సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సినీ నటుడు నవదీప్, ఎఫ్–లాంజ్ క్లబ్ మాజీ జనరల్ మేనేజర్ అర్పిత్ సింగ్ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ముంబైలో ఉన్న నవదీప్ అక్కడ నుంచి నేరుగా ఉదయం 11.15 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన కంటే ముందే అర్పిత్ సింగ్ వచ్చారు. రాత్రి 8.45 గంటల వరకు వీరి విచారణ సాగింది. గత నెల 31న దర్శకుడు పూరీ జగన్నాథ్ తర్వాత ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించింది వీరిద్దరినే. సోమవారం నాటి విచారణ.. కెల్విన్‌తో వారికున్న సంబంధాలు, ఎఫ్–క్లబ్ లావాదేవీలు, మనీల్యాండరింగ్ ఆరోపణల కేంద్రంగా జరిగింది. డ్రగ్స్ కేసులో ఇతర నిందితులుగా ఉన్న పీటర్, కమింగ్‌లతో సంబంధాలు ఉన్నాయా? అనేది ఆరా తీశారు.
ఎఫ్–లాంజ్ నా స్నేహితులది: నవదీప్
2016–17 మధ్య ఎఫ్–క్లబ్‌లో భారీ స్థాయిలో డ్రగ్స్ పార్టీలు జరిగాయనేది తెలంగాణ ఎక్సైజ్ అధికారుల ఆరోపణ. వాటికి అనేకమంది సినీ ప్రముఖులు హాజరయ్యారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీన్ని నవదీప్ నిర్వహించగా... అర్పిత్ సింగ్ జనరల్ మేనేజర్‌గా వ్యవహరించాడని ఈడీ అనుమానం. ఆ మధ్యకాలంలో దాదాపు 35 పెద్ద పార్టీలకు ఆ క్లబ్ వేదికైనట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. అక్కడ జరిగిన పార్టీలకు కెల్విన్ నుంచి డ్రగ్స్ ఖరీదు చేయడం వంటి ఆరోపణలపై ఇద్దర్నీ వివరణ అడిగింది. ఎఫ్–లాంజ్ తన స్నేహితులకు చెందినదని చెప్పిన నవదీప్... అక్కడ జరిగిన కొన్ని సినీ సంబంధిత ఈవెంట్లకు మాత్రమే తాను వెళ్లానని స్పష్టం చేశారు. తాను సినిమాల్లో నటించడంతో పాటు ఆ రంగానికి సంబంధించిన, ఇతర కీలక ఈవెంట్లూ నిర్వహిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మరో ఈవెంట్ మేనేజర్ అయిన కెల్విన్‌తో పరిచయం ఉందని వివరించారు. అలా కలిసిన సందర్భాల్లోనే ఫొటోలు దిగడం, ఈవెంట్లకు సంబంధించిన వివరాలపై చర్చించిన నేపథ్యంలో ఫోన్, వాట్సాప్ సంభాషణలు ఉండి ఉండవచ్చని చెప్పారు. 2016–18 మధ్య కాలానికి సంబంధించిన తన బ్యాంకు స్టేట్‌మెంట్లను అందజేశారు.
లావాదేవీలన్నీ ఈవెంట్స్‌కు సంబంధించినవే: అర్పిత్
ఈవెంట్ మేనేజర్‌గా ఉన్న కెల్విన్ ఎఫ్–క్లబ్‌లోనూ కొన్ని కార్యక్రమాలు చేసినట్లు అర్పిత్ సింగ్ ఈడీ అధికారులకు తెలిపారు. 2016–17 మధ్య జరిగిన పార్టీలకు ముందు, తర్వాత అనేకమంది సినీ ప్రముఖుల నుంచి అర్పిత్‌తో పాటు ఎఫ్–క్లబ్ ఖాతాకు భారీగా డబ్బు బదిలీ జరిగిందని ఈడీ ఆధారాలు సేకరించింది. ఆర్థిక లావాదేవీలు జరిగిన మాట వాస్తవమే అని అంగీకరించిన అర్పిత్.. అవన్నీ కేవ లం ఈవెంట్స్, లేదా పార్టీలకు సంబంధించినవి మాత్రమే అని స్పష్టం చేశారు. ఎఫ్–క్లబ్ బ్యాంకు లావాదేవీల రికార్డులను అందించారు. నవదీప్, అర్పిత్ సింగ్‌లను వేర్వేరుగా ఆపై ఇద్దరినీ కలిపి విచారించిన ఈడీ అధికారులు వాం గ్మూలాలు నమోదు చేశారు. ఈడీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్తున్న సమయం లో మీడియాతో మాట్లాడటానికి నవదీప్ విముఖత చూపారు. ఇలావుండగా సినీ నటి ముమైత్‌ఖాన్ బుధవారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు.
సినీ ఈవెంట్లకే ఎఫ్ క్లబ్‌కు వెళ్లా
Published Tue, Sep 14 2021 12:57 AM | Last Updated on Sun, Oct 17 2021 1:16 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment