Telangana excise department
-
రియా చక్రవర్తితో సంబంధమేంటి?
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్‌తో ముడిపడి ఉన్న డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నటి రకుల్ ప్రీత్ సింగ్‌ను విచారించారు. శుక్రవారం ఉదయం 9:10 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆమెను అధికారులు దాదాపు ఏడు గంటలపాటు విచారించారు. తెలంగాణ ఎక్సైజ్ అధికారులు 2017లో నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. అయితే అప్పట్లో రకుల్ పేరు బయటకు రాలేదు. గతేడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డ్రగ్స్ కేసు నమోదు చేసింది. అందులో రకుల్ పేరు వెలుగులోకి రావడంతోపాటు ఇక్కడి కేసులో కీలక నిందితుడైన కెల్విన్ విచారణలో బయటపడిన అంశాల ఆధారంగానే రకుల్‌కు ఈడీ సమన్లు జారీ చేసినట్లు తెలిసింది. రియాతో సంబంధాలపై ఆరా... గతేడాది సెప్టెంబర్ 25న ముంబైలో ఎన్సీబీ విచారణకు రకుల్ హాజరయ్యారు. తాజాగా శుక్రవారం రకుల్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు ప్రధానంగా సుశాంత్‌సింగ్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి (రియాను అప్పట్లో ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే)తో సంబంధాలపై ఆరా తీశారు. అప్పటి విచారణకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు ఎన్సీబీ నుంచి తీసుకున్నారు. వాటితోపాటు రెండు నెలల క్రితం కెల్విన్ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా ఈడీ అధికారులు రకుల్‌ను ప్రశ్నించారు. డ్రగ్స్ కొనుగోలు చేయడానికి మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రశ్నలు సంధించారు. గతేడాది ఎన్సీబీ విచారించడానికి కారణం అదేనా? అంటూ ప్రశ్నించారు. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చిన రకుల్ తన బ్యాంకు లావాదేవీలన్నీ పారదర్శకంగానే జరిగాయని చెప్పారు. మాదకద్రవ్యాల కొనుగోలు, వినియోగాలకు తాను ఎప్పుడూ దూరంగానే ఉన్నానంటూ స్పష్టం చేసి బ్యాంకు లావాదేవీల రికార్డులు ఈడీకి అందించారు. ముందే వచ్చిన రకుల్... ఎక్సైజ్ విభాగానికి చెందిన సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ.. విచారణకు రావాల్సిందిగా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు గత నెల్లో సమన్లు జారీ చేసింది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి చార్మీ కౌర్‌ను ప్రశ్నించారు. షెడ్యూల్ ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె విజ్ఞప్తి మేరకు శుక్రవారం రావడానికి ఈడీ అధికారులు అంగీకరించారు. ఇప్పటివరకు విచారణకు హాజరైన పూరీ, చార్మీ ఉదయం 10–10:30 గంటల మధ్య ఈడీ కార్యాలయానికి రాగా, రకుల్ మాత్రం ఉదయం 9:10 గంటలకే వచ్చారు. ఆమె వెంట సహాయకులు, మేనేజర్, ఆడిటర్, న్యాయవాది ఉన్నారు. సాయంత్రం తిరిగి వెళ్తున్న సమయంలో రకుల్ మీడియాతో మాట్లాడటానికి విముఖత చూపారు. బుధవారం నటుడు దగ్గుబాటి రానా ఈడీ విచారణకు హాజరుకానున్నారు. -
శని, ఆదివారాలు చెక్కులిచ్చినా.. లిక్కర్ ఇస్తాం
సాక్షి, హైదరాబాద్: ఆదాయార్జనలో అందివచ్చిన ఏ అవకాశాన్నీ ఎక్సైజ్ శాఖ వదిలిపెట్టడంలేదు. కొత్త మున్సిపాలిటీల్లో బార్ల ఏర్పాటు పేరుతో ఔత్సాహికుల నుంచి నెల రోజుల్లోనే రూ. 75 కోట్లకుపైగా సంపాదించిన ఆబ్కారీ శాఖ ఇప్పుడు మద్యం వ్యాపారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. శని, ఆదివారాలు సెలవులు ఉన్న నేపథ్యంలో చెక్కు ఇచ్చినా సరే డిపోల నుంచి రిటైలర్లకు మందు సరఫరా చేయాలని నిర్ణయించింది. దీన్ని బట్టి ఖజానాను నింపుకొనే క్రమంలో రెండు రోజుల సమయాన్ని కూడా ఆ శాఖ వదులుకోవడంలేదని అర్ధమవుతోంది. గతంలో డీడీలు ఇప్పుడు చెక్‌లు రాష్ట్రంలోని రిటైల్ మద్యం వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ ఇప్పటివరకు క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో మాత్రమే మందు అమ్ముతోంది. అంటే ఏదైనా వైన్ లేదా బార్ షాపునకు మద్యం కావాలంటే కొనుగోలు విలువకు సరిపడా నగదును బ్యాంకులో చెల్లించి డీడీ రూపంలో సమర్పిస్తేనే డిపో నుంచి షాపునకు మద్యం పంపేది. కానీ, ఇప్పుడు చెక్కు ఇచ్చినా మద్యం సరఫరా చేయాలని శాఖ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. రెండు రోజులను కూడా వృధా చేసుకోకుండా కాసులు రాబట్టుకునేందుకే చెక్కుల నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, చెక్కు బౌన్స్ అయితే మాత్రం 20 శాతం పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. -
మందుబాబులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో కొత్త బార్లు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 72 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 159 బార్లకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 55, పట్టణ ప్రాంతాల్లో 104 బార్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సోమవారం నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అదేరోజు జిల్లా ఎక్సైజ్ అధికారులు ఈ నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు వచ్చే నెల 8వ తేదీ వరకు తీసుకుంటారు. లాటరీ పద్ధతి ఫిబ్రవరి 10న ఆయా జిల్లాల కలెక్టర్లు లాటరీ పద్ధతిన బార్లు కేటాయిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్సైజ్ కమిషనర్ 11న డ్రా తీస్తారు. బార్లు పొందిన వారి జాబితాను అదే నెల 12న ఆయా జిల్లాల డిప్యూటీ కమిషనర్లు.. ఎక్సైజ్ కమిషనర్‌కు పంపనుండగా, 13న జీహెచ్ఎంసీ జాబితాను పంపుతారు. అదే నెల 17న లాటరీ వచ్చిన వారికి జిల్లా అధికారులు బార్లు కేటాయించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనైతే కమిషనర్ కార్యాలయంతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి డీసీ కార్యాలయాల్లో, రాష్ట్రంలోని మిగిలిన పట్టణ ప్రాంతాల్లో మాత్రం జిల్లా ఎక్సైజ్ కార్యాలయంతో పాటు డిప్యూటీ కమిషనర్, కమిషనర్ కార్యాలయాల్లో కొత్త బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు లభ్యమవుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజు కింద రూ.లక్ష వసూలు చేయనున్నారు. గతంలో ఉన్న 1,030 బార్లకు అదనంగా కొత్త మున్సిపాలిటీల్లో మరో 159 ఏర్పాటు కానున్నాయి. దరఖాస్తు సులభం ఈసారి బార్ల కోసం దరఖాస్తు చేసుకునే విధానాన్ని సులభం చేసింది. ఒక్క పేజీలోనే ఎక్సైజ్ శాఖ దరఖాస్తును తయారుచేసింది. మూడు కలర్ పాస్‌పోర్టు ఫొటోలు, స్వీయ ధ్రువీకరణతో కూడిన పాన్‌కార్డు లేదా ఆధార్‌కార్డు మాత్రమే దరఖాస్తు సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. బార్ల లాటరీ పూర్తయ్యాక మాత్రం 90 రోజుల్లోగా ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన అన్ని నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే మరో 60 రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. కానీ ఈ కాలానికి మొదటి వాయిదా లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలు అన్నీ పూర్తి చేసిన తర్వాతే బార్ లైసెన్స్ ఇస్తామని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. -
లాక్డౌన్: కల్లు అమ్మకాలకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కల్లు అమ్ముకునేందుకు అనుమతి ఇస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఈ మేరకు సీఎం అనుమతితో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆయన వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, లాక్డౌన్ నిబంధనలకు లోబడి కల్లు అమ్మాలని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగిలిన జిల్లాల్లో కల్లు విక్రయించేందుకు సీఎం కేసీఆర్ అనుమతినిచ్చారని, ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. గీత కార్మిక పక్షపాతిగా కేసీఆర్ మొదటి నుంచీ వారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని, ఇప్పుడు కల్లు అమ్మకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 2.8 లక్షల మంది లైసెన్స్డ్ గీత వృత్తిదారులకు ఉపాధి కలుగుతుందని తెలిపారు. సమావేశంలో ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, గౌడ సంఘాల నేతలు పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్, బి.బాలరాజ్ గౌడ్, చింతల మల్లేశం గౌడ్, అంబాల నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సర్కారీ సారాయి?
గుడుంబా నియంత్రణకు ప్రత్యామ్నాయ మార్గం! ఎక్సైజ్ శాఖ సమీక్షలో ప్రస్తావించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్తీ మద్యంతో కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన పరిష్కారంపై నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం డిమాండ్ మేరకు రాష్ట్రంలోనే మద్యం ఉత్పత్తి తగినన్ని డిస్టిలరీల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్న కేసీఆర్ తెలంగాణలో చాలా చోట్ల గుడుంబా సమస్య ఉంది. నేను గరీబ్‌నగర్‌కు పోతే అక్కడి మహిళలు మళ్లీ ప్రభుత్వ సారా తేవాలని అడిగారు. తెలంగాణ సమాజం ఈ సమస్యను అధిగమించాలి. దీనిపై చర్చ జరగాలి. తొందర్లోనే దీనిపై ఓ విధానం రూపొందిస్తాం - ఆదివారం వరంగల్ జిల్లా హన్మకొండలో మీడియాతో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ ప్రభుత్వ సారాయి దుకాణాలు తెరిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయా? కల్తీ మద్యాన్ని(గుడుంబా) అరికట్టడానికి ఇదే ప్రత్యామ్నాయమని ప్రభుత్వం భావిస్తోందా? కల్తీ మందు తాగి చోటుచేసుకుంటున్న మరణాలతో కుటుంబాలు వీధిన పడుతున్నాయని, దీనికి మరో మార్గాన్ని అన్వేషించాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు గుడుంబా గురించి ఎక్కువ మంది ఫిర్యాదు చేస్తున్నారని, ప్రభుత్వ సారా అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వరంగల్‌లో చేసిన వ్యాఖ్యలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. తాజాగా ఎకై్సజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలోనూ సీఎం ఈ విధమైన సూచన చేసినట్లు సమాచారం. సోమవారం సచివాలయంలో ఎకై్సజ్ శాఖతో సమావేశంలో ముఖ్యమంత్రి ఎక్కువగా గుడుంబాపైనే చర్చించినట్లు తెలిసింది. అధికారవర్గాల సమాచారం ప్రకారం.. వచ్చే అబ్కారీ సంవత్సరానికి సంబంధించిన పలు అంశాలపైనా ఆయన చర్చించారు. గుడుంబాతో అనేక కుటుంబాలు పెద్దదిక్కును, యుక్తవయసులోని పిల్లలను కోల్పోయి దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతున్నాయని కేసీఆర్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ మద్యాన్ని తాగి యువకులు మరణించడం వల్ల చిన్న వయసులోనే యువతులు వితంతువులుగా మారుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గుడుంబాను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై త్వరగా ఓ నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వారుణి వాహిని పేరుతో ప్యాకెట్ల ద్వారా విక్రయించిన సారాయిపై 1993లో నిషేధం విధించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో సారా నిషేధం కొనసాగుతోంది. దీని స్థానంలో చీప్ లిక్కర్‌ను తీసుకొచ్చినా.. ఆ తర్వాత ధరల పెరుగుదలతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు గుడుంబాకు అలవాటుపడ్డారు. దాదాపుగా అన్ని జిల్లాల్లో యథేచ్ఛగా గుడుంబా విక్రయాలు సాగుతున్నా ఎకై్సజ్ శాఖ పట్టించుకోని పరిస్థితి ఉంది. రాష్ర్టంలోనే తగినన్ని డిస్టిలరీల ఏర్పాటు కాగా, డిమాండ్ మేరకు మద్యం ఉత్పత్తిని రాష్ర్టంలోనే చేపట్టాలని, ఇందుకు అవసరమైన డిస్టిలరీల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని ఎకై్సజ్ అధికారులను కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో అమ్ముడయ్యే చాలా లిక్కర్ బ్రాండ్లను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని, దీంతో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పన్నులు రాకుండా పోతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ఉత్పత్తికి అవసరమైన మేరకు డిస్టల్లరీలను రాష్ర్టంలోనే ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ప్రభుత్వానికి పన్నుల ఆదాయం కూడా పెరుగుతుందని, వినియోగదారులకూ ఎంతోకొంత ధర తగ్గుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణలో మద్యం వ్యాపారం చేస్తూ రాష్ర్టంలో డిస్టిల్లరీలు పెట్టని కంపెనీల వివరాలు సేకరించాలన్నారు. ఈ సమీక్షలో మంత్రి పద్మారావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ఎకై్సజ్ శాఖ సంయుక్త కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు. -
న్యూ ఇయర్ వేడుకల టార్గెట్ రూ. 150 కోట్లు
* కొత్త సంవత్సరం ద్వారా ఆదాయం సమకూర్చుకోవడంపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ దృష్టి * జిల్లాల అధికారులకు కమిషనర్ అహ్మద్ నదీం నిర్దేశం * నూతన సంవత్సర పార్టీలకు ‘ఈవెంట్ పర్మిట్’ తప్పనిసరి * పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని నియంత్రించాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఆ శాఖకు రోజు వారీగా వచ్చే రాబడి కన్నా ఏకంగా ఐదు రెట్లు అధికంగా రాబట్టాలని భావిస్తోంది. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాల ద్వారా కనీసం రూ. 150 కోట్లు ఆదాయం పొందాలని అధికార యంత్రాంగం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు రూ. 30 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతాయి. అయితే డిసెంబర్ 31న సాగే విక్రయాలను దృష్టిలో ఉంచుకొని మద్యం వ్యాపారులు ఈ నెల 22వ తేదీ నుంచే స్టాక్‌ను భారీగా కొనుగోలు చేస్తున్నారు. 25, 26 తేదీల్లో సెలవు దినాలు రావడంతో శనివారం మద్యం కొనుగోళ్లు పెద్దఎత్తున సాగాయి. ఒక దశలో డిపోల్లో సర్వర్లు కూడా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆదివారం మళ్లీ సెలవుకావడంతో 29, 30 తేదీల్లో మద్యం డిపోలకు తాకిడి పెరిగే అవకాశముంది. ఈ మద్యం మొత్తం 31, 1వ తేదీల్లో ఖాళీ అవుతుందని అధికారుల అంచ నా. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలతో కనీసం రూ. 150 కోట్లు ఆర్జించాలని అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లతో ఎక్సైజ్ శాఖ కమిషనర్ అహ్మద్ నదీం శనివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో సూచించినట్లు సమాచారం. బ్రూవరేజ్ కార్పొరేషన్ అధికారులతో కూడా ఆ యన మాట్లాడి లిక్కర్ డిపోల్లో మద్యం స్టాక్ వి వరాలను తెలుసుకున్నారు. ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్లు కొన్ని అందుబాటులో లేవంటూ వైన్‌షాపులు, బార్ల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, 30వ తేదీ వరకు భారీ ఎత్తున స్టాక్‌ను ఖాళీ చే యాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రాజధానిపై ప్రత్యేక దృష్టి రాష్ట్రంలో సాధారణ రోజుల్లో కూడా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే రాబడే ఎక్కువ. ఇక్కడ అధిక ధర పలికే ప్రీమియం బ్రాండ్ల మద్యం అమ్మకాలు ఎక్కువ. అలాగే స్టార్ హోటళ్లు, బార్లు, క్లబ్బులు, రిసార్టులు ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకల ద్వారా ఈ రెండు జిల్లాల్లో మద్యం విక్రయాల రూపంలో కనీసం రూ. 75 కోట్ల మేర వస్తుందని అధికారుల అంచనా. ఇక కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ భారీగానే మద్యం విక్రయాలు సాగుతాయని భావిస్తున్నారు. అయితే... ప్రైవేటు వ్యక్తులు గ్రూపులుగా ఏర్పాటై చేసుకునే పార్టీలకు సంబంధించి ఎక్సైజ్ సూపరింటెండెంట్లను అప్రమత్తం చేయాలని ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీం అధికారులకు సూచించారు. అనుమతి లేకుండా హోటళ్లు, లాడ్జీలు, రిసార్టుల్లో మద్యంతో వేడుకలు చేసుకోకుండా చూడాలని జిల్లాల డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. పట్టణాల నుంచి నగరాల వరకు రూ. 3 వేల నుంచి రూ. 6 వేల వరకు చెల్లించి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ద్వారా ‘ఈవెంట్ పర్మిట్’ పొందిన తరువాతే పార్టీలకు అనుమతివ్వాలన్నారు. సరిహద్దులపై ప్రత్యేక నిఘా.. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిఘా పెంచినట్లు ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీం తెలిపారు. ఇప్పటి నుంచి సంక్రాంతి వరకు రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణా, కల్తీ మద్యాన్ని నిరోధించడంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు ఆయన చెప్పారు. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ద్వారా దేశీదారు మద్యం.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి సరిహద్దుల ద్వారా కర్ణాటక నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉందని... దీనిని అరికట్టేందుకు చర్యలు చేపట్టామని నదీం పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం తప్పనిసరిగా ఈవెంట్ పర్మిట్ తీసుకోవాలని, ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎక్సైజ్ ఆదాయం పెరగడం సహజమేనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.