polio
-
పాక్‌లో కొత్తగా రెండు పోలియో కేసులు.. 41కి చేరిక
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో కొత్తగా మరో రెండు పోలియో కేసులు నమోదు కావడంతో కలకలం చెలరేగింది. దేశంలో ఈ ప్రాణాంతక ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న రోగుల సంఖ్య 41కి చేరింది. పాకిస్తాన్‌కు చెందిన డాన్ వార్తాపత్రిక తెలిపిన వివరాల ప్రకారం గురు, శుక్రవారాల్లో కొత్తగా రెండు పోలియో కేసులు నమోదయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 24ను పోలియో దినోత్సవంగా జరుపుకుంటారు. ఇదే సమయంలో కొత్తగా కేసులు నమోదుకావడం పాక్ ప్రభుత్వానికి సవాల్‌గా నిలిచింది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లలో నమోదైన ఈ రెండు కేసులు పోలియో వైరస్‌ను నిర్మూలించడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బగా నిలిచాయి.బలూచిస్థాన్‌లోని లోరాలై జిల్లాలోని మూడేళ్ల బాలికకు పోలియో వ్యాధి సోకింది. ఈ చిన్నారి అక్టోబర్ 8న పోలియో బారిన పడింది. పోలియో వ్యాక్సినేషన్ ప్రచారంలో వ్యాధి సోకిన ఈ చిన్నారికి యాంటీ పోలియో డోస్ ఇవ్వలేదని వెల్లడయ్యింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కోహట్ జిల్లాలోని రెండేళ్ల బాలునికి పోలియో సోకింది.ఇప్పటివరకు బలూచిస్తాన్‌లో 21, సింధ్‌లో 12, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఆరు, పంజాబ్, ఇస్లామాబాద్‌లలో ఒక్కొక్కటి చొప్పున పోలియో కేసులు నమోదయ్యాయి. పాక్‌లో పోలియో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 4.5 కోట్ల మందికి పైగా పిల్లలకు పోలియో డోస్‌లు వేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూన్ 2025 నాటికల్లా పాకిస్తాన్ నుంచి ఈ వ్యాధిని తరిమికొట్టేందుకు పెద్ద ఎత్తున ప్రణాళిక అమలు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం పోలియో ఇప్పటికీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో మహమ్మారిగా ఉంది.ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్లో తొక్కిసలాట.. తొమ్మిదిమందికి గాయాలు -
Israel-Hamas war: గాజాకు 3 రోజుల ఊరట
లండన్: గాజాపై దాడులకు ఇజ్రాయెల్ తాత్కాలిక విరామం ఇచి్చంది. గాజాలో పోలియో వ్యాక్సిన్ డ్రైవ్ కోసం ఇజ్రాయెల్ ఇందుకు అంగీకారం తెలిపిందని ఐరాస ప్రకటించింది. పాతికేళ్ల తరవాత గాజాలో ఓ బాలుడిలో పోలియో వ్యాధిని గుర్తించారు. దీని నివారణకు పిల్లలకు టీకా డ్రైవ్ నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్ణయించింది. దాంతో ఇజ్రాయెల్ ‘మానవతా విరామం’ఇచ్చినట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఉదయం ఆరింటి నుంచి మధ్యాహ్నం మూడింటి దాకా యుద్ధవిరామం ఉండనుంది. ఇది విరామమే తప్ప కాల్పుల విరమణ కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. మూడు దశల్లో డ్రైవ్... గాజా స్ట్రిప్ అంతటా సుమారు 6.4 లక్షల మంది పిల్లలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు డబ్ల్యూహెచ్ఓ సీనియర్ అధికారి రిక్ పీపర్కోర్న్ తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ, యునిసెఫ్, యూఎన్ఆర్డబ్ల్యూఏ సహకారంతో పాలస్తీనా ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇది గాజా మధ్య, దక్షిణ, ఉత్తర భాగాల్లో మూడు దశల్లో జరుగుతుంది. గాజాలో ఇప్పటికే 12.6 లక్షల ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 (ఎన్ఓపీవీ 2) డోసులున్నాయి. త్వరలో మరో 4 లక్షల డోసులు రానున్నాయి. వ్యాక్సిన్ ఇచ్చేందుకు 2,000 మందికి పైగా హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇచ్చారు. గాజా లోపల వైరస్ వ్యాప్తిని నివారించడానికి స్ట్రిప్ అంతటా 90% వ్యాక్సిన్ కవరేజీ సాధించాలని డబ్ల్యూహెచ్ఓ భావిస్తోంది. అందుకోసం అవసరమైతే మరో రోజు యుద్ధవిరామానికి ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదిరింది. గాజాలో 2022లో 99% పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది. గతేడాది 89%కి తగ్గింది. యుద్ధం వల్ల వ్యాక్సిన్ వేయక అధిక సంఖ్యలో పిల్లలు పోలియో బారిన పడే ప్రమాదముందని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లోని 6.5 లక్షలకు పైగా పాలస్తీనా బాలలను రక్షించడానికి అంతర్జాతీయ సంస్థలతో సహకరించేందుకు సిద్ధమని హమాస్ కూడా తెలిపింది. -
పాకిస్తాన్లో పోలియో కేసుల కలకలం
పోలియోమైలిటీస్ వ్యాధిని వాడుక భాషలో పోలియో అని పిలుస్తుంటారు. ఇది ఒక రకమైన అంటు వ్యాధి. వైరస్ కారణంగా వ్యాప్తిచెంది, మానవ నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఐదేళ్లలోపు వయసుగల చిన్నారులు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ వ్యాధి ఇప్పుడు పాకిస్తాన్‌ను వణికిస్తోంది.పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్లోగల క్వెట్టాలో పోలియో కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. తాజాగా ఐదో కేసు వెలుగు చూసింది. ఇది ఏప్రిల్ 29న వెలుగు చూడగా, జూన్ 8న నిర్ధారణ అయ్యింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) నివేదిక ప్రకారం బాధిత చిన్నారి తొలుత అతిసారం, వాంతులు తదితర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆ చిన్నారిని చికిత్స కోసం క్వెట్టాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ చికిత్స పొందుతున్న తరుణంలో 10 రోజుల తర్వాత ఆ చిన్నారి శరీరంలోని దిగువ భాగం బలహీనంగా మారింది. తరువాత పోలియో వ్యాధి ఆ చిన్నారి శరీరానికంతటికీ వ్యాపించింది. దీంతో బాధిత చిన్నారిని కరాచీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ (ఎన్ఐసీహెచ్)కు తరలించారు. అక్కడ ఆ చిన్నారికి అక్యూట్ ఫ్లాసిడ్ పక్షవాతం (ఏఎఫ్‌పీ) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వైద్య చికిత్స అందించినప్పటికీ వ్యాధి సోకిన చిన్నారి మే 22న మృతి చెందింది. దీనిపై వైద్యారోగ్యశాఖ విచారణ చేపట్టింది.బాధిత చిన్నారి రక్త నమూనాలను సేకరించారు. ఆ చిన్నారి తోబుట్టువులలో ఒకరికి వైల్డ్ పోలియోవైరస్ టైప్ వన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కాగా ఆ చిన్నారికి పోలియో వ్యాక్సిన్ వేయించని కారణంగానే మృతి చెందిందా? అనే కోణంలో వైద్యశాఖ విచారణ చేస్తోంది. -
ఇష్టమైన కళ తీరిన వేళ
పోలియో బాధితురాలైన సునిత త్రిప్పనిక్కర అయిదు సంవత్సరాల వయసు నుంచి బొమ్మలు వేయడం ప్రారంభించింది. సునిత మొదట్లో చేతులతోనే బొమ్మలు వేసేది. అయితే డిగ్రీ చదివే రోజుల్లో చేతుల్లో పటుత్వం కోల్పోయింది. బ్రష్ పట్టుకోవడం కష్టంగా మారింది. ఆ సమయంలో తన సోదరుడిని స్ఫూర్తిగా తీసుకుని మౌత్ ఆర్టిస్ట్‌గా మారింది. దివ్యాంగుడైన ఆమె సోదరుడు నోటితో కుంచె పట్టుకుని బొమ్మలు వేస్తాడు. సునిత ఇప్పటివరకు అయిదు వేలకు పైగా పెయింటింగ్స్ వేసింది. ఆమె ఆర్ట్‌వర్క్స్ సొంత రాష్ట్రం కేరళతోపాటు సింగపూర్‌లోనూ ప్రదర్శితమయ్యాయి. ప్రకృతి సంబంధిత చిత్రాలు వేయడం అంటే సునితకు ఇష్టం. విన్సెంట్ వాన్ గో ఆమెకు ఇష్టమైన చిత్రకారుడు. ‘ప్రయాణాలు చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. ఇక రంగులు అనేవి నన్ను ఎప్పుడూ అబ్బురపరిచే అద్భుతాలు. సంప్రదాయంతో పాటు ఆధునిక చిత్రధోరణులు అంటే కూడా ఇష్టం. మొదట్లో పళ్ల మధ్య కుంచె పట్టుకుని చిత్రాలు వేయడం చాలా కష్టంగా అనిపించింది. సాధన చేస్తూ చేస్తూ కష్టం అనిపించకుండా చేసుకున్నాను’ అంటుంది సునిత. సునిత చేసే ప్రయాణాలలో కనిపించే సుందర దృశ్యాలు కాన్వాస్‌పైకి రావడానికి ఎంతోకాలం పట్టదు. ‘బాధితులకు ఓదార్పును ఇచ్చే శక్తి చిత్రకళకు ఉంది’ అంటాడు వ్యాన్ గో. ఆ మాట సునిత విషయంలో అక్షరాలా నిజం అయింది. క్యాన్వాస్ దగ్గర ఉన్న ప్రతిసారీ తనకు వందమంది స్నేహితుల మధ్య సందడిగా ఉన్నట్లుగా ఉంటుంది. ధైర్యం చెప్పే గురువు దగ్గర ఉన్నట్లు అనిపిస్తుంది. ఆత్మీయతను పంచే అమ్మ దగ్గర ఉన్నట్లుగా ఉంటుంది. ‘నా జీవితంలోకి చిత్రకళ రాకుండా ఉండి ఉంటే పరిస్థితి ఊహకు అందనంత విషాదంగా ఉండేది’ అంటుంది సునిత. బెంగళూరు నుంచి సింగపూర్ వరకు సునిత ఆర్ట్ ఎగ్జిబిషన్స్ జరిగాయి. అక్కడికి వచ్చే వారు ఆర్టిస్ట్‌గా ఆమె ప్రతిభ గురించి మాత్రమే మాట్లాడడానికి పరిమితం కాలేదు. స్ఫూర్తిదాయకమైన ఆమె సంకల్పబలాన్ని వేనోళ్లా పొగిడారు. ‘మౌత్ అండ్ ఫుట్ పెయింటింగ్ ఆర్టిస్ట్స్’ సంస్థలో సభ్యురాలైన సునిత దివ్యాంగులైన ఆర్టిస్ట్‌లకు సహకారం అందించే ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తోంది. వీల్‌చైర్‌కే పరిమితమైన వారిలో విల్‌పవర్ పెంపొందించేలా సోదరుడు గణేష్‌తో కలిసి ‘ఫ్లై’ అనే సంస్థను ప్రారంభించింది. ‘చిరకు’ పేరుతో ఒక పత్రికను నిర్వహిస్తోంది. కాలి వేళ్లే కుంచెలై... రెండు చేతులు లేకపోతేనేం సరస్వతీ శర్మకు సునితలాగే అంతులేని ఆత్మబలం ఉంది. సునిత నోటితో చిత్రాలు వేస్తే రాజస్థాన్‌కు చెందిన సరస్వతీ శర్మ కాలివేళ్లను ఉపయోగించి చిత్రాలు వేస్తుంది. ఇంగ్లీష్ సాహిత్యంలో మాస్టర్స్ చేసింది. ఫైన్ ఆర్ట్స్‌లో డిప్లొమా చేసింది. ఎడమ కాలితో నోట్స్ రాసుకునేది. ‘మొదట్లో ఆర్ట్ అనేది ఒక హాబీగానే నాకు పరిచయం అయింది. అయితే అది హాబీ కాదని, అంతులేని శక్తి అని ఆ తరువాత అర్థమైంది’ అంటుంది సరస్వతీ శర్మ. కోచిలోని ‘మౌత్ అండ్ ఫుట్ ఆర్టిస్ట్స్’ ఆర్ట్ గ్యాలరీలో సునిత చిత్రాలతో పాటు సరస్వతి చిత్రాలను ప్రదర్శించారు. ఒకవైపు నోటితో చిత్రాలు వేస్తున్న సునిత మరో వైపు కాలివేళ్లతో చిత్రాలు వేస్తున్న సరస్వతిలను చూస్తుంటే ప్రేక్షకులకు ఆత్మబలానికి నిలువెత్తు రూపాలను చూసినట్లుగా అనిపించింది. ‘అయ్యో’ అనుకుంటే ఎదురుగుండా కనిపించే దారిలో అన్నీ అవరోధాలే కనిపిస్తాయి. ‘అయినా సరే’ అనుకుంటే మనసు ఎన్నో మార్గాలు చూపుతుంది. కేరళలోని కన్నూర్‌కు చెందిన సునితకు బొమ్మలు వేయడం అంటే ప్రాణం. అయితే చేతులు పటుత్వం కోల్పోవడంతో కుంచెకు దూరం అయింది. ‘ఇష్టమైన కళ ఇక కలగానే మిగలనుందా?’ అనుకునే నిరాశామయ సమయంలో మనసు మార్గం చూపించింది. మౌత్ ఆర్టిస్ట్‌గా గొప్ప పేరు తెచ్చుకుంది... -
"బతకడు" అన్న మాటే ఊపిరి పోసింది!అద్భుతం చేసింది!
ఒక్కొసారి నిరాశగా అన్న మాటలు కూడా ఆయుధంగా మారతాయి. అవి వరంగా మారి గెలిచే ఆసక్తిని రేపుతాయి కూడా. బహుశా అందుకేనేమో పెద్దలు విమర్శిస్తున్నారని కూర్చొకు వాటినే ఎదిగేందుకు ఉపయోగపడే మెట్లుగా భావిస్తే విజయం నీ పాదాక్రాతం అని అన్నారు. ఇది జరిగే అవకాశమే లేదు అన్నవి, ఒక్క శాతం కూడా గెలిచే అవకాశం లేనివి కూడా ఏదో ఒక ఊహించని మలుపులో గెలుపు తీరం అందుతుంది, ఒక్క క్షణంలో అంతా మారిపోతుంది. అచ్చం అలాంటి అద్భుత ఘటనే యూఎస్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి విషయంలో ఈ అద్భుతం జరిగింది. యూఎస్‌లో అలెగ్జెండర్ అనే వ్యక్తి 1946లో జన్మించాడు. ఆ టైంలో యూఎస్ అంతట పోలియో ప్రబలంగా ఉంది. అతను కూడా ఈ పోలియో బారినే పడ్డాడు. అయితే ఇతని కేసు మాత్రం యూఎస్ చరిత్రలో పిల్లలకు సోకిన 58 వేల పోలియో కేసుల్లో ఘోరమైనది. అలెగ్జెండర్ ఆరేళ్ల ప్రాయంలో ఈ పోలియో బారిన పడ్డాడు. ఎంత ఘోరంగా అంటే.. అతడి వెన్నుపాముని చచ్చుపడేలా చేసి ప్రాణాంతకంగా మారింది. దీని కారణంగా అలెగ్జాండర్ ఊపిరి పీల్చుకోలేని స్థితికి చేరుకున్నాడు. నిజానికి ఈ పోలీయో వ్యాధి పోలియోన్ లేదా పోలియోమైలిటిస్ అనే పోలియో వైరస్ వల్ల వస్తుంది. దీని కారణంగా వికలాంగులు కావడమో లేదా ప్రాణాంతకంగా మారవచ్చు. పోలియో వ్యాక్సిన్‌ని యూఎస్ 1955లోనే ఆమోదించింది. పిల్లలందరికీ అందించింది కూడా. 1979 కల్లా దేశం పోలియో రహిత దేశంగా ప్రకటించబడింది కూడా. అప్పటికే అలెగ్జాండర్కి జరగకూడని నష్టం జరిగిపోయింది. శరీరం అంతా చచ్చుబడి శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్న అలెగ్జాండర్కి ట్రాకియోటమీ అనే ఇనుప ఊపిరితిత్తులు అమర్చారు. అది అతని మెదడు నుంచి కాలి వరకు కవర్ అయ్యి ఉంటుంది. అది అతన్ని కదలడానికి లేదా దగ్గడానికి అనుమతించదు. నిజం చెప్పలంటే అతను ఎప్పటి వరకు బతుకుతాడనేది కూడా చెప్పలేం. ఏ క్షణమైన చనిపోవచ్చు. ఏదో వైద్యులు అతన్ని కాపాడేందుకు అమర్చిన పరికరమై తప్ప అతని లైఫ్ టైం పెంచేది మాత్రం కాదు. వైద్యులు కూడా అతను బతకడు, బతికే అవకాశం లేదనే భావించారు. కొద్ది రోజుల్లోనే చనిపోతాడనే అన్నారు. అయితే అతడు అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఏకంగా 70 ఏళ్లు అలానే కదలకుండా ఆ ఇనుప యంత్రంతో బతికాడు. ఐతే అత్యాధునిక యంత్రాలు వచ్చినప్పటికీ అతడి శరీరం ఆ భారి ఇనుమ మెషిన్‌కి అలవాటుపడటంతో ఈ తేలికపాటి ఆధునిక యంత్రాలు అమర్చడం అసాధ్యమయ్యింది. అసలు చెప్పాలంటే అతడు ఉన్న పరిస్థితి తలుచుకుని దిగులుతో చనిపోతారు. కానీ అతడు ఎంతో గుండె నిబ్బరంతో ఆ సమస్యతో పోరాడుతూనే బతికి చూపించాడు. పైగా పాఠశాల విద్యను పూర్తి చేశాడు. న్యాయశాస్త్రంలో పట్టుభద్రుడవ్వడమే గాక చాలా ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేశాడు కూడా. కదలేందుకు వీలు లేకపోయినా నిరాశ చెందలేదు. కాలు మెదపకుండా జీవితాంత ఆ బరువైన ఇనుప మెషిన్‌తో అలానే బెడ్‌కి పరిమితమైన కూడా.. "జీవించాలి" అనే ఆశను వదులుకోలేదు. ఎలాగో చనిపోతాడని తెలిసి కూడా ఏదో ఒకటి చేస్తూ.. బతకగడం అంటే మాటలు కాదు. ఎందుకంటే మొత్తం మిషన్‌తో ఓ డబ్బాలో ఉన్న మొండెలా కనిపిస్తాడు అలెగ్జాండర్. ఏ క్షణంలోనూ కొద్దిపాటి నిరాశకు, నిస్ప్రుహను దరిచేరనివ్వకుండా బతికి చూపడు. అతడి ఈ తెగువే అత్యంత పొడవైనా ఐరన్ ఊపిరితిత్తులు కలిగినా వృద్ధ రోగిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కేలా చేసింది. అతడికి వైద్యం చేసిన వైద్యులే చనిపోయారేమో కానీ అత్యంత దయనీయ స్థితిలో బతకీడుస్తూ కూడా తాను పూర్ణాయుష్కుడినే అని నిరూపించాడు. వైద్యులు సైతం అతడు ఇప్పటి వరకు జీవించి ఉండటం అద్భుతమని చెప్పారు. క్షణికావేశంలో అకృత్యాలకు పాల్పడే యువతకు, అనుకున్నది జరగలేదన్న వ్యథతో బతుకు ముగించుకోవాలన్న వ్యక్తులందరీకి అతడు స్ఫూర్తి. ఓపికతో ఎలా వ్యవహిరించాలి, క్లిష్ట పరిస్థితుల్లో ఎలా సంయమనంతో ఉండి అందరూ ముక్కున వేలేసుకునేలా ఎలా జీవించాలో అతడు చేసి చూపించాడు. (చదవండి: గమ్యస్థానాలకు చేర్చే "ట్రావెలింగ్ పార్క్"..చూస్తే ఫిదా అవ్వడం ఖాయం!) -
నేను ప్రెగ్నెంట్‌ని..పోలియో, ఆటిజం జన్యుపరమైన జబ్బులా? నా బిడ్డకు..
మా మరిదికి పోలియో, మా బావగారి పాపకు ఆటిజం ఉంది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని.. మూడో నెల. ఈ పోలియో, ఆటిజం ఏమైనా జన్యుపరమైన జబ్బులా? నా బిడ్డకూ వచ్చే ప్రమాదం ఉందా? –కర్నె ఉజ్వల, నాగర్ కర్నూల్ పోలియో అనేది వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ఫ్లూ లాగా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తుంది. పోలియో జన్యుపరమైన.. వంశపారంపర్య జబ్బు కాదు. పోలియో వైరస్ బారినపడిన వారికి స్పైనల్ కార్డ్ ఇన్ఫెక్షన్ పక్షవాతం ఉంటుంది. మెనింజైటిస్ – బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల శాశ్వతమైన వైకల్యం సంభవిస్తుంది. టీకాతో పోలియోను పూర్తిగా నివారించవచ్చు. ఐపీవీ అండ్ ఓపీవీ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. పిల్లలందరికీ ఇప్పుడు నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో పోలియో టీకాను ఇస్తున్నారు. ఇది జన్యుపరమైన అంటే తల్లిదండ్రులు.. బంధువుల నుంచి వ్యాపించదు. మీ మరిదికి పోలియో ఉన్నా.. ఇప్పుడు మీ ప్రెగ్నెన్సీలో మీ బిడ్డకు సోకే ప్రమాదం.. అవకాశం ఏమాత్రం లేదు. ఇక ఆటిజం విషయానికి వస్తే.. ఆటిజం అనేది.. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌లో ఒక భాగం. ఇది డెవలప్మెంటల్ డిజేబులిటీ. బాల్యంలోనే పిల్లల మెదడులో తేడాలను గుర్తించి దీన్ని డయాగ్నసిస్ చేస్తారు. దీనికి తల్లిదండ్రులతో కొంతవరకు జన్యుపరంగా రావచ్చు. కొన్నిసార్లు మామూలు తల్లితండ్రులకూ ఆటిజం ఉన్న బిడ్డ ఉండొచ్చు. ఇది స్పాంటేనియస్ మ్యుటేషన్స్‌తో అవుతుంది. ఎవరికి ఆటిజం ఉంటుంది అని ప్రెగ్నెన్సీలోనే కనిపెట్టడం కష్టం. కానీ కొన్ని జంటలకు జెనెటిక్ కౌన్సెలర్స్ ద్వారా ఇన్వెస్టిగేషన్స్ చేయించి.. కొన్ని కేసెస్‌లో బిడ్డకు వేరే సిండ్రోమ్స్ ఏమైనా వచ్చే చాన్సెస్ ఉంటే.. వాటిల్లో ఆటిజం కూడా ఉంటే మూడో నెల ప్రెగ్నెన్సీలో కొన్ని జెనెటిక్ టెస్ట్‌ల ద్వారా బిడ్డకు ఆ సిండ్రోమ్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. కాబట్టి జెనెటిక్, నాన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ రెండూ ఆటిజానికి కారణాలు కావచ్చు. వంశపారంపర్యంగా వచ్చే చాన్స్ ఉన్న కేసెస్‌లో ముందస్తుగానే అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందే జెనెటిక్ , ఫీటల్ మెడిసిన్ కౌన్సెలింగ్ చేయిస్తే.. ఏ కేసెస్కి వైద్యపరీక్షలు అవసరం అనేది ముందుగానే నిర్ధారించే అవకాశం ఉంటుంది. --డా భావన కాసు గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ (చదవండి: నేను ప్రెగ్నెంట్‌ని. ఇప్పుడు మూడో నెల. రక్త హీనత ఉందని నాకు మాత్రలు ఇచ్చారు. దీనివల్ల బిడ్డకు ఏదైనా ప్రమాదం ఉంటుందా?) -
Chintala Posavva: దివ్య సంకల్పం
జీవితానికి పరీక్షలు అందరికీ ఉంటాయి. బతుకు పరీక్షాపత్రం అందరికీ ఒకలా ఉండదు. ప్రతి ఒక్కరికీ ఒక్కో పత్రాన్ని నిర్దేశిస్తుంది ఎవరి పరీక్ష వారిదే... ఎవరి ఉత్తీర్ణత వారిదే. ఆ పరీక్షలో పోశవ్వకి నూటికి నూరు మార్కులు. తన ఉత్తీర్ణతే కాదు... తనలాంటి వారి ఉత్తీర్ణత కోసం... ఆమె నిర్విరామంగా సాగిస్తున్న దివ్యమైన సేవ ఇది. ‘ఒకటే జననం... ఒకటే మరణం. ఒకటే గమనం... ఒకటే గమ్యం’ చింతల పోశవ్వ కోసం ఫోన్ చేస్తే ఆమె రింగ్‌టోన్ ఆమె జీవితలక్ష్యం ఎంత ఉన్నతంగా ఉందో చెబుతుంది. తెలంగాణ, కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివసించే పోశవ్వ ఓ ధీర. జీవితం విసిరిన చాలెంజ్‌ని స్వీకరించింది. ‘అష్టావక్రుడు ఎనిమిది అవకరాలతో ఉండి కూడా ఏ మాత్రం ఆత్మస్థయిర్యం కోల్పోలేదు. పైగా రాజ్యాన్ని ఏలే చక్రవర్తికి గురువయ్యాడు. నాకున్నది ఒక్క వైకల్యమే. నేనెందుకు అనుకున్నది సాధించలేను’ అనుకుంది. ఇప్పుడామె తన కాళ్ల మీద తాను నిలబడడమే కాక, తనలాంటి వాళ్లకు ఉపాధికల్పిస్తోంది. పోరాటం చేస్తున్న వాళ్లకు ఆసరా అవుతోంది. తన జీవితాన్ని సమాజహితానికి అంకితం చేయాలనే సంకల్పంతో పని చేస్తున్న పోశవ్వ సాక్షితో తన జీవనగమనాన్ని పంచుకున్నది. నాన్న వైద్యం... నానమ్మ మొక్కు! ‘‘విధి నిర్ణయాన్ని మార్చలేమనుకుంటాను. ఎందుకంటే మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్ అయి ఉండీ నేను పోలియో బారిన పడ్డాను. ఆ తర్వాత నాన్న ఆయుర్వేద వైద్యం నేర్చుకుని నాకు వైద్యం చేశారు. నానమ్మ నన్ను గ్రామ దేవత పోచమ్మ ఒడిలో పెట్టి ‘నీ పేరే పెట్టుకుంటా, బిడ్డను బాగు చేయ’మని మొక్కింది. మెడ కింద అచేతనంగా ఉండిపోయిన నాకు ఒక కాలు మినహా మిగిలిన దేహమంతా బాగయిపోయింది. కష్టంగానైనా నాకు నేనుగా నడవగలుగుతున్నాను. నాకు జీవితంలో ఒకరి మీద ఆధారపడే పరిస్థితి రాకూడదని ఎం.ఏ., బీఈడీ చదివించారు. చదువు పూర్తయిన తర్వాత మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్‌లో అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఎక్కువ కాలం చేయలేదు. ఫీల్డు మీదకు వెళ్లాల్సిన ఉద్యోగం అది. నేను పనిని పరిశీలించడానికి పని జరిగే ప్రదేశానికి వెళ్లి తీరాలి. నేను వెళ్లడానికి సిద్ధమైనప్పటికీ కొన్ని చోట్లకు మామూలు మనుషులు వెళ్లడం కూడా కష్టమే. ఇతర అధికారులు, ఉద్యోగులు ‘మీరు రాకపోయినా ఫర్వాలేదు’ అంటారు. అయినా ఏదో అసంతృప్తి. ఉద్యోగాన్ని అలా చేయడం నాకు నచ్చలేదు. నెలకు ముప్ఫై వేల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాను. హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్డీలో సర్ఫ్, ఫినాయిల్, ఫ్లోర్ క్లీనర్, సబీనా తయారీలో శిక్షణ, చిన్న ఇండస్ట్రీతో బతుకు పుస్తకంలో కొత్త పాఠం మొదలైంది. కోవిడ్‌తో కొత్త మలుపు నేను మార్కెట్లో నిలదొక్కుకునే లోపే కోవిడ్ వచ్చింది. మా ఉత్పత్తులు అలాగే ఉండిపోయాయి. దాంతోపాటు వాటి ఉత్పత్తి సమయంలో ఎదురైన సమస్యలు కూడా నన్ను పునరాలోచనలో పడేశాయి. క్లీనింగ్ మెటీరియల్ తయారీలో నీటి వృథా ఎక్కువ, అలాగే అవి జారుడు గుణం కలిగి ఉంటాయి కాబట్టి పని చేసేటప్పుడు దివ్యాంగులకు ప్రమాదాలు పొంచి ఉన్నట్లే. అందుకే నీటితో పని లేకుండా తయారు చేసే ఉత్పత్తుల వైపు కొత్త మలుపు తీసుకున్నాను. అవే ఎకో ఫ్రెండ్లీ రాఖీలు. ఆ ప్రయత్నం నేను ఊహించనంతగా విజయవంతం అయింది. ఆ తర్వాత గోమయ గణపతి నుంచి ఇప్పుడు పదకొండు రకాల ఉత్పత్తులను చేస్తున్నాం. అందరూ దివ్యాంగులే. ఇక మీదట ఒంటరి మహిళలకు కూడా అవకాశం కల్పించాలనుకుంటున్నాను. కన్యాదాతనయ్యాను! మా జిల్లాలో ఎవరికి వీల్ చైర్ కావాలన్నా, ట్రై సైకిల్, వినికిడి సాధనాలు, పెన్షన్ అందకపోవడం వంటి సమస్యల గురించి నాకే ఫోన్ చేస్తారు. ఎన్జీవోలు, డీఆర్డీఏ అధికారులను సంప్రదించి ఆ పనులు జరిగేటట్లు చూస్తున్నాను. దివ్యాంగులకు, మామూలు వాళ్లకు కలిపి మొత్తం పన్నెండు జంటలకు పెళ్లిళ్లు చేశాను. వాళ్లలో ఇద్దరికి మాత్రం అమ్మాయి తరఫున పెళ్లి పెద్ద బాధ్యత వహించాల్సి వచ్చింది. నాకు అమ్మాయిల్లేరు, ముగ్గరబ్బాయిలు. ఈ రకంగా అవకాశం వచ్చిందని సంతోషించాను. సంకల్పం గొప్పది! నేను నా ట్రస్ట్ ద్వారా సమాజానికి అందించిన సహాయం ఎంతో గొప్ప అని చెప్పను. ఎంతో మంది ఇంకా విస్తృతంగా చేస్తున్నారు. కానీ నాకు ఉన్నంతలో నేను చేయగలుగుతున్నాను. నా లక్ష్యం గొప్పదని మాత్రం ధీమాగా చెప్పగలను. ఆదాయం కోసం పర్యావరణానికి హాని కలిగించడానికి వెనుకాడని ఈ రోజుల్లో, పర్యావరణ హితమైన మార్గంలో ఉపాధిని వెతుక్కుంటున్న మా ప్రయత్నాన్ని ఎన్నో సంస్థలతోపాటు ప్రభుత్వం కూడా గుర్తించింది. నాకు గత ఏడాది మహిళాదినోత్సవం సందర్భంగా సత్కరించింది. నా కుటుంబ పోషణకు నా భర్త ఉద్యోగం ఉంది. నా దివ్యహస్తం ట్రస్ట్ ద్వారా చేస్తున్న సర్వీస్ అంతా పర్యావరణ పరిరక్షణ, సమాజహితం, దివ్యాంగుల ప్రయోజనం కోసమే’’ అన్నారు. ‘ఉన్నది ఒకటే జననం... అంటూ... గెలుపు పొందే వరకు... అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు... గెలుపు కొరకే బతుకు’ అనేదే ఆమె తొలిమాట... మలిమాట కూడా. ఆదాయం కోసం పర్యావరణానికి హాని కలిగించడానికి వెనుకాడని ఈ రోజుల్లో, పర్యావరణ హితమైన మార్గంలో ఉపాధిని వెతుక్కుంటున్న మా ప్రయత్నాన్ని ఎన్నో సంస్థలతోపాటు ప్రభుత్వం కూడా గుర్తించింది. – వాకా మంజులారెడ్డి -
