ముంబై: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడికి శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ లేఖ రాశారు. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహకరించాలంటూ కొందరు వ్యక్తులు దాదాపు నెల రోజుల క్రితం తనను సంప్రదించాలని లేఖలో పేర్కొన్నారు. సహకరించకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారని చెప్పారు.
రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావాలన్నదే వారి ఉద్దేశమని తెలిపారు. అలాగే ట్విట్టర్‌లో శివసేన గుర్తు పులి ఫొటోను పోస్టు చేశారు. జుఖేంగే నహీ.. జై మహారాష్ట్ర (మహారాష్ట్ర తలవంచదు) అని ట్వీట్ చేశారు. శివసేన నేతృత్వంలోని ఎంవీఏ ప్రభుత్వం పూర్తికాలం.. ఐదేళ్లూ అధికారంలోకి కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలను దురుద్దేశపూర్వకంగా ప్రయోగిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఎంవీఏ సర్కారు ఏర్పాటైన తర్వాత శివసేన నాయకులను కేంద్ర దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఉపరాష్ట్రపతికి రాసిన లేఖలో వెల్లడించారు. రాజ్యసభ సభ్యులపై వేధింపులను అడ్డుకోవాలని కోరారు. ఈ విషయంలో ఉపరాష్ట్రపతి స్పందించాలని, తగిన చర్యలు తీసుకోవాలని సంజయ్ రౌత్ విన్నవించారు. ఉపరాష్ట్రపతికి తాను రాసిన లేఖ ఒక ట్రైలర్ మాత్రమేనని సంజయ్ రౌత్ అన్నారు. బీజేపీ క్రిమినల్ సిండికేట్‌ను ముందుండి నడిపిస్తున్న ఈడీ అధికారులు బాగోతం బయటపెడతానని తేల్చిచెప్పారు.
మనీ ల్యాండరింగ్ పేరిట వేధింపులు
మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద నాతో పాటు మరో ఇద్దరు మహారాష్ట్ర మంత్రులను జైలుకు పంపిస్తామని బెదిరించారని తెలిపారు. రాష్ట్రంలోని ముఖ్యమైన నాయకులందరినీ జైలుకు పంపితే మధ్యంతర ఎన్నికలు వస్తాయని వారు భావించారని చెప్పారు. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం 2003 జనవరి 17న అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. కానీ, అంతకంటే ముందు జరిగిన డబ్బు లావాదేవీలు కూడా మనీ ల్యాండరింగే అంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, వేధింపులకు దిగుతున్నాయని ఆరోపించారు.
2012–13లో తనకు, తన కుటుంబ సభ్యులకు భూమిని విక్రయించిన వారిని ఈడీ బెదిరిస్తోందని, తనకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని హుకుం జారీ చేస్తోందని ధ్వజమెత్తారు. తన కుమార్తె పెళ్లిలో అలంకరణ పనులు చేసిన వారిని సైతం వెంటాడుతోందని, నేను వారికి రూ.50 లక్షలు ఇచ్చినట్లుగా ప్రకటన చేయాలని భయపెడుతోందని దుయ్యబట్టారు. తనకు సంబం« దించిన ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు 28 మందిని అదుపులోకి తీసుకొని, ప్రశ్నించాయన్నారు.
ఈడీ కనుసన్నల్లో అక్రమాలు
స్వేచ్ఛగా భావాలను వెల్లడించే హక్కు తనకుందని, ఆ హక్కుపై దర్యాప్తు సంస్థలు దాడి చేస్తున్నట్లుగా భావిస్తున్నానని సంజయ్ రౌత్ చెప్పారు. సిండికేట్, బ్లాక్‌మెయిలింగ్, మనీ ల్యాండరింగ్ వంటి అక్రమ వ్యవహారాలు ఈడీ కనుసన్నల్లో సాగుతున్నాయని ఆరోపించారు. తనను జైలుకు పంపిస్తే వెళ్తానని, తన తర్వాత బీజేపీ నాయకులు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. తాము ఎలాంటి తప్పులు చేయలేదని, బీజేపీ నేతలే ఎన్నో పాపాలు చేశారని అన్నారు.
తాము భయపడతామని అనుకుంటే అది పొరపాటేనని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎవరు సాయం అడిగారని ప్రశ్నించగా... దానిపై త్వరలో మాట్లాడతానని సంజయ్ రౌత్ బదులిచ్చారు. అది ఢిల్లీ, ముంబైకి చెందిన నాయకుల ఉమ్మడి కుట్ర అని పేర్కొన్నారు. గత ఏడాది ఉప ఎన్నికలో దాద్రా నగర్ హవాలీ ఎంపీ సీటును శివసేన గెలుచుకుందని, అప్పటి నుంచి తమ పార్టీకి ఇక్కట్లు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
త్వరలో మహారాష్ట్రలో బీజేపీదే అధికారం
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మహారాష్ట్రలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. మార్చి 10న ఫలితాలు బహిర్గతమైన తర్వాత మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ రావడం తథ్యమని జోస్యం చెప్పారు. శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment