'ఆశ్రయం కోరి వచ్చిన ప్రాణిని ఆదరించు.. అని చెప్పింది అమ్మ. ఒక మూగజీవి గాయాలతో రోదిస్తుంటే చూస్తూ ఊరుకోలేను. ఒకప్రాణి కడుపులో కాళ్లు పెట్టుకుని ముడుచుకుని పడుకుంటే దాని ఆకలి తీర్చకుండా నా దారిన నేను వెళ్లలేను. ఒకరోజు గాయపడిన ఓ కుక్కపిల్ల ఏడుపు నాలోని తల్లి మనసును కదిలించింది. దాని బాధ చూసిన తర్వాత మనసు కలచివేసింది. ఆ కుక్కపిల్ల ఆరోగ్యం కుదుటపడే వరకు మా ఇంట్లోనే పెట్టుకున్నాను. అలా మొదలైన ఈ సేవ ఇప్పుడు దాదాపు నాలుగు వందల కుక్కలతో సాగుతోంది’ అన్నారు 58 ఏళ్ల సారా అయ్యర్.'
చెన్నైకి చెందిన సారా అయ్యర్ స్పెషల్ ఎడ్యుకేటర్. స్పెషల్ చిల్డ్రన్‌ని సమాజంలో సాధారణ పౌరుల్లా తీర్చిదిద్దడంలో దాదాపు పాతికేళ్లు పని చేశారు. ఐదేళ్ల కిందట మూగజీవుల సేవ వైపు మలుపు తీసుకుందామె జీవితం. ఏ మాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా జరిగిపోయిన మార్పులను ఇలా చెప్పారామె.. ‘‘మా అమ్మయి పై చదువుల కోసం అమెరికా వెళ్లింది. ఆ పనుల కోసం నేను టీచింగ్ నుంచి కొంత విరామం తీసుకోవాల్సి వచ్చింది. పిల్లలు దూరంగా వెళ్లిన తర్వాత ఇంట్లో ఏర్పడే వెలితి. ఎంప్టీనెస్ట్ సిండ్రోమ్ అనేటంత పెద్ద పదం చెప్పను కానీ కొంత మానసికమైన ఖాళీ ఏర్పడిందనే చెప్పాలి.
జనవరి ఒకటో తేదీన నేను, నా భర్త గెర్రీ ఇద్దరం పీకే సినిమాకి వెళ్లి వస్తున్నాం. దాదాపుగా ఇంటికి దగ్గరకు వచ్చేశాం. ఎక్కడి నుంచో చిన్న కుక్కపిల్ల అరుపు వినిపిస్తోంది. క్షణాల్లోనే తెలిసింది అది అరుపు కాదు ఏడుపు అని. ఎవరో పెంచుకోవడానికి కుక్కపిల్లను తెచ్చుకున్నారు, అది బెంగతో ఏడుస్తుందేమో అనుకున్నాను. అది నిస్సహాయంగా ఏడుస్తోందని కొద్ది నిమిషాల్లోనే తెలిసిపోయింది. ఇక ఊరుకోలేకపోయాను. దాని గొంతు వినవస్తున్న దిశగా వెళ్లాను.
అది పార్కు చేసిన కారుకి గోడకు మధ్య ఇరుక్కు పోయి ఉంది. తీవ్రంగా గాయపడింది. బయటకు తీయడానికి దగ్గరకు వెళ్తున్నా రానివ్వలేదు. నేను దానిని ఊరడిస్తూ ఉంటే మా వారు మరో వైపు నుంచి వెళ్లి దానిని బయటకు తీశారు. అయితే... కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా క్లినిక్‌లన్నీ మూసేసి ఉన్నాయి. ఇంటికి తీసుకువెళ్లి మాకు చేతనైన చికిత్స చేసి ఆ మరునాడు దానికి వైద్యం చేయించాం. ఆ కుక్కపిల్ల మామూలయ్యే వరకు మాతోనే ఉంది. ఆ తర్వాత కూడా మాతోనే ఉండిపోయింది. అలా మొదలైన సేవ ఇది.
ఓ రోజు.. ఒక ఇండియన్ బ్రీడ్ కుక్క నాలుగు పిల్లలను పెట్టి అలసటతో ఉంది. ఆ దారిన ఓ వ్యక్తి లాబ్రిడార్‌ను వాకింగ్‌కు తీసుకువెళ్తున్నాడు. వాళ్లను చూసి ఈ కుక్క అరవసాగింది. ఆ వ్యక్తికి కోపం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ తన చేతిలో ఉన్న కర్ర ఎత్తాడు. అతడు ఆ కుక్క నడవలేనంత తీవ్రంగా గాయపరిచాడని ఆ మరునాడు తెలిసింది. అప్పుడు ఆ కుక్కను, పిల్లలను ఇంటికి తెచ్చాను. నేను మా వారు ఇద్దరమూ వాటికి ఆహారం పెట్టడం, గాయపడిన వాటికి వైద్యం చేయడం, ఫిజియోథెరపీ చేయడం అన్నీ నేర్చుకున్నాం.
మాకు తెలిసిన అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి ‘కుక్కలు, కుక్క పిల్లలు గాయపడి నిరాశ్రయంగా ఉన్నట్లు మీ దృష్టికి వస్తే మాకు తెచ్చివ్వండి, లేదా సమాచారం ఇవ్వండి, మేము సంరక్షిస్తాం’ అని మెసేజ్ పెట్టాం. మద్రాస్ యానిమల్ రెస్క్యూ సొసైటీ అలా ఏర్పడింది. ఇప్పుడు మా దగ్గర గాయపడినవి, చూపు కోల్పోయినవి, అనారోగ్యాలతో పుట్టినవి, ఆదరించే వాళ్లు లేక ఇక్కడే ఉండిపోయినవి అన్నీ కలిసి నాలుగు వందలకు పైగా ఉన్నాయి. మా సర్వీస్‌కి మెచ్చిన మా అమ్మ, అత్తమ్మ ఇద్దరూ తమ వంతుగా ఈ మూగజీవుల సంరక్షణకు అవసరమైన వస్తువులు, ఇతర అవసరాల కోసం డబ్బు ఇచ్చి అండగా నిలిచారు. ఇప్పుడు వాళ్లిద్దరూ లేరు. ‘ఆశ్రయం కోసం వచ్చిన ఏప్రాణినీ నిర్లక్ష్యం చేయవద్దు’ అని వారు మాకు చెప్పిన మాట మాతోనే ఉంది.
మేము స్థాపించిన మద్రాస్ యానిమల్ రెస్క్యూ సొసైటీ... తమిళనాడు యానిమల్ వెల్ఫేర్ బోర్డుతో కలిసి పని చేస్తోంది. ఈ మా ప్రయాణంలో ఇన్ని కుక్కలను సంరక్షించడానికి అవసరమైన విశాలమైన స్థలం పెద్ద సమస్య అయింది. చెన్నై నగర శివారు, మహాబలిపురం రూట్‌లో ఈస్ట్‌కోస్ట్‌రోడ్‌లో మా ఫ్రెండ్‌కి ఓ స్థలం ఖాళీగా ఉంది. దానిని అద్దెకు తీసుకుని కుక్క పిల్లలకు, గాయపడిన వాటికి, అనారోగ్యం పాలైన వాటికి వేరు వేరుగా కెన్నెల్స్ కట్టించి సంరక్షిస్తున్నాం. అవి మమ్మల్ని పేరెంట్స్‌గా ప్రేమిస్తాయి’’ అంటూ తనను ముద్దాడడానికి వచ్చిన పెట్‌ను ప్రేమగా చేతుల్లోకి తీసుకున్నారు సారా అయ్యర్. తన సంరక్షణలో ఉన్న కుక్కలన్నింటికీ పేర్లు పెట్టారామె. వాటికి రిజిస్టర్ నిర్వహిస్తూ వాటికి ఎప్పుడు ఏ మందులు వేశారు, ఇంకా ఎప్పుడు ఏ ఇంజక్షన్‌లు వేయించాలి... వంటి వివరాలను నమోదు చేస్తారామె.
ఇవి చదవండి: Dr Aparna Buzarbarua: విశ్రాంత సమయాన అవిశ్రాంత కృషి
Comments
Please login to add a commentAdd a comment