సర్కారీ సారాయి?
గుడుంబా నియంత్రణకు ప్రత్యామ్నాయ మార్గం!
ఎక్సైజ్ శాఖ సమీక్షలో ప్రస్తావించిన తెలంగాణ ముఖ్యమంత్రి
కల్తీ మద్యంతో కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన
పరిష్కారంపై నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
డిమాండ్ మేరకు రాష్ట్రంలోనే మద్యం ఉత్పత్తి
తగినన్ని డిస్టిలరీల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్న కేసీఆర్
తెలంగాణలో చాలా చోట్ల గుడుంబా సమస్య ఉంది. నేను గరీబ్‌నగర్‌కు పోతే అక్కడి మహిళలు మళ్లీ ప్రభుత్వ సారా తేవాలని అడిగారు. తెలంగాణ సమాజం ఈ సమస్యను అధిగమించాలి. దీనిపై చర్చ జరగాలి. తొందర్లోనే దీనిపై ఓ విధానం రూపొందిస్తాం
- ఆదివారం వరంగల్ జిల్లా హన్మకొండలో మీడియాతో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ ప్రభుత్వ సారాయి దుకాణాలు తెరిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయా? కల్తీ మద్యాన్ని(గుడుంబా) అరికట్టడానికి ఇదే ప్రత్యామ్నాయమని ప్రభుత్వం భావిస్తోందా? కల్తీ మందు తాగి చోటుచేసుకుంటున్న మరణాలతో కుటుంబాలు వీధిన పడుతున్నాయని, దీనికి మరో మార్గాన్ని అన్వేషించాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు గుడుంబా గురించి ఎక్కువ మంది ఫిర్యాదు చేస్తున్నారని, ప్రభుత్వ సారా అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వరంగల్‌లో చేసిన వ్యాఖ్యలు ఇందుకు దోహదం చేస్తున్నాయి.
తాజాగా ఎకై్సజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలోనూ సీఎం ఈ విధమైన సూచన చేసినట్లు సమాచారం. సోమవారం సచివాలయంలో ఎకై్సజ్ శాఖతో సమావేశంలో ముఖ్యమంత్రి ఎక్కువగా గుడుంబాపైనే చర్చించినట్లు తెలిసింది. అధికారవర్గాల సమాచారం ప్రకారం.. వచ్చే అబ్కారీ సంవత్సరానికి సంబంధించిన పలు అంశాలపైనా ఆయన చర్చించారు. గుడుంబాతో అనేక కుటుంబాలు పెద్దదిక్కును, యుక్తవయసులోని పిల్లలను కోల్పోయి దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతున్నాయని కేసీఆర్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
కల్తీ మద్యాన్ని తాగి యువకులు మరణించడం వల్ల చిన్న వయసులోనే యువతులు వితంతువులుగా మారుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గుడుంబాను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై త్వరగా ఓ నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వారుణి వాహిని పేరుతో ప్యాకెట్ల ద్వారా విక్రయించిన సారాయిపై 1993లో నిషేధం విధించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో సారా నిషేధం కొనసాగుతోంది. దీని స్థానంలో చీప్ లిక్కర్‌ను తీసుకొచ్చినా.. ఆ తర్వాత ధరల పెరుగుదలతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు గుడుంబాకు అలవాటుపడ్డారు. దాదాపుగా అన్ని జిల్లాల్లో యథేచ్ఛగా గుడుంబా విక్రయాలు సాగుతున్నా ఎకై్సజ్ శాఖ పట్టించుకోని పరిస్థితి ఉంది.
రాష్ర్టంలోనే తగినన్ని డిస్టిలరీల ఏర్పాటు
కాగా, డిమాండ్ మేరకు మద్యం ఉత్పత్తిని రాష్ర్టంలోనే చేపట్టాలని, ఇందుకు అవసరమైన డిస్టిలరీల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని ఎకై్సజ్ అధికారులను కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో అమ్ముడయ్యే చాలా లిక్కర్ బ్రాండ్లను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని, దీంతో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పన్నులు రాకుండా పోతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు.
ఉత్పత్తికి అవసరమైన మేరకు డిస్టల్లరీలను రాష్ర్టంలోనే ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ప్రభుత్వానికి పన్నుల ఆదాయం కూడా పెరుగుతుందని, వినియోగదారులకూ ఎంతోకొంత ధర తగ్గుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణలో మద్యం వ్యాపారం చేస్తూ రాష్ర్టంలో డిస్టిల్లరీలు పెట్టని కంపెనీల వివరాలు సేకరించాలన్నారు. ఈ సమీక్షలో మంత్రి పద్మారావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ఎకై్సజ్ శాఖ సంయుక్త కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు.