
న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అధినేతల పదవీకాలం పొడగింపునకు వీలుకల్పిస్తూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకెక్కింది. ఆయా అత్యున్నత పదవుల్లోని ఉన్నతాధికారులను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులపై పక్షపాత ధోరణిలో దాడులు, దర్యాప్తులకు ఆదేశించేందుకే సర్కార్ వారి పదవీకాలాన్ని పొడిగించిందంటూ విపక్షాలు నిరసన వ్యక్తంచేస్తుండటం తెలిసిందే. ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీకాలం ఐదేళ్లవరకు పొడిగిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తేవడం వివాదమైంది. దీంతో కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దర్యాప్తు సంస్థల స్వతంత్రత కాపాడేలా గతంలో కోర్టు ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించేలా ఈ ఆర్డినెన్స్‌లను తెచ్చారని, దర్యాప్తు సంస్థలపై ప్రభుత్వ ఒత్తిడి తొలగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోర్టును కోరారు.
Comments
Please login to add a commentAdd a comment