పోలియో చుక్కలు, సూదిని వేయించాలి
నల్లగొండ టౌన్ :
చిన్నారులకు పోలియో చుక్కలతో పాటు పోలియో సూదిని విధిగా వేయించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ డి.కిరణ్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎ.బాలనరేంద్ర అన్నారు. సోమవారం స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్‌పీహెచ్‌ఓలు, పీహెచ్‌సీల వైద్యాధికారులకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పుట్టిన ప్రతి ఒక్కరికి 24గంటల్లోపు పోలియో చుక్కలు, ఐపీ టైటీస్‌బీ టీకాలను వేయించాలన్నారు. నిర్ణీత ప్రణాళిక ప్రకారం ప్రతి బుధ, శనివారాల్లో జిల్లాలోని అన్ని ఉపకేంద్ర, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాల కార్యక్రమాలను నిర్వహించాలని, సంబంధిత వైద్యాదికారులు, పర్యవేక్షకులు పర్యవేక్షించాలని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 91శాతం పిల్లలకు అన్ని రకాల టీకాలు వేస్తుండగా ప్రైవేటు ఆస్పత్రుల్లో 9 శాతం మాత్రమే టీకాలను వేస్తున్నారని తెలిపారు. పుట్టిన ఏ బిడ్డ కూడా వికలాంగుడు కాకూడదని సరైన సమయంలో టీకాలను వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ అరుంధతి, పాఠశాల విద్య కార్యక్రమ అధికారి డాక్టర్ లలితాదేవి, జాతీయ ఆరోగ్య మిషన్ అధికారి డాక్టర్ కె.రామకృష్ణ, జిల్లా మలేరియా అధికారి ఓం ప్రకాశ్, ఉప మీడియా అధికారి ఆర్.తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.