ముంబై: దాదాపు ఏడాది క్రితం అంటే 2020 ఏప్రిల్‌లో ఆరు పథకాలకు స్వస్తి పలికిన ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్)పై ఓవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, మరోపక్క మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టిసారించాయి. దీనిలో భాగంగా ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ ఎంఎఫ్‌పై ఈడీ మనీ లాండరింగ్ కేసును నమోదు చేసినట్లు తెలుస్తోంది. సంస్థతోపాటు మరో 8మందిపై కేసు రిజిస్టర్ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఆరు పథకాలను మూసివేసే ముందుగానే కీలక అధికారులు కొంతమంది తమ పెట్టుబడులను వెనక్కి(రీడీమ్) తీసుకోవడంపై ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ ఎంఎఫ్‌తోపాటు, కీలక అధికారులకు సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా సమన్లు సైతం జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అవకతవకలు, అక్రమ లావాదేవీల(ఎఫ్‌యూటీపీ) నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై సెబీ దర్యాప్తును చేపట్టినట్లు తెలుస్తోంది. పథకాల మూసివేతకంటే ముందుగానే ఫండ్ హౌస్‌కు చెందిన కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు రూ. 50 కోట్లకుపైగా విలువైన పెట్టుబడులను రీడీమ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలు ఆడిట్‌లో వెల్లడికావడంతో సెబీ చట్టపరమైన దర్యాప్తునకు తెరతీసినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి.
సాధారణ పద్ధతిలోనే..: నియంత్రణ సంస్థల దర్యాప్తు వార్తల నేపథ్యంలో మూసివేసిన ఆరు పథకాలలో కంపెనీకి చెందిన యాజమాన్యం, ఉద్యోగుల పెట్టుబడులున్నట్లు ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ ఎంఎఫ్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. 2020 ఏప్రిల్ 23వరకూ దాఖలైన యూనిట్ హోల్డర్ల దరఖాస్తులను సాధారణ బిజినెస్ పద్ధతిలో ప్రాసెస్ చేసినట్లు తెలియజేశారు. పథకాలను మూసివేసేందుకు ట్రస్టీలు ముందస్తుగా నిర్ణయించాక కంపెనీకి చెందిన కీలక వ్యక్తులెవరూ ఎలాంటి పెట్టుబడులనూ రీడీమ్ చేసుకోలేదని వివరించారు. సెబీ జారీ చేసిన షోకాజ్ నోటీసులకు పూర్తిస్థాయిలో వివరాలను దాఖలు చేసినట్లు వెల్లడించారు.
రూ. 25,000 కోట్లు
2020 ఏప్రిల్‌లో ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ ఎంఎఫ్ ఎత్తివేసిన 6 పథకాల్లో పెట్టుబడుల విలువ రూ. 25,000 కోట్లు కాగా.. 3 లక్షల మంది ఇన్వెస్ట్ చేశారు. కాగా.. సాధ్యమైనంత త్వరగా ఇన్వెస్టర్లకు పెట్టుబడులను వెనక్కిచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఫ్రాంక్లిన్ ప్రతినిధి చెప్పారు. ఇప్పటికే రూ.9,122 కోట్లను పంపిణీ చేశామని, మరో రూ.1,180 కోట్ల నగదును సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
ఫ్రాంక్లిన్ ఎంఎఫ్‌పై ఈడీ కేసు
Published Fri, Mar 5 2021 4:51 AM | Last Updated on Fri, Mar 5 2021 4:57 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment