డబ్బుల్లేక విసుగెత్తిపోతున్న జనం
తమ వద్దా డబ్బు లేదంటున్న బ్యాంకర్లు
డబ్బు రీసైకిల్ కాకపోవడమే కారణం
ప్రొద్దుటూరు : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని విజయనగరం వీధికి చెందిన వాసుదేవరెడ్డి శనివారం ఏటీఎంలో డబ్బు తీసుకునేందుకు వెళ్లగా లేకపోవడంతో వెనక్కి తిరిగారు. పండుగ తాకిడికి ఏటీఎంలో డబ్బు అయిపోయిందేమో అని భావించాడు. సోమవారం (వర్కింగ్ డే) మధ్యాహ్న సమయంలో శ్రీ రాములపేటలోని ఏటీఎంలో ప్రయత్నించగా అందులోనూ డబ్బు లేదు. ఆ తర్వాత పట్టణంలో ఆరు చోట్ల ఉన్న ఏటీఎంల వద్దకు వెళ్లి చూశాడు. అన్ని చోట్లా అదే పరిస్థితి. పట్టణ శివారులో ఉన్న ఓ ఏటీఎం వద్దకు వెళ్లగా ఇక్కడా కాసేపటి క్రితమే డబ్బు అయిపోయిందని అక్కడున్న వారు సెలవిచ్చారు. దీంతో చేసేది లేక ఓ మిత్రుడికి ఫోన్ చేసి చేబదులు తీసుకోవడానికి బయలుదేరాడు. ఇలా ఒక్క ప్రొద్దుటూరులోనే కాదు.. దాదాపు జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
జిల్లాకు సంబంధించి కడప నగర పరిధిలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 75 ఏటీఎంలు ఉండగా తర్వాత స్థానంలో ఉన్న ప్రొద్దుటూరులో 30 ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఈ ప్రకారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 32 బ్యాంక్‌లకుగాను 365 బ్రాంచిల పరిధిలో 238 ఏటీఎంలను ఏర్పాటు చేశారు. సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ఏటీఎంలో రూ.45 లక్షల వరకు డబ్బు పెట్టే అవకాశం ఉంది. బ్యాంక్ అధికారుల అంచనా ప్రకారం ప్రతి ఏటీఎంలో రోజూ 150 వరకు ట్రాన్సాక్షన్లు జరుగుతాయని, యావరేజిగా రూ.7.50 లక్షల వరకు డ్రా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కొంత కాలంగా బ్యాంక్ సమీపంలో ఉన్న ఏటీఎంలలో తప్ప బయట ఉన్న ఏటీఎంలలో కావలసినంత డబ్బు పెట్టడం లేదని తెలుస్తోంది. ఈ కారణంగా ఖాతాదారులు ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం ముగిశాక ఈ ప్రభావం మరీ ఎక్కువగా కనిపిస్తోంది. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో అందరు పండుగ ప్రభావమని భావించారు. అయితే వాస్తవానికి ఆర్థిక లేమి పరిస్థితులే కారణమని స్వయంగా బ్యాంకర్లే చెబుతున్నారు.
రీసైకిల్ లేకపోవడమే కారణం
తమ బ్యాంక్ వద్ద ఉన్న రెండు ఏటీఎంలలో రోజూ రూ.40 లక్షలు పెడుతున్నా ఖాతాదారులు డ్రా చేస్తున్నారే కానీ.. తిరిగి తమ బ్యాంక్‌కు డబ్బు రావడం లేదని ఓ బ్యాంక్ అధికారి తెలపగా, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వ్యవధిలో తమ ఏటీఎం నుంచి రూ.10 లక్షలు డ్రా చేసిన విషయాన్ని గమనించి తాను ఆశ్చర్య పోయానని మైదుకూరు రోడ్డులోని మరో బ్యాంక్ మేనేజర్ సాక్షికి వివరించారు. ఒక్క ప్రొద్దుటూరులోని ఏటీఎంలకు సంబంధించే రోజు రూ.12 కోట్లు డబ్బు పెడుతున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. బ్యాంకర్ల అంచనా ప్రకారం సాధారణంగా డ్రా చేసిన డబ్బు ఏదో ఒక రూపంలో కొంత మొత్తమైనా తిరిగి బ్యాంక్‌లకు జమ కావలసి ఉంది. అయితే వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఖాతాదారులు తీసుకెళ్లిన డబ్బు తిరిగి బ్యాంక్‌లకు జమ కాకపోవడంతో బ్యాంక్‌లు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
కొద్ది రోజులుగా ఈ పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఈ సమస్యను బ్యాంక్ ఉన్నతాధికారులు రిజర్వ్ బ్యాంక్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. డబ్బు రీసైకిల్ కాని కారణంగా బ్యాంకర్లు ఇతర ప్రాంతాల్లోని బ్యాంక్‌ల నుంచి ఓడీ తీసుకుంటున్నారు. ప్రొద్దుటూరులో ఆ ఓడీ కూడా దొరకడం లేదని బ్యాంకర్లు వాపోతున్నారు. వ్యాపారాలు లేకపోవడం, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ విధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతోపాటు మానవుని జీవన వ్యయం పెరగడం, పొదుపు తగ్గడం మరో కారణంగా చెప్పవచ్చు. ఇటీవల ప్రొద్దుటూరులో జరిగిన బంగారు వ్యాపారుల సమ్మె ప్రభావం అటు వారితోపాటు వస్త్ర వ్యాపారులపై కూడా తీవ్రంగా పడిందని ప్రముఖ వ్యాపారి బుశెట్టి రాంమోహన్‌రావు తెలిపారు. రీసైకిల్ కాకుండా డబ్బు ఎలా వెళ్లిందన్న విషయం చెప్పలేమని ఓ బ్యాంక్ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
ఆర్థిక సంక్షోభం వాస్తవమే ...
డబ్బు రీసైకిల్ లేని కారణంగా ఆర్థిక సంక్షోభం ఉందని పలువురు బ్యాంకర్లు చెప్పిన విషయం నా దృష్టికి వచ్చింది. అయితే ఖాతాదారులకు ఇబ్బంది లేకుండా ఎలాగోలా కొంత కొంత డబ్బు సర్దుబాటు చేస్తున్నారు.
- రఘునాథరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్