150 రోజులు కరెన్సీ కష్టాలు.. జీతాలకు ఇక్కట్లే
కోల్‌కతా: కొద్ది వారాల్లోనే పెద్ద నోట్ల కష్టాలు తీరిపోతాయని కేంద్రంలోని అధికార నాయకులు చెబుతున్నా మరో నాలుగు నెలలపాటు కరెన్సీ కష్టాలు తప్పవని బ్యాంకు ఉద్యోగుల సంఘం చెబుతోంది. దేశంలోని నోట్ల ముద్రణ శాలలు పూర్తి స్థాయిలో పనిచేసినప్పటికీ ఈ పరిస్థితి ఉంటుందని పేర్కొంది. ది బ్యాంక్ ఎప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్‌ఐ) పెద్ద నోట్ల రద్దు తిప్పలపై గురువారం స్పందిస్తూ ప్రస్తుతం దేశంలో నాలుగు కరెన్సీ ముద్రణ శాలలు ఉన్నాయని, అవి పూర్తి సమయం పనిచేసినప్పటికీ నాలుగు నుంచి ఐదు నెలలపాటు ఈ సమస్యలు ఉంటాయని పేర్కొంది.
మరో వారం రోజుల్లో ఉద్యోగులు నెలవారి జీతాలు తీసుకోవాల్సి ఉంటుందని, అది కష్టంగా మారనుందని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. 'నాలుగు ముద్రణ శాలలు తమ సామర్థ్యంమేరకు పనిచేసినా సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు కరెన్సీ లోటు తీరేందుకు మరో నాలుగు నుంచి ఐదు నెలలు సమయం పడుతుంది' అని బీఈఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి పీకే బిశ్వాస్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, డబ్బును తీసుకునే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొలేక చాలా చోట్ల వినియోగదారులు బ్యాంకు ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారని అది సరైన చర్య కాదని అన్నారు. ఇక బ్యాంకుల నుంచి ఏటీఎంల నుంచి తమ జీతాలను తీసుకునే సమయంలో ఇబ్బందులు వస్తే మాత్రం పరిస్థితులు చాలా చెత్తగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.