సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్‌తో ముడిపడి ఉన్న డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నటి రకుల్ ప్రీత్ సింగ్‌ను విచారించారు. శుక్రవారం ఉదయం 9:10 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆమెను అధికారులు దాదాపు ఏడు గంటలపాటు విచారించారు. తెలంగాణ ఎక్సైజ్ అధికారులు 2017లో నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. అయితే అప్పట్లో రకుల్ పేరు బయటకు రాలేదు.
గతేడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డ్రగ్స్ కేసు నమోదు చేసింది. అందులో రకుల్ పేరు వెలుగులోకి రావడంతోపాటు ఇక్కడి కేసులో కీలక నిందితుడైన కెల్విన్ విచారణలో బయటపడిన అంశాల ఆధారంగానే రకుల్‌కు ఈడీ సమన్లు జారీ చేసినట్లు తెలిసింది.
రియాతో సంబంధాలపై ఆరా...
గతేడాది సెప్టెంబర్ 25న ముంబైలో ఎన్సీబీ విచారణకు రకుల్ హాజరయ్యారు. తాజాగా శుక్రవారం రకుల్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు ప్రధానంగా సుశాంత్‌సింగ్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి (రియాను అప్పట్లో ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే)తో సంబంధాలపై ఆరా తీశారు. అప్పటి విచారణకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు ఎన్సీబీ నుంచి తీసుకున్నారు. వాటితోపాటు రెండు నెలల క్రితం కెల్విన్ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా ఈడీ అధికారులు రకుల్‌ను ప్రశ్నించారు.
డ్రగ్స్ కొనుగోలు చేయడానికి మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రశ్నలు సంధించారు. గతేడాది ఎన్సీబీ విచారించడానికి కారణం అదేనా? అంటూ ప్రశ్నించారు. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చిన రకుల్ తన బ్యాంకు లావాదేవీలన్నీ పారదర్శకంగానే జరిగాయని చెప్పారు. మాదకద్రవ్యాల కొనుగోలు, వినియోగాలకు తాను ఎప్పుడూ దూరంగానే ఉన్నానంటూ స్పష్టం చేసి బ్యాంకు లావాదేవీల రికార్డులు ఈడీకి అందించారు.
ముందే వచ్చిన రకుల్...
ఎక్సైజ్ విభాగానికి చెందిన సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ.. విచారణకు రావాల్సిందిగా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు గత నెల్లో సమన్లు జారీ చేసింది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి చార్మీ కౌర్‌ను ప్రశ్నించారు. షెడ్యూల్ ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె విజ్ఞప్తి మేరకు శుక్రవారం రావడానికి ఈడీ అధికారులు అంగీకరించారు.
ఇప్పటివరకు విచారణకు హాజరైన పూరీ, చార్మీ ఉదయం 10–10:30 గంటల మధ్య ఈడీ కార్యాలయానికి రాగా, రకుల్ మాత్రం ఉదయం 9:10 గంటలకే వచ్చారు. ఆమె వెంట సహాయకులు, మేనేజర్, ఆడిటర్, న్యాయవాది ఉన్నారు. సాయంత్రం తిరిగి వెళ్తున్న సమయంలో రకుల్ మీడియాతో మాట్లాడటానికి విముఖత చూపారు. బుధవారం నటుడు దగ్గుబాటి రానా ఈడీ విచారణకు హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment