ఇజ్రాయెల్ తాత్కాలిక యుద్ధ విరామం
గాజాలో పోలియో వ్యాక్సిన్ డ్రైవ్ కోసమే
లండన్: గాజాపై దాడులకు ఇజ్రాయెల్ తాత్కాలిక విరామం ఇచి్చంది. గాజాలో పోలియో వ్యాక్సిన్ డ్రైవ్ కోసం ఇజ్రాయెల్ ఇందుకు అంగీకారం తెలిపిందని ఐరాస ప్రకటించింది. పాతికేళ్ల తరవాత గాజాలో ఓ బాలుడిలో పోలియో వ్యాధిని గుర్తించారు. దీని నివారణకు పిల్లలకు టీకా డ్రైవ్ నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్ణయించింది.
దాంతో ఇజ్రాయెల్ ‘మానవతా విరామం’ఇచ్చినట్టు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఉదయం ఆరింటి నుంచి మధ్యాహ్నం మూడింటి దాకా యుద్ధవిరామం ఉండనుంది. ఇది విరామమే తప్ప కాల్పుల విరమణ కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.
మూడు దశల్లో డ్రైవ్...
గాజా స్ట్రిప్ అంతటా సుమారు 6.4 లక్షల మంది పిల్లలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు డబ్ల్యూహెచ్‌ఓ సీనియర్ అధికారి రిక్ పీపర్‌కోర్న్ తెలిపారు. డబ్ల్యూహెచ్‌ఓ, యునిసెఫ్, యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ సహకారంతో పాలస్తీనా ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇది గాజా మధ్య, దక్షిణ, ఉత్తర భాగాల్లో మూడు దశల్లో జరుగుతుంది.
గాజాలో ఇప్పటికే 12.6 లక్షల ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 (ఎన్‌ఓపీవీ 2) డోసులున్నాయి. త్వరలో మరో 4 లక్షల డోసులు రానున్నాయి. వ్యాక్సిన్ ఇచ్చేందుకు 2,000 మందికి పైగా హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇచ్చారు. గాజా లోపల వైరస్ వ్యాప్తిని నివారించడానికి స్ట్రిప్ అంతటా 90% వ్యాక్సిన్ కవరేజీ సాధించాలని డబ్ల్యూహెచ్‌ఓ భావిస్తోంది. అందుకోసం అవసరమైతే మరో రోజు యుద్ధవిరామానికి ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదిరింది.
గాజాలో 2022లో 99% పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది. గతేడాది 89%కి తగ్గింది. యుద్ధం వల్ల వ్యాక్సిన్ వేయక అధిక సంఖ్యలో పిల్లలు పోలియో బారిన పడే ప్రమాదముందని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లోని 6.5 లక్షలకు పైగా పాలస్తీనా బాలలను రక్షించడానికి అంతర్జాతీయ సంస్థలతో సహకరించేందుకు సిద్ధమని హమాస్ కూడా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment