సారా జీవితం.. ఆ వించిస్టర్‌ హౌస్‌ నిర్మాణం నేటికి మిస్టరీలే! | History of Californias Winchester Mystery House | Sakshi
Sakshi News home page

సారా జీవితం.. ఆ వించిస్టర్‌ హౌస్‌ నిర్మాణం నేటికి మిస్టరీలే!

Published Sun, Oct 8 2023 1:55 PM | Last Updated on Sun, Oct 8 2023 2:22 PM

History of Californias Winchester Mystery House - Sakshi

ఊహో..? అపోహో..? అంతకు మించిన అభూతకల్పనో..? తేల్చుకోలేని స్థితే అశాంతికి ఆలవాలం. అంధవిశ్వాసానికి ఆధ్యం. వాటి మధ్య నలిగిన జీవితాలు.. వాళ్లు వదిలి వెళ్లిన ఆనవాళ్లు.. తర్వాత తరాలను ఇట్టే బెదరగొడతాయి. అలాంటి ఉదంతమే ఇది. 1881 తర్వాత మొదలైంది ఈ కథ.

అది అమెరికా, న్యూ హెవెన్‌ సమీపంలోని ఒక పెద్ద విల్లా. అందులో నివసించే 44 ఏళ్ల సారా వించిస్టర్‌కు పడుకునే ముందు పియానో వాయించి నిద్రపోవడం అలవాటు. ఆ రాత్రి అదే చేసింది. అయితే పన్నెండు దాటాక.. అదే పియానో మ్యూజిక్‌ అస్పష్టంగా వినిపించడం మొదలైంది. తుళ్లిపడి నిద్ర లేచిన సారా.. వెంటనే హాల్లోకి వెళ్లిచూడగానే.. ఆ మ్యూజిక్‌ ఆగిపోయింది. కానీ ఆ ఇంట్లో ఆమె తప్ప ఎవరూ లేరు. ‘ఎవరది?’ అనే అరుపు ఆమెలోని భయాన్ని మభ్యపెట్టింది.

అప్పుడే..  చిమ్మచీకటిలో హాల్‌కి ఆనుకుని ఉన్న స్టోర్‌ రూమ్‌ డోర్‌ చిన్నగా ఓపెన్‌ అయ్యింది. ఆ అలికిడికి తిరిగి చూసిన సారా.. ధైర్యం తెచ్చుకుని.. దగ్గరకు వెళ్లి తలుపు క్లోజ్‌ చేయబోతుంటే.. అందులో ఉన్న ఊయల ఊగుతూ కనిపించింది. పసిపాప ఏడుపు, విచిత్రమైన ఓ నవ్వు ఆమెను వణికించాయి. అప్పటి నుంచి ప్రతిరాత్రి అదే ఉలికిపాటు. కొన్ని రోజులకు పియానో వాయించే మనిషి కూడా స్పష్టంగా కనిపించడం మొదలైంది. కొన్నిసార్లు అది కలో.. నిజమో ఆమెకు అర్థమయ్యేది కాదు. అప్పటికే ఆమె జీవితంలో ఎన్నో విషాదాలు ముసురుకున్నాయి.


∙∙ 
1862లో ‘విలియమ్‌ విర్ట్‌ వించిస్టర్‌’ అనే ధనికుడ్ని వివాహం చేసుకున్న సారా.. తన మామగారు ఆలివర్‌ వించిస్టర్‌కి వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉండేది. మొదట షర్ట్స్‌ కంపెనీ నడిపించే వించిస్టర్‌ కుటుంబం.. తర్వాత కాలంలో రైఫిల్స్‌ కంపెనీ (తుపాకుల వ్యాపారం) పెట్టి.. రెట్టింపు లాభాలు గడించసాగింది. గవర్నమెంట్‌ పర్మిషన్స్‌తో అఫీషియల్‌గానే కాదు.. రహస్యంగా కూడా చాలా గన్స్‌ అమ్మేది. సుఖశాంతులతో సాగిపోతున్న ఆ కుటుంబంలోకి సారా మరో శుభవార్తను మోసుకొచ్చింది.. తాను తల్లిని కాబోతున్నా అంటూ! పెళ్లి అయిన చాలా ఏళ్లకు కలగబోతున్న సంతానం కావడంతో.. ఆ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. సారాకు ఆడపిల్ల పుట్టింది.

పాపకి యానీ వించిస్టర్‌ అని పేరు పెట్టుకున్నారు. కానీ నెల రోజులకే ఆ పాప చనిపోయింది. ఆ విషాదం వించిస్టర్‌ కుటుంబాన్ని కోలుకోనివ్వలేదు. కొన్ని రోజులకే ఆలివర్‌ మరణించాడు. ఇంటి పెద్ద  మరణించడంతో సారా, విలియమ్‌ కుంగిపోయారు. కొన్నాళ్లకు రైఫిల్‌ కంపెనీ లాభాలు తగ్గాయి. వ్యాపారం పతనం దిశగా సాగింది. కంపెనీ బాధ్యతలందుకున్న విలియమ్‌.. ఏడాది గడవకముందే (1881లో) మరణించాడు. దాంతో సారా మరింత కుంగిపోయింది. నిజానికి అక్కడితోనే ఆ కుటుంబంలో విషాదాలు ఆగిపోలేదు. విలియమ్‌ తర్వాత.. సారా అత్త, సారా తల్లి, సారా సోదరి ఇలా పలు కుటుంబ సభ్యులు, సమీప బంధువులు చాలామంది మరణించారు. దాంతో సారాలో భయం రెట్టింపు అయ్యింది. ఈ క్రమంలోనే సారాకు ఆత్మలు కనిపించడం మొదలుపెట్టాయి.

తనకు ఎదురవుతున్న వింత అనుభవాల గురించి.. కొందరు శ్రేయోభిలాషులతో పంచుకుని, వారి సాయంతో.. పరిష్కారం కోసం కొంతమంది మాంత్రికుల్ని కూడా ఆశ్రయించింది. వారు ఆ ఇంటిని పరిశీలించి.. ఇక్కడ అతీంద్రియ శక్తులు ఉన్నాయని.. ఇందులో నివసించడం మంచిది కాదని తేల్చేశారు. కొన్నినెలల పాటు శాంతిపూజలు చేయించినా ఫలితం లేదు. అసలు ట్విస్ట్‌ ఏంటంటే.. స్టోర్‌ రూమ్‌లో ఊగే ఊయల సారా పాపదే. ప్రతిరాత్రి పియానో వాయించేది సారా భర్తే. తనకు ఎదురుపడే అస్పష్టమైన ఆకారం తన భర్తేదేనని గ్రహించిన రాత్రే.. సారాకి చాలా విషయాలు తెలిశాయి. ఆ రాత్రి విలియమ్‌.. సారాను తీవ్రంగా హెచ్చరించాడట.

‘మనం అమ్మిన రైఫిల్స్‌ (తుపాకీలు) కారణంగా చనిపోయిన వారి ఆత్మలు మన ఇంటిని చుట్టుముట్టాయి. ఆత్మలన్నీ కలసి.. వించిస్టర్‌ కుటుంబాన్ని నాశనం చేయాలని తీర్మానించుకున్నాయి. ఇప్పటి దాకా జరిగిన మరణాలన్నీ (నాతో సహా) ఆ ఆత్మల వల్లే జరిగాయి. ఈ ఇల్లు వదిలి పారిపో.. మరెక్కడైనా ఇల్లు కట్టుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించు. అయితే ఆ నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాకుండా చూసుకో.. ఎప్పుడైతే ఇంటి నిర్మాణం పూర్తవుతుందో ఆ రోజే నీకు మరణం సంభవిస్తుంది’ అని చెప్పి విలియమ్‌ మాయమయ్యాడట. దాంతో సారా ‘న్యూ హెవెన్‌ను విడిచిపెట్టి.. కాలిఫోర్నియా వెళ్లిపోయింది.

అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అనువైన స్థలం కోసం వెతకడం మొదలుపెట్టింది. ఓ మూడేళ్లకు.. తనకు వారసత్వంగా వచ్చిన డబ్బుతో కాలిఫోర్నియాలోని శానోస్‌ సమీపంలో ఓ విశాలమైన స్థలాన్ని కొనుక్కున్నది. అక్కడ ఏడంతస్తుల భవనానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. సుమారు పదహారుసార్లు.. కట్టిన గదులను కూలుస్తూ మళ్లీ మళ్లీ కట్టించింది. ఆ ఇల్లు.. ఆత్మలను గందరగోళంలోకి నెట్టేలా ఉండాలనేది సారా ఉద్దేశమట. 1906 నాటికి ఇంటికి ఓ అందమైన రూపం వచ్చినా.. ఆమె శాంతించలేదు. ఆ ఇల్లు కొన్నిసార్లు భూకంప ప్రభావాలకు కూలితే.. ఎక్కువ సార్లు సారా అభీష్టానికి కూలిపోయింది.

గదులు, కిటికీలు, తలుపులు ఇలా అన్నీ పగిలేవి, విరిగేవి. సుమారు ఆమె మరణం వరకూ అంటే 1922 సెప్టెంబర్‌ దాకా ఆ ఇంటి నిర్మాణం జరుగుతూనే ఉంది. స్వయంగా తనే ఎప్పటికప్పుడు నిర్మాణాల్లో పలు మార్పులు చేసేదట. సుమారు 36 ఏళ్ల పాటు ఆ ఇంట్లో రకరకాల మార్పుచేర్పులు జరిగాయి. కొన్ని మెట్లు పైకప్పుకి మార్గమైతే.. కొన్ని తలుపులు కేవలం అడ్డు గోడల్ని చూపెడుతుంటాయి. అంటే మెట్లు ఎక్కి మరో అంతస్తుకు వెళ్తాం అనుకుంటే అక్కడ ఇంటి పైకప్పు తప్ప ఏం ఉండదు. కొన్ని చోట్ల తలుపులు తెరిస్తే అడ్డంగా నిర్మించిన గోడలు తప్ప మార్గం కనిపించదు. కొన్ని కిటికీలు గోడలకు కాకుండా సీలింగ్‌కి ఉంటాయి.

సారా స్వయంగా ఆత్మలతో మాట్లాడేదని.. వాటికి క్షమాపణలు చెప్పేదని.. వాటిని శాంతపరచడానికే ఇంటికి పదే పదే మార్పుచేర్పులు చేసేదని ఆ ఇల్లు కట్టిన కార్మికులు కొందరు ప్రచారం చేశారు. భర్త, బిడ్డ చనిపోవడంతో ఆమెకు  పిచ్చి పట్టిందని.. ఆస్తులుండటంతో అలా ఇష్టమొచ్చినట్లు ఖర్చుచేసిందని కొందరి అభిప్రాయం. అయితే వించిస్ట్టర్‌ బంధువులు మాత్రం.. ‘ఆమెకు ఆర్కిటెక్చర్‌ మీదున్న ఆసక్తికారణంగానే అన్నిసార్లు భవన నిర్మాణంలో మార్పులు చేసిందని.. ఆత్మలు వంటి పుకార్లను నమ్మొద్దు’ అని ప్రపంచానికి వెల్లడించారు.

ఏది ఏమైనా సారా జీవితం.. ఆ వించిస్టర్‌ హౌస్‌ నిర్మాణం రెండూ నేటికీ మిస్టరీలే. అంతేగాదు మిస్టరీ హౌస్‌లో.. ప్రస్తుతం నాలుగు అంతస్తుల నిర్మాణం మిగిలింది. 500లకు పైగా గదులు, 2 వేలకు పైగా తలుపులు, 10 వేలకు పైగా కిటికీలు, 50కి పైగా బెడ్‌ రూమ్స్, 13 బాత్‌ రూమ్స్, ఆరు కిచెన్‌ రూమ్స్, చాలా బాల్కనీల సువిశాలమైన ఆ భవనం.. ఇప్పుడు పర్యాటక కేంద్రంగా ఔత్సాహికులను ఆకట్టుకుంటోంది. 

సంహిత నిమ్మన

(చదవండి: ఆరుగంటలకు పైగా మంచులో కూరుకుపోయింది! బతికే ఛాన్స్‌ లేదు కానీ..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement