ఆంటొనియొ గ్యుటెరస్
ఐక్యరాజ్య సమితి: ఐక్యరాజ్య సమితి తీవ్రమైన నిధుల కొరతలో ఉందని సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు వచ్చే నెల వేతనాలిచ్చేందుకూ సరిపోను నిధులు లేవన్నారు. ఐరాసలో ఈ దశాబ్దంలో ఈ స్థాయి సంక్షోభం ఎన్నడూ లేదన్నారు. సంస్థకు ఇస్తామని ప్రకటించిన నిధులను తక్షణమే అందించాలని 193 సభ్య దేశాలకు విజ్ఞప్తి చేశారు. నిధుల్లేకుండా ఐరాస పథకాల అమలు సాధ్యం కాబోదన్నారు. ఈ దశాబ్దంలోనే ఈ నెలలో అత్యంత తక్కువ స్థాయిలో నిధులున్నాయన్నారు. సంస్థకు దేశం తరఫున అందించాల్సిన నిధులను పూర్తిగా అందించిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయితే, శాంతి పరిరక్షణ దళ ఖర్చుల నిమిత్తం భారత్‌కే ఐరాస రూ. 270 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
73 దేశాలు మాత్రమే..
2017, 2018 సంవత్సరాలకు గానూ 73 దేశాలు మాత్రమే, మార్చి నాటికి తమ వాటాను పూర్తిగా చెల్లించాయని గ్యుటెరస్ తెలిపారు. 2016లో 62 దేశాలు, 2015లో 67 దేశాలు తమ వాటాను పూర్తిగా చెల్లించాయన్నారు. 2018 చివరి నాటికి సభ్య దేశాల నుంచి సంస్థకు అందాల్సిన నిధులు 529 మిలియన్ డాలర్లు. 2018, 2019 సంవత్సరాలకు గానూ.. సంస్థ సాధారణ బడ్జెట్ అయిన 5.4 బిలియన్ అమెరికన్ డాలర్లలో దాదాపు 22% అమెరికా నుంచి అందాల్సి ఉంది. ఈ జనవరి నుంచి తీవ్రస్థాయిలో పొదుపు చర్యలు చేపట్టకుండా, నెలవారీ ఖర్చుల విధానం ప్రారంభించకుండా ఉండి ఉంటే.. పరిస్థితి మరింత దారుణంగా ఉండి ఉండేదని గ్యుటెరస్ అభిప్రాయపడ్డారు. ‘ఆ చర్యలే చేపట్టకుండా ఉండి ఉంటే.. జనరల్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అవసరమైన నిధులు కూడా మనవద్ద ఉండేవి కావు’ అన్నారు. అత్యంత తీవ్రమైన నిధుల లేమి కారణంగా కఠినమైన పొదుపు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment