సాక్షి ప్రతినిధి, చెన్నై: మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో భారతీయ జనతా పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి కోర్టుకు హాజరయ్యారు. తప్పుడు పత్రాలను సమర్పించి బ్యాంకుల నుంచి వందలకోట్ల రూపాయలను రుణాలుగా పొంది ఎగవేయడంతో ఈడీ ఈ కేసు నమోదు చేసింది. చెన్నై జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న ప్రజాప్రతినిధుల కోర్టుకు సుజనా చౌదరి శనివారం ఉదయం 11.10 గంటలకు న్యాయవాదులు, మరికొందరితో కలిసి వచ్చారు. ఈ కేసులో ఆయన ఆరో నిందితునిగా ఉన్నారు.
గతంలో ఇదే కేసులో ఆయన వివిధ కారణాలతో దాదాపు పలుమార్లు విచారణకు గైర్హాజరయ్యారు. తాజాగా అక్టోబర్ 29న చెన్నైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టుకు సుజనా హాజరుకావాల్సి ఉండగా.. ఆ రోజు కూడా ఆయన రాలేదు. శనివారం మందీ మార్బలంతో ఆయన కోర్టుకు చేరుకున్నారు. ఉదయం సుమారు 11.20 నిమిషాలకు లోనికి వెళ్లిన ఆయన మధ్యాహ్నం 12.45 గంటలకు బయటకు వచ్చారు. ప్రత్యేక అనుమతితో అత్యంత గోప్యంగా ఢిల్లీ నుంచి వచ్చిన సుజనాకు ఈ కేసులో వెనువెంటనే బెయిల్ మంజూరయినట్లు తెలిసింది.
దౌర్జన్యంగా వీడియో దృశ్యాల తొలగింపు
కాగా సుజనాచౌదరి కోర్టు మొదటి అంతస్తులోకి న్యాయవాదులతో కలిసి వస్తున్న దృశ్యాలను ‘సాక్షి’ ప్రతినిధి సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. ఈ విషయాన్ని పసిగట్టిన సుజనా వాటిని తొలగించాల్సిందిగా న్యాయవాదులను పురమాయించారు. నలుగురు న్యాయవాదులు సాక్షి ప్రతినిధిని చుట్టుముట్టి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన దృశ్యాలను తొలగించాల్సిందిగా కోరారు. మీ విధులు మీరు నిర్వర్తిస్తున్నట్లే.. నా విధులు నిర్వర్తించడం నా కర్తవ్యం, అడ్డుకునే హక్కు మీకు లేదని విలేకరి వాదించినా వినిపించుకోలేదు. దౌర్జన్యంగా సెల్‌ఫోన్‌ను లాక్కుని మరీ వీడియోను డిలీట్ చేశారు.
గుట్టుగా కోర్టుకు సుజనా
Published Sun, Dec 5 2021 4:51 AM | Last Updated on Sun, Dec 5 2021 4:52 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment