సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్(కేఎస్‌బీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. మదుపరుల అనుమతి లేకుండా వారి షేర్లను బదలాయించడంతోపాటు సెబీ నిబంధనలు ఉల్లంఘించి తీసుకున్న బ్యాంకు రుణాలను వ్యక్తిగత, షెల్ కంపెనీలకు మళ్లించిన నేరంలో ఆయనను సోమవారం ఉదయం బెంగళూర్‌లో పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు.
కార్వీలో జరిగిన కుంభకోణంపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పార్థసారథితోపాటు ఇతర డైరెక్టర్లపై ఇప్పటికే కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే తరహా కేసులో బెంగళూర్ పోలీసులు కూడా పార్థసారథిని పీటీ వారెంట్‌పై తీసుకెళ్లి విచారించారు. సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో కార్వీకి చెందిన 14 కార్యాలయాలు, ఎండీ, ఇతర కీలక వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేసింది.
కార్వీ షేర్లు కొన్న మదుపరుల పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా వారికి తెలియకుండా షేర్లను తన వ్యక్తిగత ఖాతాలోకి బదలాయించుకొని వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.3 వేల కోట్లు రుణంగా పార్థసారథి పొందినట్టు ఈడీ గుర్తించింది. ఐసీఐసీఐ, ఇండస్ బ్యాంకుల ద్వారా పొందిన రూ.1,100 కోట్ల రుణంను తన ఖాతాలతోపాటు షెల్ కంపెనీలైనా కార్వీ రియాల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్, మరో 7 కంపెనీలోకి మళ్లించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ గుర్తించింది. డీమ్యాట్ అకౌంట్లు బ్లాక్ లిస్ట్‌లో ఉన్నా పార్థసారథి సెబీ నిబంధనలు ఉల్లంఘించి ఇలా తనఖా పెట్టి షేర్ల ద్వారా రుణాలను షెల్ కంపెనీల్లోకి మళ్లించినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది.
రూ.700 కోట్ల షేర్లు ఫ్రీజ్
గతేడాది సెప్టెంబర్‌లో ఈడీ రూ.700 కోట్ల విలువైన కార్వీ స్టాక్ బ్రోకింగ్ షేర్లను ఫ్రీజ్ చేసింది. కస్టమర్లకు తెలియకుండా బదలాయించుకున్న షేర్లకు సంబంధించిన రూ.1,906 కోట్లను కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ నుంచి కార్వీ రియాల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌లోకి బదలాయించినట్టు ఈడీ దర్యాప్తులో గుర్తించినట్టు తెలిసింది. మిగిలిన రూ.1,800 కోట్ల లావాదేవీలపై విచారణను ముమ్మరం చేసింది.
డబ్బును ఎక్కడికి మళ్లించారు, దేనికి వాడారో తేల్చేందుకు పార్థసారథిని మరింత లోతుగా విచారించనుంది. ఇందుకు కోర్టులో కస్టడీ పిటిషన్ వేసి విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు. కాగా, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను షెల్ కంపెనీకు మళ్లించిన ఆధారాలను ఆటోమేటెడ్ డిలీట్ సాఫ్ట్‌వేర్‌తో పార్థసారథి ధ్వంసం చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. వీటిని వెలుగులోకి తేవాల్సి ఉందని ఈడీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment