
సాక్షి, హైదరాబాద్: ఏపీ మహేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఎండీ ఎ.ఉమేశ్‌చంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. ఉమేశ్‌చంద్రపై నమోదు చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును నిలిపివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేశారని, ఈ కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరుకావాలంటూ ఈడీ ఇచ్చిన సమన్లను సవాల్ చేస్తూ ఉమేశ్‌చంద్ర దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు.
బ్యాంకు పాలకమండలి ఎన్నిక సందర్భంగా నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేయడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. ఇది ఈడీ దర్యాప్తు నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ మేరకు స్పందించిన న్యాయమూర్తి... తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు దర్యాప్తు నిలిపివేయాలని, అలాగే ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment