
సాక్షి, అమరావతి: బ్యాంకు రుణాల మోసం కేసులో వీనస్ ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ డైరెక్టర్లు నిమ్మగడ్డ రామకృష్ణ, నిమ్మగడ్డ వేణుగోపాల్, వీవీఎన్‌కే విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు చెందిన హైదరాబాద్, విజయవాడల్లోని 27 స్థిరాస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. ఈ స్థిరాస్తుల విలువ రూ.11.05 కోట్లు ఉంటుందని బుధవారం ఈడీ ట్వీట్ చేసింది.
గుడివాడలోని ఆంధ్రా బ్యాంకు (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్) నుంచి వీనస్ ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ పేరు మీద 470 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నట్టు తప్పుడు కాగితాలు సృష్టించి రూ.19.44 కోట్ల రుణాలను తీసుకొని ఎగ్గొట్టారు. దీనిపై బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేయడంతో దీని ఆధారంగా దర్యాప్తు చేసిన ఈడీ స్థిరాస్తులను జప్తు చేసింది. బ్యాంకు రుణం ద్వారా తీసుకున్న సొమ్మును సొంత ఖాతాలకు మరలించి స్థిరాస్తులు కొనుగోలు చేయడంతో పాటు సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం బ్యాంకుకు చెల్లించాల్సిన రుణం విలువ రూ.36.97 కోట్లకు చేరింది. జప్తు చేసిన ఆస్తుల మార్కెట్ విలువ రూ.34 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment