట్టించుకోబోమంటూ వారిద్దరూ బాధితురాలిపై తీవ్ర, అసభ్య పదజాలం వాడారు. ఆమె చూపిస్తున్న జీపీఏ కాపీలను గాంధీ చింపి నేలపై పడేశారు. తెల్లవారుజాము 4 గంటల వరకు ఈ తతంగం నడిచింది. ►అదేరోజు మధ్యాహ్నం మరోసారి కార్యాలయానికి రావాలంటూ రాఘవిరెడ్డిని బెదిరించి పంపారు. ఇస్బెల్లా బ్రిట్టో తన వాహనంలో ఆమెను ఇంటికి చేర్చారు. మధ్యాహ్నం మరోసారి ఆమెను బలవంతంగా జీఎస్టీ కార్యాలయానికి తరలించారు. అయితే ఆ సందర్భంలో ఆనంద్ కుమార్ అభ్యంతరంగా ప్రవర్తించారంటూ బాధితురాలు జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్ ఆదేశాల మేరకు గత శుక్రవారం ఐదుగురిపై ఐపీసీ 354, 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ►గాంధీతోపాటు సుధారాణి 2021 ఫిబ్రవరి నుంచి సస్పెన్షన్‌లో ఉన్నారు. -
డ్రగ్స్ కేసు విచారణను ప్రభుత్వం అడ్డుకుంటోంది..
సాక్షి, హైదరాబాద్: సినీ సెలబ్రిటీల డ్రగ్ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని టీపీసీసీ అధ్యక్షుడు, రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గుట్కా, మట్కా, పేకాట లేవని ముఖ్య మంత్రి చెప్తున్నా, అందుకు విరుద్ధంగా ఇవన్నీ ఇక్కడ జోరుగా సాగుతున్నాయని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ జరిపిన సినీ సెలబ్రిటీల డ్రగ్ కేసు విచారణలో అనేక లోపాలున్నాయని అన్నారు. తాను ఇదివరకు వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేయాలని ఆదేశించిందని చెప్పారు. అయితే ఎక్సైజ్ విభాగం ఇప్పటివరకు ఈడీకీ కేసు పూర్వాపరాలు, ఆధారాలను ఇవ్వకపోవడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఆయన శుక్రవారం ఈడీ జాయింట్ డైరెక్టర్‌ను కలసి మరోసారి ఫిర్యాదు చేశారు. రాజకీయ నేతలు ప్రమేయం ఉండటం వల్లే ప్రభుత్వం ఈడీ విచారణకు సహకరించడంలేదని ఆరోపించారు. కాగా, సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఆదర్శంగా ఉండాలని కోరిన రేవంత్‌రెడ్డి.. 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, డగ్స్ కేసులో ఎంత పెద్ద హీరో ఉన్నా వదిలేది లేదని స్పష్టం చేశారు. చదవండి: మందు కొడితే మాకుమేమే రౌడీలం -
Tollywood Drugs Case: కాల్ డేటా రికార్డింగ్స్ ఎక్కడ? ప్రశ్నించిన ఈడీ
-
మహారాష్ట్ర తలవంచదు
ముంబై: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడికి శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ లేఖ రాశారు. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహకరించాలంటూ కొందరు వ్యక్తులు దాదాపు నెల రోజుల క్రితం తనను సంప్రదించాలని లేఖలో పేర్కొన్నారు. సహకరించకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారని చెప్పారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావాలన్నదే వారి ఉద్దేశమని తెలిపారు. అలాగే ట్విట్టర్లో శివసేన గుర్తు పులి ఫొటోను పోస్టు చేశారు. జుఖేంగే నహీ.. జై మహారాష్ట్ర (మహారాష్ట్ర తలవంచదు) అని ట్వీట్ చేశారు. శివసేన నేతృత్వంలోని ఎంవీఏ ప్రభుత్వం పూర్తికాలం.. ఐదేళ్లూ అధికారంలోకి కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలను దురుద్దేశపూర్వకంగా ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎంవీఏ సర్కారు ఏర్పాటైన తర్వాత శివసేన నాయకులను కేంద్ర దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఉపరాష్ట్రపతికి రాసిన లేఖలో వెల్లడించారు. రాజ్యసభ సభ్యులపై వేధింపులను అడ్డుకోవాలని కోరారు. ఈ విషయంలో ఉపరాష్ట్రపతి స్పందించాలని, తగిన చర్యలు తీసుకోవాలని సంజయ్ రౌత్ విన్నవించారు. ఉపరాష్ట్రపతికి తాను రాసిన లేఖ ఒక ట్రైలర్ మాత్రమేనని సంజయ్ రౌత్ అన్నారు. బీజేపీ క్రిమినల్ సిండికేట్‌ను ముందుండి నడిపిస్తున్న ఈడీ అధికారులు బాగోతం బయటపెడతానని తేల్చిచెప్పారు. మనీ ల్యాండరింగ్ పేరిట వేధింపులు మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద నాతో పాటు మరో ఇద్దరు మహారాష్ట్ర మంత్రులను జైలుకు పంపిస్తామని బెదిరించారని తెలిపారు. రాష్ట్రంలోని ముఖ్యమైన నాయకులందరినీ జైలుకు పంపితే మధ్యంతర ఎన్నికలు వస్తాయని వారు భావించారని చెప్పారు. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం 2003 జనవరి 17న అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. కానీ, అంతకంటే ముందు జరిగిన డబ్బు లావాదేవీలు కూడా మనీ ల్యాండరింగే అంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, వేధింపులకు దిగుతున్నాయని ఆరోపించారు. 2012–13లో తనకు, తన కుటుంబ సభ్యులకు భూమిని విక్రయించిన వారిని ఈడీ బెదిరిస్తోందని, తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని హుకుం జారీ చేస్తోందని ధ్వజమెత్తారు. తన కుమార్తె పెళ్లిలో అలంకరణ పనులు చేసిన వారిని సైతం వెంటాడుతోందని, నేను వారికి రూ.50 లక్షలు ఇచ్చినట్లుగా ప్రకటన చేయాలని భయపెడుతోందని దుయ్యబట్టారు. తనకు సంబం« దించిన ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు 28 మందిని అదుపులోకి తీసుకొని, ప్రశ్నించాయన్నారు. ఈడీ కనుసన్నల్లో అక్రమాలు స్వేచ్ఛగా భావాలను వెల్లడించే హక్కు తనకుందని, ఆ హక్కుపై దర్యాప్తు సంస్థలు దాడి చేస్తున్నట్లుగా భావిస్తున్నానని సంజయ్ రౌత్ చెప్పారు. సిండికేట్, బ్లాక్‌మెయిలింగ్, మనీ ల్యాండరింగ్ వంటి అక్రమ వ్యవహారాలు ఈడీ కనుసన్నల్లో సాగుతున్నాయని ఆరోపించారు. తనను జైలుకు పంపిస్తే వెళ్తానని, తన తర్వాత బీజేపీ నాయకులు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. తాము ఎలాంటి తప్పులు చేయలేదని, బీజేపీ నేతలే ఎన్నో పాపాలు చేశారని అన్నారు. తాము భయపడతామని అనుకుంటే అది పొరపాటేనని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎవరు సాయం అడిగారని ప్రశ్నించగా... దానిపై త్వరలో మాట్లాడతానని సంజయ్ రౌత్ బదులిచ్చారు. అది ఢిల్లీ, ముంబైకి చెందిన నాయకుల ఉమ్మడి కుట్ర అని పేర్కొన్నారు. గత ఏడాది ఉప ఎన్నికలో దాద్రా నగర్ హవాలీ ఎంపీ సీటును శివసేన గెలుచుకుందని, అప్పటి నుంచి తమ పార్టీకి ఇక్కట్లు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో మహారాష్ట్రలో బీజేపీదే అధికారం మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మహారాష్ట్రలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. మార్చి 10న ఫలితాలు బహిర్గతమైన తర్వాత మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ రావడం తథ్యమని జోస్యం చెప్పారు. శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. -
డ్రగ్స్‌పై ఈడీ అమీతుమీ!
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో అమీతుమీ తేల్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంసిద్ధమైంది. పాత కేసుల్లో స్పష్టత రానందున వాటిని మళ్లీ తిరగతోడే పనిలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. హైకోర్టు ఆదేశాలతో 2017లో జరిగిన సినీ ప్రముఖుల డ్రగ్స్ వ్యవహారంలో ఈడీ అధికారులు మరోసారి విచారణకు సిద్ధమవుతుండటం సంచలనం రేపుతోంది. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను ఈడీకి అప్పగించాలని హైకోర్టు ఎక్సైజ్ శాఖను ఆదేశించడంతో కేసు దర్యాప్తు హీటెక్కినట్టు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని పంజగుట్ట పోలీసులు విచారిస్తున్న డ్రగ్స్ పెడ్లర్ (అక్రమ సరఫరాదారు) టోనీ వ్యవహారంపైనా ఈడీ దృష్టిపెట్టింది. విదేశాలకు నిధుల తరలింపుతోపాటు రూ. కోట్లు బదిలీ చేసి వ్యాపారవేత్తలు డ్రగ్స్ దందాలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు అనుమానిస్తోంది. పొంతన లేని విచారణ 2017లో డ్రగ్స్ వాడారన్న కేసులో మనీలాండరింగ్ జరిగిందని భావించిన ఈడీ 13 మంది సినీ ప్రముఖులను విచారించింది. అయితే ఈ విచారణలో ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి సహకారం అందలేదని ఈడీ హైకోర్టుకు తెలిపింది. అప్పుడు విచారణ సమయంలోనూ ఈడీ అనేక అనుమానాలు వ్యక్తంచేసింది. కేసు విచారణలో బయటకొచ్చిన అంశాలకు, దాఖలు చేసిన చార్జిషీట్లకు పొంతనలేదన్న భావనలో ఈడీ అధికారులున్నట్టు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో అప్పటి కాల్‌డేటా, నిందితుల బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకొని మరోసారి పూర్తిస్థాయిలో విచారించాలని భావిస్తోంది. ఈ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను విచారించాలని యోచిస్తోంది. విచారణ సమయంలో తమకు సహకరించలేదని, మనీలాండరింగ్ అంశాలు బయటకు రాకుండా వ్యవహరించారని అనుమానిస్తోంది. వీరిని విచారిస్తే రాష్ట్రంలో సంచలనంగా మారే అవకాశం ఉంది. రాష్ట్ర అధికారులను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారనుంది. వ్యాపారవేత్తలకు నోటీసులు! హైదరాబాద్ డ్రగ్ కేసులో టోనీ, ప్రముఖ వ్యాపారవేత్తల వ్యవహారంపైనా ఈడీ చర్యలు చేపట్టింది. వ్యాపారవేత్తల ద్వారా సమకూరిన డబ్బును నైజీరియాకు తరలించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో ఈ కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద విచారణ జరపాలని భావిస్తోంది. ఈ కేసులో పట్టుబడ్డ 31 మంది వ్యాపారవేత్తల నుంచి హవాలా రూపంలో డ్రగ్స్ కొనుగోలు జరిగిందా అన్న కోణంలోనూ విచారించాలని యోచిస్తోంది. వ్యాపారవేత్తలకు నోటీసులు జారీచేసి విచారించాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. -
కార్వీ ఎండీ పార్థసారథి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్(కేఎస్‌బీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. మదుపరుల అనుమతి లేకుండా వారి షేర్లను బదలాయించడంతోపాటు సెబీ నిబంధనలు ఉల్లంఘించి తీసుకున్న బ్యాంకు రుణాలను వ్యక్తిగత, షెల్ కంపెనీలకు మళ్లించిన నేరంలో ఆయనను సోమవారం ఉదయం బెంగళూర్‌లో పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. కార్వీలో జరిగిన కుంభకోణంపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పార్థసారథితోపాటు ఇతర డైరెక్టర్లపై ఇప్పటికే కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే తరహా కేసులో బెంగళూర్ పోలీసులు కూడా పార్థసారథిని పీటీ వారెంట్‌పై తీసుకెళ్లి విచారించారు. సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో కార్వీకి చెందిన 14 కార్యాలయాలు, ఎండీ, ఇతర కీలక వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేసింది. కార్వీ షేర్లు కొన్న మదుపరుల పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా వారికి తెలియకుండా షేర్లను తన వ్యక్తిగత ఖాతాలోకి బదలాయించుకొని వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.3 వేల కోట్లు రుణంగా పార్థసారథి పొందినట్టు ఈడీ గుర్తించింది. ఐసీఐసీఐ, ఇండస్ బ్యాంకుల ద్వారా పొందిన రూ.1,100 కోట్ల రుణంను తన ఖాతాలతోపాటు షెల్ కంపెనీలైనా కార్వీ రియాల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, మరో 7 కంపెనీలోకి మళ్లించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ గుర్తించింది. డీమ్యాట్ అకౌంట్లు బ్లాక్ లిస్ట్‌లో ఉన్నా పార్థసారథి సెబీ నిబంధనలు ఉల్లంఘించి ఇలా తనఖా పెట్టి షేర్ల ద్వారా రుణాలను షెల్ కంపెనీల్లోకి మళ్లించినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. రూ.700 కోట్ల షేర్లు ఫ్రీజ్ గతేడాది సెప్టెంబర్‌లో ఈడీ రూ.700 కోట్ల విలువైన కార్వీ స్టాక్ బ్రోకింగ్ షేర్లను ఫ్రీజ్ చేసింది. కస్టమర్లకు తెలియకుండా బదలాయించుకున్న షేర్లకు సంబంధించిన రూ.1,906 కోట్లను కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ నుంచి కార్వీ రియాల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లోకి బదలాయించినట్టు ఈడీ దర్యాప్తులో గుర్తించినట్టు తెలిసింది. మిగిలిన రూ.1,800 కోట్ల లావాదేవీలపై విచారణను ముమ్మరం చేసింది. డబ్బును ఎక్కడికి మళ్లించారు, దేనికి వాడారో తేల్చేందుకు పార్థసారథిని మరింత లోతుగా విచారించనుంది. ఇందుకు కోర్టులో కస్టడీ పిటిషన్ వేసి విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు. కాగా, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను షెల్ కంపెనీకు మళ్లించిన ఆధారాలను ఆటోమేటెడ్ డిలీట్ సాఫ్ట్‌వేర్‌తో పార్థసారథి ధ్వంసం చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. వీటిని వెలుగులోకి తేవాల్సి ఉందని ఈడీ భావిస్తోంది. -
ఎమ్మార్ కేసులో ఈడీ విచారణ నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో స్టైలిష్ హోం డైరెక్టర్ తుమ్మల రంగారావుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు విచారణను 3 రోజులు నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సీబీఐ కేసును తొలగించినా సీబీఐ కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ.. తనను నిందితునిగా చేర్చడా న్ని సవాల్ చేస్తూ రంగారావు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ పి.మాధవీల త శుక్రవారం విచారించారు. ఆయన అప్రూవర్‌గా మారి సీఆర్పీసీ 164 కింద వాంగ్మూ లం ఇచ్చారు. దీంతో ఆయన్ను సీబీఐ కేసులో నిందితుల జాబితా నుంచి తొలగించారు. -
బ్యాంకులకు రూ.402 కోట్లు బురిడీ
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి కొనుగోళ్లు లేకపోయినా ఉన్నట్టు సృష్టించి బ్యాంకులను రూ.402 కోట్లు బురిడీ కొట్టించిన సర్వో మ్యాక్స్ ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ ఎండీ, ప్రమోటర్ అవసరాల వెంకటేశ్వర్రావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం అరెస్ట్ చేసింది. నకిలీ అకౌంట్ బుక్కులు, నకిలీ కొనుగోళ్లతో ఎక్కువ లాభాలు చూపించి పలు బ్యాంకులను మోసం చేసినందుకు వెంకటేశ్వర్రావుపై సీబీఐ 2018లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఈడీ, కోర్టు అనుమతితో మనీలాండరింగ్ కింద విచారణ ప్రారంభించింది. విచారణలో ఈడీ అధికారులు అనేక లోపాలను గుర్తించారు. సర్వోమ్యాక్స్ ఇండియా లిమిటెడ్ పేరుతో బ్యాంకుల నుంచి రూ.402 కోట్లు రుణం తీసుకొని ఎలాంటి కొనుగోళ్లు చేయకుండానే నష్టం వచ్చినట్టు మోసానికి పాల్పడ్డారని, కొనుగోళ్లు చేసినట్టు నకిలీ పత్రాలు సృష్టించారని, ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించి అకౌంట్ బుక్కులో నమోదు చేశారని గుర్తించారు. రుణంగా పొందిన డబ్బును ఇతర కంపెనీలకు మళ్లించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ అధికారులు దర్యాప్తులో వెలుగులోకి తీసుకువచ్చారు. ఆర్థిక నేరాలపై సాక్ష్యాలతో వెంకటేశ్వరరావును కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు 14రోజుల రిమాండ్ విధించినట్టు ఈడీ వెల్లడించింది. -
పనామా పేపర్స్ కేసులో ఈడీ ముందుకు ఐశ్వర్యా రాయ్
న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పనామా పేపర్స్’ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. ఈడీ ఆదేశాల మేరకు సోమవారం ఆమె ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. ఫారెన్ ఎక్సే్చంజ్ మేనేజ్మెంట్ (ఫెమా) చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై కొనసాగుతున్న కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఐశ్వర్య వాంగ్మూలాన్ని తీసుకున్నారు. దాదాపు ఆరు గంటలపాటు ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా అధికారులకు ఐశ్వర్య పలు డాక్యుమెంట్లను అందజేశారు. విదేశాలకు నిధుల మళ్లింపునకు సబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ 2016–17 నుంచి దర్యాప్తు చేస్తోంది. 2004లో ఆర్బీఐ సరళీకరించిన విదేశీ పెట్టుబడుల పథకం(ఎల్ఆర్ఎస్), ఫెమా చట్టాలను ఉల్లంఘించి 2005లో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌లో ఆమె తల్లిదండ్రులతో కలసి అమిక్ పార్ట్నర్స్ సంస్థను నెలకొల్పారని, దీనిపై బచ్చన్ కుటుంబం వివరణ ఇవ్వాలని ఈడీ గతంలోనే నోటీసులిచ్చింది. ఈ విషయంలో ఐశ్వర్యకు సమన్లు జారీచేయగా తనకు మరికొంత సమయం కావాలని ఆమె గతంలో రెండుసార్లు విన్నవించుకున్నారు. సోమవారం ఐశ్వర్యను ఈడీ అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. పన్నుల బాదరబందీలేని, పెట్టుబడులకు స్వర్గధామంగా భావించే బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో అనేక దేశాలకు చెందిన సంపన్నులు, నేతలు, సెలబ్రిటీలు రహస్య పెట్టుబడులు పెట్టారని, తద్వారా సొంత దేశాలకు భారీ స్థాయిలో పన్నులు ఎగ్గొట్టారని గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. పనామాకు చెందిన ఆర్థిక, కార్పోరేట్ సేవల సంస్థ మొసాక్ ఫోన్సెకా ద్వారా వీరంతా పెట్టిన పెట్టుబడులు, ఎగ్గొట్టిన పన్నుల సమగ్ర వివరాలను వాషింగ్టన్కు చెందిన ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే).. పనామా పేపర్స్ పేరిట విడుదల చేసి ప్రకంపనలు సృష్టించిన సంగతి తెల్సిందే. దాదాపు 1.15 కోట్ల డాక్యుమెంట్లతో 2016 ఏడాదిలో వెలుగుచూసిన ఈ ఉదంతంలో భారతీయులకు చెందిన 426 ఆర్థిక ఉల్లంఘనల కేసులూ బయటపడ్డాయి. వాటిలో ఐశ్వర్య డైరెక్టర్‌గా ఉన్న సంస్థా ఉంది. 2009లో ఐశ్వర్య ఆ సంస్థ నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో ఆమె మామ అమితాబ్ బచ్చన్‌నూ ఈడీ ప్రశ్నించింది. పెట్టుబడులన్నీ భారతీయ చట్టాలకు లోబడే జరిగాయని ఆయన గతంలో వివరణ ఇచ్చారు. మీకు గడ్డుకాలం మొదలవుతుంది రాజ్యసభలో బీజేపీ ఎంపీలకు జయా బచ్చన్ శాపం సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయా బచ్చన్, బీజేపీ సభ్యులకు మధ్య సోమవారం రాజ్యసభలో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఎన్డీపీఎస్ (సవరణ) బిల్లుపై జయ మాట్లాడుతూ... 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ అంశాన్ని లేవనెత్తారు. సభాపతి స్థానంలో ఉన్న భువనేశ్వర్ కలితా కూడా గతంలో వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపిన వారేనన్నారు. దీంతో బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా తనపై వ్యక్తిగత కామెంట్లు చేశారని జయ ఆరోపించారు. ఒకదశలో సహనం కోల్పోయిన ఆమె బీజేపీ ఎంపీలను ఉద్దేశిస్తూ ‘మీకు త్వరలోనే గడ్డుకాలం మొదలవుతుంది. ఇదే నా శాపం’ అని ఆగ్రహించారు. కోడలు ఐశ్వర్య ఈడీ విచారణకు హాజరైన రోజే.. ఇది చోటుచేసుకోవడం గమనార్హం. ‘సభలో నాపై వ్యక్తిగత కామెంట్లు చేశారు. నా పైనా, నా కెరీర్ పైనా వ్యాఖ్యలు చేశారు. ఇది దురదృష్టకరం. వారలా మాట్లాడాల్సింది కాదు. మీరు సదరు సభ్యుడిపై చర్యలు తీసుకోవాలి. సభాపతి స్థానంలో కూర్చున్నారు కాబట్టి మీరు ఏ పార్టీకి చెందిన వారు కాదు సార్. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి’ అని భువనేశ్వర్ కలితాను ఉద్దేశించి జయాబచ్చన్ అన్నారు. తర్వాత కూడా అధికార, విపక్షాలకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడంతో రాజ్యసభ వాయిదా పడింది. వీటికి మీ సమాధానమేంటి ? 1. 2005లో అమిక్ పార్ట్నర్స్ పేరిట నెలకొల్పిన కంపెనీతో మీకున్న సంబంధాలేంటి? 2. కంపెనీ తొలినాళ్లలో మీరు, మీ తండ్రి కె.రమణ కృష్ణ రాయ్, తల్లి కవిత, సోదరుడు ఆదిత్య తలా 12,500 డాలర్లు మొత్తంగా 50వేల డాలర్ల ప్రారంభ పెట్టుబడులు పెట్టారు. ఆ కంపెనీకి డైరెక్టర్‌గా ఎందుకున్నారు? 3. 2005 జూన్‌లో డైరెక్టర్ నుంచి షేర్‌హోల్డర్‌గా ఎందుకు మారారు? 4. 2008 నుంచి సంస్థ ఎందుకు క్రియాశీలకంగా లేదు? 5. ఆర్థిక లావాదేవీలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుమతుల వివరాలు చెప్పండి? 6. మీ సంస్థను మొసాక్ ఫోన్సెకాయే రిజిస్టర్ చేసిందని మీకు తెలుసా? -
గుట్టుగా కోర్టుకు సుజనా
సాక్షి ప్రతినిధి, చెన్నై: మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో భారతీయ జనతా పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి కోర్టుకు హాజరయ్యారు. తప్పుడు పత్రాలను సమర్పించి బ్యాంకుల నుంచి వందలకోట్ల రూపాయలను రుణాలుగా పొంది ఎగవేయడంతో ఈడీ ఈ కేసు నమోదు చేసింది. చెన్నై జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న ప్రజాప్రతినిధుల కోర్టుకు సుజనా చౌదరి శనివారం ఉదయం 11.10 గంటలకు న్యాయవాదులు, మరికొందరితో కలిసి వచ్చారు. ఈ కేసులో ఆయన ఆరో నిందితునిగా ఉన్నారు. గతంలో ఇదే కేసులో ఆయన వివిధ కారణాలతో దాదాపు పలుమార్లు విచారణకు గైర్హాజరయ్యారు. తాజాగా అక్టోబర్ 29న చెన్నైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టుకు సుజనా హాజరుకావాల్సి ఉండగా.. ఆ రోజు కూడా ఆయన రాలేదు. శనివారం మందీ మార్బలంతో ఆయన కోర్టుకు చేరుకున్నారు. ఉదయం సుమారు 11.20 నిమిషాలకు లోనికి వెళ్లిన ఆయన మధ్యాహ్నం 12.45 గంటలకు బయటకు వచ్చారు. ప్రత్యేక అనుమతితో అత్యంత గోప్యంగా ఢిల్లీ నుంచి వచ్చిన సుజనాకు ఈ కేసులో వెనువెంటనే బెయిల్ మంజూరయినట్లు తెలిసింది. దౌర్జన్యంగా వీడియో దృశ్యాల తొలగింపు కాగా సుజనాచౌదరి కోర్టు మొదటి అంతస్తులోకి న్యాయవాదులతో కలిసి వస్తున్న దృశ్యాలను ‘సాక్షి’ ప్రతినిధి సెల్ఫోన్లో వీడియో తీశారు. ఈ విషయాన్ని పసిగట్టిన సుజనా వాటిని తొలగించాల్సిందిగా న్యాయవాదులను పురమాయించారు. నలుగురు న్యాయవాదులు సాక్షి ప్రతినిధిని చుట్టుముట్టి సెల్ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలను తొలగించాల్సిందిగా కోరారు. మీ విధులు మీరు నిర్వర్తిస్తున్నట్లే.. నా విధులు నిర్వర్తించడం నా కర్తవ్యం, అడ్డుకునే హక్కు మీకు లేదని విలేకరి వాదించినా వినిపించుకోలేదు. దౌర్జన్యంగా సెల్‌ఫోన్‌ను లాక్కుని మరీ వీడియోను డిలీట్ చేశారు. -
మహేశ్ బ్యాంక్ ఎండీకి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: ఏపీ మహేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఎండీ ఎ.ఉమేశ్‌చంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. ఉమేశ్‌చంద్రపై నమోదు చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును నిలిపివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేశారని, ఈ కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరుకావాలంటూ ఈడీ ఇచ్చిన సమన్లను సవాల్ చేస్తూ ఉమేశ్‌చంద్ర దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. బ్యాంకు పాలకమండలి ఎన్నిక సందర్భంగా నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేయడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. ఇది ఈడీ దర్యాప్తు నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ మేరకు స్పందించిన న్యాయమూర్తి... తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు దర్యాప్తు నిలిపివేయాలని, అలాగే ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. -
ఈడీ, సీబీఐ చీఫ్‌ల ‘పొడిగింపు’పై సుప్రీం తలుపుతట్టిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అధినేతల పదవీకాలం పొడగింపునకు వీలుకల్పిస్తూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకెక్కింది. ఆయా అత్యున్నత పదవుల్లోని ఉన్నతాధికారులను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులపై పక్షపాత ధోరణిలో దాడులు, దర్యాప్తులకు ఆదేశించేందుకే సర్కార్ వారి పదవీకాలాన్ని పొడిగించిందంటూ విపక్షాలు నిరసన వ్యక్తంచేస్తుండటం తెలిసిందే. ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీకాలం ఐదేళ్లవరకు పొడిగిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తేవడం వివాదమైంది. దీంతో కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దర్యాప్తు సంస్థల స్వతంత్రత కాపాడేలా గతంలో కోర్టు ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించేలా ఈ ఆర్డినెన్స్‌లను తెచ్చారని, దర్యాప్తు సంస్థలపై ప్రభుత్వ ఒత్తిడి తొలగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోర్టును కోరారు. -
అది సభా హక్కుల ఉల్లంఘనే
కోల్‌కతా: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీఐబీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చెందిన ఇద్దరు అధికారులపై పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బుధవారం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హక్కుల తీర్మానం ప్రవేశపెట్టింది. నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసేటప్పుడు ముందస్తుగా సమాచారం అందివ్వలేదని అది సభాహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆ తీర్మానం పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ మంత్రి తపస్ రాయ్ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నారద స్టింగ్ ఆపరేషన్ కేసుకి సంబంధించి ఈ ఏడాది మొదట్లో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిరాద్ హకీమ్, మదన్ మిత్రా, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని, వారిని అరెస్ట్ చేయడానికి ముందు స్పీకర్ బిమన్ బెనర్జీ అనుమతి తీసుకోలేదని, ఆయనకు ఏ విధమైన సమాచారాన్ని కూడా అందివ్వలేదని తపస్ రాయ్ చెప్పారు. ఈడీ కూడా వారి ముగ్గురిపై అభియోగాలు నమోదు చేసిందని వెల్లడించారు. సీబీఐ, ఈడీ సభా హక్కుల్ని ఉల్లంఘించారని, స్పీకర్‌కు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదన్నారు. సీబీఐ డిప్యూటీ ఎస్పీ సత్యేంద్ర సింగ్, ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ రతిన్ బిశ్వాస్‌పై సభా హక్కుల ఉల్లంఘనను ప్రవేశపెడుతున్నట్టుగా వెల్లడించారు. ఈ అంశాన్ని స్పీకర్ బిమన్ బెనర్జీ హక్కుల కమిటీ పరిశీలనకు పంపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా దీనిపై విచారణ జరిపి నివేదిక అందించాలని విజ్ఞప్తి చేశారు. -
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ పదవీకాలం ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాము అనుకున్నదే చేస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్ల దాకా పొడిగించే వెసులుబాటును కల్పిస్తూ ఇటీవలే వివాదాస్పద ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చిన కేంద్రం... దీనికి అనుగుణంగానే ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని బుధవారం మరో ఏడాదిపాటు పెంచింది. 1984 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన మిశ్రా 2018 నవంబరు 18న రెండేళ్ల పదవీకాలానికి ఈడీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2020లో ఆయన పదవీకాలాన్ని పెంచుతూ... రెండేళ్ల బదులు మూడేళ్లకు గాను ఆయన్ను ఈడీ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర నియామక ఉత్తర్వులను సవరించింది. కొందరు దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా... ఆ ఒక్కసారికి పొడిగింపునకు సమ్మతించిన కోర్టు తదుపరి మాత్రం సంజయ్‌కుమార్ మిశ్రాకు పొడిగింపు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. అయినప్పటికీ సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం పదవీకాలాన్ని పెంచుతూ ఆర్డినెన్స్ తెచ్చి... మిశ్రాకు మరో ఏడాది పొడిగింపునిచ్చింది. గురువారం ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా... 2022 నవంబరు 18 దాకా ఆయన పదవిలో కొనసాగుతారని బుధవారం ఆదేశాలు జారీచేసింది. జాబితాలోకి విదేశాంగ కార్యదర్శి పదవీకాలం పొడిగింపు అర్హుల జాబితాలో విదేశాంగ కార్యదర్శిని చేరుస్తూ కేంద్రం ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను సవరించింది. రక్షణ, హోంశాఖ కార్యదర్శులు, ఐబీ డైరెక్టర్, ‘రా’ కార్యదర్శి, సీబీఐ, ఈడీల డైరెక్టర్ల పదవీకాలాన్ని గరిష్టంగా ఐదేళ్ల వరకు పొడిగించేలా ఆదివారం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో విదేశాంగ కార్యదర్శిని చేర్చింది. -
అనిల్ దేశ్‌ముఖ్‌కు షాక్.. ఈ నెల 12 వరకు ఈడీ కస్టడి
ముంబై: వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రికి ముంబై హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడికీ ఈ నెల 12 వరకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. నవంబర్ 1న మనీలాండరింగ్ కేసులలో అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్ అయ్యారు. అయితే శనివారం పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు అనిల్ దేశ్‌ముఖ్ కస్టడీని పొడగించడానికి నిరాకరిస్తూ.. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడికి పంపించిన విషయం తెలిసిందే. కాగా, అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు నెలకు రూ.100 కోట్ల వసూలు చేయాలని రాష్ట్ర పోలీసు శాఖకి లక్ష్యం నిర్ణయించారని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ఆరోపించడంతో దేశ్‌ముఖ్ రాజీనామా కూడా చేసిన విషయం తెలిసిందే. చదవండి: UP: సెంట్రల్ జైలులో ఖైదీల వీరంగం -
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్
ముంబై: వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్ అయ్యారు. దాదాపు 12 గంటల సేపు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం అర్ధరాత్రి దాటాక ఆయనని అరెస్ట్ చేశారు. దేశ్‌ముఖ్‌ను మంగళవారం ముంబై ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి పి.బి.జాదవ్ ఆయనకు నవంబర్ 6 వరకు కస్టడీ విధించారు. అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు నెలకు రూ.100 కోట్ల వసూలు చేయాలని రాష్ట్ర పోలీసు శాఖకి లక్ష్యంగా నిర్ణయించారని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ఆరోపించడంతో దేశ్‌ముఖ్ రాజీనామా కూడా చేసిన విషయం తెలిసిందే. (చదవండి: రూ. 70 వేల చొక్కా.. రూ.25 లక్షల వాచీ) -
స్కామ్ సొమ్ముతో భూముల కొనుగోలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీలో చోటు చేసుకున్న రూ.64.5 కోట్ల కుంభకోణంపై దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ డబ్బుల్లో అధిక మొత్తం కాజేసినట్లు ఆరోపణలున్న ప్రధాన సూత్రధారి సాయికుమార్ వివాదాస్పద భూములు ఖరీదు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయనే ఈ పని చేసినట్లు భావిస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు అరెస్టు అయిన 14 మందిలో 9 మందిని సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. తెలుగు అకాడమీ అకౌంట్స్ అధికారి రమేశ్, ఎఫ్‌డీల విత్‌డ్రాలో దళారులుగా వ్యవహరించిన సాయికుమార్, నందూరి వెంకట రమణ, వెంకటేశ్వర్రావు, సోమశేఖర్లతో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్వాన్ బ్రాంచ్ మాజీ మేనేజర్ మస్తాన్‌వలీ, ఏపీ మర్కంటైల్ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ, మేనేజర్లు పద్మజ, మెహినుద్దీన్లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఏసీపీ మనోజ్‌కుమార్ నేతృత్వంలోని అధికారులు ఈ నిందితులను వేర్వేరుగా విచారిస్తున్నారు. కొన్ని అనుమానాస్పద అంశాలపై మాత్రం నిందితులను కలిపి విచారిస్తూ వాస్తవాలను నిర్ధారించుకుంటున్నారు. 34 ఎకరాలు, 3 ప్లాట్లు.. ప్రధాన నిందితుడు సాయికుమార్ స్కామ్‌లో తన వాటాగా రూ. 20 కోట్లకుపైగా తీసుకున్నాడని ఇప్పటివరకు గుర్తించారు. ఇతను రూ.5 కోట్లతో పెద్ద అంబర్‌పేట్‌లో 34 ఎకరాల వివాదాస్పద భూము లు కొనుగోలు చేశాడని, ఆ భూముల పత్రాలను కొందరి వద్ద తాకట్టు పెట్టి నగదు తీసుకున్నాడని తెలిసింది. ఇవి తక్కువ ధరకు రావడంతో పాటు భవిష్యత్తులో తాను అరెస్టు అయినప్పటికీ ఈ భూములను పోలీసులు స్వాధీనం చేసుకోలేరనే ఇలా చేసి ఉంటాడని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన వెంకటరమణ కొండాపూర్, ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, విశాఖపట్నంలో సుమారు రూ.6.5 కోట్లు వెచ్చించి మూడు ప్లాట్లను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ ఆస్తులకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు అందించనున్నట్లు సమాచారం.ఈ కుంభకోణంలో మరికొందరు నిందితుల ప్రమే యం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చందానగర్ కెనరా బ్యాంకు మాజీ మేనేజర్ సాధన పోలీసు కస్టడీ పిటిషన్‌పై కోర్టు సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వేగంగా ఈడీ విచారణ తెలుగు అకాడమీలో కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణను వేగవంతం చేశారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను శుక్రవారమే కోర్టు అనుమతితో తీసుకున్న ఈడీ, శనివారం చంచల్‌గూడ జైల్లో అకాడమీ ఇన్చార్జి అకౌంటెంట్ రమేశ్‌ను ప్రశ్నించింది. బ్యాంక్ ఎఫ్‌డీల నుంచి డ్రా చేసిన డబ్బును ఎవరెవరు, ఎంతెంత తీసుకున్నారు.. తమ వాటాగా తీసుకున్న డబ్బులను ఏం చేశారన్న అంశాలపై కూపీ లాగినట్టు తెలిసింది. కాగా, ఈడీ దర్యాప్తు బృందం సోమవారం బ్యాంక్ మేనేజర్లను ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. కెనరా బ్యాంక్‌తో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్లను ప్రశ్నించి ఎఫ్డీ సొమ్మును ఎక్కడికి తరలించారన్న సంగతిని రాబట్టాలని భావిస్తోంది. అలాగే ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న సాయికుమార్ తన వాటాగా వచ్చిన డబ్బును ఎక్కడికి తరలించాడు, ఎక్కడ పెట్టుబడులు పెట్టాడన్న అంశాలను గుర్తించి వాటిని జప్తు చేయాలని ఈడీ ప్రయత్నిస్తోంది. మరో పక్క ఇద్దరు బ్యాంక్ మేనేజర్లు వారి వాటాగా వచ్చిన డబ్బును కుటుంబ సభ్యుల ద్వారా మళ్లించినట్టు సీసీఎస్ తన దర్యాప్తులో స్పష్టంచేసింది. ఆ డబ్బులను హవాలామార్గాల్లో తరలించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు మేనేజర్లతోపాటు మిగతా నిందితులను ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. -
గోవాలో హైదరాబాదీపెడ్లర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గోవా డ్రగ్ రాకెట్లో హైదరాబాద్ యువకుడు పట్టుబడటం సంచలనం రేపుతోంది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) వారం రోజులు జల్లెడ పట్టి డ్రగ్స్ దందా సాగిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసింది. వీరిలో హైదరాబాద్‌కు చెందిన సిద్దిఖ్ అహ్మద్ కూడా ఉన్నాడు. ఇప్పటికే డ్రగ్స్‌కు సంబంధించిన ఒక కేసులో టాలీవుడ్‌కు చెందిన 12 మంది సినీ ప్రముఖులను ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారించింది. అదే కేసులో మనీలాండరింగ్ అనుమానంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా దర్యాప్తు జరిపింది. ఇంతలోనే గోవాలో సిద్దిఖ్ పట్టుబడటంతో.. డ్రగ్స్ మాఫియాలో హైదరాబాద్ లింకు మరోసారి చర్చనీయాంశమయ్యింది.. ఛత్తీస్‌గఢ్ వ్యక్తితో కలిసి.. సిద్దిఖ్ అహ్మద్ అరెస్టుకు సంబంధించి గోవా ఎన్సీబీ అధికారులను ఆరా తీయగా సంచలనాత్మక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నౌమాన్ సవేరీతో కలిసి సిద్దిఖ్ గోవాలో డ్రగ్స్‌ను (ఎల్ఎస్డీ, ఎమ్డీఎమ్ఏ) సరఫరా చేస్తున్నాడు. గత బుధవారం సవేరీని ఎన్సీబీ అరెస్టు చేసి విచారించగా తనతో పాటు ప్రధాన భాగస్వామి సిద్దిఖ్ అహ్మద్ ముంబయితో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాలకు డ్రగ్స్ రవాణా (పెడ్లింగ్) చేస్తున్నాడని వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే శనివారం అర్ధరాత్రి సిద్దిఖ్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. పుట్టి పెరిగిందంతా ఇక్కడే... సిద్దిఖ్ అహ్మద్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే అని ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం గోవాలోని సియోలిమ్ బీచ్ ప్రాంతంలో సెటిల్ అయ్యాడని, ఆ బీచ్ కేంద్రంగానే డ్రగ్ పెడ్లర్‌గా మారి ప్రధానంగా ముంబయి, బెంగళూరు తర్వాత హైదరాబాద్‌కు మాదకద్రవ్యాలైన లైసర్జిక్ యాసిడ్ డైతల్మైడ్ (ఎల్ఎస్డీ), మిథలిన్ డయాక్సీ మెథమాపెటమైన్ (ఎండీఎమ్ఏ) సరఫరా చేస్తున్నట్టు విచారణలో బయటపడిందని తెలిపారు. అయితే సిద్దిక్ హైదరాబాద్ నుంచి గోవాకు ఎందుకు మకాం మార్చాడన్న దానిపై ఎన్సీబీ దృష్టి పెట్టింది. గోవా కేంద్రంగా భారీ స్థాయిలోనే నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ఉంటాడా? అనే కోణంలో విచారణ సాగిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఎండీఎమ్ఏ తయారీ? సిద్దిఖ్ విచారణలో కొన్ని ఆందోళన కల్గించే అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముంబయికి చెందిన డ్రగ్స్ మాఫియా హైదరాబాద్‌లోని కొన్ని పారిశ్రామిక కంపెనీల్లో ఎండీఎమ్ఏ డ్రగ్‌ను తయారు చేయిస్తోందని, అక్కడి నుంచే గోవా, బెంగళూరు, ముంబయి ప్రాంతాలకు రవాణా అవుతోందని అతను వెల్లడించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సిద్దిఖ్ దగ్గరున్న వివరాల ఆధారంగా ముంబయి డ్రగ్స్ తయారీ మాఫియాను గుర్తించేందుకు దర్యాప్తు అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. రంగంలోకి స్థానిక అధికారులు సిద్దిఖ్ హైదరాబాద్‌లో పుట్టి పెరగడం, నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ఉండటం.. హైదరాబాద్ ఎన్సీబీ అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. సిద్దిఖ్ నివాసం ఉన్న ప్రాంతాన్ని గుర్తించడం, అతడితో కాంటాక్ట్‌లో ఉండి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని గుర్తించేందుకు ఇప్పటికే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఎండీఎమ్ఏ తయారీ అంశం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ప్రధానంగా దీనిపైనే దృష్టి సారించి దర్యాప్తు జరుపుతున్నట్టు తెలుస్తోంది. గోవా నుంచే ఈవెంట్లకు డ్రగ్స్! హైదరాబాద్‌లో ఉన్న పరిచయాలు, బెంగళూరులో ఉన్న స్నేహితులు, ముంబయిలో ఉన్న డ్రగ్స్ మాఫియా ద్వారా సిద్దిఖ్ పలు ప్రత్యేక ఈవెంట్లకు ఎల్ఎస్డీ సరఫరా చేస్తున్నట్టు గోవా ఎన్సీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. పార్టీలకు పేరొందిన (మోస్ట్ హ్యాపెనింగ్) మెట్రో సిటీల్లో వీకెండ్ హంగామాకు అంతేలేదు. పబ్ కల్చర్ విపరీతంగా ఉన్న నగరాలు కావడం వరుసగా డ్రగ్ కేసులు వెలుగులోకి రావడం ఎన్సీబీని కలవరపెడుతోంది. గోవా కేంద్రంగా ఎల్ఎస్డీని ఈ మూడు ప్రాంతాలకు సిద్దిఖ్ చేరవేస్తున్నట్టు అనుమానిస్తోంది. -
రూ.700 కోట్ల ‘కార్వీ’ షేర్లు ఫ్రీజ్
సాక్షి, హైదరాబాద్: కార్వీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరింత దూకుడు పెంచింది. కార్వీతోపాటు ఇతర 8 కంపెనీలకు చెందిన రూ.700 కోట్ల విలువైన షేర్లను ఫ్రీజ్ చేసింది. మూడు రోజుల క్రితం కార్వీ సీఎండీతోపాటు ఇతర నిందితుల ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా కీలకమైన డాక్యుమెంట్లు, డైరీలు, డిలీట్ చేసిన మెయిల్స్, పెన్‌డ్రైవ్‌లు ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నాయి. తదుపరి చర్యల్లో భాగంగా షేర్లను ఫ్రీజ్ చేసినట్టు తెలిసింది. 2019–20 ఆర్థిక సంవత్సరం ప్రకారం వాటి విలువను రూ.700 కోట్లుగా నిర్ధారించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. రుణాలు తీసుకుని షెల్ కంపెనీలకు.. హైదరాబాద్ సీసీఎస్‌లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. పార్థసారథి అక్రమ పద్ధతిలో బ్యాంకుల నుంచి రుణాలు పొంది తిరిగి కట్టకుండా డిఫాల్టర్ అయ్యారు. దీంతో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కార్వీ స్కాం వెలుగులోకి వచ్చింది. హెచ్డీఎఫ్సీ నుంచి రూ.329 కోట్లు, ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి రూ.137 కోట్లు, ఐసీఐసీఐ నుంచి రూ.562.5 కోట్లు రుణాలు పొందినట్లు ఆయా బ్యాంకులు ఫిర్యాదులో పేర్కొన్నాయి. వీటితోపాటు మరికొన్ని బ్యాంకుల్లో రుణాలు పొంది షెల్ కంపెనీలకు బదలాయించాడని, మొత్తం స్కాం విలువ రూ. 2,873 కోట్లు అని ఈడీ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఎక్సే్ఛంజ్ బోర్డులకు చెప్పకుండానే.. షేర్ల వ్యవహారంలో కార్వీ సంస్థ రెండు డీపీ (డిపాజిటరీ పార్టిసిపేటరీ) అకౌంట్ల ద్వారా జనవరి 2019 నుంచి ఆగస్టు 2019 వరకు జరిగిన ట్రేడింగ్ వివరాలను బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్సే్ఛంజ్) ఫైలింగ్‌లో ఎక్సే్ఛంజ్ బోర్డులకు చూపకుండా దాచిపెట్టినట్టు ఈడీ దర్యాప్తులోకి వెలుగులోకి వచ్చింది. ఆ బోర్డులకు సమాచారమివ్వకుండా మదుపరుల షేర్లను తన వ్యక్తిగత డీమాట్ అకౌంట్లోకి బదలాయించినట్టు కూడా గుర్తించింది. సెబీకి సమాచారం లేకుండా ఏప్రిల్ 2016 నుంచి అక్టోబర్ 2019 వరకు రూ.1,096 కోట్లను పార్థసారథి కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) నుంచి కార్వీ రియాలిటీ ఇండియా (కేఆర్‌ఐఎల్)లోకి బదలాయించారు. అదేవిధంగా కేఎస్‌బీఎల్ నుంచి కార్వీ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (కేసీఎల్)తో పాటు 8 షెల్ కంపెనీలకు నిధులు బదలాయించినట్లు ఈడీ గుర్తించింది. కార్వీ రియల్ ఇండియా పేరుతో బదలాయించిన సొమ్ములో కొంత మొత్తాన్ని అదే కంపెనీ పేరిట భూములు కొనుగోలు చేసినట్టు ఉన్న డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు దొరక్కుండా కంప్యూటర్లలో ఫైల్స్, మెయిల్స్‌ను డిలీట్ చేసినట్టు గుర్తించిన ఈడీ వాటిని తిరిగి చేజిక్కించుకున్నట్లు దర్యాప్తు అధికారుల ద్వారా తెలిసింది. -
డ్రగ్స్ కొనలేదు .. డబ్బు ఇవ్వలేదు.. ఈడీ మళ్లీ రమ్మనలేదు
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని సినీ నటుడు తనీష్ చెప్పారు. కెల్విన్ నుంచి తాను డ్రగ్స్ ఖరీదు చేయడం కానీ, దాని నిమిత్తం డబ్బు వెచ్చించడం కానీ జరగలేదని స్పష్టం చేశారు. టాలీవుడ్ ప్రముఖులతో ముడిపడి ఉన్న ఈ కేసులో మనీల్యాండరింగ్ కోణాన్ని దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట శుక్రవారం ఆయన హాజరయ్యారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన ఆయన సాయంత్రం 6 గంటలకు తిరిగి వచ్చారు. బుధవారం నటుడు తరుణ్ విచారణకు హాజరుకానున్నారు. ఈవెంట్ల వల్లే కెల్విన్‌తో పరిచయం డ్రగ్స్ కేసు ప్రధాన నిందితుడు కెల్విన్‌తో ఉన్న పరిచయం, అతడితో లావాదేవీలపై తనీష్‌ను ఈడీ అధికారులు ఆరా తీశారు. 2016–17 మధ్య కెల్విన్‌తో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసినట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఈడీ దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో తాను చేసిన పలు సినిమాలకు కెల్విన్ ఈవెంట్లు నిర్వహించాడని, ఆ విధంగానే అతడితో పరిచయం ఏర్పడిందని తనీష్ జవాబిచ్చారు. ఈ వ్యవహారంలో డ్రగ్స్ క్రయవిక్రయాలు, వినియోగానికి ఎక్కడా తావు లేదని స్పష్టం చేశారు. కెల్విన్ విచారణలో తన పేరు బయటకు రావడానికి అతడితో ఈవెంట్ల పరంగా ఉన్న పరిచయమే కారణమని వివరణ ఇచ్చారు. మళ్లీ రమ్మనలేదు తాను బాలనటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగానని, డ్రగ్స్ వంటి వాటి జోలికి వెళితే అది సాధ్యమయ్యేది కాదని తనీష్ చెప్పారు. తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన స్టేట్మెంట్స్ను ఈడీ అధికారులకు ఆయన అందించారు. విచారణ ముగించుకుని తిరిగి వెళ్తూ మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులను కోరిన వివరాలు అందించానని, వారు కొన్ని డాక్యుమెంట్లు సైతం పరిశీలించారని తెలిపారు. మరోసారి విచారణకు రావాల్సిన అవసరం ఉంటుందని చెప్పలేదని, ఒకవేళ పిలిస్తే కచ్చితంగా వచ్చి పూర్తి సహకారం అందిస్తానని పేర్కొన్నారు. -
హర్ష మందర్ ఇళ్లల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మానవ హక్కుల ఉద్యమకారుడు హర్ష మందర్(66)కు చెందిన ఇళ్లల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం సోదాలు నిర్వహించింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగానే ఈ సోదాలు జరిపినట్లు అధికారులు చెప్పారు. ఢిల్లీలో ఇళ్లు, ఎన్జీఓ కార్యాలయంలో సోదాలు జరిపారు. హర్ష మందర్‌కు సంబంధం ఉన్న రెండు ఎన్జీఓల ఆర్థిక, బ్యాంకింగ్ కార్యకలాపాల పత్రాలను ఈడీ అధికారులు పరిశీలించారు. హర ్షమందర్ గురువారం ఉదయమే తన భార్యతో కలిసి జర్మనీకి పయనమయ్యారు. సామాజిక న్యాయం, మానవ హక్కులపై ఆయన వార్తా పత్రికల్లో సంపాదకీయాలు రాస్తుంటారు. పుస్తకాలు రచిస్తారు. హర్ష మందర్ డైరెక్టర్‌గా ఉన్న సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్(సీఎస్ఈ) అనే సంస్థపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసు: కెల్విన్‌తో ఫోన్‌కాల్స్ మర్మమేమిటి?
సాక్షి, హైదరాబాద్: ‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసు విచారణలో భాగంగా నటి ముమైత్ ఖాన్‌ను బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆమెను ఏడు గంటలకుపైగా విచారించారు. మనీలాండరింగ్ కోణంలో ఈ విచారణ సాగింది. ఆమె 2016–17 కు సంబంధించిన తన బ్యాంకు స్టేట్మెంట్ను అధికారులకు అందించారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్‌తో ఆమె జరిపిన ఫోన్, వాట్సాప్ కాల్స్‌పై అధికారులు ఆరా తీశారు. ఈవెం ట్ మేనేజర్ అయిన కెల్విన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపించిన నేపథ్యంలోనే తనకు పరిచయమయ్యాడని ముమైత్ స్పష్టం చేశారు. సినీ రంగానికి సంబంధించిన అంశాలపైనే అతడిని సంప్రదించానని, అంతేతప్ప తనకు డ్రగ్స్ దందాతో సంబం ధాలు లేవని వివరణ ఇచ్చారు. 2015–17 మధ్య తాను పెద్దగా తెలుగు సినిమాల్లో నటించలేదని, ఎక్కువగా ముంబైలోనే ఉన్నానని చెప్పారు. చదవండి: సినీ ఈవెంట్లకే ఎఫ్ క్లబ్‌కు వెళ్లా పూరీ జగన్నాథ్ సినిమాల్లో ఎక్కువగా నటించానని, ఆ సందర్భాల్లోనే ఈవెంట్ మేనేజర్‌గా కెలి్వన్ కలిసేవాడని వివరించారు. ఎఫ్–లాంజ్ క్లబ్ సహా అనేక పబ్బులకు తాను వెళ్లిన మాట వాస్తవమేనని అంగీకరించిన ముమైత్, వీటిలో ఎక్కడా డ్రగ్స్ కొనలేదని, వాడలేదని స్పష్టం చేశారు. ముమైత్ విదేశీ పర్యటనలపైనా ఈడీ ప్రశ్నించగా సినిమా షూటింగ్స్, వ్యక్తిగత పర్యటనల నిమిత్తం గోవా, బ్యాంకాక్ తదితర ప్రాంతాలకు వెళ్లానని వివరించారు. ‘టాలీవుడ్ డ్రగ్స్’కేసు విచారణలో భాగంగా శుక్రవారం నటుడు తనీష్ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. -
సినీ ఈవెంట్లకే ఎఫ్ క్లబ్‌కు వెళ్లా
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సినీ నటుడు నవదీప్, ఎఫ్–లాంజ్ క్లబ్ మాజీ జనరల్ మేనేజర్ అర్పిత్ సింగ్ సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ముంబైలో ఉన్న నవదీప్ అక్కడ నుంచి నేరుగా ఉదయం 11.15 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన కంటే ముందే అర్పిత్ సింగ్ వచ్చారు. రాత్రి 8.45 గంటల వరకు వీరి విచారణ సాగింది. గత నెల 31న దర్శకుడు పూరీ జగన్నాథ్ తర్వాత ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించింది వీరిద్దరినే. సోమవారం నాటి విచారణ.. కెల్విన్‌తో వారికున్న సంబంధాలు, ఎఫ్–క్లబ్ లావాదేవీలు, మనీల్యాండరింగ్ ఆరోపణల కేంద్రంగా జరిగింది. డ్రగ్స్ కేసులో ఇతర నిందితులుగా ఉన్న పీటర్, కమింగ్లతో సంబంధాలు ఉన్నాయా? అనేది ఆరా తీశారు. ఎఫ్–లాంజ్ నా స్నేహితులది: నవదీప్ 2016–17 మధ్య ఎఫ్–క్లబ్లో భారీ స్థాయిలో డ్రగ్స్ పార్టీలు జరిగాయనేది తెలంగాణ ఎక్సైజ్ అధికారుల ఆరోపణ. వాటికి అనేకమంది సినీ ప్రముఖులు హాజరయ్యారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీన్ని నవదీప్ నిర్వహించగా... అర్పిత్ సింగ్ జనరల్ మేనేజర్‌గా వ్యవహరించాడని ఈడీ అనుమానం. ఆ మధ్యకాలంలో దాదాపు 35 పెద్ద పార్టీలకు ఆ క్లబ్ వేదికైనట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. అక్కడ జరిగిన పార్టీలకు కెల్విన్ నుంచి డ్రగ్స్ ఖరీదు చేయడం వంటి ఆరోపణలపై ఇద్దర్నీ వివరణ అడిగింది. ఎఫ్–లాంజ్ తన స్నేహితులకు చెందినదని చెప్పిన నవదీప్... అక్కడ జరిగిన కొన్ని సినీ సంబంధిత ఈవెంట్లకు మాత్రమే తాను వెళ్లానని స్పష్టం చేశారు. తాను సినిమాల్లో నటించడంతో పాటు ఆ రంగానికి సంబంధించిన, ఇతర కీలక ఈవెంట్లూ నిర్వహిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మరో ఈవెంట్ మేనేజర్ అయిన కెల్విన్‌తో పరిచయం ఉందని వివరించారు. అలా కలిసిన సందర్భాల్లోనే ఫొటోలు దిగడం, ఈవెంట్లకు సంబంధించిన వివరాలపై చర్చించిన నేపథ్యంలో ఫోన్, వాట్సాప్ సంభాషణలు ఉండి ఉండవచ్చని చెప్పారు. 2016–18 మధ్య కాలానికి సంబంధించిన తన బ్యాంకు స్టేట్మెంట్లను అందజేశారు. లావాదేవీలన్నీ ఈవెంట్స్‌కు సంబంధించినవే: అర్పిత్ ఈవెంట్ మేనేజర్‌గా ఉన్న కెల్విన్ ఎఫ్–క్లబ్‌లోనూ కొన్ని కార్యక్రమాలు చేసినట్లు అర్పిత్ సింగ్ ఈడీ అధికారులకు తెలిపారు. 2016–17 మధ్య జరిగిన పార్టీలకు ముందు, తర్వాత అనేకమంది సినీ ప్రముఖుల నుంచి అర్పిత్‌తో పాటు ఎఫ్–క్లబ్ ఖాతాకు భారీగా డబ్బు బదిలీ జరిగిందని ఈడీ ఆధారాలు సేకరించింది. ఆర్థిక లావాదేవీలు జరిగిన మాట వాస్తవమే అని అంగీకరించిన అర్పిత్.. అవన్నీ కేవ లం ఈవెంట్స్, లేదా పార్టీలకు సంబంధించినవి మాత్రమే అని స్పష్టం చేశారు. ఎఫ్–క్లబ్ బ్యాంకు లావాదేవీల రికార్డులను అందించారు. నవదీప్, అర్పిత్ సింగ్‌లను వేర్వేరుగా ఆపై ఇద్దరినీ కలిపి విచారించిన ఈడీ అధికారులు వాం గ్మూలాలు నమోదు చేశారు. ఈడీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్తున్న సమయం లో మీడియాతో మాట్లాడటానికి నవదీప్ విముఖత చూపారు. ఇలావుండగా సినీ నటి ముమైత్‌ఖాన్ బుధవారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు. -
కెల్విన్‌కు నగదు బదిలీ చేశారా?
సాక్షి, హైదరాబాద్: ‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం సినీ నటుడు దగ్గుబాటి రానాను ప్రశ్నించారు. ఈడీ అధికారులకు డ్రగ్స్ కేసు ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే రానా విచారణ జరిగినట్లు తెలిసింది. ఉదయం 10.30 గంటల నుంచి దాదాపు ఏడున్నర గంట ల పాటు విచారణ జరిగింది. డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎక్సైజ్ విభాగానికి చెందిన సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. లావాదేవీలన్నీ సినీరంగానివే... మంగళవారం నటుడు నందు విచారణ సందర్భంగా కెల్విన్‌ను తీసుకొచ్చిన అధికారులు.. బుధవారం కూడా ఆయనను ఈడీ కార్యాలయానికి రప్పించారు. అతడి ల్యాప్‌టాప్‌ను తెరిపించి అందులోంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. రానా, కెల్విన్‌లను విడివిడిగా, ఆపై ఇద్దరినీ కలిపి ఈడీ బృందం ప్రశ్నిం చింది. ఇరువురూ చెప్పిన అంశాల్లో కొన్నింటిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. రానా తన వెంట రెండు బ్యాంకు ఖాతాలకు సంబందించిన స్టేట్మెంట్లు తెచ్చారు. 2015–17 మధ్య లావాదేవీల వివరాలను ఈడీకి ఇచ్చారు. 2017లో ఎఫ్–క్లబ్లో జరిగిన పార్టీకి హాజరయ్యారా? దాని ముందు, ఆ తర్వాత కెల్విన్‌కు నగదు బదిలీ చేశారా? తదితర అంశాలపై రానాను ప్రశ్నించారు. ఇంతకు ముందే కెల్విన్ బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించిన అధికారులు అం దులో రానా ఖాతా నుంచి డబ్బు బదిలీ అయినట్లు గుర్తించారని సమాచారం. ఈవెంట్ మేనేజర్ అయిన కెల్విన్‌తో తాను చేసిన లావాదేవీలన్నీ సినీ రంగానికి సంబంధించినవే అని ఈడీ అధికారులకు రానా స్పష్టం చేసినట్లు తెలి సింది. రానా సాయంత్రం 6 గంటలకు ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోగా, ఆ తర్వాత 2 గంటల పాటు కెల్విన్ విచారణ సాగింది. నేడు నవ్‌దీప్ కూడా..? ఈడీ సమన్లు అందుకున్న వారిలో నటుడు రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. వీరిద్దరూ గురువారం ఈడీ కార్యాలయానికి రానున్నారు. సోమవారం నటుడు పి.నవ్‌దీప్ హాజరుకావాల్సి ఉంది. అనివార్య కారణాల నేపథ్యంలో ఆయన కూడా గురువారం హాజరుకావడానికి అనుమతి కోరినట్లు సమాచారం. -
కెల్విన్‌తో కలిపి నందు విచారణ
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖులతో ముడిపడి ఉన్న డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్. ఈ కేసుకు సంబంధించిన మనీల్యాండరింగ్ వ్యవహారాలపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటివరకు ముగ్గురిని ప్రశ్నించగా... మంగళవారం సినీ నటుడు నందు విచారణ సమయంలో క్రాస్ ఎగ్జామినేషన్‌కు తెర తీశారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్‌ను సైతం ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు ఇద్దరినీ విడివిడిగా, ఆ తర్వాత కలిపి విచారించారు. దాదాపు ఏడు గంటల విచారణ తర్వాత నందును పంపించగా, కెల్విన్ విచారణను కొనసాగించారు. ఆయనను రాత్రి 10 గంటలకు పంపించారు. కెల్విన్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. ఈడీ ముందుకు ముందే... షెడ్యూల్ ప్రకారం నందు ఈడీ అధికారుల ఎదుట ఈ నెల 20న హాజరుకావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో నందు మంగళవారమే ఈడీ ముందు హాజరయ్యారు. కెల్విన్‌తో నందుకు కొన్ని ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ కొనుగోలుకు నగదు వెచ్చించారా? లేక కెల్విన్‌కు బదిలీ చేశారా? అన్న కోణంలో నందు విచారణ సాగింది. ఈ ఆరోపణలు నిరాధారమంటూ కొట్టేసిన నందు తన బ్యాంకు ఖాతాల స్టేట్మెంట్ను అధికారులకు ఇచ్చినట్లు తెలిసింది. అధికారులు నందు సమగ్ర వాంగ్మూలం నమోదు చేశారు. దర్శకుడు పూరీ జగన్నాథ్, నటీమణులు చార్మీ, రకుల్‌ప్రీత్‌సింగ్‌ల విచారణ సమయంలో కెల్విన్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకురాని అధికారులు నందు విచారణ సమయంలో మాత్రం ఆయనను తీసుకురావడం గమనార్హం. నందు ఉదయం ఈడీ ఎదుటకు రాగా... మధ్యాహ్నం కేంద్ర బలగాలతో కూడిన ప్రత్యేక బృందం కెల్విన్‌ను తీసుకొచ్చింది. అతడి ఇంటి నుంచి కొన్ని పత్రాలు, ల్యాప్‌టాప్, ఫోన్లనూ అధికారులు తెచ్చారు. ఎదురెదురుగా ఉంచి ప్రశ్నలు కెల్విన్ కాల్ డేటాలో నందు నంబర్ ఉన్నట్లు గతంలో ఎక్సైజ్ అధికారులూ గుర్తించారు. వాట్సాప్‌లోనూ వీరి మధ్య జరిగిన చాటింగ్స్‌నూ ఆరా తీశారు. ఇప్పుడు ఈడీ అధికారులు సైతం ప్రధానంగా ఈ అంశాలపైనే ఇద్దరినీ విచారించారు. కెల్విన్ ఈవెంట్ మేనేజర్ కావడం వల్ల సంప్రదింపులు జరిపానని, అంతకుమించి తనకు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం లేదని నందు చెప్పినట్టు తెలిసింది. సినిమా రంగంలో ఎవరైనా డ్రగ్ వాడతారా? అని ఈడీ అధికారులు ప్రశ్నించగా.. తన వద్ద ఎలాంటి సమాచారం లేదని నందు చెప్పినట్లు తెలిసింది. రెండు గంటలపాటు నందు, కెల్విన్‌లను విడివిడిగా విచారించిన అధికారులు.. ఆపై ఇద్దరినీ కలిపి విచారిస్తూ కొన్ని సందేహాలు లేవనెత్తినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈడీ నందుతోపాటు మరికొందరిని మరోసారి విచారించే అవకాశం ఉంది. రానాకు అనూహ్యంగా.. ఈడీ జారీ చేసిన సమన్ల ఆధారంగా బుధవారం సినీ నటుడు దగ్గుబాటి రానా విచారణకు హాజరుకావాలి. 2017లో సిట్ విచారణలో ఆయన పేరు రాలేదు. అయితే అనూహ్యంగా ఈడీ అధికారులు ఆయనకు సమన్లు జారీ చేశారు. మరోపక్క కెల్విన్‌ను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేయడానికి ముందే 2016లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి నమోదైన కేసులో దర్యాప్తు పూర్తి చేసిన అధికారులు అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి నాంపల్లి న్యాయస్థానం కెల్విన్‌కు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 11న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. -
ఈడీ ఎదుటకు టీఎంసీ ఎంపీ అభిషేక్
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీని సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సుదీర్ఘంగా దాదాపు 9 గంటలపాటు విచారణ జరిపారు. రాష్ట్రంలో జరిగిన బొగ్గు కుంభకోణంలో మనీల్యాండరింగ్ ఆరోపణలకు సంబంధించి అభిషేక్ సోమవారం ఢిల్లీలోని జామ్‌నగర్ హౌస్‌లో ఉన్న ఈడీ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. తిరిగి ఆయన రాత్రి 8 గంటల సమయంలో వెళ్లిపోయారు. ఈ కేసులో ఇతర నిందితులతో సంబంధాలు, తన కుటుంబీకులకు చెందిన రెండు కంపెనీల్లో జరిగిన అక్రమ లావాదేవీలపై అభిషేక్‌ను అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు చెందిన బొగ్గు గనుల్లో అనేక కోట్ల అక్రమాలు చోటుచేసుకున్నట్లు 2020లో సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అనూప్ మాఝి అలియాస్ లాలాను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఈ అక్రమాల్లో అభిషేక్ కూడా లబ్ధి పొందినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఇందులో భాగంగానే అభిషేక్ భార్య రుజిరాకు కూడా నోటీసులు జారీ చేసింది. కానీ, ఆమె కరోనా తీవ్రత దృష్ట్యా రాలేకపోతున్నట్లు సమాచారం అందించడంతో, కోల్‌కతాలోనే అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఈడీ.. కొందరు ఐపీఎస్ అధికారులతోపాటు, ఒక లాయర్‌ను కూడా విచారణకు రావాలంటూ సమన్లు జారీ చేసింది. -
రియా చక్రవర్తితో సంబంధమేంటి?
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్‌తో ముడిపడి ఉన్న డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నటి రకుల్ ప్రీత్ సింగ్‌ను విచారించారు. శుక్రవారం ఉదయం 9:10 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆమెను అధికారులు దాదాపు ఏడు గంటలపాటు విచారించారు. తెలంగాణ ఎక్సైజ్ అధికారులు 2017లో నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. అయితే అప్పట్లో రకుల్ పేరు బయటకు రాలేదు. గతేడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డ్రగ్స్ కేసు నమోదు చేసింది. అందులో రకుల్ పేరు వెలుగులోకి రావడంతోపాటు ఇక్కడి కేసులో కీలక నిందితుడైన కెల్విన్ విచారణలో బయటపడిన అంశాల ఆధారంగానే రకుల్‌కు ఈడీ సమన్లు జారీ చేసినట్లు తెలిసింది. రియాతో సంబంధాలపై ఆరా... గతేడాది సెప్టెంబర్ 25న ముంబైలో ఎన్సీబీ విచారణకు రకుల్ హాజరయ్యారు. తాజాగా శుక్రవారం రకుల్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు ప్రధానంగా సుశాంత్‌సింగ్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి (రియాను అప్పట్లో ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే)తో సంబంధాలపై ఆరా తీశారు. అప్పటి విచారణకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు ఎన్సీబీ నుంచి తీసుకున్నారు. వాటితోపాటు రెండు నెలల క్రితం కెల్విన్ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా ఈడీ అధికారులు రకుల్‌ను ప్రశ్నించారు. డ్రగ్స్ కొనుగోలు చేయడానికి మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రశ్నలు సంధించారు. గతేడాది ఎన్సీబీ విచారించడానికి కారణం అదేనా? అంటూ ప్రశ్నించారు. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చిన రకుల్ తన బ్యాంకు లావాదేవీలన్నీ పారదర్శకంగానే జరిగాయని చెప్పారు. మాదకద్రవ్యాల కొనుగోలు, వినియోగాలకు తాను ఎప్పుడూ దూరంగానే ఉన్నానంటూ స్పష్టం చేసి బ్యాంకు లావాదేవీల రికార్డులు ఈడీకి అందించారు. ముందే వచ్చిన రకుల్... ఎక్సైజ్ విభాగానికి చెందిన సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ.. విచారణకు రావాల్సిందిగా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు గత నెల్లో సమన్లు జారీ చేసింది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి చార్మీ కౌర్‌ను ప్రశ్నించారు. షెడ్యూల్ ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె విజ్ఞప్తి మేరకు శుక్రవారం రావడానికి ఈడీ అధికారులు అంగీకరించారు. ఇప్పటివరకు విచారణకు హాజరైన పూరీ, చార్మీ ఉదయం 10–10:30 గంటల మధ్య ఈడీ కార్యాలయానికి రాగా, రకుల్ మాత్రం ఉదయం 9:10 గంటలకే వచ్చారు. ఆమె వెంట సహాయకులు, మేనేజర్, ఆడిటర్, న్యాయవాది ఉన్నారు. సాయంత్రం తిరిగి వెళ్తున్న సమయంలో రకుల్ మీడియాతో మాట్లాడటానికి విముఖత చూపారు. బుధవారం నటుడు దగ్గుబాటి రానా ఈడీ విచారణకు హాజరుకానున్నారు. -
Dhulipalla Narendra Kumar: ధూళిపాళ్లపై ఈడీ కన్ను
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీ కుంభకోణం కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. తాజాగా ఆయన అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిర్భీతిగా నిబంధనలను ఉల్లంఘిస్తూ డెయిరీ ఆస్తులను ధూళిపాళ్ల తమ కుటుంబ ట్రస్టుకు బదిలీ చేసి భారీ అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ పక్కాఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసి అక్రమార్కులపై కఠిన చర్యలకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మరోవైపు సొంత పార్టీలోనే ధూళిపాళ్లకు పరిస్థితులు ఎదురుతిరుగుతున్నాయి. దశాబ్దాలుగా కష్టపడ్డవారిని విస్మరించిన ఆయన తన స్వార్థం చూసుకున్నారని గుంటూరు జిల్లా టీడీపీ నేతలు ఆయనపై మండిపడుతున్నారు. ఆయనకు ఏ విధంగానూ సహకరించకూడదని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఆయనకు అండగా నిలబడకుండా తూతూమంత్ర పరామర్శలతో సరిపెడుతున్నారు. ఇప్పటికే ప్రాథమిక ఆధారాల సేకరణ వందల కోట్ల విలువైన సంగం డెయిరీ ఆస్తులను ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబం కొల్లగొట్టిన ఉదంతంపై ఈడీ తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఫోర్జరీ పత్రాలతో భారీ మొత్తాల్లో రుణం తీసుకోవడం, వాటికి లెక్కాపత్రం లేకపోవడంపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. అందుకే తక్షణం రంగంలోకి దిగి ఈ కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ట్రస్టుకు వచ్చిన నిధులను నరేంద్ర దారి మళ్లించి ‘బ్లాక్’ చేసినట్లు ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు లభించాయి. ► సంగం డెయిరీకి ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో 10 ఎకరాలను ధూళిపాళ్ల తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కు బదిలీ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలా బదిలీ చేయడం సహకార చట్టంలోని 439 నిబంధనకు విరుద్ధమని ఈడీ గుర్తించింది. ఆ భూముల్లో తమ కుటుంబ ట్రస్ట్ పేరిట ఓ కార్పొరేట్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని కూడా తేల్చింది. ధూళిపాళ్ల భార్య జ్యోతిర్మయి ఆ ఆస్పత్రికి ఎండీగా ఉన్న విషయం గమనార్హం. ► సహకార సొసైటీని కంపెనీగా మార్చాలంటే ముందు ప్రభుత్వానికి బకాయిలు చెల్లించడంతోపాటు ప్రభుత్వ భూములను వెనక్కి ఇచ్చేసి నిరభ్యంతర పత్రం పొందాలి. ఈ నిబంధనలను కూడా ధూళిపాళ్ల పట్టించుకోలేదు. ► ఫోర్జరీ పత్రాలతో ధూళిపాళ్ల జాతీయ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) నుంచి రూ.115.58 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ నిధులను తమ కుటుంబ ట్రస్ట్‌కు బదిలీ చేసినట్టు కూడా ఈడీ గుర్తించింది. ► సంగం డెయిరీ నిధులతో కొనుగోలు చేసిన 72.54 ఎకరాలను ధూళిపాళ్ల హస్తగతం చేసుకున్న విషయంపై ఈడీ కూపీ లాగుతోంది. ► సంగం డెయిరీ చైర్మన్‌గా ఉంటూనే సహకార చట్టాలకు విరుద్ధంగా ధూళిపాళ్ల సొంతంగా మిల్క్‌లైన్ అనే డెయిరీని నెలకొల్పడం, అనంతరం దానికి తన భార్య జ్యోతిర్మయిని ఎండీని చేయడంపై కూడా దృష్టి సారించింది. ► తాజాగా డెయిరీ నిధులు రూ.50 కోట్లను ధూళిపాళ్ల తమ సొంత ట్రస్ట్‌కు బదిలీ చేసిన విషయాన్నీ ఈడీ గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా మనీలాండరింగ్ పాల్పడి అక్రమాలకు పాల్పడ్డ ధూళిపాళ్ల నరేంద్రపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ఈడీ సమాయత్తమవుతోందని కేంద్ర అధికార వర్గాలు తెలిపాయి. ► సుదీర్ఘకాలంగా డెయిరీలో పనిచేస్తున్న ముఖ్యులను కాదని.. నిబంధనలకు విరుద్ధంగా నిధులను దారి మళ్లించడంతో వారంతా నరేంద్ర పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఈడీ జోక్యం చేసుకోనున్న నేపథ్యంలో వారంతా మౌనాన్ని ఆశ్రయించడం మేలనే భావనలో ఉన్నారు. ధూళిపాళ్లపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత మరోవైపు ధూళిపాళ్లకు సొంత పార్టీ టీడీపీలోనే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన సొంత నియోజకవర్గం పొన్నూరుతో సహా గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలెవరూ ఆయనకు అండగా నిలిచేందుకు ఏమాత్రం సుముఖత చూపించడం లేదు. భారీ అవినీతికి పాల్పడి ఆధారాలతో సహా దొరికిన ఆయనకు ఈ కేసులో శిక్ష పడటం ఖాయమని టీడీపీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇక ఆయన అక్రమాలపై తాజాగా ఈడీ కూడా దృష్టి సారించడంతో టీడీపీలో కలకలం రేగుతోంది. ఈ నేపథ్యంలో ధూళిపాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. చదవండి: ఇనోదయ ఆస్పత్రిపై జాయింట్ కలెక్టర్ చర్యలు -
ఫ్రాంక్లిన్ ఎంఎఫ్‌పై ఈడీ కేసు
ముంబై: దాదాపు ఏడాది క్రితం అంటే 2020 ఏప్రిల్‌లో ఆరు పథకాలకు స్వస్తి పలికిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్)పై ఓవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మరోపక్క మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టిసారించాయి. దీనిలో భాగంగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎంఎఫ్‌పై ఈడీ మనీ లాండరింగ్ కేసును నమోదు చేసినట్లు తెలుస్తోంది. సంస్థతోపాటు మరో 8మందిపై కేసు రిజిస్టర్ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఆరు పథకాలను మూసివేసే ముందుగానే కీలక అధికారులు కొంతమంది తమ పెట్టుబడులను వెనక్కి(రీడీమ్) తీసుకోవడంపై ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎంఎఫ్‌తోపాటు, కీలక అధికారులకు సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా సమన్లు సైతం జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అవకతవకలు, అక్రమ లావాదేవీల(ఎఫ్‌యూటీపీ) నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై సెబీ దర్యాప్తును చేపట్టినట్లు తెలుస్తోంది. పథకాల మూసివేతకంటే ముందుగానే ఫండ్ హౌస్‌కు చెందిన కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు రూ. 50 కోట్లకుపైగా విలువైన పెట్టుబడులను రీడీమ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలు ఆడిట్లో వెల్లడికావడంతో సెబీ చట్టపరమైన దర్యాప్తునకు తెరతీసినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. సాధారణ పద్ధతిలోనే..: నియంత్రణ సంస్థల దర్యాప్తు వార్తల నేపథ్యంలో మూసివేసిన ఆరు పథకాలలో కంపెనీకి చెందిన యాజమాన్యం, ఉద్యోగుల పెట్టుబడులున్నట్లు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎంఎఫ్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. 2020 ఏప్రిల్ 23వరకూ దాఖలైన యూనిట్ హోల్డర్ల దరఖాస్తులను సాధారణ బిజినెస్ పద్ధతిలో ప్రాసెస్ చేసినట్లు తెలియజేశారు. పథకాలను మూసివేసేందుకు ట్రస్టీలు ముందస్తుగా నిర్ణయించాక కంపెనీకి చెందిన కీలక వ్యక్తులెవరూ ఎలాంటి పెట్టుబడులనూ రీడీమ్ చేసుకోలేదని వివరించారు. సెబీ జారీ చేసిన షోకాజ్ నోటీసులకు పూర్తిస్థాయిలో వివరాలను దాఖలు చేసినట్లు వెల్లడించారు. రూ. 25,000 కోట్లు 2020 ఏప్రిల్‌లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎంఎఫ్ ఎత్తివేసిన 6 పథకాల్లో పెట్టుబడుల విలువ రూ. 25,000 కోట్లు కాగా.. 3 లక్షల మంది ఇన్వెస్ట్ చేశారు. కాగా.. సాధ్యమైనంత త్వరగా ఇన్వెస్టర్లకు పెట్టుబడులను వెనక్కిచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఫ్రాంక్లిన్ ప్రతినిధి చెప్పారు. ఇప్పటికే రూ.9,122 కోట్లను పంపిణీ చేశామని, మరో రూ.1,180 కోట్ల నగదును సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. -
పీఎఫ్ఐ కార్యాలయాల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: నగదు అక్రమ రవాణా ఆరోపణలకు సంబంధించి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కు చెందిన 26 కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం సోదాలు నిర్వహించింది. దాదాపు 9 రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. పీఎఫ్ఐ చైర్మన్ ఓఎం అబ్దుల్ సలాం, కేరళ రాష్ట్ర పీఎఫ్ఐ చీఫ్ నసారుద్దీన్ ఎల్మరామ్, పీఎఫ్ఐ జాతీయ కార్యదర్శి అబ్దుల్ వాహిద్‌ల నివాసాలు, కార్యాలయాల్లోనూ సోదాలు జరిపారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఆందోళనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ దాడులు చేశారని పీఎఫ్ఐ పేర్కొంది. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముర్షీదాబాద్, లక్నో, ఔరంగాబాద్, జైపూర్, కొచ్చి, మలప్పురం తదితర నగరాలతోపాటు ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో దాడులు చేసింది. నగదు అక్రమ రవాణా కేసుకు సంబంధించి సాక్ష్యాలను సంపాదించేందుకు సోదాలు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలకు ఆర్థిక సాయం అందించారన్న ఆరోపణలతో పీఎఫ్ఐ ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్, బెంగళూరులో పోలీస్ స్టేషన్లపై దాడి, హాథ్రస్ హత్యాచారం తరువాత నిధుల లావాదేవీలు.. తదితర నేరాల వెనుక పీఎఫ్ఐ హస్తం ఉందన్న ఆరోపణలపై కూడా ఈడీ విచారణ చేస్తోంది. -
బ్యాంకును మోసం చేసిన కేసులో పలువురి ఆస్తుల జప్తు
సాక్షి, అమరావతి: బ్యాంకు రుణాల మోసం కేసులో వీనస్ ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ డైరెక్టర్లు నిమ్మగడ్డ రామకృష్ణ, నిమ్మగడ్డ వేణుగోపాల్, వీవీఎన్‌కే విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు చెందిన హైదరాబాద్, విజయవాడల్లోని 27 స్థిరాస్తులను జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. ఈ స్థిరాస్తుల విలువ రూ.11.05 కోట్లు ఉంటుందని బుధవారం ఈడీ ట్వీట్ చేసింది. గుడివాడలోని ఆంధ్రా బ్యాంకు (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్) నుంచి వీనస్ ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ పేరు మీద 470 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నట్టు తప్పుడు కాగితాలు సృష్టించి రూ.19.44 కోట్ల రుణాలను తీసుకొని ఎగ్గొట్టారు. దీనిపై బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేయడంతో దీని ఆధారంగా దర్యాప్తు చేసిన ఈడీ స్థిరాస్తులను జప్తు చేసింది. బ్యాంకు రుణం ద్వారా తీసుకున్న సొమ్మును సొంత ఖాతాలకు మరలించి స్థిరాస్తులు కొనుగోలు చేయడంతో పాటు సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం బ్యాంకుకు చెల్లించాల్సిన రుణం విలువ రూ.36.97 కోట్లకు చేరింది. జప్తు చేసిన ఆస్తుల మార్కెట్ విలువ రూ.34 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
మనీల్యాండరింగ్ కేసులో ఈడీ ఎదుట ఫరూఖ్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌కి సంబంధించిన 40 కోట్ల రూపాయల మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాని ఆరు గంటలపాటు విచారించింది. రాజ్‌బాగ్‌లోని తమ కార్యాలయంలో ఫరూఖ్‌ను ఈడీ విచారించింది. విచారణ అనంతరం బయటకు వచ్చిన ఫరూఖ్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులోని వాస్తవాలను కోర్టులు నిర్ణయిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఫరూఖ్ బతికున్నా, లేదా చనిపోయినా, 370 ఆర్టికల్ కోసం మన పోరాటం కొనసాగుతుంది. నన్ను ఉరితీసినా మన నిర్ణయం మారదు’ అని అన్నారు. అబ్దుల్లాపై ఈడీ విచారణ చేపట్టడం రాజకీయ వేధింపుల్లో భాగమేనని, జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలతో కొత్తగా ఏర్పడిన పీపుల్స్ అలయెన్స్ భాగస్వామ్య పక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వ వ్యతిరేకతను, ప్రభుత్వంపై అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వం సహించే స్థితిలో లేదని వారు విమర్శించారు. -
ఎట్టకేలకు ఒప్పుకున్నాడు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో భారీ బెట్టింగ్‌కు పాల్పడిన కలర్ ప్రిడెక్షన్ యాప్ కేసులో ప్రధాన నిందితుడైన చైనా జాతీయుడు యాన్ హూ ఎట్టకేలకు అసలు విషయం అంగీకరించాడు. ఇప్పటివరకు తనకు ఏమీ తెలియదని, తాత్కాలిక ప్రాతిపదికపై వచ్చి ఇరుక్కుపోయానని చెప్పుకొచ్చాడు. తాజాగా ఇతడిని న్యాయస్థానం అనుమతితో ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మంగళవారం కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ కామర్స్ ముసుగులో ఆన్లైన్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నానని, అందుకోసమే ఢిల్లీలో మకాం పెట్టానని ఒప్పుకున్నాడు. కలర్ ప్రిడెక్షన్ కేసుకు సంబంధించిన యాన్ హూతోపాటు ఢిల్లీవాసులు అంకిత్, ధీరజ్‌లను హైద రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆగస్టు 13న అరెస్టు చేసిన విషయం విదితమే. లోతుగా దర్యాప్తు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బీజింగ్ టుమారో పవర్ సంస్థకు చెందిన డమ్మీ కంపెనీల్లో ఒక దాని బ్యాంకు ఖాతాను ఇతడే నిర్వహిస్తున్నాడని, ఆ మేరకు బ్యాంకు ఖాతాదారుడి నుంచి ఆథరైజేషన్ కూడా తీసుకున్నాడని గుర్తించారు. యాన్ హూ ఫోన్ లోని చాటింగ్స్ ద్వారా అతడి పాత్రను నిర్ధారించారు. ఆ ఫోన్లోని వాట్సాప్‌లో డాకీ పే పేరుతో ఉన్న గ్రూప్ చాటింగ్స్‌లో యాన్ హూ ఆర్థిక లావాదేవీలు ఉండటంపై ఆధారాలు సేకరించారు. కలర్ ప్రిడెక్షన్‌పై సిటీసైబర్ క్రైమ్ ఠాణాలో రెండు, ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్లో ఒక కేసు నమోదయ్యాయి. రూ.9 లక్షలు నష్టపోయిన తలాబ్‌కట్టవాసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్‌నగర్ ఠాణాలో మరో కేసు నమోదైంది. సైబర్‌క్రైమ్ పోలీసులిచ్చిన సమాచారం మేరకు ఈడీ మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ అధికారులు కోర్టు అనుమతితో యాన్ హూను కస్టడీలోకి తీసుకున్నారు. ఈలోపు బెట్టింగ్ వ్యవహారంలో అతడి పాత్రపై కీలక ఆధారాలు సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. ఈడీ కస్టడీలో ఉన్న యాన్ హూ ఎదుట వీటిని పెట్టి ప్రశ్నించారు. దీంతో అతడు అసలు విషయం బయటపెట్టక తప్పలేదు. అయితే తాను చైనాలోని సూత్రధారుల నుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే పని చేశానంటూ చెప్పుకొచ్చాడు. వారు చెప్పినట్లే చేసేవాడినని, చెప్పిన ఖాతాల్లోకి డబ్బు బదిలీ చేస్తుండేవాడినని చెప్పాడు. కలర్ ప్రిడెక్షన్ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురినీ ఈడీ అధికారులు మనీల్యాండరింగ్ కోణంలో విచారిస్తున్నారు. -
ఫుట్‌పాత్‌ల అక్రమణలపై జీహెస్ఎమ్సీ కొరడా
-
ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఈడీ ఉత్తర్వులు
- జగన్ సంస్థల్లో పెట్టుబడుల వ్యవహారం... - సీబీఐ ఛార్జిషీట్లనే తానూ తీసుకున్న ఈడీ - వాటిలో పేర్కొన్న ఆస్తుల వరస అటాచ్మెంట్లు - ఇప్పటిదాకా7 ఛార్జిషీట్లు; ఇది ఎనిమిదవది - ఈ ఛార్జిషీట్లో మాత్రం సీబీఐ పేర్కొనని ఆస్తులూ అటాచ్!! - కేసులో సీబీఐ వేసినవి మొత్తం 11 ఛార్జిషీట్లు - 2012 అక్టోబర్‌లో అటాచ్మెంట్ మొదలెట్టిన ఈడీ సాక్షి, హైదరాబాద్: వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి చెందిన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి పలు ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. వి.వి.లక్ష్మీనారాయణ జాయింట్ డెరైక్టరుగా ఉన్న సమయంలో సీబీఐ ఈ వ్యవహారానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయటం తెలిసిందే. ఎన్నడూ లేనట్టుగా విచిత్రమైన రీతిలో ఈ కేసుకు సంబంధించి దఫదఫాలుగా మొత్తం 11 ఛార్జిషీట్లను సీబీఐ దాఖలు చేసింది. తొలి ఛార్జిషీటును 2012 మార్చి 31న దాఖలు చేసిన సీబీఐ... 11వ ఛార్జిషీటును 2013 సెప్టెంబరు చివర్లో దాఖలు చేయటం గమనార్హం. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ సహా పలు అంశాలు ఇమిడి ఉన్నట్లు సీబీఐ పేర్కొనటంతో... ఆ కోణాన్ని ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈడీ నిజానికి సొంతగా ఎలాంటి దర్యాప్తూ చేయటం లేదు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లను యథాతథంగా తీసుకుంటూ... అందులో పేర్కొన్న ఆస్తుల్ని వరసగా అటాచ్ చేస్తూ వస్తోంది. ఇప్పటిదాకా 7 ఛార్జిషీట్లకు సంబంధించి అందులో పేర్కొన్న ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. ‘‘ఈ ఒక్క ఛార్జిషీట్ విషయంలో మాత్రం సీబీఐ పేర్కొనని ఆస్తులను కూడా అటాచ్ చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. దీనిపైనా న్యాయపోరాటం చేస్తాం’’ అని జగన్మోహన్రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో కడప జిల్లాలో రఘురామ్ సిమెంట్‌కు సున్నపురాయి మైనింగ్ లీజును ఇవ్వటం వల్ల ఆ సంస్థ భారీగా లాభపడిందని, ప్రభుత్వానికి నష్టం వచ్చిందనేది ఈ ఛార్జిషీటు సారాంశం. దీంతో భారతి సిమెంట్స్‌లోకి పెట్టుబడి రూపంలో వచ్చిన మొత్తాలకు సరిపడా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన స్థిర, చరాస్థులు, షేర్లు తదితరాలను అటాచ్ చేస్తున్నామని, వీటి విలువ రూ.749 కోట్లదాకా ఉంటుందని ఈడీ తెలియజేసింది. వీటిలో జగన్మోహన్రెడ్డికి చెందిన హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నివాసంతో పాటు వివిధ కంపెనీలకు బెంగళూరు, హైదరాబాద్‌లో ఉన్న ఆస్తుల్ని పేర్కొన్నారు. వీటితో పాటు పలు కంపెనీల్లో షేర్లను కూడా అటాచ్ చేస్తున్నట్లు తెలియజేశారు. 2012 అక్టోబరు నుంచి మొదలు... వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సంస్థల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి ఆయన సంస్థలకు చెందిన ఆస్తుల్ని గడిచిన నాలుగేళ్లుగా ఈడీ అటాచ్ చేస్తూ వస్తోంది. తొలి చార్జిషీట్లో పేర్కొన్న అరబిందో పార్మా, హెటిరోడ్రగ్స్, సాక్షి మీడియాకు సంబంధించిన కొన్ని ఆస్తుల్ని 2012 అక్టోబరు 5న ఈడీ అటాచ్ చేసింది. అప్పటి నుంచి సీబీఐ వేసిన చార్జిషీట్లన్నిటినీ వరసగా తీసుకుంటూ... వాటిలో పేర్కొన్న ఆస్తుల్ని అటాచ్ చేస్తూ వస్తోంది. మొత్తం 11 ఛార్జిషీట్లలో ఇది 8వ చార్జిషీటు. అటాచ్మెంట్ అంటే..? అటాచ్ మెంట్ అంటే ఈ ఆస్తుల క్రయవిక్రయాలను నిలిపేసే చర్య. అటాచ్మెంట్ అయిన ఆస్తుల్ని వాటి హక్కుదార్లు యథాతథంగా ఎప్పటిలానే వాడుతుంటారు. కాకపోతే వాటిని విక్రయించటం గానీ, వాటి తరఫున కొత్త కొనుగోళ్లుగానీ చేయకూడదు. ఈడీ అటాచ్మెంట్ ఉత్తర్వుల్ని ప్రతివాదులు ఈడీ న్యాయాధికార సంస్థలో సవాలు చేయొచ్చు. అక్కడ కూడా అటాచ్‌మెంట్‌ను ధ్రువీకరిస్తే దానిపై కూడా అప్పీలు చేయొచ్చు. ఆ తరవాత కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు వంటి ఉన్నతస్థాయి న్యాయస్థానాల్లో న్యాయపోరాటం చేసే వీలుంటుంది. న్యాయ ప్రత్యామ్నాయాలున్నాయి... జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) జారీ చేసిన అటాచ్మెంట్ ఉత్తర్వులు తాత్కాలికమైనవేనని న్యాయవాది అశోక్‌రెడ్డి చెప్పారు. చార్జిషీట్ దాఖలు చేసిన ప్రతిసారీ ఈడీ ఈ విధంగా తాత్కాలిక అటాచ్మెంట్ ఉత్తర్వులిస్తోందని తెలిపారు. తమకు న్యాయపరంగా అనేక ప్రత్యామ్నాయాలున్నాయని చెబుతూ... ఈ ఉత్తర్వులను తాము అడ్జుడికేటింగ్ అథారిటీ, అప్పిలెట్ అథారిటీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో సవాలు చేస్తామన్నారు.