పోలియోపై పోరుకు రూ.9.8 వేల కోట్ల విరాళం
బెర్లిన్: ప్రపంచ వ్యాప్తంగా పోలియో మహమ్మారిపై సాగే పోరాటానికి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.8 వేల కోట్ల)సాయం ప్రకటించింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ తదితర దేశాలను పోలియో రహితంగా మార్చేందుకు, వైరస్ కొత్త వేరియంట్ల వ్యాప్తిని నివారణకు ఈ మొత్తాన్ని వెచ్చిస్తామని తెలిపింది. పోలీయో నిర్మూలన కోసం ఇప్పటి వరకు 5 బిలియన్ డాలర్లు వెచ్చించినట్లు వెల్లడించింది. పోలీయోపై పరిశోధనలు, కొత్త వేరియంట్ల గుర్తింపు సహా ప్రజల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు కృషి చేస్తామని పేర్కొంది. ఇటీవలే పాకిస్తాన్లో 20, అఫ్గానిస్తాన్‌లో 2 పోలీయో కేసులు నమోదైన క్రమంలో ఆయా దేశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపింది. ప్రపంచం ఈ మహమ్మారిని అంతం చేస్తానని మాటిచ్చిందని, ఏ ఒక్కరు ఈ వ్యాధిపై భయంతో జీవించకూడదంటూ ట్వీట్ చేసింది బిల్ అండ్ మెలిండా గేట్స్. The world made a promise to #EndPolio for good. No one should live in fear of this preventable disease. The Gates Foundation is proud to commit $1.2B toward helping health workers stop all forms of this virus and protect children forever. https://t.co/oA7RNzcOIy — Gates Foundation (@gatesfoundation) October 16, 2022 ఇదీ చదవండి: Bill Gates: ఫౌండేషన్‌కు లక్షన్నర కోట్ల విరాళం..ప్రకటించిన బిల్ గేట్స్! -
గ్రేట్ జర్నీ స్టీరింగ్ ఉమన్
ఆమె ఆటో రిక్షా నడుపుతుంటే ఆ పట్టణంలోని పిల్లలు ఆసక్తిగా చూస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలు... ఇలా కూడా ఉంటుందా? అన్నంత విచిత్రంగా చూస్తారు. నిజమే... వాహనం స్టీరింగ్ ఆడవాళ్ల చేతిలో ఉండడం అంటే వాళ్లకు ప్రపంచంలో ఎనిమిదో వింతను చూడడమే. నడివయసు మగవాళ్లైతే ఆ దృశ్యాన్ని కళ్లెర్రచేసి చూస్తారు. ఆమె తల్లిదండ్రులను, భర్తను తలుచుకుని ఆడపిల్లను ఎలా పెంచాలో, స్త్రీ పట్ల ఎంతటి కట్టుబాట్లు పాటించాలో తెలియని మూర్ఖులు అన్నట్లు ఓ చూపు చూసి, తమ ఇంటి ఆడవాళ్లను గూంగట్ చాటున దాచిన తమ ఘనతను తలుచుకుని మీసం మీద చెయ్యేసుకుంటారిప్పటికీ. ఈ సంప్రదాయ సంకెళ్లను ఛేదించింది నలభై ఏళ్ల మాయా రాథోడ్. ఒక్క సంప్రదాయ సంకెళ్లను మాత్రమే కాదు, పోలియో బారిన పడిన అమ్మాయి జీవితం అక్కడితో ఆగిపోదని, సంకల్పం, పట్టుదల, శ్రమ, అకుంఠిత దీక్ష ఉంటే బతుకుపథంలో అడుగులు చక్కగా వేయవచ్చని కూడా నిరూపిస్తోంది. మరో ముఖ్యమైన విషయం కూడా ప్రముఖం గా గుర్తించాల్సిందే ఉంది. కాలుష్య రహిత సమాజ స్థాపనలో భాగంగా కాలుష్యాన్ని విడుదల చేసే ఆటోరిక్షాలను ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఆటో రిక్షాలను ప్రవేశ పెట్టినప్పుడు మగవాళ్లు ఎలక్ట్రానిక్ స్టీరింగ్ పట్టుకోవడానికి సాహసించలేదు. అలాంటప్పుడు మాయా రాథోడ్ వేసిన ఓ ముందడుగు ఇప్పుడు రాజస్థాన్‌లోని బిల్వారా పట్టణంలో పలువురికి స్ఫూర్తినిస్తోంది. అక్కడి మహిళలకు మాయా రాథోడ్ ఓ రోల్ మోడల్ అయింది. బహుముఖ పోరాటం మాయా రాథోడ్ ఆరేళ్ల వయసులో పోలియో బారిన పడింది. అసలే ఆడపిల్లలు బతికి బట్టకట్టడం కష్టమైన రాజస్థాన్ రాష్ట్రం. ఆడపిల్లలను బడికి పంపించమని ప్రభుత్వాలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాల్సిన పరిస్థితిలో ఉన్న రాష్ట్రం. అలాంటి చోట మాయా రాథోడ్ బతుకు పోరాటం చేసింది. ఏకకాలం లో పోలియోతోనూ సమాజంతోనూ పోరాడింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఆ జీతంతో బతుకు కుదుట పడడం కుదిరే పని కాదని కూడా త్వరలోనే అర్థమైందామెకు. భర్త సంపాదనకు తన సంపాదన కూడా తోడైతే తప్ప పిల్లల భవిష్యత్తుకు మంచి దారి వేయలేమని కూడా అనుకుంది. అదే సమయంలో ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఆటో రిక్షాలను సబ్సిడీ ధరలో ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆ క్షణంలో మాయా రాథోడ్ తీసుకున్న నిర్ణయమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. బ్యాంకు లోన్ తీసుకుని ఎలక్ట్రానిక్ ఆటో రిక్షా తీసుకున్నది. ఇది జరిగి మూడేళ్లవుతోంది. ఆ క్షణం నుంచి ఆమెను సంప్రదాయ సమాజం విమర్శన దృక్కులతో వేధించింది. అభివృద్ధి పథం లో నడవాలనుకున్న సమాజం ఆమెను ఆదర్శంగా తీసుకుంది. ఆమె మాత్రం... ‘మహిళలు యుద్ధ విమానాలు నడుపుతున్న రోజులివి. ఆటో రిక్షా నడపడాన్ని కూడా ఆక్షేపించే రోజులు కావివి. ఆటో నడపడం నాకు వచ్చో రాదో అనే సందేహాలు వద్దు. నా ఆటోలో ప్రయాణించి చూడండి’ అని సవాల్ విసురుతోంది. ఈ మూడేళ్లలో బిల్వారాలో మంచి మార్పే వచ్చింది. చిల్లర దొంగతనాలు ఎక్కువగా ఉండే ఆ రాష్ట్రంలో రాత్రిళ్లు మగవాళ్ల ఆటోలో ప్రయాణించడం కంటే మాయ ఆటోలో ప్రయాణించడానికి ఆడవాళ్లతోపాటు మగవాళ్లు కూడా ఇష్టపడుతున్నారు. -
ఏ వ్యాక్సిన్‌కు ఎంత సమయం?
తొలినాళ్లలో టీకాలు కనిపెట్టేందుకు దశాబ్దాల కాలం పట్టేది. కానీ ఆధునిక సాంకేతికత పెరిగే కొద్దీ టీకాల ఉత్పత్తి సమయం తగ్గుతూ వచ్చింది. తాజాగా మానవాళిపై ప్రకృతి పంపిన కరోనా మహమ్మారికి రికార్డు స్థాయిలో ఏడాదిలోపే టీకా కనుగొన్నారు. చరిత్రలో ప్రత్యేకత సంతరించుకున్న వ్యాక్సిన్లు, వాటిని కనిపెట్టేందుకు పట్టిన సమయం ఓసారి చూద్దాం.. స్మాల్‌పాక్స్ (మశూచి) క్రీ.పూ 3వ శతాబ్దం నుంచి మానవచరిత్రలో ఈ వ్యాధి ప్రస్తావన కనిపిస్తుంది. 18వ శతాబ్దినాటికి కాలనైజేషన్ కారణంగా ప్రపంచమంతా విస్తరించింది. దీనివల్ల కలిగే మరణాలు భారీగా ఉండేవి. 1796లో ఎడ్వర్డ్ జెన్నర్ తొలిసారి ఈవ్యాధికి వ్యాక్సిన్ తయారు చేశారు. కానీ ప్రపంచవ్యాప్తంగా 1967 తర్వాతే ఈ వ్యాక్సిన్‌ను విరివిగా ఇచ్చి 1980 నాటికి స్మాల్‌పాక్స్ ఆనవాళ్లు లేకుండా చేయడం జరిగింది. ఇప్పటివరకు టీకాతో సమూలంగా నిర్మూలించిన వ్యాధి ఇదొక్కటే. టైఫాయిడ్: 1880లో దీనికి కారణమైన బ్యాక్టీరియాను కనుగొన్నారు. 1886లో టీకా కనుగొనే యత్నాలు ఆరంభమయ్యాయి. 1909లో రస్సెల్ అనే శాస్త్రవేత్త విజయవంతమైన వ్యాక్సిన్ కనుగొన్నారు. 1914 నుంచి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. ఇన్‌ఫ్లూయెంజా: ఈ వ్యాధికి టీకా కనుగొనే ప్రయత్నం 1930 నుంచి జరిగింది. 1945లో విజయవంతమైన టీకా ఉత్పత్తి చేశారు. కానీ ఈ వ్యాధికారక వైరస్‌లో మార్పులు జరుగుతుండటంతో టీకాలో మార్పులు చేస్తున్నారు. పోలియో: ప్రాణాంతకం కాకపోయినా, మనిషిని జీవచ్ఛవంలా మార్చే ఈ వ్యాధి నివారణకు టీకాను 1935లో కోతులపై ప్రయోగించారు. కానీ తొలిసారి విజయవంతమైన టీకాను 1953లో జోనస్ సాక్, 1956లో ఆల్బర్ట్ సబిన్ తయారు చేశారు. 1990 అనంతరం పలు దేశాల్లో పోలియోను దాదాపు నిర్మూలించడం జరిగింది. ఆంత్రాక్స్: ఈవ్యాధి గురించి క్రీ.పూ 700 నుంచి మనిషికి తెలుసు. 1700నుంచి దీనిపై శాస్త్రీయ అధ్యయనాలు జరిగాయి. 1881లో తొలిసారి వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రయత్నం జరిగింది. పశువులకు వాడే విజయవంతమైన ఆంత్రాక్స్ టీకాను మాత్రం 1937లో మాక్స్ స్టెర్నె కనుగొన్నారు. 1970ల్లో ఆంత్రాక్స్ టీకా ఉత్పత్తి జరిగింది. ఎంఎంఆర్: మీజిల్స్, మంప్స్, రూబెల్లా అనేవి వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధులు. 1960 నాటికి వీటికి విడివిడిగా వ్యాక్సిన్లు వచ్చాయి. 1971లో మౌరిస్ హిల్లెమన్ ఈ వ్యాధులకు ఒకే వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. చికెన్‌పాక్స్(ఆటలమ్మ): 19వ శతాబ్దం వరకు దీన్ని స్మాల్పాక్స్గానే భ్రమించేవారు. అనంతరం దీనిపై విడిగా పరిశోధనలు జరిగాయి. 1970లో జపాన్ సైంటిస్టులు విజయవంతమైన చికెన్‌పాక్స్ టీకా కనుగొన్నారు. ప్లేగు: మానవాళిని గజగజలాడించిన మొండి వ్యాధి. ప్రపంచంలోనే అత్యధిక మరణాలకు కారణమైంది. కానీ దీనికి సరైన వ్యాక్సిన్ ఇప్పటివరకు లేదు. ఈ వ్యాధి బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుంది. అందువల్ల ఆధునిక యాంటీబయాటిక్స్‌తో దీన్ని నివారించవచ్చు. గతంలో దీనికి వ్యాక్సిన్ తయారు చేయాలన్న యత్నాలు సఫలం కాలేదు. 2018లో దాదాపు 17 వ్యాక్సిన్లు వివిధ దశల ట్రయిల్స్‌లో ఉన్నట్లు డబ్లు్యహెచ్‌ఓ తెలిపింది. యెల్లో ఫీవర్ 500 ఏళ్లుగా మనిషిని ఇబ్బందులు పెట్టిన ఈవ్యాధికి టీకా కనుగొనే యత్నాలు 19వ శతాబ్దంలో ఆరంభమయ్యాయి. 1918లలో రాక్ఫెల్లర్ సంస్థ సైంటిస్టులు వ్యాక్సిన్ కనుగొన్నారు. మాక్స్ ధీలర్ 1937లో తొలిసారి యెల్లోఫీవర్కు విజయవంతమైన టీకా తయారు చేశారు. 1951లో ఆయనకు నోబెల్ వచ్చింది. టీకా ఉత్పత్తికి నోబెల్ అందుకున్న తొలి శాస్త్రవేత్త ఆయనే. హెపటైటిస్ బీ ఇటీవల కాలంలో కనుగొన్న వైరస్ ఇది. 1965లో దీన్ని గుర్తించిన డా. బరూచ్ బ్లుంబర్గ్ నాలుగేళ్ల అనంతరం దీనికి వ్యాక్సిన్‌ను తయారు చేయగలిగారు. 1986లో హెపటైటిస్ బీకి సింథటిక్ టీకాను కనుగొన్నారు. ఈ వైరస్ వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీని టీకాతో లివర్ క్యాన్సర్‌ను నివారించడం జరుగుతుంది కనుక ఈ టీకాను తొలి యాంటీ క్యాన్సర్ టీకాగా పేర్కొంటారు. -
కరోనా వాక్సిన్ : సీరం సీఈఓ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న వేళ ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి సుదీర్ఘ కాలంపాటు కోవిడ్-19 వాక్సీన్ల అవసరం ఉంటుదని పేర్కొన్నారు. జనాభాలో 100 శాతానికి కరోనా టీకా ప్రక్రియ పూర్తిచేసినప్పటికీ, భవిష్యత్తులోమరో 20 ఏళ్లపాటు ఈ టీకాల అవసరం తప్పక ఉంటుందన్నారు. టీకా ఒక్కటే పరిష్కారం కాదని అదార్ వివరించారు. ఎందుకంటే ప్రపంచంలో పలురకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిల్లో ఏ ఒక్క టీకాను నిలిపివేసిన చరిత్ర ఎక్కడా లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు వ్యాక్సిన్ ఖచ్చితమైన శాస్త్రం కాదు. అది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది, కానీ వ్యాధి రాకుండా పూర్తిగా నిరోధించదని పూనావాలా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నటీకాలు ఎంతకాలం రక్షణ కల్పిస్తాయో ఎవరికీ తెలియదు. ఒకటి, రెండు లేదా మూడు సంవత్సరాలు. అయితే ఫ్లూ విషయానికి వస్తే ప్రతీ ఏడాది, ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కరోనావైరస్ విషయంలో కనీసం రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు. కోవిడ్-9 వ్యాక్సిన్ కరోనాను ప్రపంచ వ్యాప్తంగా నిర్మూలిస్తుంది, వైరల్ సంక్రమణను పూర్తిగా అరికడుతుంది లాంటి ఆశలు ఏమైనా ఉంటే ఈ కఠోర సత్యాన్ని మనం జీర్ణించుకోక తప్పదన్నారు. మీజిల్స్ వ్యాక్సిన్, అత్యంత శక్తివంతమైన టీకా, 95 శాతం వ్యాధి నివారణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ ప్రతీ ఏడాది కొత్తగా పుట్టిన శిశువులకు మీజిల్స్ వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే కదా అని ఆయన ఉదాహరించారు. మొత్తం ప్రపంచంలో 100 శాతానికి టీకాలు అందించిన తరువాత కూడా భవిష్యత్తు కోసం కరోనా టీకా అవసరం ఉంటూనే ఉంటుదని పూనావల్లా వాదించారు. ఫ్లూ, న్యుమోనియా, మీజిల్స్, అంత ఎందుకు పోలియో వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ఒక్కటి కూడా ఇంతవరకూ నిలిపివేయలేదని తెలిపారు. -
చిన్నారుల్లో ఆ వ్యాధులు మళ్లీ విజృంభిస్తాయేమో?
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా చిన్నారులకు సాధారణంగా ఇచ్చే వ్యాక్సిన్ కార్యక్రమానికి ఆటంకం కలగడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా పిల్లలకు క్రమం తప్పకుండా వేస్తున్న టీకా కార్యక్రమం రెండు నెలలుగా నిలిచిపోవడంతో పాత శత్రువులైన డిఫ్తీరియా, ధనుర్వాతం, తట్టు, పోలియో మళ్లీ తిరగబెట్టే ప్రమాదముందని అంటున్నారు. కోవిడ్–19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 8 కోట్ల మంది ఏడాదిలోపు చిన్నారులు డిఫ్తీరియా, తట్టు, పోలియో వ్యాధుల బారిన పడే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఒక నివేదికలో తెలిపింది. భారత్‌లో ప్రతినెలా 20 నుంచి 22 లక్షల మంది చొప్పున ఏడాదికి 2.60 కోట్ల మంది చిన్నారులకు జాతీయ టీకా కార్యక్రమం కింద వ్యాక్సినేషన్ జరుగుతుందని తెలిపింది. -
దివ్యాంగులకు దిక్సూచి
విధి చిన్నచూపు చూసినా అతడు కుంగిపోలేదు. వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపించాడు. పేదరికాన్ని జయించి చదువుకుని రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. తనలా శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారిని ఆదుకోవాలనేఆశయంలో ఉద్యోగాన్ని వదిలి దివ్యాంగులకు అండగా నిలుస్తున్నారు దేవరపల్లికి చెందిన కాగిత భాస్కరరావు. గొల్లగూడెం వద్ద ఆశ్రమం స్థాపించి 56 మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు. దేవరపల్లి : పోలియో వ్యాధి బారిన పడి రెండు కాళ్లు చచ్చుపడిపోవడంతో మానసికంగా కుంగిపోయాడు దేవరపల్లికి చెందిన కాగిత భాస్కరరావు. చదువుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ పేదరికం అడ్డుగా నిలిచింది. అయినా పట్టుదలతో తల్లిదండ్రులను ఒప్పించి ఇంటర్ వరకు ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నాడు. అనంతరం ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేసి 1994లో దివ్యాంగుల కోటాలో రైల్వే శాఖలో ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ భాస్కరరావుకు తృప్తి లేదు. సమాజంలో దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులను, అవమానాల నుంచి కొంతమదిౖకైనా విముక్తి కల్పించాలని నిర్ణయించుకుని రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2004లో భారతి వికలాంగుల సేవా సమితి స్థాపించి లగడపాటి రామలక్ష్మమ్మ వికలాంగుల ఆశ్రమం పేరున దేవరపల్లి మండలం గొల్లగూడెం వద్ద ఆశ్రమం స్థాపించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాలలో సుమారు 56 మంది దివ్యాంగులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. చదువుతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు, వృత్తి విద్యలో శిక్షణ ఇస్తున్నారు. చేతివృత్తులతో పాటు కంప్యూటర్ రంగంలో శిక్షణ ఇస్తున్నారు. దాతల సహకారంతో ఆశ్రమం అభివృద్ధి ఆశ్రమం అభివృద్ధికి ప్రభుత్వ సహకారం లేకపోయినప్పటికీ దాతల సహకారం లభిస్తోంది. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఎంతోమంది దాతలు ఆశ్రమాన్ని సందర్శించి విరాళాలు అందజేస్తున్నారు. ఎంతోమంది ధనికులు తమ పిల్లల పుట్టిన రోజు వేడుకలు, పెళ్లి్ల రోజు వేడుకలను ఆశ్రమంలో నిర్వహించి దివ్యాంగులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాలుగా భాస్కరరావు ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఎంతోమంది దివ్యాంగులను అక్కున చేర్చుకుంటున్నారు. ఆశ్రమం ద్వారా వివిధ సేవలు ప్రత్యేక విద్య, చేతివృత్తుల శిక్షణ, కంప్యూటర్ శిక్షణ, డిజిటల్ క్లాసులు, దివ్యాంగులకు ఉచిత హాస్టల్ వసతి సౌకర్యం, మెడికల్ క్యాంపుల నిర్వహణ, కృత్రిమ కాళ్లు, చేతులు, క్యాలిపర్స్, క్రచ్చెస్, వీల్‌చైర్స్, ట్రైసెకిళ్లు అందజేయుట, దివ్యాంగులకు వివాహ కార్యక్రమాలు నిర్వహించడం, వేసవి కాలంలో మినరల్ వాటర్‌తో చలివేంద్రాల ఏర్పాటు, అనాథలకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంతేకాక కన్నబిడ్డల నిర్లక్ష్యానికి గురైన తల్లిదండ్రుల కోసం వృద్ధాశ్రమం స్థాపించి వృద్ధులకు ఆశ్రయం కల్పింస్తున్నారు. తనతో పాటు భార్య భారతి, ఇద్దరు పిల్లలు కూడా ఆశ్రమం సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. భాస్కరరావు కుటుంబమంతా దివ్యాగులు, వృద్ధుల సేవలకే అంకితమై పనిచేస్తున్నారు. నా చివరి శ్వాస వరకు దివ్యాగుల సేవలోనే ఉంటానని భాస్కరరావు అంటున్నారు. వృద్ధుల కోసం దాతల సహకారంతో భవన నిర్మాణం చేస్తున్నారు. -
వీల్‌చైర్ నుంచే విజయ బావుటా..
ఊహ తెలియని వయసులో వైకల్యం కాటేసింది. ఒక్క కాలితోనే పాఠశాలకు వెళ్లేది. అందరూ ఉత్సాహంగా ఆటలు ఆడుతుంటే సంతోషంగా చూసేది. క్రమంగా తాను వారికంటే మేటిగా ఆడాలని కలలు కంది, సాధనతో ఆ స్వప్నాల్ని సాకారం చేసుకుంది. చక్రాల కుర్చీ క్రీడాకారిణి ప్రతిమారావు తనవంటివారికి ఆదర్శంగా నిలిచారు. సాక్షి, శివాజీనగర(బెంగళూరు): దేవుడు ఒక ద్వారం మూసేస్తే మరో ద్వారం ఎక్కడో తెరిచే ఉంటాడు అని ప్రతిమారావు తన బాల్యంలో విన్న మాటలు. చేయాల్సిందల్లా ఆ మార్గాన్ని వెతుక్కో వడమే అంటారు బెంగళూరుకు చెందిన 33 ఏళ్ల వీల్‌చైర్ టెన్నిస్ క్రీడాకారిణి ప్రతిమారావు. ఆమెకు మూడేళ్ల వయసులో పోలియో ఇంజెక్షన్ వేసినప్పుడు అది రియాక్షన్ కావడంతో కుడి కాలును పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. ఆమె క్రమంగా క్రీడాకారిణిగా మారి నేడు వీల్‌చైర్ టెన్నిస్‌లో ఏఐటీఏ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచారు. ఉడుపి జిల్లా వద్ద సాలిగ్రామానికి చెందిన ప్రతిమా కంప్యూటర్ డిప్లొమా చేసి జీవీకే ఇఎమ్ఆర్ఐ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. తండ్రి సాధారణ పాన్ వ్యాపారి. ఆమె సాక్షితో మాట్లాడుతూ.. ‘నన్ను ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచారు. పాఠశాలలో నేను ఆటలకు దూరంగా ఉండేదాన్ని. టీచర్ పక్కన కూర్చొని ఇతరుల ఆటలను చూస్తూ ఉండేదాన్ని. అయితే బెంగళూరుకు వచ్చిన తరువాత నాకు టెన్నిస్‌లో ఆసక్తి పెరిగింది. వీల్‌చైర్‌లో టెన్నిస్ ఆడటాన్ని చూసి నాకూ ఉత్సాహం కలిగింది.’ అని అనుభవాలను పంచుకున్నారు. సాధించాలనే తపనే ఇక్కడ నిలిపింది పోలియో ఇంజక్షన్‌ను సరిగా వేయకపోవడంతో తన కుడి కాలును కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ, నాన్నకు తాను కష్టపడటం ఇష్టం లేదు, వారితో సంతోషంగా ఉండాలనే ఆశ ఉండేది అన్నారు. ‘అయితే నాకు ఏదైనా సాధించాలని ఆత్మ విశ్వాసం ఉంది. చక్రాల కుర్చీ ఉపయోగించకుండా నేను నడవగలను. దూరంగా నడవాలంటే మాత్రం క్యాలిఫర్ ఉపయోగిస్తా. అయితే టెన్నిస్ ఆడాలనే ఆసక్తితో తొలిసారిగా చక్రాలకుర్చీని ఉపయోగించడం నేర్చుకున్నా. 2012లో కర్ణాటక వీల్‌చైర్ టెన్నిస్ అసోసియేషన్ (కేడబ్ల్యూటీ)ద్వారా అడేందుకు ఆవకాశం దక్కింది. దీనిద్వారా కర్ణాటక రాష్ట్ర లాన్ టెన్నిస్ సంస్థ (కేఎస్ఎట్టీఎ) మైదానంలో ప్రతి వారాంతం సాధన చేసేదాన్ని. గూగుల్, యూట్యూబ్‌లో చూసి టెన్నిస్ శిక్షణ గూగుల్, యూ ట్యూబ్‌లో వీడియోలు చూస్తూ టెన్నిస్ ఆడటాన్ని నేర్చుకున్నా. 2013లో జాతీయ వీల్‌చైర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్స్ చేరుకున్నాను’ అని ప్రతిమారావు తెలిపారు. ‘ఆ తరువాత కోచ్ నిరంజన్ రమేశ్ ద్వారా శిక్షణ లభించింది. ఆయనే నా గురువు. సమయ పాలనతో పాటు వృత్తి జీవిత పలు క్రమశిక్షణలను నేర్పించారు. ఆ తరువాత ఏఐటీఏ ర్యాంకింగ్‌లో ఆగ్రస్థానం లభించింది. ఐటీఎఫ్ ర్యాంకింగ్‌లో ప్రస్తుతానికి ఏ స్థానం లభించలేదు. అందులో ర్యాంకింగ్ సాధించడమే నా ఏకైక లక్ష్యం’ అని చెప్పారు. ప్రతిమారావు సాధనలు.. ప్రతిమారావు కర్ణాటక రాష్ట్ర లాన్ టెన్నిస్ సంస్థ ఇటీవల జరిపిన టిబెబుయియా ఓపెన్ వీల్‌చైర్ టెన్నిస్ టోర్నీలో మహిళల విభాగంలో విజేతగా నిలిచారు. 2015లో మలేషియా ఓపెన్ టోర్నీలో సెమిఫైనల్ వరకూ వెళ్లారు. 2016లో ఆర్వైటీహెచ్ఎమ్ 4వ జాతీయ వీల్‌చైర్ చాంపియన్‌షిప్‌లో సింగిల్, డబుల్స్‌లో రన్నరప్. 2016 కేడబ్ల్యూటీఏ రాష్ట్రస్థాయి టెన్నిస్‌లో సింగిల్స్, డబుల్స్‌లో చాంపియన్. 2016 టెబెబుయియా ఓపెన్ టోర్నీలో సింగిల్స్, డబుల్స్‌లో విజేత. 2017 మరినా ఓపెన్ టోర్నీలో సింగిల్స్ ట్రోఫీ. -
వ్యాక్సిన్‌తో శ్రీరామరక్ష
మిడుతూరు: ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయిస్తే వారి జీవితానికి శ్రీరామరక్షగా ఉంటుందని స్టేట్ నోడల్ అధికారి వెంకటరత్నం అన్నారు. మండలపరిధిలోని కడుమూరు అంగన్వాడీ కేంద్రంలో ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. రాష్ట్రంలో 50.92 లక్షల మంది చిన్నారులకు బైవలెంట్ పోలియో చుక్కల మందును (వ్యాక్సిన్) వేస్తున్నట్లు తెలిపారు. 3,17, 771 వైల్స్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం 1,52,672 మంది సిబ్బందిని వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి 2008లో ఈస్టు గోదావరి జిల్లా కాకినాడలో, దేశంలో 2011లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పోలియో కేసు నమోదైందన్నారు. 2014లో భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తించిందని వివరించారు. వైద్యాధికారి సురేష్ కుమార్, సూపర్వైజర్ విలాసకుమారి, హెల్త్ అసిస్టెంట్ పార్వతి, ఆంగన్ వాడి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
పోలియో ఉందని బిడ్డను వదిలేశారు
-
2 నుంచి పల్స్ పోలియో
ఏలూరు (మెట్రో): జిల్లాలో పోలియో వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు వచ్చేనెల 2 నుంచి 4వ తేదీ వరకూ మూడు రోజులపాటు పల్స్ పోలియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా వైద్యారోగ్యాధికారి (డీఎంహెచ్ఓ) కె.కోటేశ్వరి తెలిపారు. పల్స్ పోలియా కార్యక్రమ ఏర్పాట్లపై సోమవారం ఆమె కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు నాలుగు లక్షల మంది వరకూ ఉన్నారని, వారందరికీ పోలియో చుక్కలు వేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. 2వ తేదీన జిల్లాలో 3,233 కేంద్రాలను ఏర్పాటు చేసి 13,215 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్టు చెప్పారు. డీఆర్ఓ హైమావతి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి మోహనకృష్ణ, డెమో నాగేశ్వరరావు పాల్గొన్నారు. అందరికీ ఆరోగ్య బీమా లక్ష్యం జిల్లాలో అందరికీ ఆరోగ్య బీమా అందించే లక్ష్యంతో హెల్త్ ఫర్ ఆల్ అనే పథకం అమలుకు విస్తృత చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్ఓ కె.కోటేశ్వరి తెలి పారు. సోమవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆరోగ్య బీమా పథకంలో భాగంగా ఏడాదికి రూ.1,200 చెల్లించడం ద్వారా రూ.2 లక్షల వరకు వైద్య సేవలు పొందే వీలుంటుందన్నారు. కలెక్టర్ భాస్కర్ ఆదేశాల మేరకు వచ్చేనెల 3వ తేదీ నుంచి ఇంటింటా అవగాహన కార్యక్రమం చేపడతామని చెప్పారు. ఏఎన్ఎంలు, ఆరోగ్య మిత్రలు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వారిని పథకంలో చేర్చేందుకు కృషి చేస్తారని తెలిపారు. పథకాల అమలుపై ఆరా జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య పథకాలపై ఎంపీహెచ్ఈఓ, సీఓలతో డీఎంహెచ్ఓ కోటేశ్వరి సమీక్షించారు. ఐవో మోహనకృష్ణ, ఆర్బీఎస్కే డాక్టర్ కె.సురేష్‌బాబు, డెప్యూటీ డెమో నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
29న పల్స్‌పోలియో
అయిదేళ్లలోపు పిల్లలందరికీ చుక్కల మందు వేయాలి అలసత్వం ప్రదర్శిస్తే సిబ్బందిపై చర్యలు డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ చంద్రయ్య కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ) : ఈ నెల 29న పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎం అండ్ హెచ్‌వో) డాక్టర్ కె.చంద్రయ్య తెలిపారు. ఆ రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలియో చుక్కల మందు వేస్తారన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంపై రూట్ సూపర్వైజర్లకు కాకినాడలోని తన కార్యాలయంలో గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి అయిదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలన్నారు. జీవనాధారం కోసం వలస వచ్చిన కుటుంబాలు, ఇటుక బట్టీలు, కోళ్లఫారాల్లో పని చేస్తున్నవారి చిన్నారులను గుర్తించి తప్పకుండా పోలియో చుక్కలు వేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొదటి రోజు ఎంపిక చేసిన పోలియో కేంద్రాల్లో చిన్నారులకు చుక్కల మందు వేయాలని, రెండు, మూడు రోజుల్లో ప్రతి ఇంటినీ సందర్శించి పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులను గుర్తించి చుక్కల మందు వేయాలని సూచించారు. పల్స్‌పోలియో కార్యక్రమంలో అలసత్వం ప్రదర్శిస్తే సిబ్బందిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తీవ్ర జ్వరం, విరేచనాలు, అస్వస్థతతో బాధ పడుతున్న చిన్నారులకు చుక్కల మందు వేయరాదన్నారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియజేయాలన్నారు. జిల్లా ప్రధాన కేంద్రం నుంచి సంబంధిత పీహెచ్సీ, సీహెచ్‌సీలకు పల్స్‌పోలియా చుక్కల మందు సరఫరా, పోలియో కేంద్రాల్లో పాటించాల్సిన విధులు, బాధ్యతలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేష¯ŒS అధికారి డాక్టర్ అనిత, కాకినాడ, పెద్దాపురం డివిజన్ల సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
నగరంలో మళ్లీ పోలియో కలకలం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మళ్లీ పోలియో (టైప్–2) వైరస్ కలకలం సృష్టిస్తోంది. అంబర్‌పేట, నాగోలు నాలాలో పోలియో ఆనవాళ్లు ఉన్నట్లు మరోసారి భయటపడటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సాధారణ నమూనా సేకరణలో భాగంగా ఆగస్టు 28న నగరంలో ర్యాండమ్‌గా సేకరించిన శాంపిల్స్‌ను ముంబై డబ్ల్యూహెచ్ఓ సంస్థకు పంపగా.. పరీక్షల్లో నాగోలు, అంబర్‌పేట నాలాల్లో పోలియో వైరస్ ఉన్నట్లు తేలింది. వ్యక్తి మలం ద్వారా ఈ వైరస్ వ్యాపించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. నాలాలో వైరస్ బయటపడింది కాబట్టి పెద్ద ప్రమాదం ఏమీ లేదు. కానీ ఇదే వైరస్ పిల్లలకు వ్యాపించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలోనే వైరస్ ఆనవాళ్లు మళ్లీ బయటపడటం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఐదు మాసాల కిందే గుర్తింపు అంబర్పేట్, గోల్నాక నాలాలో పోలియో వైరస్ ఆన వాళ్లు ఉన్నట్లు ఐదు మాసాల క్రితమే నిర్ధారణైంది. హైదరాబాద్ జిల్లాలోని అ ంబర్పేట, గోలా ్నక, బార్కాస్, కంటోన్మెంట్, డబీర్‌పుర, జంగమ్మెట్, కింగ్‌కోఠి, లాలాపేట, మలక్‌పేట, నాంపల్లి, పానిపురా, సీతాఫల్మండి, సూరజ్‌భాను ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్, మల్కజిగిరి, బాలానగర్, అల్వాల్, నార్సింగ్, శేర్లింగంపల్లి, కీసర, నారపల్లి, ఉప్పల్, అబ్దుల్లాపూర్, సరూర్‌నగర్, బాలాపూర్ తదితర ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించింది. డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్ సంస్థల ప్రతినిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందాలు నగరంలో వేర్వేరుగా పర్యటించాయి. ఆయా ప్రాంతాల్లో ఆరు మాసాల నుంచి మూడేళ్లలోపు పిల్లలు మూడున్నర లక్షల మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించి ఆ మేరకు జూన్ 20 నుంచి 26 వరకు ప్రత్యేకంగా ఐపీవీ వాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఓపీవీ స్థానంలో ఐపీవీ పరిచయం అప్పటి వరకు ఉన్న ఓరల్ పోలియో వాక్సిన్(ఓపీవీ) స్థాన ంలో (ఏప్రిల్ 25 నుంచి) కొత్తగా ఇన్ యాక్టివేటెడ్ పోలియో వాక్సిన్(ఐపీవీ) పోలియో ఇంజెక్షన్లను వైద్య ఆరోగ్యశాఖ అందుబాటులోకి తెచ్చింది. ప్రజల నుంచి ఆశించిన దానికంటే ఎక్కువ స్పందన రావడంతో వాక్సిన్ కొరత ఏర్పడింది. దీంతో అప్పటికప్పుడు జెనీవా, చెన్నై నుంచి వాక్సిన్ తెప్పించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐపీవీ ఇంజెక్షన్ల కొరత ఏర్పడింది. దీంతో నగరంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు తమ వద్దకు వచ్చిన పిల్లలకు ఇప్పటిMీ ఓరల్ పోలియో వాక్సిన్‌నే వేస్తున్నట్లు ఈ తాజా ఉదాంతంతో స్పష్టమైంది. పోలియో వైరస్ నాలాలో ఉన్నందున అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆ రోగ్యశాఖ స్పష్టం చేస్తోంది. -
పోలియో చుక్కలు, సూదిని వేయించాలి
నల్లగొండ టౌన్ : చిన్నారులకు పోలియో చుక్కలతో పాటు పోలియో సూదిని విధిగా వేయించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ డి.కిరణ్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎ.బాలనరేంద్ర అన్నారు. సోమవారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీహెచ్ఓలు, పీహెచ్‌సీల వైద్యాధికారులకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పుట్టిన ప్రతి ఒక్కరికి 24గంటల్లోపు పోలియో చుక్కలు, ఐపీ టైటీస్బీ టీకాలను వేయించాలన్నారు. నిర్ణీత ప్రణాళిక ప్రకారం ప్రతి బుధ, శనివారాల్లో జిల్లాలోని అన్ని ఉపకేంద్ర, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాల కార్యక్రమాలను నిర్వహించాలని, సంబంధిత వైద్యాదికారులు, పర్యవేక్షకులు పర్యవేక్షించాలని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 91శాతం పిల్లలకు అన్ని రకాల టీకాలు వేస్తుండగా ప్రైవేటు ఆస్పత్రుల్లో 9 శాతం మాత్రమే టీకాలను వేస్తున్నారని తెలిపారు. పుట్టిన ఏ బిడ్డ కూడా వికలాంగుడు కాకూడదని సరైన సమయంలో టీకాలను వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ అరుంధతి, పాఠశాల విద్య కార్యక్రమ అధికారి డాక్టర్ లలితాదేవి, జాతీయ ఆరోగ్య మిషన్ అధికారి డాక్టర్ కె.రామకృష్ణ, జిల్లా మలేరియా అధికారి ఓం ప్రకాశ్, ఉప మీడియా అధికారి ఆర్.తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. -
యువతి ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం: గోపవరం పంచాయతీ పరిధిలోని ఆచార్లకాలనీలో ఆదివారం సాయంత్రం గుర్రమ్మ (25) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. త్రీ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుర్రమ్మ బీఎస్సీ, బిఈడీ చదువుకుంది. ఆమెకు చిన్న తనంలోనే పోలియో వ్యాధి సోకింది. ఆమెకు అప్పుడప్పుడు మతిస్థిమితం కూడా సరిగా ఉండదు. బెంగుళూరు, మధురై ఆస్పత్రుల్లో చూపించినప్పటికీ నయం కాలేదు. తీవ్ర మనస్థాపానికి గురైన గుర్రమ్మ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. -
చేతులెత్తేశారు..
గందరగోళంగా పోలియో వ్యాక్సినేషన్ గుర్తించింది 2.5 లక్షలు.. వేసింది 3.16 లక్షలు వ్యాక్సిన్ కొరతతో మన్సూరాబాద్ కేంద్రానికి తాళం ఆస్పత్రి ముందు తల్లిదండ్రుల ఆందోళన సిటీబ్యూరో: నగరంలో ప్రతిష్టాత్మంగా చేపట్టిన పోలియో టీకాల కార్యక్రమం గందరగోళంగా మారింది. ఆరోగ్య కేంద్రానికి వచ్చే ఆఖరి బిడ్డ వరకు వ్యాక్సిన్ వేస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. వ్యాక్సిన్ లేక చేతులెత్తేసింది. బస్తీల్లోని పిల్లలను అంచనా వేయడంలోను, వ్యాక్సిన్ సరఫరాలోనూ వైద్య ఆరోగ్యశాఖ ఘోరంగా విఫలమైంది. టీకాల కోసం ప్రతిరోజు పలు ఆరోగ్య కేంద్రాల వద్ద భారీగా బారులు తీరుతున్నారు. ఆదివారం టీకాలు వేసేందుకు చివరి రోజుగా ప్రకటించడంతో వ్యక్తిగత పనులను వాయిదా వేసుకుని పిల్లలకు టీకాలు వేయించేందుకు తల్లిదండ్రులు భారీగా తరలి వచ్చారు. వ్యాక్సిన్ కొరత వల్ల కొన్నిచోట్ల పోలీసుల సహకారంతో పిల్లలకు టీకాలు వేస్తే, మరి కొన్ని చోట్ల పోలియో కేంద్రాలకు తాళాలు వేయాల్సిన దుస్థితి తలెత్తింది. దీంతో తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయాలంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం గుర్తించిన హైరి స్కు ప్రాంతాలతో పాటు దానికి ఆనుకుని ఉన్న బస్తీల్లో ఎంత మంది పిల్లలు ఉన్నారు? ఎంత మంది వ్యాక్సిన్ వేయిం చుకునే అవకాశం ఉంది? ఎంత సరఫరా చేయాలి? వ ంటి అంశాలను అధికారులు అంచనా వేయలేక పోయారు. ఇదిలా ఉం టే, హైరిస్కు జోన్లలో 2.5 లక్షల మంది పిల్లలను గుర్తించామని, వీరందరికీ టీకా లు వేశామని అధికారులు చెబుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లోని పిల్లలు టీకాలు వేయించుకోక పోయినా నష్టమేమీ లేదని స్పష్టం చేయడం గమనార్హం. అంచనాలో ఘోర విఫలం.. అంబర్‌పేట నాలాలో వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు నిర్థారణ కావడంతో ఆ ప్రాంతంతో ముడిపడి ఉన్న హైదరాబాద్ జిల్లాలోని 69 ఆరోగ్య కేంద్రాల పరిధిలోని అంబర్‌పేట, బార్కాస్, కంటోన్మెంట్, మలక్‌పేట్, కోఠి, లాలాపేట్, డబీర్‌పుర, జంగంమెట్, పానిపుర, సీతాఫల్మండి, సూరజ్భానులో ప్రభుత్వం 750 పోలియో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని 12 ఆరోగ్య కేంద్రాల పరిధిలోని కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, బాలానగర్, ఉప్పల్, నారపల్లి, కీసర, అబ్దుల్లాపూర్, సరూర్‌నగర్, బాలాపూర్‌లో 136 కేంద్రాలను ఏర్పాటు చేసింది. కంటోన్మెంట్ సహా ఈ 24 హైరిస్కు ప్రాంతాల్లో ఆరు వారాల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 2.50 లక్షల మంది ఉన్నట్టు గుర్తించారు. కేవలం ైెహ రిస్కు జోన్ల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పిల్లలు భారీగా పోటెత్తడంతో తొలి రెండు రోజుల్లోనే వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. దీంతో మరో లక్ష డోసులు అదనంగా తెప్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ పిల్లలను అంచనా వేయడంలోనే కాదు.. చివరకు వాక్సిన్ తె ప్పించడంలోనూ వైద్య ఆరోగ్యశాఖ ఘోరంగా విఫలమైంది. మన్సూరాబాద్ కేంద్రానికి తాళాలు వ్యాక్సిన్ కోసం పిల్లలతో మన్సూరాబాద్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి చేరుకున్న తల్లి దండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. వ్యాక్సిన్ లేకపోవడంతో స్థానికులు ఎక్కడ తమపై దాడి చేస్తారోనని భయపడిన సిబ్బంది కేంద్రానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. మన్సూరాబాద్ పట్టణ ఆరోగ్య కేం ద్రంలో రెండు రోజుల పాటు ప్రత్యేక క్యాంప్‌ను ఏర్పాటు చేశామని, ఇక్కడి వీకర్ సెక్షన్‌కాలనీ కమ్యూనిటీహాల్లో శనివారం రోజంతా కేంద్రం కొనసాగిం దని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ఆదివారం పోలియో ఇంజక్షన్ వేయాలనే ఆదేశం తమకు లేదని, అందుకే తాము టీకాలు వేయడం లేదని సిబ్బంది తెలి పారు. అంబర్‌పేట్‌లోని ప్రాధమిక ఆరో గ్య కేంద్రానికి స్థానిక పిల్లలతో పాటు ఉప్పల్, రామంతాపూర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి పోటెత్తడంతో వారిని నియంత్రించడం కష్టమై పోలీ సుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. -
అప్రమత్తం
పోలియో వైరస్‌పై వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్ నేటి నుంచి ప్రత్యేక ‘వ్యాక్సినేషన్’ డ్రైవ్ 24 ప్రాంతాల్లో ఇంటింటి సర్వే సిటీబ్యూరో:నగరంలోని అంబర్‌పేట నాలా మురుగు నీటిలో టైప్-2 పోలియో వైరస్ ఉన్నట్లు తేలడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. నివారణ చర్యలకు వెంట నే రంగంలోకి దిగింది. ఈ మేరకు సోమవా రం నుంచి నగరంలో వారం రోజుల పాటు ప్రత్యేక పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. కాగా వైరస్ ఉన్నట్లు నిర్ధారణైన 14 రోజుల్లో నివారణ చర్యలు చేపట్టాల్సి ఉండటంతో హైదరాబాద్ జిల్లా పరిధిలోని అంబర్పేట్, బార్కాస్, కంటోన్మెంట్, మలక్‌పేట్, కోఠి, లాలాపేట్, డబీర్‌పుర, జంగంమెట్, పానిపుర, సీతాఫల్మండి, సూరజ్భానులతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్, మల్కజ్గిరి, బాలానగర్, మల్కజ్గిరి, ఉప్పల్, నారపల్లి, కీసర, అబ్దుల్లాపూర్, సరూర్‌నగర్, బాలాపూర్‌లో ఇప్పటికే ఇంటింటి సర్వే నిర్వహించింది. ఆయా ప్రాంతాల్లోని ఆరు వారాల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇందుకు అవసరమైన వ్యాక్సిన్‌ను చెన్నై నుంచి తెప్పించి ఆయా ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచింది. ఆరు వారాల నుంచి మూడేళ్లలోపు వారంతా వేసుకోవాలి నోటి ద్వారా ఇచ్చే పోలియో వ్యాక్సిన్‌కు అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఎప్పుడో స్వస్తి పలికాయి. ప్రస్తుతం అక్కడ ఐపీవీ ఇంజక్షన్ ఇస్తున్నారు. మన దేశంలో కూడా దీన్ని అమలు చేస్తున్నారు. ఇంజక్షన్‌పై అనవసర అపోహలు పెట్టుకోవద్దు. పుట్టిన ఆరు మాసాల పిల్లల నుంచి మూడేళ్లలోపు పిల్లలందరూ టీకాలు వేయించుకోవాలి. కుడి చేతికి పాయింట్ వన్ ఎంఎల్ ఇంజక్షన్ ఇస్తారు. - డాక్టర్ ప్రసన్న, ఇన్చార్జి, జిల్లా చిన్నపిల్లల వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అపోహలు వద్దు ఇప్పటి వరకు ఓరల్ వ్యాక్సిన్‌కు అలవాటు పడిన వారు అకస్మాత్తుగా ఇంజక్షన్ అంటే కొంత భయపడటం సహజమే. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్‌పై అపోహలు అసలే వద్దు. ఐపీవీ వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్ రూపంలో చిన్న పిల్లలకు ఇస్తున్నందున సహజంగా కొద్దిపాటి నొప్పి ఉంటుంది. అలాగే చిన్న దద్దుర్లు వస్తాయి. అంతేకానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. - ప్రొఫెసర్ రమేష్ దాంపురి, నిలోఫర్ ఆస్పత్రి -
కన్నతండ్రే కాళ్లయ్యాడు..
‘నన్ను 20 ఏళ్లుగా తన భుజస్కంధాలపై మోస్తున్నాడు నాన్న. ప్రస్తుతం ఐసెట్ రాశాను. గ్రూప్-2కి ప్రిపేర్ అవుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి నా కోసం సర్వం ధారపోసిన తండ్రి రుణం తీర్చుకుంటానంటోం’ది తేజస్విని. రాంనగర్‌లోని బాప్టిస్టు చర్చి సమీపంలో నివాసముండే ముజ్జి వెంకటేశ్వరరావు, రమాదేవిల కూతురు తేజస్విని. ఈమెకు పుట్టుకతోనే పోలియో సోకడం తో కదల్లేని పరిస్థితి. కాలు ఇంటి బయట పెట్టాలన్నా సపోర్ట్ కావాల్సిందే. చిన్నప్పుడు హయత్‌నగర్‌లోని ఓ స్కూల్లో చదువుకున్నప్పుడు తల్లిదండ్రులు ఆమెను రోజూ స్కూల్లో వదిలి వచ్చేవారు. రాంనగర్ సెయింట్ పాయిస్లో ఇంటర్ చేసినప్పుడు తరగతి గది మూడో అంతస్తులో ఉండటంతో తండ్రి వెంకటేశ్వరరావు కూతురును ఎత్తుకొని వెళ్లి, ఎత్తుకొచ్చేవారు. రెండేళ్లు రోజూ ఇదే విధంగా చేశారు. మారేడ్‌పల్లిలోని కస్తూర్భా మహిళా డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో చదివినప్పుడు మూడేళ్లు కూడా తరగతి గదిలో కూర్చోబెట్టి వచ్చేవారు. అన్ని పనులు మానుకొని కూతురికే అత్యధిక సమయం వెచ్చించడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోయింది. అయినా పట్టించుకోలేదు. ఆమె కోసం ఆటో కొని అందులో పాపను తీసుకువెళ్లి, తీసుకొచ్చేవారు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా పాపను తన భుజాలపై మోసుకుంటూ తరగతి గదిలో కూర్చొబెట్టిన వెంకటేశ్వరరావును కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ‘బీయింగ్ ఎగ్జామ్ప్లరీ పేరెంట్స్’ పేరుతో సత్కరించారు కూడా. -
‘పోలియో’ పోరు!
నేరుగా నాడీ మండలంపై దాడిచేసి పసిపిల్లలను పక్షవాతానికి గురిచేసే ప్రమాద కరమైన పోలియో వైరస్ మళ్లీ హైదరాబాద్ నగరంలో కనబడిందన్న వార్తలు అందరినీ కలవరపరిచాయి. మన దేశంలో అయిదేళ్లక్రితం చివరి పోలియో కేసు నమోదైంది. మూడేళ్ల తర్వాత అంటే...2014లో భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పోలియో రహిత దేశంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం ఆందోళన కలిగించింది. అందువల్లే డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో మకాం వేసి నేరుగా దీన్ని పర్యవేక్షిస్తోంది. ఈ నెల20 నుంచి ఆరు రోజులపాటు 3 లక్షలమంది పిల్లలకు వ్యాక్సిన్ అందించే ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణను ప్రారంభించ డంతోపాటు మూడు లక్షల డోసుల ఇంజక్షన్లను తెప్పించారు. అయితే ఇదంతా ముందుజాగ్రత్తలో భాగం మాత్రమేనని అధికారుల వివరణ. ఇప్పుడు గుర్తించిన పోలియో వైరస్ అంత ప్రమాదకారి కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంటున్నది. ఇప్పటికీ మనది పోలియో రహిత దేశమేనని చెబుతున్నది. నిజానికి ఇప్పుడు హైదరాబాద్‌లో బయటపడింది తొలి ఉదంతం అనుకోనవసరం లేదు. 2014 తర్వాత దేశంలో ఈ మాదిరి కేసులు నాలుగు బయటపడ్డాయి. అయితే అవి ప్రమాదకరం కానివని తేల్చారు. కలుషిత జలాలు, కలుషిత ఆహారమూ, అపరిశుభ్ర పరిసరాలూ కారణంగా వ్యాపించే ఈ వ్యాధికి శతాబ్దాల చరిత్ర ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది పిల్లలు దీనిబారిన పడి అంగవైకల్యానికి గురయ్యేవారు. చిన్నతనంలోనే కన్ను మూసేవారు. 2000 సంవత్సరంనాటికల్లా భూగోళంనుంచి పోలియోను శాశ్వ తంగా నిర్మూలించాలని 1988లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశం సంకల్పిం చింది. అయితే గడువులోగా ఆ లక్ష్యాన్ని సాధించడం ఓపట్టాన సాధ్యం కాలేదు. ఎన్నో ప్రయత్నాలు...అందులో అనేక వైఫల్యాలు ఎదురుకావడం, వాటినుంచి ఎప్పటికప్పుడు గుణపాఠం తీసుకుని కదలడం పర్యవసానంగానే పోలియో నిర్మూ లన సాధ్యమైంది. ఇంత కృషీ విఫలమై పరిస్థితి మొదటికొస్తుందంటే ఎవరికైనా ఆందోళనకరమే. ఇప్పుడు బయటపడ్డ పోలియో వైరస్‌పై భిన్న కథనాలున్నాయి. ఈ వ్యాధి రాకుండా వాడే చుక్కల మందు వ్యాక్సిన్‌ను తీసుకున్న మనిషి శరీరంనుంచి వెలువడిన వైరస్ మురుగు నీటిలో కలిసి ఉంటుందని అధికారుల అంచనా. అయితే ఈ వైరస్‌కు పోలియో వ్యాధిని కలిగించే శక్తి లేదని కూడా వారంటున్నారు. వాస్తవానికి అత్యంత ప్రమాదకరమైన రకం వైరస్‌ను 1999లో చివరిసారిగా గుర్తించారని చెబుతున్నారు. దీన్ని అంత తేలిగ్గా తీసుకోలేమన్నది నిపుణుల మాట. రోగ నిరోధక శక్తి తక్కువుంటే, పౌష్టికాహార లేమితో బాధపడుతుంటే దీని ప్రభావం నుంచి తప్పించుకోవడం సులభం కాదని వారి అభిప్రాయం. కనుక నిరుపేద వర్గాలు నివసించే ప్రాంతాల్లోని పిల్లలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని పోలియో వ్యాక్సిన్‌ను అందించడం, వారికి పౌష్టికాహారాన్ని సమకూర్చడం తక్షణావసరం. మన దేశంలో పోలియో నిర్మూలన ఇతర రాష్ట్రాల్లో ఏదో మేర విజయవం తమైనా ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు మాత్రం సమస్యాత్మకంగా ఉండేవి. వాస్త వానికి దేశంలో బయటపడే కేసుల్లో 95 శాతం ఆ రాష్ట్రాల్లోనే ఉండేవి. అసలు పోలియో వైరస్ నిర్మూలనకు ఉపయోగించే వ్యాక్సిన్ల తయారీ పెద్ద చిక్కుముడిగా ఉండేది. పోలియో వైరస్‌పై శాస్త్రవేత్తలు సాగించిన సమరం ఎన్నదగినది. చెప్పా లంటే అది శాస్త్రవేత్తలతో దాగుడుమూతలాడింది. వారిని ముప్పుతిప్పలు పెట్టింది. ఒక రకం వైరస్ నిర్మూలనకు ఉపయోగించే వ్యాక్సిన్ ఇతర రకాల వ్యాక్సిన్లను ప్రభావరహితం చేసేది. పర్యవసానంగా ఒక వైరస్ ద్వారా వ్యాపించే వ్యాధిని అరికట్టామనుకునే లోగానే మరో రకం వైరస్ పసివాళ్లను రోగగ్రస్తం చేసేది. ఆ వైరస్ల నిర్మూలన పెను సమస్యగా మారేది. దీన్నొక సవాలుగా తీసుకున్న శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా ప్రయోగాలు చేసి ఎట్టకేలకు మెరుగైన వ్యాక్సిన్ల రూపకల్పనలో విజయం సాధించగలిగారు. వ్యాక్సిన్ల తయారీ ఒక ఎత్తయితే వాటిని గడప గడపకూ తీసుకెళ్లడం మరో ఎత్తు. అన్ని మాధ్యమాల ద్వారా దాన్ని పెద్దయెత్తున ప్రచారం చేయడం, ప్రకటనలివ్వడం, సెలబ్రిటీలతో చెప్పించడం వగైరాలన్నీ ఫలితమిచ్చాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, బడులు... అన్నీ పోలియో మందు ఇవ్వడానికి కేంద్రాలయ్యాయి. పోలియో మహమ్మారిపై బహుముఖాలుగా సాగించిన యుద్ధంలో అందరూ సైనికులయ్యారు. కనుకనే ఆ వైరస్‌పై ఘన విజయం సాధించడం సాధ్యమైంది. అయితే పోలియో మహమ్మారి విషయంలో అత్యంత జాగరూకతతో వ్యవ హరించాలని డబ్ల్యూహెచ్ఓ ఎప్పటికప్పుడు అన్ని దేశాలనూ హెచ్చరిస్తూనే ఉంది. రెండో రకం పోలియో వైరస్‌ను పూర్తిగా నిర్మూలించినందువల్ల మూడు రకాల పోలియో వైరస్‌లతో కూడిన టీకానుంచి ఆ రకాన్ని పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం ఒకటి, మూడు రకాల వైరస్‌లున్న చుక్కల మందును అమల్లోకి తెచ్చారు. దీంతోపాటే పోలియో టీకాను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ దశలో రెండో రకం పోలియో వైరస్ బయటపడింది. ఈ వైరస్ ప్రమాదరహితమైనదే అనుకున్నా... ఇతరత్రా మార్గాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌లలో ఈ ఏడాది 16 పోలియో కేసులు బయటపడ్డాయి. ఆ రెండు దేశాలకూ రాకపోకలు ఉంటున్నాయి గనుక అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక బంగ్లాదేశ్ అనుభవం మరింత ఆందోళనపరిచేది. అక్కడ పసిపిల్లలకు అందించే చుక్కల మందు 43 శాతంమందిలో మాత్రమే ఫలితాన్నిస్తున్నదని నాలుగేళ్లక్రితం గుర్తిం చారు. యూరప్‌లో 95 శాతం మందిని మెరుగుపరుస్తున్న వ్యాక్సిన్ ఇక్కడ ఎందుకు పనిచేయడం లేదన్న ప్రశ్నలు తలెత్తాయి. ఎన్నో పరిశోధనల తర్వాత పౌష్టికాహార లోపం, రోగనిరోధక శక్తి లేకపోవడం కారణమని తేల్చారు. ఇలాంటి ఉదంతాలన్నీ పోలియో వ్యాక్సిన్లు, ఇంజక్షన్లపైన మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తే సరిపోదని... నిరుపేద వర్గాల చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందించడం లోనూ శ్రద్ధవహించాలని చాటిచెబుతున్నాయి. అన్నిరకాలుగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. హైదరాబాద్‌లో వెల్లడైన కేసు ఆ దిశగా కార్యా చరణకు పురిగొల్పుతుందని ఆశించాలి. పోలియో నిర్మూలనకు కొత్త లక్ష్యాలంటూ ఏవీ ఉండవు. ఉన్న లక్ష్యం పట్ల అప్రమత్తతగా ఉండటమే అవశ్యం. - వైరా ష్కిబ్ నర్ చెకొస్లొవేకియా ప్రొఫెసర్ -
కూతురి మూగవేదన చూడలేక...
నార్కట్‌పల్లి : పోలియో, మూగవేదనతో కన్న కూతురు పడుతున్న బాధను చూడలేక కూతురిని చంపి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ తల్లి. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు స్థానికుల కథనం ప్రకారం.. మునుగోడు మండల కేంద్రానికి చెందిన నాగరోని వెంకటేశ్వర్లు, కల్పన (అలియాస్) పారిజాత దంపతులకు కుమార్తె సుమశ్రీ (9), ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. సుమశ్రీ పుట్టుకతోనే పోలియో బారిన పడడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. అంతే కాకుండా పుట్టు మూగ. ఐదేళ్ల క్రితమే వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కల్పననే వారి ఆలనాపాలన చూస్తోంది. కల్పన మూడేళ్లుగా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. సుమశ్రీని బాగు చేయించేందుకు ఆమె ఎన్నో ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేదు. ఇటీవల తిరుపతిలో ఆయుర్వేదిక్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లినా నయం కాదని చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి కల్పన సోమవారం సాయంత్రం కూతురిని తీసుకుని ఇంటి నుంచి బయలుదేరి నార్కట్‌పల్లి మండలం వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న రైలు పట్టాల వద్దకు చేరుకుంది. రాత్రి తొమ్మిది గంటల వరకు ఒక్క రైలు కూడా రాకపోవడంతో బ్లేడుతో కూతురు గొంతు గోసి, ఆపై తాను కూడా చేయి, గొంతు కోసుకుంది. విషయాన్ని తన మామ బక్కయ్యకు ఫోన్లో సమాచారం ఇచ్చింది. వారు 108 కు సమాచారం ఇవ్వగా వారిద్దరిని కామినేని ఆస్పత్రికి తరలించారు. విషమ పరిస్థితిలో ఉన్న సుమశ్రీని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి కల్పన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
వరంగల్ టు బల్లార్షా..
రైళ్లలో చిన్నారులకు పోలియో చుక్కలు వరంగల్ రైల్వేస్టేషన్ ఆరోగ్యాధికారి మీనా వెల్లడి రైల్వేగేట్ : పోలియో రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా వరంగల్ రైల్వే ఆరోగ్యాధికారి(హెల్త్ ఇన్స్పెక్టర్) బబ్లూరాం మీనా ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. వరంగల్ స్టేషన్ మీదుగా వెళ్తున్న రైళ్లలోని ప్రయాణికుల పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని నిర్ణయించారు. దీనికోసం ఆదివారం ఉదయం వరంగల్ రైల్వేస్టేషన్‌కు వచ్చిన అలహాబాద్ - త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్ రైలులో వరంగల్ నుంచి బల్లార్షా వరకు తన బృందంతో వెళ్లారు. ఈ సందర్భంగా ప్రతీ బోగీలోని ఐదేళ్ల లోపు పిల్లలకు చుక్కలు వేసినట్లు బబ్లూరాం తెలిపారు. -
పోలియో శాశ్వత నిర్మూలనకు వ్యాక్సిన్
- శాంతా బయోటెక్ లిమిటెడ్ రూపకల్పన - యునిసెఫ్ ద్వారా దేశ వ్యాప్తంగా సరఫరా - వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: పోలియో నిర్మూలనకు శాంతా బయోటెక్ లిమిటెడ్ తయారు చేసిన షాన్-ఐపీవీని (ఇనాక్టివేటేడ్ పోలియో వ్యాక్సిన్ - దీనిని ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పోలియో పునరావృతం కాకుండా ఉండేందుకు సురక్షితమైన ఈ వ్యాక్సిన్‌ను రూపొందించినట్లు కంపెనీ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం కంపెనీ ప్రతినిధులు సచివాలయంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా మొదటి శాంపిల్‌ను కేసీఆర్ యునిసెఫ్ ప్రతినిధులకు అందించారు. ఈ వ్యాక్సిన్‌ను రూపొందించినందుకు శాంతా బయోటెక్ కంపెనీని ముఖ్యమంత్రి అభినందించారు. పోలియో శాశ్వత నిర్మూలన లక్ష్యంగా ఈ వ్యాక్సిన్ పని చేస్తుందని, బిడ్డకు 14 వారాల వయసులో దీనిని ఇస్తారని, ఇప్పుడు వేస్తున్న పోలియో చుక్కలకు ఇది అదనమని, అయిదేళ్ల పాటు శ్రమించి దీన్ని రూపొందించామని వరప్రసాద్‌రెడ్డి సీఎంకు వివరించారు. వ్యాక్సిన్ తయారీలో ఫ్రెంచి కంపెనీ నుంచి శాస్త్రీయ సహకారం తీసుకున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ వ్యాక్సిన్ ధర ఒక యూనిట్‌కు రూ.1,050 ఉందని, తమ కంపెనీ మాత్రం యునిసెఫ్‌కు కేవలం రూ.55 చొప్పున సరఫరా చేస్తుందన్నారు. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలకు యునిసెఫ్ ద్వారా కేంద్రం తమ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తుందన్నారు. రాష్ట్రానికి ఉచిత సరఫరా.. ఈ వ్యాక్సిన్‌ను తెలంగాణకు యునిసెఫ్ ఉచితంగా అందిస్తుందని వరప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ తయారీ రాష్ట్రానికి గర్వ కారణమని కేసీఆర్ ప్రశంసించారు. ఇప్పటికే ఈ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్‌ను 25 లక్షల డోస్‌ల కొనుగోలుకు యునిసెఫ్ ముందుకొచ్చిందని, ఏపీ, తెలంగాణకు ఉచితంగా అందించనుందని సీఎం పేర్కొన్నారు. తక్కువధరలో వ్యాక్సిన్స్, ఇన్సులిన్ తయారీలో శాంతా బయోటెక్ అద్భుతమైన పనితీరును కనబరుస్తోందని కొనియాడారు. కాగా, మేడ్చల్ సమీపంలోని తమ యూనిట్‌కు నీటి సరఫరా సమస్యను పరిష్కరించాలని వరప్రసాద్‌రెడ్డి సీఎంకు విజ్ఞప్తి చేశారు. వీలైనంత తొందరగా నీటి సరఫరాను పునరుద్ధరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను సీఎం ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు సీఎస్ రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, హెల్త్ కమిషనర్ బుద్ధ ప్రకాశ్, యునిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్ సోని కుట్టి జార్జ్ పాల్గొన్నారు. -
'ధ్యానం, ఆరోగ్యాన్ని వేటితో ముడిపెట్టవద్దు'
భిన్న మతాలు, సంస్కృతులకు నిలయమైన భారత్‌లో ఎన్నో ఆచారాలు ఉన్నట్లే భిన్న నమ్మకాలున్నాయి... అయితే, ఈ విషయాలు ఆరోగ్యం, ధ్యానం లాంటి వాటికి అవరోధాలు కాకుడదని బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ అభిప్రాయపడ్డారు. పోలియోపై నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టార్తో పాటు బిగ్ బీ పాల్గొన్నారు. పోలియో మహమ్మారి వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టీకా మందుల గురించి వివరించేందుకు రెండు మొబైల్ వాహనాలను ప్రారంభించారు. పోలియో నిర్మూలనలో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కొన్ని వర్గాల ప్రజలు తమ నమ్మకాల కారణంగా యోగా చేయడం లేదన్న విషయాన్ని గుర్తించారు. భారత్ అన్నది అన్ని వర్గాల సమాహారం. ధ్యానం చేయడానికి ప్రతిఒక్కరూ అంగీకరించే విధంగా కొత్త రకం ఏర్పాటుచేయాలని భావిస్తే ఏలా అని పేర్కొన్నారు. టీబీ లేని హర్యానా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పోలియో చుక్కలు ఎవరైనా వేసుకోవచ్చని, వీటిని ఏ అంశాలతోనూ ముడిపెట్టవద్దని సూచించారు. టీబీతో తాను పోరాడుతున్నానని, 2000లో దీన్ని గుర్తించినప్పటి నుంచి ఇలాంటి అంశాలపై నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలని వాటి గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని భావించినట్లు బిగ్ బీ చెప్పుకొచ్చారు. -
కన్న తండ్రేనా?
ఐదు రోజుల ఆడ పిల్లను వదిలించుకునే యత్నం మూసీకాల్వలో పడేసేందుకు పన్నాగం ఇతనో ప్రభుత్వ ఉద్యోగి ఉప్పల్: పొత్తిళ్ల బిడ్డను కడతేర్చాలని చూశాడు ఈ తండ్రి. తల్లికి తెలియకుండానే కడతేర్చాలనుకున్నాడు. ఆడ పిల్ల పుట్టిందని అందులోనూ అవిటిది (పోలియో) అయిందని గ్రహించిన ఆ తండ్రి ఎలాగైనా బిడ్డను వదిలించుకోవాలని యత్నించాడు. ఐదు రోజుల బిడ్డను గుట్టు చప్పుడు కాకుండా తల్లి పొత్తిళ్ల నుంచి తీసుకొచ్చి ఉప్పల్ ఏషియన్ థియేటర్ ఎదురుగా గల నాలాలో పడేయడానికి ప్రయత్నిస్తూ స్థానికులకు పట్టుబడ్డాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.. ప్రకారం.. సరూర్‌నగర్ కర్మాన్‌ఘాట్‌కు చెందిన జిల్లా జగదీశ్వర్(35) నాంపల్లి ఎలక్ట్రికల్ విభాగంలో జూనియర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. భార్య ప్రతిమ(30) వీరికి ఒక బాబు ఉన్నాడు. ఈ నెల 21న ప్రసవం కోసం చైతన్యపురిలోని స్వప్న ఆస్పత్రిలో చేరింది. అదే రోజు ఆడపిల్లకు జన్మనిచ్చింది. పిల్ల అవిటిగా (పోలియో ఎఫెక్ట్‌తో) పుట్టడంతో ఎలాగైనా వదిలించుకుందామనుకున్నాడు ఆ తండ్రి. ఆదివారం సాయంత్రం బిడ్డను ఆస్పత్రి నుంచి తీసుకొని బస్సులో ఉప్పల్ ఏషియన్ థియేటర్‌కు చేరుకున్నాడు. పొత్తిళ్ల బిడ్డను మూసీ కాల్వలో పడేయడానికి తండ్రి జగదీశ్వర్ ప్రయత్నిస్తుండగా ఈ విషయాన్ని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి పసిగట్టి 100కి ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఆ లోపు స్థానికులను పోగు చేసిన ఆ ఉద్యోగి అతడ్ని పట్టుకొని పోలీసులు వచ్చే వరకు నిలువరించారు. పోలీసులు వచ్చి బిడ్డను స్వాధీనం చేసుకొని తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. -
వైకల్యంతో పుట్టిందని.. కడతేర్చాలని చూశాడు
హైదరాబాద్: ఐదు రోజుల పసికందును కడతేర్చాలని చూశాడో కసాయి దండ్రి. తల్లికి తెలియకుండానే కడతేర్చాలని చూశాడు. ఆడ పిల్ల పుట్టిందని అందులోను అవిటి (పోలీయో) అయిందని గ్రహించిన ఆ తండ్రి ఎలాగైనా బిడ్డను వదిలించుకుందామనుకున్నాడు. ఐదు రోజుల బిడ్డను గుట్టు చప్పుడు కాకుండా తల్లి పోత్తిళ్ల నుంచి తీసుకొచ్చి ఉప్పల్ ఏషియన్ థియేటర్ ఎదురుగా గల నాలాలో పడేయడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం.. సరూర్‌నగర్ కర్మాన్‌ఘాట్‌కు చెందిన జిల్లా జగదీశ్వర్(35) నాంపల్లి ఎలక్ట్రికల్ విభాగంలో జూనియర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. భార్య ప్రతిమ(30) వీరికి ఒక బాబు ఉన్నాడు. కాగా ఈ నెల 21వ తేదీన ప్రసవం కొరకు చైతన్యపురిలోని స్వప్న ఆస్పత్రిలో జాయిన్ అయింది. అదే రోజు ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటి నుండి ఆడపిల్ల అవిటిగా (పోలీయో ఎఫెక్ట్) తో పుట్టడంతో ఎలాగైనా వదిలించుకుందామనుకున్నాడు ఆ తండ్రి. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం బిడ్డను ఆస్పత్రి నుండి తీసుకొని బస్సులో ఉప్పల్ ఏషియన్ థియేటర్‌కు చేరుకున్నాడు. పొత్తిళ్ల బిడ్డను మూసి కాలువలో పడేయడానికి తండ్రి జగదీశ్వర్ ప్రయత్నిస్తుండగా ఈ విషయాన్ని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి పసిగట్టి 100కి ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఆ లోపు స్థానికులను పోగు చేసిన ఉద్యోగి అతడిని పట్టుకొని పోలీసులు వచ్చేవరకు నిలువరించాడు. పోలీసులు వచ్చి బిడ్డను స్వాధీనం చేసుకొని తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. -
మరోసారి పోలియో పడగ
కీవ్: ఉక్రెయిన్‌లో రెండు పోలియో కేసులు నమోదయ్యాయి. ఓ పదేళ్ల బాలికకు, నాలుగేళ్ల చిన్నారికి పోలియో సోకినట్లు ఉక్రెయిన్ వైద్యాధికారులు ధృవీకరించారు. దీంతో గత 2010 నుంచి ఇప్పటి వరకు యూరప్‌లో తొలి పోలియో కేసు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ హెచ్ఓ) తెలిపింది. కాగా, చిట్టచివరిగా ఉక్రెయిన్‌లో మాత్రం 1996లో పోలియో కేసు నమోదైనట్లు వెల్లడించింది. తాజాగా నమోదైన రెండు కేసులు కూడా ఉక్రెయిన్‌లోని జకర్పాట్యా ప్రాంతానికి చెందినవి. దీంతో ఆ ప్రాంతంలో మరోసారి పోలియో నివారణ చర్యలకు కోసం తామే ప్రత్యేకంగా శ్రద్ధ వహించినట్లు డబ్ల్యూ హెచ్ఓ తెలిపింది. ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో వ్యాక్సిన్ చేరవేయడంలో నిర్లక్ష్యం వహించడంతోపాటు పంపించే ప్రాంతాలకు కూడా తక్కువ మోతాదులో పంపించడం వల్లే తాజాగా పోలియో వైరస్ బయటకు రావడానికి కారణమైందని వెల్లడించింది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు పోలియో రహిత దేశాలుగా నమోదవ్వగా తాజాగా తలెత్తిన పరిస్థితి మరోసారి పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. -
తూటాలకు భయపడక ...
కాబూల్: ఆమె తాలిబన్ల బెదిరింపులకు తలొగ్గడం లేదు. గుండె నుంచి తూటాలు దూసుకుపోయిన ఫర్వాలేదన్న నిబ్బరం ఆమెది. తాలిబన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పాకిస్థాన్ వీధుల్లో ఆమె ఇల్లిల్లూ తిరుగుతూ పోలియో నివారణకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఆమె పాకిస్తాన్‌కు చెందిన నర్సు. పేరు ఫర్హీనా తౌసీఫ్. ముగ్గురు చిన్న పిల్లల తల్లి. పాక్‌లో మళ్లీ విజృంభిస్తున్న పోలియో వ్యాధిని ఎలాగైనా అరికట్టాలన్న తాపత్రయం ఆమెది. మూడేళ్ల క్రితం పాకిస్తాన్లో పోలియో దాదాపు అదుపులోకి వచ్చింది. ఆ సమయంలోనే పోలియో వ్యాక్సినేషన్ చేయడం వెనుక ‘పాశ్చాత్య దేశాల కుట్ర’ ఉందని, పోలియో చుక్కల పేరిట ప్రమాదకరమైన జీవ రసాయనాన్ని ఎక్కిస్తున్నారని తాలిబన్లు ఆరోపిస్తూ పాక్‌లో ఈ కార్యక్రమాన్ని నిషేధించారు. 2011లో అమెరికా సీఐఏ ఏజెంట్లు, ఒసామా బిన్ లాడెన్ జాడ కనిపెట్టడం కోసం పోలియో ఆరోగ్య కార్యకర్తల ముసుగులో పాక్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని సీఐఏనే స్వయంగా ధ్రువీకరించడం గమనార్హం. ఈ విషయం కనిపెట్టిన తాలిబన్లు, అర్థరహిత ఆరోపణలతో నిషేధాన్ని విధించారు. అప్పటి నుంచి దేశంలో పోలియో చుక్కలు వేస్తూ హెల్త్ వర్కర్లు ఎవరు కనిపించినా నిర్ధాక్షిణ్యంగా కాల్చేస్తున్నారు. ఈ మూడేళ్లలో 80 మందిని తాలిబన్లు కాల్చేశారు. రెండేళ్ల క్రితం ఫర్హీనా కళ్ల ముందే ఆమె సహచర నర్సులిద్దరిని తాలిబన్లు కాల్చేసిన ఆమె తన కర్తవ్యాన్ని వదిలిపెట్టలేదు.తన నాయకత్వంలోని బృందంతో పాక్‌లో పోలియో నివారణకు విశేషంగా కృషి చేస్తోంది. గత రెండేళ్లలో ఆమె బృందం దేశంలో 322 పోలియో కేసులను గుర్తించింది. ఉద్యోగానికి రాజీనామా చేయమంటూ భర్త ఎంతో గొడవ చేస్తున్నా ఆమె మాత్రం తన నర్సు ఉద్యోగానికి రాజీనామా చేయడం లేదు. ‘మీకేమైనా అయితే మీ పిల్లలు ఏమవుతారు’ అని ఆమెను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ‘అలా జరగకుండా ఉండాలనే నా ఆశ' నా ప్రాణాలకు ముప్పున్న మాట వాస్తవమే. నా పిల్లలతోటి పిల్లలను రక్షించడం నా బాధ్యత. పాక్ నుంచి పోలియోను పూర్తిగా నిర్మూలించేవరకు నేను కృషి చేస్తా. ఆ తర్వాత సమయం ఉంటే నా పిల్లలకు, మా వారికి సమయం కేటాయిస్తా’ అని ఫర్మీనా వ్యాఖ్యానించారు. ఆమెపై ప్రత్యేక కథనాన్ని శనివారం రాత్రి ఏడున్నర గంటలకు బ్రిటీష్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌క్యాస్టింగ్ టెలివిజన్ ‘ఛానల్-4’ ప్రసారం చేసింది. -
పోలియోవేటు
-
ఉషని కాదు... కిరణ్‌ని...
రెండు కాళ్లూ చచ్చుబడిపోయినా, ఆత్మబలంతో అంగవైకల్యాన్ని జయించడమే కాకుండా, సమాజంలోని అభాగ్యులెందరికో అండగా నిలిచి పొరుగు రాష్ట్రాల్లో సైతం అంగవికలుర హక్కుల కోసం పోరాడుతున్నారు కిరణ్ అలియాస్ ఉష. కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న ఓ సామాజిక కార్యక్రమానికి రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమితులై దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఉష... ఇటీవలే తన స్వస్థలమైన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామ శివారులోని హనుమాన్తండాకు వచ్చివెళ్లారు. ఆ సందర్భంగా సాక్షితో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె (అతడి) మాటల్లోనే... అబ్బు వెంకట్‌రెడ్డి, సాక్షి, నర్సంపేట మా అమ్మనాన్నలది కూలి పని చేస్తేగానీ పూటగడవని పరిస్థితి. నాకు ఒక అక్క, తము్మడు, చెల్లి. ఊహ తెలియక ముందే నా రెండు కాళ్లూ పోలియో వచ్చి చచ్చుబడిపోయూయి.బడికి పోవాలనే కోరిక బలంగా ఉండేది. కానీ ఎవరో ఒకరు ఎత్తుకుని తీసుకెళ్లనిదే బయటికి కదల్లేను కదా. తొలిసారి నా ఎనిమిదవ యేట బడికి వెళ్లాను. అది కూడా నేను బడికి పోతానని ఏడిస్తే కానీ అమ్మానాన్నలు ఒప్పుకోలేదు. మా తండా పక్క గ్రామంలో ఉన్న పాఠశాలకు నా స్నేహితుల సహకారంతో కష్టపడుతూ వెళ్లి పాఠాలు నేర్చుకున్నా. అమ్మ కన్నీళ్లే... నా పోరాటానికి ప్రేరణ అప్పుడు నాకు తొమ్మిదేళ్లు. వికలాంగుల సర్టిఫికెట్ ఉంటే ప్రభుత్వం నుంచి లబ్ది చేకూరుతుందని అందరూ అంటే అమ్మ నన్ను ఎత్తుకుని, నియోజకవర్గ కేంద్రమైన నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ పొద్దంతా ఉన్నా సర్టిఫికెట్ ఇవ్వలేదు. జిల్లా కేంద్రంలోని ఎంజీఎంలో తీసుకోండని చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్లకుండా సాయుంత్రం నర్సంపేట నుండి వరంగల్‌కు నన్ను అవ్ము తీసుకెళ్లింది. అక్కడ అప్పటికే సమయుం అయిపోయిందని, ఇప్పట్లో ఇవ్వలేమని అధికారులు చెప్పడంతో అక్కడి నుండి ఇంటికి వెళ్లి మరోరోజు వచ్చేందుకు బస్సు చార్జీలు లేక అమ్మ నన్ను తన ఒడిలో ఉంచుకుని ఆస్పత్రి ముందు ఉన్న ఫుట్‌పాత్‌పై రాత్రంతా చలిలో ఒణుక్కుంటూ, తనకు దోమలు కుడుతున్నా తన కొంగును నాపై కప్పి నిద్రపోకుండా మేల్కొనే ఉంది. తెల్లవారిన తర్వాత అమ్మ మళ్లీ ఆస్పత్రిలోకి వెళ్లి ఎవరెవరినో బతిమిలాడినా వికలాంగ సర్టిఫికెట్ రాలేదు. ఇక సాధ్యం కాదని నన్ను ఎత్తుకుని, ఏడ్చుకుంటూ ఇంటిబాట పట్టింది. అప్పుడే అమ్మను అడిగాను... ‘‘ఎందుకవ్మూ సర్టిఫికెట్? మనకెందుకు ఇస్తారవ్మూ? అని. ‘గవర్నమెంటోళ్లు మనకు ఇవ్వాలని రూల్ ఉన్నా ఇత్తలేరు బిడ్డా’ అని అమ్మ చెప్పిన మాటలు నాకింకా గుర్తే. అప్పుడే ఎలాగైనా సర్టిఫికెట్ పొందాలని నాలో సంకల్పం కలిగింది. వారం రోజుల తర్వాత నర్సంపేటలో క్యాంపు పెట్టినప్పుడు నేను వెళ్లాను. అక్కడ కొన్ని సాకులతో అధికారులు తప్పించుకునేందుకు చూస్తే, ఎదిరించి ఎందుకు ఇవ్వరంటూ వాళ్ల ముందు కూర్చోని గట్టిగా అరిచాను. నా అరుపులకు విలేకరులు, విద్యార్థులు, మరికొంత మంది నా దగ్గరికొచ్చి ఏమైందని ప్రశ్నించారు. నాకు సర్టిఫికెట్ ఇవ్వడంలేదని, చెప్పి ఇప్పించాలని వేడుకున్నా. సాయుంత్రం లోగా వికలాంగ సర్టిఫికెట్ నా చేతిలోకి వచ్చింది! అప్పుడే అనుకున్నా... పోరాడితే న్యాయుం జరుగుతుందని. నాటి నుండీ... నేను నడవలేని స్థితిలో ఉన్నా... నలుగురికి సహాయుం చేయూలనే లక్ష్యంతో వరంగల్ జిల్లాలో ప్రజ్వల వికలాంగుల పోరాట సంక్షేమ సంఘాన్ని ఏర్పరచి 2000 మందికి వారి హక్కుల సాధన కోసం సహాయుకురాలిగా ఉద్యమాలు నిర్వహించాను. అదే స్పూర్తి నేటికీ నన్ను ముందుకు నడిపిస్తోంది. అమ్మాయినే పెళ్లి చేసుకున్నా ఊళ్లో ప్రాథమిక విద్య అయ్యాక, ఇంటర్, డిగ్రీ నర్సంపేటలో పూర్తి చేసాను. ఆ సమయుంలో తోపుడు బండిపై ఎక్కడకు వెళ్లాలన్నా నా స్నేహితురాలి వల్లనే సాధ్యం అయింది. నేను ఆడపిల్లను అయినా, మగవారిలా కంఫర్ట్‌గా ఉండాలని నా వేషధారణ మార్చుకున్నాను. నన్ను అన్ని రకాలుగా అర్థం చేసుకుని, స్నేహితురాలిగా ఉన్న సాటి అమ్మాయిని వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. నా ఆలోచనను నా స్నేహితురాలికి చెప్పాను. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంగీకారం తెలిపింది. 2008 మార్చి 9న తిరుపతికి వెళ్లి వివాహం చేసుకున్నాం. ఈ విషయుం అందరికీ తెలిసి ఇదేం పని అని ప్రశ్నించారు. చివరకు మా తల్లిదండ్రులు కూడా అంగీకరించలేదు. దాంతో కర్ణాటక వెళ్లిపోయాం. కలిసి జీవిస్తున్నాం. నేను పేరు మార్చుకున్నాను. ఉష అని కాకుండా, కిరణ్‌గా పిలిపించుకోవడమే నాకు ఇష్టం. పోరు బాట... పరభాషను నేర్పింది ప్రస్తుతం చిక్‌బళ్లాపూర్‌లో ఉంటున్నాం. తోటి వికలాంగుల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో 2009లో కర్ణాటక వికలాంగుల పోరాట సమితిని ప్రారంభించాను. తెలుగు భాష తప్ప ఇతర ఏ భాషా తెలియని నేను ఎలాగైనా కన్నడం నేర్చుకోవాలనుకున్నా. భాష రానిదే పోరుబాటలో నడవలేనని తెలుసుకుని కొద్ది కాలంలోనే కన్నడం నేర్చుకున్నాను. ఇప్పటి వరకు మా సమితిలో 25 వేల మంది వికలాంగులు సభ్యులుగా చేరారు. వారికి ఎలాంటి సమస్య ఉన్నా ముందుకు నడిచి ఆందోళనలు చేపట్టాను. దీంతో అక్కడి ప్రభుత్వాలు కూడా మా పోరాట బలాన్ని చూసి మాకు గుర్తింపునిచ్చాయి. ప్రస్తుతం హిజ్రాల తరపున జరుగుతున్న పోరాటానికి నాయకత్వం వహిస్తూనే, కర్ణాటక ప్రభుత్వం తరఫున లింగత్వ అల్పసంఖ్యాకుల వేదికకు రాష్ట్ర కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అలాగే కర్ణాటక ఎయిడ్స్ అవగాహన ప్రాజెక్ట్‌కు అయిదు జిల్లాల కోఆర్డినేటర్‌గా కూడా ఆ ప్రభుత్వం నాకు బాధ్యతలు అప్పగించింది. మున్ముందు నేను చేపట్టబోయే కార్యక్రమాలకు సొంత రాష్ట్రంలో కూడా ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నా. -
పోలియో బాధితురాలికి సీఎం అండ!
-
పోలియో బాధితురాలికి సీఎం అండ!
హైదరాబాద్: పోలియో వల్ల రెండు కాళ్లు కోల్పోయిన ఎం.రమాదేవికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు అండగా నిలిచారు. ఆమెకు వెంటనే ఉద్యోగం కల్పించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. నల్లగొండ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన రమాదేవి మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. చిన్నప్పుడే రెండు కాళ్లు కోల్పోయానని, భర్త కళ్యాణ్‌కుమార్ కూడా ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్నాడని ఆమె వివరించారు. ఇద్దరు పిల్లలను పోషించడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు చలించిన సీఎం... వెంటనే ఉద్యోగం కల్పించాలని ఆదేశించారు. -
పోలియో బాధిత చిన్నారి బావిలో తోసివేత
రెంటచింతల: రెండు కాళ్లకు పోలియో సోకిన చిన్నారి(3)ని భారంగా భావించిన తల్లిదండ్రులు ఆమెను కర్కశంగా బావిలో పడేసి పారిపోయారు.ఈ సంఘటన గుంటూరు జిల్లా రెంటచింతలలో శనివారం చోటుచేసుకుంది. నేలబావి సమీపంలో నారుమడికి నీరుపెట్టేందుకు వెళ్లిన రైతు పాత పుల్లారావుకు బావిలో నుంచి పాప ఏడుపు వినిపించింది. దీంతో ఆయన వెళ్లి బావిలోకి జారిన మర్రి ఊడలను పట్టుకొని వేలాడుతున్న పాపను బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు పాపకు స్థానిక వైద్యుడు మధుబాబు వద్ద వైద్య పరీక్షలు చేయించి, ఆయన పర్యవేక్షణలో ఉంచారు. పాప వివరాలు తెలిసినవారు సీఐ నం:9440796228, ఎస్ఐ నం: 9440900883, స్టేషన్ నం: 08642258433లలో సంప్రదించాలని పోలీసులు సూచించారు. -
ఆనందంగా ఉంది:అమితాబ్ బచ్చన్
ముంబై: పోలియో నిర్మూలనలో తాను ఒక భాగమైనందుకు ఆనందంగా ఉందని బిగ్ బి అమితాబ్ బచ్చన్ తెలిపారు. భారతదేశంలో దాదాపు పోలియోను నిలువరించినందుకు, అందులో తాను ఒక భాగస్వామినైందుకు ఆయన సంతోషంగా వ్యక్తం చేశారు. 2005వ సంవత్సరంలో యూనిసెఫ్ (ఐక్యరాజ్య సమితి బాలల నిధి) పోలియో నిర్మూలన బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్ బచ్చన్ ను నియమించింది. అప్పట్నుంచి నుంచి పోలియో నిర్మూలన కార్యక్రమానికి యూనిసెఫ్ ప్రతినిధిగా ఉన్న అమితాబ్.. ఈ బాధ్యత ఎంతో సంతృప్తినిచ్చిందన్నాడు. ఈ ఎనిమిది సంవత్సరాల ప్రయాణం తనకు చాలా హాయిగా ఉందన్నాడు. భారత్ లో పోలియో నిర్మూలన కార్యక్రమం పూర్తిగా విజయవంతమైందని అమితాబ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. -
గుండెజబ్బుకు టీకా!
అవును. పోలియో, మెదడువాపు, క్షయ టీకాల మాదిరిగా గుండెజబ్బుకు కూడా త్వరలోనే టీకా రానుందట! అదేంటీ..? టీకా అంటే.. భవిష్యత్తులో శరీరంలోకి ప్రవేశించి ప్రాణాంతక వ్యాధులను కలిగించే వైరస్లు, బ్యాక్టీరియాలను అడ్డుకునేందుకు తోడ్పడే ఔషధం కదా. మరి.. గుండెజబ్బు సూక్ష్మజీవుల వల్ల రాదు కదా. దానికి టీకా ఏంటీ? అనుకుంటున్నారా? గుండెజబ్బు సూక్ష్మజీవుల వల్ల రాదు నిజమే. కానీ ధమనులు గట్టిబారడం(ఎథెరోస్క్లీరోసిస్) అనే సమస్య వల్ల కూడా వస్తుంది. హానికర సూక్ష్మజీవులను హతమార్చాల్సిన మన సొంత రోగనిరోధక వ్యవస్థే ఒక్కోసారి కొన్ని పరిస్థితుల వల్ల శత్రువులా మారిపోతుంది. దీంతో ధమనులు గట్టిబారడంతో పాటు ఉబ్బిపోతాయి. ఫలితంగా ధమనుల్లో కొవ్వులు పేరుకుపోయి రక్తప్రసరణకు అడ్డంకి ఏర్పడి గుండెకు ముప్పు కలుగుతుందన్నమాట. అయితే శత్రువులా మారే తెల్ల రక్తకణాలను ఎలా గాడిలో పెట్టాలో ఇప్పుడు అమెరికాలోని వేన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ధమనులపై తెల్ల రక్తకణాల హానికర ప్రభావాన్ని వీరు విజయవంతంగా తగ్గించగలిగారట. దీంతో మనుషుల్లోనూ తెల్ల రక్తకణాలను నియంత్రించేందుకు టీకాలను తయారు చేయవచ్చని వీరు ధీమా వ్యక్తంచేస్తున్నారు. -
పాక్‌లో మూడు కొత్త పోలియో కేసులు
పోలియో మహమ్మారి మళ్లీ వెలుగు చూసింది. పాకిస్థాన్‌లో మూడు కొత్త పోలియో కేసులు సోమవారం రికార్డయ్యాయి. బాధితులు ముగ్గురూ ఉత్తర, దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతానికి చెందినవారని డాన్ పత్రిక తన కథనంలో పేర్కొంది. పాకిస్థాన్‌లో ఈ ఒక్క సంవత్సరమే కనీసం 66 పోలియో కేసులు వెలుగు చూశాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు, పాకిస్థాన్ నుంచి వేరే దేశాలకు వెళ్లే ప్రయాణికులంతా తప్పనిసరిగా పోలియో వాక్సినేషన్ వేయించుకున్నట్లు సర్టిఫికెట్ వెంట ఉంచుకోవాలి. జూన్ 1 తర్వాతి నుంచి ఇది తప్పనిసరి పాకిస్థాన్‌లో నెల రోజులకుపైగా ఉన్న విదేశీయులకు కూడా ఇది తప్పనిసరి. ప్రపంచం మొత్తమ్మీద పాకిస్థాన్‌తో పాటు అఫ్ఘానిస్థాన్, నైజీరియా దేశాల్లో మాత్రమే పోలియో కేసులు మళ్లీ మళ్లీ వస్తున్నాయి. -
పోలియో రహిత దేశంగా భారత్
న్యూఢిల్లీ : తరతరాలుగా పట్టి పీడిస్తోన్న పోలియో మహమ్మారి ఎట్టకేలకు భారత్‌లో కనుమరుగైంది. స్మాల్‌పాక్స్‌ను భారతదేశం నుంచి తరిమేసిన దాదాపు 37 సంవత్సరాల తర్వాత పోలియో వైరస్కూడా మన దేశం నుంచి వెళ్లిపోయినట్లే . గత మూడేళ్ల కాలం నుంచీ దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారమిక్కడ ప్రకటించింది. దాంతో నేటితో భారత్ పోలియో రహిత దేశంగా చరిత్రకెక్కింది. ఇప్పటికే భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. 2014నాటికి దక్షిణాసియాలో కూడా పోలియో నివారణకు తగిన చర్యలు చేపట్టనున్నట్టు దక్షిణాసియాకు చెందిన ప్రపంచ ఆరోగ్యశాఖ ప్రకటించింది. పోలియో నివారణకు భారత్ తీసుకున్న చర్యల వల్ల ఈ సత్పలితాలు వచ్చాయని ప్రపంచ ఆరోగ్యశాఖ ప్రకటించింది. గత కొన్నేళ్ల నుంచి పోలియో చుక్కల వినియోగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసి అందుకు అనుగుణంగా ప్రణాళికను కూడా అమలుపరడంలో సఫలీకృతమయ్యాయి. ఇది మన దేశానికి గొప్ప విజయంగా చెప్పొచ్చు. 2009లో 741 పోలియో కేసులు నమోదు కాగా, 2010లో ఆ సంఖ్య 42కు తగ్గింది. 2011 జనవరిలో పశ్చిమబెంగాల్లోని హౌరా జిల్లాలో వాక్సిన్ వేయించుకోని రెండేళ్ల బాలికకు పోలియో సోకింది. -
సంకల్పం ముందు చిన్నబోయిన వైకల్యం
గురజనాపల్లి(కరప), న్యూస్‌లైన్ : బలమైన సంకల్పం ఉంటే లక్ష్యసాధనకు అంగవైకల్యం ఎంతమాత్రం అడ్డురాదని నిరూపించింది ఈ యువతి. పోలియో వల్ల రెండు కాళ్లూ చచ్చుబడిపోయినా నిరాశతో ఇంటి వద్ద కూర్చోకుండా వజ్ర సంకల్పంతో ఆమె బీఏ బీఈడీ కష్టించి పూర్తిచేసింది. ఉపాధి కల్పించాలని గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదుకు కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ స్పందించడంతో విద్యావలంటీరుగా నియమితురాలైంది. కరప మండలం గురజనాపల్లి శివారు అడవిపూడి గ్రామానికి చెందిన మేడిశెట్టి మహాలక్ష్మికి చిన్నతనంలో పోలియో సోకడంతో రెండుకాళ్లు చచ్చుబడిపోయాయి. తండ్రి రాధాకృష్ణ వ్యవసాయకూలీ. ఇంటివద్ద నడవలేని స్థితిలో ఒంటరిగా కూర్చోకుండా తల్లి గనికమ్మ సహాయంతో పాఠశాలకు వెళ్లి అక్షరాలు దిద్దుకుంది. ఆమె పట్టుదలను చూసి తల్లిదండ్రులు, గురువులు ఇచ్చిన ప్రోత్సాహంతో చదువును కొనసాగించింది. బాగా చదువుకొని పైకి రావాలన్న పట్టుదలతో డిగ్రీ చదివింది, గతేడాది బీఈడీ పూర్తిచేసింది. డిసెంబరు 30వ తేదీన కాకినాడలోని కలెక్టర్ గ్రీవెన్స్‌కు వెళ్లి తనకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని విన్నవించుకుంది. కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ స్పందించి విద్యావలంటీరు పోస్టు మంజూరుచేసి ఇవ్వాలని రాజీవ్ విద్యామిషన్ అధికారులను ఆదేశించారు. దీంతో ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్ వెన్నపు చక్రధరరావు ఉత్తర్వుల మేరకు ఎంఏఓ ఎంవీవీ సుబ్బారావు గురజనాపల్లి శివారు బొందలవారిపేట ఎంపీపీ పాఠశాలలో విద్యావలంటీరుగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. మహాలక్ష్మి గురువారం పాఠశాలలో విద్యావలంటీరుగా చేరి విద్యార్థులకు పాఠాలు బోధించి, తన కలను సాకారం చేసుకుంది. పేదలకు సహాయ పడతా బోధనపై మక్కువతో బీఈడీ చదివానని, టెట్ రాసి, డీఎస్సీలో టీచర్‌గా ఎంపిక కావాలన్న లక్ష్యంతో ఉన్నట్టు మహాలక్ష్మి ‘న్యూస్‌లైన్’కు తెలిపింది. ఉద్యోగంలో స్థిరపడ్డాక పేదలకు, వృద్ధులకు సహాయపడతానంది. వికలాంగులు అధైర్యపడకూడదని, పట్టుదలతో చదువుకుని, అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవాలని మహాలక్ష్మి పేర్కొంది. -
వైకల్యం నేర్పిన నైపుణ్యం!
లాన్‌టెన్నిస్‌లో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలంటే కదలికల్లో చిరుతపులి పోకడ ఉండాలి, డేగలాంటి చూపుండాలి... అంతకుమించి ఇంకేం అవసరం లేదు అని నిరూపిస్తోంది అహ్మదాబాద్ క్రీడాకారిణి మధుబగ్రీ. ఆ రెండూ ఉన్న ఈమె తన వీల్ చైర్లో కూర్చొనే టెన్నిస్ కోర్టులో చాకచక్యంగా కదులుతోంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం ప్రత్యేకంగా నిర్వహించే లాన్‌టెన్నిస్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది మధు. భారతదేశం ఇప్పుడు పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందింది కానీ... తొంభైల వరకూ చిన్నారులకు అతిపెద్ద శాపం పోలియో. అలాంటి పోలియో బారిన పడిన వారిలో ఒకరు మధు. అయితే దీన్ని ఆమె దురదృష్టం అని అంటే ఒప్పుకోదు. ఎవరైనా సానుభూతి చూపిస్తే సమ్మతించదు. 18 నెలల వయసులోనే పోలియో బారిన పడి, రెండు కాళ్లూ కోల్పోయిన మధుకు జీవితంలోని ప్రతి కష్టమూ చాలెంజింగ్గానే అనిపించింది. బాల్యంలో తన వయసు ఉన్న పిల్లలతో కలవడాన్ని, తన పనులు తానే చేసుకోవడాన్ని ఆమె చాలెంజ్‌గా తీసుకుని విజయం సాధించింది. అక్కడితో ఆగిపోలేదు. ఇంకా ఏదైనా సాధించాలనే తపనతో ముందుకు సాగింది. ఈ క్రమంలో ఆమెకు వేకప్ 2 డ్రీమ్స్ అనే ఎన్జీవో చేయూతనిచ్చింది. స్వతహాగా టెన్నిస్ మీద ఆసక్తి కలిగి ఉన్న మధు వీల్‌చైర్ మీద నుంచి టెన్నిస్ ప్రాక్టిస్ చేయడం ప్రారంభించింది. ఆమెకు పరమేశ్మోడీ అనే కోచ్ సహకారం అందించడంతో ఆటపై నైపుణ్యం సాధించడానికి అవకాశం దొరికింది. అనునిత్యం చేసిన ప్రాక్టీస్‌తో మధుబగ్రీ అంతర్జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్ అయ్యింది. మైదానంలో ఆమె వేగంగా కదిలే తీరు చూస్తే, షాట్ కొట్టే పద్ధతిని గమనిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! ఈ నైపుణ్యంతో భారతదేశం తరపున వీల్‌చైర్ టెన్నిస్ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకొంది. ఇప్పటికే బ్యాంకాక్‌లో జరిగిన వీల్‌చైర్ టెన్నిస్టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసింది మధు. తన వైకల్యమే తనను కార్యసాధకురాలిగా చేసిందని మధు అంటోంది. -
పోలియో అనుమానంతో చెన్నైకి చిన్నారి తరలింపు
ఆత్మకూరు, న్యూస్‌లైన్: పోలియో అనుమానంతో ఓ చిన్నారిని చెన్నైకి తరలించారు. ఈ ఘటన ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపల్లిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వెంకట్రావుపల్లికి చెందిన బాలంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి కుమారుడు జగన్‌కు ఒ కటిన్నర ఏడాది వయస్సు. ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఆత్మకూరులోని ఓ ఆ స్పత్రిలో చికిత్స చేయించారు. చికిత్స చేసిన మరుసటి రోజు నుంచి చిన్నారి కాళ్లలో కదలికలు ఆగిపోయాయి. దీంతో వారు నెల్లూరులోని పలు ఆస్పత్రుల్లో చూపించారు. అ యితే అక్కడ కూడా ఎలాంటి మార్పు రా లేదు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఇ మ్యూనైజేషన్ అధికారి జయసింహ వెంకట్రావుపల్లికి వచ్చి చిన్నారిని పరిశీలించారు. చిన్నారి మ లాన్ని పరీక్షించాల్సిందిగా వై ద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సూచించారు. అయితే ఆ ప రీక్ష చేసే అవకాశం కలగలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం తెల్లవారుజామున చిన్నారి జగన్‌ను వైద్యపరీక్షల నిమిత్తం చెన్నైకి తరలించారు. మూడు రోజుల అనంతరం వైద్యపరీక్షల నివేదిక ఇస్తారని తెలుస్తోంది. ప్రత్యేక పల్స్‌పోలియో కార్యక్రమం మహిమలూరు పీహెచ్సీ వైద్యాధికారి పెంచలయ్య ఆధ్వర్యంలో శుక్రవారం వెంకట్రావుపల్లిలో ప్రత్యేక పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో మొత్తం 52 మం ది పోలియో చుక్కలకు అర్హులున్నట్లు గుర్తిం చారు. వీరిలో 36 మందికి పోలియోచుక్కలు వేశారు. మిగిలిన వారికి శనివారం వేస్తామని వైద్యాధికారి పెంచలయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సుధాకర్, హెల్త్ అసిస్టెంట్ చిన్నపునాయుడు, ఏఎన్ఎంలు రాఘవరాణి, లీలావతి, ధనమ్మ, ల్యా బ్టెక్నీషియన్ మాధవరావు, అంగన్వాడీ కార్యకర్త మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.