సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని సినీ నటుడు తనీష్ చెప్పారు. కెల్విన్ నుంచి తాను డ్రగ్స్ ఖరీదు చేయడం కానీ, దాని నిమిత్తం డబ్బు వెచ్చించడం కానీ జరగలేదని స్పష్టం చేశారు. టాలీవుడ్ ప్రముఖులతో ముడిపడి ఉన్న ఈ కేసులో మనీల్యాండరింగ్ కోణాన్ని దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట శుక్రవారం ఆయన హాజరయ్యారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన ఆయన సాయంత్రం 6 గంటలకు తిరిగి వచ్చారు. బుధవారం నటుడు తరుణ్ విచారణకు హాజరుకానున్నారు.
ఈవెంట్ల వల్లే కెల్విన్‌తో పరిచయం
డ్రగ్స్ కేసు ప్రధాన నిందితుడు కెల్విన్‌తో ఉన్న పరిచయం, అతడితో లావాదేవీలపై తనీష్‌ను ఈడీ అధికారులు ఆరా తీశారు. 2016–17 మధ్య కెల్విన్‌తో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసినట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఈడీ దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో తాను చేసిన పలు సినిమాలకు కెల్విన్ ఈవెంట్లు నిర్వహించాడని, ఆ విధంగానే అతడితో పరిచయం ఏర్పడిందని తనీష్ జవాబిచ్చారు. ఈ వ్యవహారంలో డ్రగ్స్ క్రయవిక్రయాలు, వినియోగానికి ఎక్కడా తావు లేదని స్పష్టం చేశారు. కెల్విన్ విచారణలో తన పేరు బయటకు రావడానికి అతడితో ఈవెంట్ల పరంగా ఉన్న పరిచయమే కారణమని వివరణ ఇచ్చారు.
మళ్లీ రమ్మనలేదు
తాను బాలనటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగానని, డ్రగ్స్ వంటి వాటి జోలికి వెళితే అది సాధ్యమయ్యేది కాదని తనీష్ చెప్పారు. తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన స్టేట్‌మెంట్స్‌ను ఈడీ అధికారులకు ఆయన అందించారు. విచారణ ముగించుకుని తిరిగి వెళ్తూ మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులను కోరిన వివరాలు అందించానని, వారు కొన్ని డాక్యుమెంట్లు సైతం పరిశీలించారని తెలిపారు. మరోసారి విచారణకు రావాల్సిన అవసరం ఉంటుందని చెప్పలేదని, ఒకవేళ పిలిస్తే కచ్చితంగా వచ్చి పూర్తి సహకారం అందిస్తానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment